Type Here to Get Search Results !

ఆగష్టు-2018 వ్యక్తులు

ఆగస్టు - 1
¤ కార్పొరేట్ దిగ్గజాలు కుమార మంగళం బిర్లా, వైసీ దేవేశ్వర్‌లను కేంద్రం ఎయిరిండియా డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా నియమించింది.
          »
 నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాకు అనుబంధ గ్రాంటు కింద మూలధన సాయం ఇచ్చేందుకు పార్లమెంటు అనుమతికోరిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది.          » ఆదిత్య బిర్లా గ్రూపునకు కుమార మంగళం బిర్లా అధిపతి కాగా, ఐటీసీకి ఛైర్మన్‌గా దేవేశ్వర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.          » వీరిద్దరూ మూడేళ్ల పాటు ఎయిరిండియా బోర్డులో డైరెక్టర్లుగా ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది.          » ఎయిరిండియాతోపాటు మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రైవేట్ రంగ కంపెనీల ఉన్నతాధికారులను నియమించింది.          » నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌కు శ్యామవీర్ సైనీని, భారత్ ఎర్త్‌మూవర్స్‌కు గుర్మోహిందర్ సింగ్‌ను, బామర్ లారీకి అరుణ్ టాండన్‌ను, కోల్‌కతా మెట్రోరైల్ కార్పొరేషన్‌కు తపన్ కుమార్‌ను నాన్ అఫిషియల్ స్వతంత్ర డైరెక్టర్లుగా, డైరెక్టర్లుగా నియమించింది.
ఆగస్టు - 5
¤ పాకిస్థాన్‌లోని కసూర్ నగరంలో మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడి, వారిని హతమార్చిన ఇమ్రాన్ అలీ (23) అనే నిందితుడికి మరో 12 మరణశిక్షలు పడ్డాయి. ఇతడికి ఇప్పటికే నాలుగు మరణ శిక్షలు, రూ.60 లక్షల జరిమానా విధించారు. దీనిలో రూ.30 లక్షలను బాధితుల కుటుంబాలకు క్షమాధనం కింద ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.¤ కేరళ రాష్ట్ర సాక్షరతా మిషన్ నిర్వహించిన సాక్షరతా పరీక్షను 96 ఏళ్ల వయసున్న కేరళకు చెందిన కర్తియానీ అమ్మ రాశారు.
ఆగస్టు - 6
¤ ప్రఖ్యాత గూగుల్ సంస్థ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాలిచ్చింది.          » ఈ అవకాశాన్ని దక్కించుకున్న అయిదుగురిలో వికారాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి కుడుగుంట స్నేహారెడ్డి కూడా ఉంది.          » స్నేహ ఐఐటీ-హైదరాబాద్‌లో ఇటీవలే బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశారు. చదువులతోపాటు భిన్న అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా బంగారు పతకాన్ని సైతం అందుకున్నారు.¤ పెప్సికో సీఈఓ బాధ్యతల నుంచి ఇంద్రా నూయి (62) తప్పుకోనున్నారని కంపెనీ ప్రకటించింది. గత 12 ఏళ్లుగా సేవలు అందించిన నూయి భారత సంతతి మహిళ. 24 ఏళ్ల కిందట ఈ కంపెనీలో చేరిన ఈమె అక్టోబరు 3న సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే 2019 మొదట్లో కొన్నాళ్ల వరకు మాత్రం ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.          » ఇంద్రా నూయి స్థానంలో కొత్త సీఈఓగా రామన్ లగార్తాను సంస్థ ఎంపిక చేసింది.          » ఇంద్రానూయి చైన్నైలో జన్మించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోల్‌కతా, యేల్ యూనివర్సిటీల నుంచి పట్టాలు పొందారు. యేల్ యూనివర్సిటీ డీన్‌షిప్‌ను పొందిన తొలి మహిళ ఈమే.
ఆగస్టు - 7
¤ ఎస్కార్ట్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నిఖిల్ నందా నియమితులయ్యారు. తండ్రి రాజన్‌నందా ఇటీవల మరణించడంతో ఆయన వారసుడిగా నిఖిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆగస్టు - 8
¤ అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా 42 ఏళ్ల రషీదా తలైబ్ చరిత్ర సృష్టించనున్నారు. మిషిగన్‌లోని 13వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను ఆమె గెలుచుకున్నారు. ఈసారి ఇక్కడ నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులెవరూ బరిలోకి దిగకపోవడంతో నవంబరులో జరిగే ఎన్నికల్లో రషీదా ఏకగ్రీవంగా విజయం సాధించనున్నారు.          » పాలస్తీనా సంతతికి చెందిన రషీదా తలైబ్ 2009 2014 వరకు మిషిగన్ రాష్ట్ర శాసనకర్తగా పనిచేశారు. అప్పుడు కూడా మిషిగన్ చట్టసభలో అడుగుపెట్టిన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు.¤ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఏఎస్ఐ) ప్రకటించిన ప్రతిష్ఠాత్మక 'యువ శాస్త్రవేత్త - 2018' పురస్కారానికి ఎంపికైన 20 మందిలో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పరిశోధకులు ఉన్నారు.          » క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించే అంశంపై పరిశోధన చేసిన అరవింద్ కుమార్ రెంగన్, బయోమెడికల్ అప్లికేషన్లలకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలను రూపొందించిన సుష్మీ బదులిక ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.          » హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హెచ్‌సీయూ) వృక్షశాస్త్రం (ప్లాంట్ సైన్సెస్) విభాగంలో సహాయక ఆచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ జోగి మధుప్రకాష్, ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త జాన్ మండల్‌లు కూడా ఎన్ఏఎస్ఐ పురస్కారాలకు ఎంపికయ్యారు.
ఆగస్టు - 9
¤ ట్రాయ్ ఛైర్మన్‌గా రామ్ సేవక్ శర్మ మరో రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. నియామకాలపై ఏర్పాటైన కేంద్రమంత్రివర్గం ఆయన పదవీకాలం పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. 2020 సెప్టెంబరు 30 వరకూ (ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు) ఆయన ట్రాయ్ ఛైర్మన్‌గా కొనసాగుతారని ఆదేశాలు జారీచేసింది.          » 1982 బ్యాచ్ (రిటైర్డ్) ఝార్ఖండ్ కేడర్‌కు చెందిన శర్మ 2015 జులైలో మూడేళ్ల పదవీ కాలానికి ట్రాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఆగస్టు - 10
¤ బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన 9 ఏళ్ల శ్రేయస్ రాయల్ వరుసగా అనేక చదరంగ ఛాంపియన్‌షిప్‌లను గెల్చుకొన్నాడు. ఈ వయసు విభాగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచాడు.¤ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నూతన చీఫ్‌గా చిలీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ ఎన్నికయ్యారు.          » జోర్డాన్ దౌత్యవేత్త జైద్‌బిన్ రాద్ అల్ హుసేన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.          » 1993లో ఏర్పడిన యూఎన్ మానవ హక్కుల సంస్థకు బాచెలెట్ ఏడో హై కమిషనర్.
ఆగస్టు - 11
¤ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టాప్సీ) ఉపాధ్యక్షుడిగా రమాకాంత్ ఇనానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018 19 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.¤ జమ్ముకశ్మీర్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.          » దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కశ్మీర్ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా జస్టిస్ మిట్టల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆగస్టు - 13
¤ దేశంలోని 100 మంది మహిళా కుబేరులతో కోటక్ వెల్త్, హురున్‌లు ఓ జాబితాను విడుదల చేశాయి.          » గోద్రెజ్ గ్రూప్ మూడోతరం వారసురాలైన స్మితా కృష్ణ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె సంపద విలువ రూ.37,570 కోట్లు. 2014లో ప్రముఖ శాస్త్రవేత్త హోమీబాబాకు చెందిన బంగ్లాను రూ.371 కోట్లకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఇక రెండోస్థానంలో హెచ్‌సీఎల్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిణీ నాడార్ (సంపద రూ.30,200 కోట్లు) ఉన్నారు.          » రూ.26,240 కోట్ల నికర ఆస్తితో టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందుజైన్ మూడో స్థానంలో నిలిచారు. దేశంలో అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన బెనెట్ కోల్‌మన్‌కు ఆమె ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, ఫెమినా లాంటి పత్రికలను ఈ సంస్థ కలిగి ఉంది.          » బయోకాన్ వ్యవస్థాపకురాలు ఎండీ కిరణ్ మజుందార్ షా రూ.24,790 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు.          » ఐటీ దిగ్గజం శివనాడార్ భార్య కిరణ్ నాడార్ అయిదో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి విలువ రూ.20,120 కోట్లు. శివనాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆగస్టు - 14
¤ అఫ్గానిస్థాన్‌లోని పర్యబ్ ప్రావిన్స్‌లోని ఘోర్‌మాచ్ జిల్లాలో ఉన్న కీలక సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించి కాపలాగా ఉన్న సైనికుల్లో 17 మందిని హతమార్చారు. 40 మందిని బందీలుగా పట్టుకున్నారు.
ఆగస్టు - 23
¤ బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఈ ఏడాది మరోసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.          » ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించిన తొలి పదిమంది నటుల జాబితాలో అక్షయ్ కుమార్ 7వ (రూ.283 కోట్లు సుమారు), సల్మాన్ ఖాన్ 9వ (రూ.269 కోట్లు సుమారు) స్థానాల్లో నిలిచారు.          » హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ (రూ.1674 కోట్లు), డ్వేన్ జాన్సన్ (రూ.869 కోట్లు), రాబర్ట్ డౌనీ (రూ.567 కోట్లు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.          » జులైలో ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన వందమంది సెలబ్రిటీల జాబితాలో అక్షయ్ 76, సల్మాన్ 82వ స్థానాల్లో నిలిచారు.
ఆగస్టు - 28
¤ డీఎంకే నూతన అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.          » సుమారు 50 ఏళ్ల పాటు డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగి రికార్డు సృష్టించిన కరుణానిధి మృతి చెందడంతో అధ్యక్షుడి పదవి ఖాళీ అయింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.