Type Here to Get Search Results !

May-07

May-07 Current affairs articles

తెలంగాణకు మినీ సబ్‌జూనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 
Event-Date:07-May-2018
Level:Local
Topic:Sports and Games
మినీ సబ్‌ జూనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. బాలిక అండర్‌-10, అండర్‌-12, బాలురు అండర్‌-10, అండర్‌-12 విభాగాల్లో విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించాయి.
  • 2018 మే 6న నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో జరిగిన బాలిక అండర్‌-10 ఫైనల్లో తెలంగాణ మధ్యప్రదేశ్‌పై, అండర్‌-12 ఫైనల్లో తెలంగాణ  మధ్యప్రదేశ్‌పై విజయం సాధించాయి. బాలుర ఫైనల్లో అండర్‌-10 విభాగంలో తెలంగాణ  మధ్యప్రదేశ్‌పై, అండర్‌-12 విభాగంలో తెలంగాణ  ఆంధ్రప్రదేశ్‌పై విజయం సాధించాయి.

-------------------------------------------------------------------------------------------

అంగారకుడి దిశగా నాసా క్యూబ్‌శాట్‌ ప్రయాణం
అంగారకుడి దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన రెండు క్యూబ్‌శాట్‌లు తొలిసారిగా సుదూర విశ్వంలోకి ప్రయాణాన్ని ప్రారంభించాయి. బ్రీఫ్‌కేస్‌ పరిమాణంలో ఉన్న ఈ బుల్లి ఉపగ్రహాల్లోని వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తున్నట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. అంగారకుడిపైకి దిగేందుకు ఉద్దేశించిన ‘ఇన్‌సైట్‌’ ల్యాండర్‌ను నాసా 2018 మే 5న ప్రయోగించింది. ఆ వ్యోమనౌకతోపాటు ‘మార్స్‌ క్యూబ్‌ వన్‌’ (మార్కో) అనే క్యూబ్‌శాట్‌ జతను కూడా నింగిలోకి పంపింది. అంగారకుడి దిశగా సాగే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలో అవి ‘ఇన్‌సైట్‌’ను అనుసరిస్తాయి. అంతరిక్ష రేడియో ధార్మికతను తట్టుకొని నిలబడితే  నిర్దేశించిన రీతిలో అవి 2018 నవంబర్‌లో అంగారకుడిని చేరుకుంటాయి. 

ప్రపంచ మీడియా ర్యాంకింగ్‌కు ప్రాతిపదికలు వెల్లడించాలి: PCI
Event-Date:07-May-2018
Level:National
Topic:Foreign relations
ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచిక నివేదికలో స్పష్టత లోపించిందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(PCI) అసహనం వ్యక్తం చేసింది. ర్యాంకింగ్‌ ఇవ్వడానికి ప్రాతిపదికలు ఏమిటో చెప్పాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా డబ్ల్యూపీఎఫ్‌ స్పందించలేదని PCI ఛైర్మన్‌ జస్టిస్‌(పదవీ విరమణ) సీకేప్రసాద్‌ తెలిపారు. ఎవరో కొందరి అభిప్రాయాలు తెలుసుకుని ర్యాంకింగ్‌ ఇస్తున్నారా లేక ఏమైనా ప్రాతిపదికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో వెల్లడిస్తే భవిష్యత్తులో ర్యాంకింగ్‌ మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.
  • సరిహదుల్లేని పాత్రికేయులు పేరిట 180 దేశాలకు సంబంధించి ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచిక ఏటా నివేదికలు విడుదల చేస్తోంది.
  • 2018 ఏప్రిల్‌ 25న విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌కు 136వ ర్యాంకు కేటాయించింది. అంతకుముందు ఏడాది 138తో పోలిస్తే ఇది రెండు ర్యాంకుల దిగువున ఉంది.
PCI-Press Council of India 
పురాతన భారతీయ విజ్ఞానశాస్త్రాలపై ఐఐటీ-ఖరగ్‌పుర్‌ కొత్త కోర్సు ‘సంధి’ 
పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రాల చరిత్ర అంశంపై ఐఐటీ ఖరగ్‌పుర్‌ కొత్తగా ఓ కోర్సును ప్రారంభించింది. ‘సంధి’ పేరుతో అందిస్తున్న ఈ కోర్సులో ఆధునిక శాస్త్రాలకు పురాతన భారతీయ శాస్త్రాలు అందించిన విజ్ఞానంపై విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు.
  • భారతీయ ఖగోళశాస్త్రం: ప్రపంచంపై దాని ప్రభావాలు, వేద గణితం, వేదాలకు మునుపటి రచనలు, కేరళ గణితం, సంప్రదాయ గణన నైపుణ్యాలు, ఆయుర్వేదం, తదితర అంశాలు పాఠ్య ప్రణాళికలో ఉన్నాయి.
  • అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా ఇంజినీరింగ్‌ కళాశాలల కోసం రూపొందించిన కొత్త బోధన ప్రణాళికలో భారత్‌లో సాంకేతిక విజ్ఞానశాస్త్రాల చరిత్ర, ‘అద్వైత’ సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుడిపై రచన అంశాలను చేర్చింది.
విదేశాల్లోని భారతీయ పిల్లలకు న్యాయానికి రాజేష్‌ బిందాల్‌ కమిటీ సిఫార్సులు 
Event-Date:07-May-2018
Level:National
Topic:Foreign relations

తల్లిదండ్రుల వివాదాల కారణంగా విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న భారతీయ పిల్లలకు తగిన న్యాయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
  • పిల్లల అపహరణపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం (హేగ్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ద సివిల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ అబ్డక్షన్‌-1980)పై భారత దేశం కూడా సంతకం చేసినందున అందులో పొందుపరిచిన అంశాలను ఆచరణలో పెట్టడంపై సూచనలు ఇచ్చేందుకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
  • పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రాధికారిక సంస్థను (ఇంటర్‌ కంట్రీ పేరంటల్‌ చైల్డ్‌ రిమూవల్‌ డిస్ప్యూట్స్‌ రెస్యోషన్‌ అథారిటీ) ఏర్పాటు చేయాలని సూచించింది.
  • కనీసం అయిదేళ్లపాటు సేవలందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ దీన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
  • విదేశాలకు వెళ్లే భారతీయులందరి మొత్తం సమాచారాన్ని ఈ ప్రాధికార సంస్థ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  • సమాచారంలో ఎలాంటి మార్పులు వచ్చినా వాటిని సంబంధిత దేశంలోని భారతీయ రాయబార కార్యాలయంలో నమోదు చేసే నిబంధన విధించాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌ వేదికను రూపొందించాలి.
  • పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం భారతీయ రాయబార కార్యాలయాలను సంప్రదించేలా అవగాహన కల్పించాలి. మొదట తల్లిదండ్రుల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • సుశిక్షితులైన మధ్యవర్తుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. తల్లిదండ్రులు వేర్వేరు దేశాల్లో ఉన్నప్పుడు ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించుకోవచ్చు.
  • ఏదైనా వివాదంతో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చినప్పుడు వెంటనే వారు అథారిటీ దగ్గరకు వెళ్లేలా చూడాలని పేర్కొంది. విచారణలన్నీ పూర్తి గోప్యంగా ఉంచాలని సూచించింది.
ఆ పెళ్లి చెల్లకపోయినా వారు కలిసి జీవించవచ్చు: సుప్రీంకోర్టు
పెళ్లి చెల్లకపోయిన ఒక కేసులో భార్యాభర్తలు వయోజనులైనందు వల్ల వారు కలిసి జీవించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. వీరికి ఆ హక్కు ఉందని స్పష్టం చేసింది. కలిసి జీవించడానికి ఇప్పుడు చట్టపరంగానూ గుర్తింపు లభిస్తోందని, గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్ట నిబంధన పరంగానూ ఇలాంటి సంబంధాలకు చోటు ఉందని పేర్కొంది.
  • చట్టపరంగా తనకు వివాహ వయసు లేనందున తాను తుషార అనే అమ్మాయితో చేసుకున్న వివాహం చెల్లదని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్రానికి చెందిన నందకుమార్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.
  • 2018 మే 30కి తనకు 21 ఏళ్లు నిండుతాయని చెప్పారు. పెళ్లినాటికి వరుడికి 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉందన్న ఏకైక కారణంతో వారి పెళ్లిని రద్దు చేయడం తగదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
  • ‘వధువు, వరుడు... ఇద్దరూ హిందువులు. మేజర్లు. వివాహబంధంలో అడుగిడేందుకు వారు యోగ్యులు కాకపోయినా ఆ బంధానికి వెలుపలైనా కలిసి ఉండేందుకు వారికి హక్కు ఉంది. వధువును ఆమె తండ్రికి అప్పగిస్తున్నట్లు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తున్నాం. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ తుషారకి ఉందని స్పష్టం చేయదలచుకున్నాం’ అని జస్టిస్‌ ఎ.కె.సిక్రి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ధర్మాసనం పేర్కొంది.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ దీపక్‌మిశ్రా
తెలంగాణలో 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సైన్స్‌ కోర్సులు రద్దు 
తెలంగాణ కళాశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సైన్స్‌ గ్రూపును రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 129 సర్కారు డిగ్రీ కళాశాలల్లో ఉన్న 54 వేల సీట్లలో ఏటా 30 వేల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. గత మూడేళ్లుగా ఒక్కో కోర్సులో 25 శాతం కూడా సీట్లు నిండని కోర్సును హేతుబద్ధీకరించాలని నిర్ణయించడంతో పలు కోర్సుల్లో సీట్ల సంఖ్యను 60 నుంచి 30కి తగ్గించారు. తగ్గిన సీట్లను బీఏ కోర్సులో పెంచారు. 40 కళాశాలల్లో బీఎస్‌సీ కోర్సును పూర్తిగా రద్దు చేశారు.  
నల్గొండ జిల్లాలో కాకతీయుల శాసనం గుర్తింపు 
Event-Date:07-May-2018
Level:Local
Topic:Places in News
తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండం అక్కెనపల్లివారి లింగోటం గ్రామంలో కాకతీయుల కాలం నాటి శిలాశాసనం బయల్పడింది. గ్రామానికి చెందిన పంజాల యాదయ్య  భూమి చదును చేస్తుండగా ఈ శాసనం దొరికింది.
  • ఈ శాసనం క్రీస్తుశకం 1246లో వేయించినట్లు గుర్తించారు.
  • కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని ఆస్థాన మహామంత్రిగా పనిచేసిన రాయసాహ్ని బాలయ్య తన కుమారుడు శ్రీభంగజ వినాయకుడి జ్ఞాపకార్థం గణపేశ్వరాలయం కట్టించారని,  ఆలయాలకు, అర్చకులకు మాన్యం ఇచ్చినట్లు శాసనంలో ఉంది.
  • వీరగల్లులు, స్త్రీలు బొమ్మలు, శివలింగం, గణపతి, కుమారస్వామి, నాగిని విగ్రహం, మహావిష్ణు, కాకతీయుల కాలం నాటి ఇతర శిల్పాలు ఈ ప్రాంతంలో లభించాయి. 
అఫ్గానిస్థాన్‌లో ఏడుగురు భారత ఇంజినీర్ల అపహరణ

అఫ్గానిస్థాన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయులను ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబాన్‌ ఉగ్రవాదులు 2018 మే 6న అపహరించుకుపోయారు. ఉత్తర అఫ్గాన్‌లోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులందరూ ఆర్‌పీజీ గ్రూప్‌ సంస్థలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కేఈసీ సంస్థ కోసం బాధితులు అఫ్గాన్‌లో పనిచేస్తున్నారు. వీరంతా ఓ అఫ్గాన్‌ డ్రైవర్‌ నడుపుతున్న వాహనంలో వెళ్తుండగా.. బాఫ్‌లు-ఇ-షమాల్‌ ప్రాంతంలో తాలిబాన్‌ దుండగులు అపహరించుకుపోయారు. విద్యుత్‌ కేంద్రం నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు వీరు కేఈసీ తరఫున వెళ్తుండగా ఘటన జరిగింది. 

సివిల్స్‌ విజేతల మార్కులు విడుదల చేసిన UPSC
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసు పరీక్ష 2017లో ప్రథమ ర్యాంకు సాధించిన దురుశెట్టి అనుదీప్‌కు 55.6% మార్కులు వచ్చాయి. ప్రధాన పరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులను ఆయన సాధించారు. దీంతో మొత్తంగా 2025కుగాను ఆయన 1,126 మార్కులు తెచ్చుకున్నారు. సివిల్స్‌ పరీక్ష కఠిన ప్రమాణాలకు ఈ మార్కులు అద్దం పడుతున్నాయి. తెలంగాణకు చెందిన అనుదీప్‌ ఇదివరకు భారత రెవెన్యూ సేవలు(ఐఆర్‌ఎస్‌)లో పనిచేశారు.
  • 2వ ర్యాంకు సాధించిన అను కుమారికి 1,124 (55.50% - ప్రధాన పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187) మార్కులు వచ్చాయి.
  • 3వ ర్యాంకు సంపాదించిన సచిన్‌ గుప్తా 1122 (55.40% - ప్రధాన పరీక్షలో 946, ఇంటర్వ్యూలో 176) మార్కులు తెచ్చుకున్నారు.
  • యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఖూజ) 240 మంది మహిళలు సహా మొత్తంగా 990 మందిని ఎంపికచేస్తూ తుది జాబితా విడుదల చేసింది.
  • చివరి ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్‌కు 830 (40.98%- ప్రధాన పరీక్షలో 687, ఇంటర్వ్యూలో 143) మార్కులు వచ్చాయి.
  • 2016 ప్రథమ ర్యాంకర్‌ కేఆర్‌ నందిని 1120 (55.3%), 2015 మొదటి ర్యాంకర్‌ టీనా దాబి 1063 (52.49%) మార్కులు సంపాదించారు.
  • UPSC ఛైర్మన్‌ - వినయ్‌ మిట్టల్‌ 
  • UPSC ఏర్పాటు - 1926 అక్టోబర్‌ 1
  • UPSC ప్రధాన కార్యాలయం - న్యూడిల్లీ 
UPSC-Union Public Service Commission 
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఐదుగురు ఉగ్రవాదులు హతం 
Event-Date:07-May-2018
Level:National
Topic:Places in News
భారత భద్రతా బలగాలు 2018 మే 6న జమ్మూకశ్మీర్‌లో నిషేధిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. కొత్తగా ఉగ్రవాది అవతారమెత్తిన కశ్మీర్‌ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రఫీ భట్‌ (33)తో పాటు ఆ ముష్కర ముఠా కమాండర్‌ సద్దాం పాడర్‌ కూడా వీరిలో ఉన్నారు. ఘటనా స్థలం  నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్‌ జిల్లాలోని బదిగామ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
  • షోపియాన్‌ ప్రాంతానికి చెందిన సద్దాం పాడర్‌ 2014 నుంచి హిజ్బుల్‌లో క్రియాశీలంగా ఉన్నాడు. 2015లో హిజ్బుల్‌ అగ్రశ్రేణి కమాండర్‌ బుర్హాన్‌ వానీతో పాటు ఫొటోలో కనిపించిన 10 మంది ఉగ్రవాదుల్లో ఇతడు కూడా ఉన్నాడు. సద్దాం ఎన్‌కౌంటర్‌తో ఆ ఫొటోలోని ఉగ్రవాదులంతా హతమయ్యారు. పౌరులను చంపడం, భద్రతాదళాలపై దాడులు, యువతను ఉగ్రవాదంవైపునకు మళ్లించడానికి యత్నించడం వంటి అభియోగాలు సద్దాం పాడర్‌పై ఉన్నాయి.
  • ఎన్‌కౌంటర్‌ స్థలం వద్ద ఆందోళనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇందులో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో ఐదుగురు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా కశ్మీర్‌ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు తరగతులను నిలిపివేశారు. పరీక్షలను వాయిదావేశారు. పలు జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.
  • ఈ ఘటనలో హతమైన మహ్మద్‌ రఫీ భట్‌ కశ్మీర్‌ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. అతడికి పీహెచ్‌డీ పట్టా కూడా ఉంది. రఫీ తండ్రి ఫయాజ్‌ కూడా 1990లో ఓ ఉగ్రవాద ముఠాలో పనిచేశాడు. మహ్మద్‌ రఫీ భట్‌  18 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకొని, తల్లిదండ్రులకు అప్పగించారు. రఫీకి వరుసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.