రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
* విశేష అధికారాల కేంద్ర బ్యాంకు* దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం
ఆర్‌బీఐ ఏం చేస్తుంది?
* 2 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు నోట్లను ముద్రించి పంపిణీ చేస్తుంది.
* భారతదేశ విత్త మంత్రిత్వ శాఖ ముద్రించే ఒక రూపాయి నోట్లను, అన్ని నాణేలను.. భారతదేశ ప్రభుత్వ ఏజెంటుగా పంపిణీ చేస్తుంది.
* 1957 నుంచి ఆర్‌బీఐ కనిష్ఠ నిల్వల పద్ధతిని అనుసరించి కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది.
* కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ నగదు నిల్వలను వడ్డీ రహితంగా డిపాజిట్ రూపంలో ఆర్‌బీఐ తన వద్ద ఉంచుతుంది. అలాగే ప్రభుత్వం తరపున చెల్లింపులు చేయడం, రాబడులను వసూలు చేయడం, విదేశీమారక ద్రవ్య పత్రాలను నిల్వ చేయడం, ప్రభుత్వ బ్యాంకుగా, ఏజెంటుగా వ్యవహరించడం చేస్తుంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకింగ్, ఆర్థిక, ద్రవ్య విధానాల విషయాల్లో సలహాదారుగా ఉంటుంది.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున రుణాలను స్వీకరించి వాటిని ఏ సమయంలో, ఎంత మొత్తంలో స్వీకరించాలో తెలిపే సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది.
* ట్రెజరీ బిల్లులను వారపు వేలం పాటల్లో అమ్ముతుంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాలపరిమితితో స్వల్పకాలిక రుణాలు 'వేస్ అండ్ మీన్స్' అడ్వాన్సులను మంజూరు చేస్తుంది.
* కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'ఓవర్ డ్రాఫ్ట్' సౌకర్యాన్ని కూడా ఆర్‌బీఐ ద్వారా వినియోగించుకుంటాయి.
* 'రిజర్వ్ బ్యాంకు చట్టం-1934, బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం- 1949' ప్రకారం దేశంలో అన్ని బ్యాంకులను నియంత్రించే అధికారం ఆర్‌బీఐకి ఉంటుంది.
* రిజర్వ్ బ్యాంకు రెండో షెడ్యూల్‌లో ఉన్న అన్ని బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులుగా పరిగణిస్తారు.
* బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం (1949) ప్రకారం ప్రతి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు తన డిమాండు డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లలో కొంత శాతాన్ని నగదు నిల్వల రూపంలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాలి.
* బ్యాంకుల లైసెన్సింగ్ అధికారం ఆర్‌బీఐకి ఉంటుంది.
* ప్రతి బ్యాంకు ప్రతి శుక్రవారం వారాంతపు లావాదేవీలను ఆర్‌బీఐకి సమర్పించాలి.
* అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులను ఆర్‌బీఐ ఆదుకుంటుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకును అంతిమ రుణదాత అంటారు. దీన్ని ఆర్‌బీఐ విధుల్లో ముఖ్యమైందిగా పరిగణిస్తారు. వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవచ్చు.
* బ్యాంకు రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు నిల్వల నిష్పత్తిలో మార్పుల ద్వారా రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల పరపతిపై నియంత్రణ చేస్తుంది.
* భారతదేశ రూపాయి బహిర్గత విలువను నిలకడగా ఉంచే బాధ్యత ఆర్‌బీఐపై ఉంటుంది. రూపాయి మారకపు రేటును స్థిరంగా నిర్వహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు అంతర్జాతీయ కరెన్సీని నిల్వ ఉంచుతుంది.
* బ్యాంకుల స్థాపన, లైసెన్సింగ్ విధానం, శాఖల విస్తరణ, యాజమాన్య పద్ధతులు, పునర్ వ్యవస్థీకరణ లాంటి విస్తారమైన అధికారాలు ఆర్‌బీఐకి ఉంటాయి.
* రిజర్వ్ బ్యాంక్ 1935లో ప్రత్యేక వ్యవసాయ పరపతి విభాగాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకును 1980వ దశకంలో స్థాపించింది. అలాగే భారతదేశ పారిశ్రామిక విత్త కార్పొరేషన్‌ను, రాష్ట్ర విత్త కార్పొరేషన్లను వివిధ రాష్ట్రాల్లో స్థాపించింది.
రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానం
ముఖ్య లక్షణాలు: 1) ధరల స్థాయి నియంత్రణ, 2) వ్యాపారచక్రాల నియంత్రణ, 3) సంపూర్ణ ఉద్యోగిత సాధించడం, 4) విదేశీ మారక ద్రవ్య రేట్లలో స్థిరత్వం. 5) ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం
ద్రవ్య విధాన పరికరాలు / పరపతి నియంత్రణ పరికరాలు
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)
శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)
బ్యాంకు రేటు
బహిరంగ మార్కెట్ వ్యవహారాలు
రెపో-రివర్స్‌రెపో రేటు
ఆర్థిక స్థిరత్వం - ద్రవ్య విధానం పాత్ర
నిపుణుల మాట
* కేంద్ర బ్యాంకు ప్రధానమైన విధి స్థిరత్వాన్ని కాపాడటం.. అంటే ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించడం. - కిచ్ఎల్‌కిన్* కేంద్ర బ్యాంకు దేశంలోని అన్ని బ్యాంకులకు బ్యాంకు. ఇది కరెన్సీ నోట్లను జారీ చేయడం.. ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించడం.. ప్రభుత్వాలకు ప్రతినిధిగా వ్యవహరించడం.. వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలను కాపాడటం.. విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించడం.. అంతర బ్యాంకు లావాదేవీలను పరిష్కరించడం.. పరపతిని నియంత్రించడం చేస్తుంది. - ఎమ్.హెచ్.డి.కోక్
* ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్య పరిమాణాల పెరుగుదల, తరుగుదలను అదుపు చేయడం కేంద్ర బ్యాంకు ముఖ్య విధి. - కెంట్
* ద్రవ్య విధానాన్ని అమలు పరచడం కేంద్ర బ్యాంకు ముఖ్యమైన విధి. - ఆర్.ఎన్.సేయర్స్
* కేంద్ర బ్యాంకు అనేది వాణిజ్య బ్యాంకులకు అంతిమంగా రుణాలిచ్చి ఆదుకునే వ్యవస్థ. - హాత్రీ
మాదిరి ప్రశ్నలు
1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంత కార్యాలయాలు లేని చోట ఆర్‌బీఐ ఏజెంటుగా ఏ సంస్థ వ్యవహరిస్తుంది?ఎ) స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బి) ఆర్థికమంత్రిత్వ శాఖ సి) భారత ప్రభుత్వం డి) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ
జ: (ఎ)
2. కిందివాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే విధుల్లో ఏది సరైంది?
1) ద్రవ్యాన్ని చెలామణి చేయడం 2) ప్రభుత్వ బ్యాంకు 3) బ్యాంకులకు బ్యాంకు 4) పరపతి నియంత్రణ
ఎ) 1, 2 బి) 3, 4 సి) పైవన్నీ డి) ఏదీకాదు
జ: (సి)
3. ఆర్‌బీఐ 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు' (డబ్ల్యూఎమ్ఏ)ను కిందివాటిలో దేనికి కల్పిస్తుంది?
ఎ) కేంద్ర ప్రభుత్వం బి) రాష్ట్ర ప్రభుత్వం సి) రెండింటికీ డి) ఏదీకాదు
జ: (సి)
4. ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మితే వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వల మీద ప్రభావం ఎలా ఉంటుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది సి) స్థిరంగా ఉంటుంది డి) పెరుగుతుంది లేదా తగ్గుతుంది
జ: (బి)
5. ఆర్‌బీఐ కింది చర్యల్లో ఏది దేశంలోని ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడదు?
ఎ) బ్యాంకు రేటును పెంచడం బి) రిజర్వు నిష్పత్తులను పెంచడం
సి) బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం డి) రెపో రేటును పెంచడం
జ: (సి)
6. నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే వచ్చే ఫలితం
1) బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరుగుతాయి 2) రెపో రేటు పెరుగుతుంది 3) శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పతి (ఎస్ఎల్ఆర్) తగ్గుతుంది
ఎ) 1 మాత్రమే బి) 1, 2 సి) 1, 3 డి) 1, 2, 3
జ: (ఎ)
7. 'బ్యాంకింగ్ నియంత్రణ చట్టం'ను ఎప్పుడు జారీ చేశారు?
ఎ) 1947 బి) 1948 సి) 1949 డి) 1950
జ: (సి)
8. బహిరంగ మార్కెట్ వ్యవహారాల ద్వారా ఆర్‌బీఐ వేటిని కొనడం/ అమ్మడం చేస్తుంది?
ఎ) విదేశీ మారక ద్రవ్యం బి) బంగారం సి) ప్రభుత్వ సెక్యూరిటీలు డి) పైవన్నీ
జ: (సి)
9. బ్యాంకు రేటు అని దేన్ని అంటారు?
ఎ) వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణాన్ని పొందే వడ్డీ రేటు
బి) వాణిజ్య బ్యాంకులు తమ వినియోగదారులకు రుణాన్ని ఇచ్చే రేటు
సి) వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐకు రుణాన్ని ఇచ్చే వడ్డీ రేటు
డి) ఏదీకాదు
జ: (ఎ)
Posted on 07-10-2015
గంగినేని ధనుంజయ్