Type Here to Get Search Results !

May-11

May-11 Current affairs articles

చట్టబద్దంగా ట్రాన్స్‌జెండర్ల పెళ్లి
భారత్‌లో లెసిబియన్‌, గే, బై సెక్సువల్‌ అండ్‌ ట్రాన్స్‌జెండర్‌ (LGBT) కమ్యూనిటీ తొలి విజయం సాధించింది. కేరళ రాష్ట్రంలో ఇషాన్‌, సూర్య అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు చట్టబద్దంగా 2018 మే 10న వివాహం చేసుకున్నారు. పురుషుడి భావాలుకలిగిన ఇషాన్‌, స్త్రీ భావాలు కలిగిన సూర్యలు లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారు. ఒకరంటే మరొకరికి ఉన్న అనురాగంతో వివాహం చేసుకున్నారు. తిరువనంతపురంలోని మన్నం మెమోరియల్‌ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నారు.
  • ఇషాన్‌, సూర్యలు ట్రాన్స్‌జెండర్‌ జస్టిస్‌ బోర్డులో కొన్నేళ్లుగా సభ్యులు. స్నేహితులు. వీరి వివాహం భారత్‌లో ఎప్పటినుంచో LGBT కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అవమానాల నుంచి విజయంగా భావిస్తున్నారు.
LGBT-Lesbian, Gay, Bisexual, and Transgender
-------------------------------------------------------------------------------------------
ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న నగరం లండన్‌

బ్రెగ్జిట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ లండన్‌ ప్రపంచంలోనే విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన, ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న నగరంగా కితాబు అందుకుంది. బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌) ఉత్తమ విశ్వవిద్యాయాల జాబితాను 2018 మే 10న విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సరైన గమ్యస్థానం లండన్‌ అని క్యూఎస్‌ పేర్కొంది.
  • ఈ జాబితా రూపొందించడానికి యూనివర్సిటీ ర్యాంకింగ్‌, విద్యార్థుల అభిప్రాయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగుల పనితీరు, ఫీజుల వివరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. భద్రతా ప్రమాణాలు, జనాభా, సాంఘిక అంశాలు, జనాదరణ వంటి అంశాల ఆధారంగా విద్యార్థులు యూనివర్సిటీలో చేరుతున్నారని క్యూఎస్‌ తన నివేదికలో పేర్కొంది.
  • ఈ జాబితాలో లండన్‌ తర్వాత టోక్యో, మెల్‌బోర్న్‌, మాంట్రియల్‌, పారిస్‌, మ్యూనిచ్‌, బెర్లిన్‌, జ్యూరిచ్‌, సిడ్నీ, సియోల్‌లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి.
  • గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల జాబితాలోనూ లండన్‌ 2వ స్థానం సంపాదించుకుంది.
  • యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే లండన్‌లో అద్దె ఖర్చులు నిలకడగా ఉంటాయని.. ప్రపంచంలోని టాప్‌-10 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నందున ఈ జాబితాలో లండన్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని క్యూఎస్‌ తెలిపింది.
మలేసియా ప్రధానిగా మరోసారి మహతీర్‌
Event-Date:11-May-2018
Level:International
Topic:Persons in News

మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్‌ బిన్‌ మహమ్మద్‌(92) మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతపెద్ద వయస్సులో ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు.  మహతీర్‌ మహమ్మద్‌ 2018 మే 10న రాజధానిలోని ఇస్తానా నెగర ప్రాసాదంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మలేసియాకు స్వాతంత్య్రం వచ్చిన 1957 నుంచి అధికారంలో ఉన్న బరిసాన్‌ నేషనల్‌(బీఎన్‌) సంకీర్ణానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గట్టి షాకిచ్చారు. మొత్తం 222 సీట్లున్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష ‘పకటన్‌ హరపన్‌’ కూటమికి 113 సీట్లు రాగా బీఎన్‌ కూటమి 79 సీట్లు గెలుచుకుంది. మహతీర్‌ మహమ్మద్‌ బీఎన్‌ కూటమి చైర్మన్‌గా ఉన్న సమయంలో 1981-2003 వరకు 22 ఏళ్లపాటు ఏకధాటిగా ప్రధానిగా పనిచేశారు. 
  • ఎన్నిక ద్వారా అధికారంలోకి వచ్చినవారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడుగా మహతీర్‌ రికార్డు సృష్టించారు. ఈసారి ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తూ ఆయన బరిలోకి దిగారు. 1957లో స్వతంత్రదేశంగా అవతరించిన తర్వాత మలేసియాలో తొలిసారిగా ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మలేసియాలో 6 దశాబ్దాలుగా బారిసన్‌ నాజినల్‌(బీఎన్‌) సంకీర్ణమే పాలనలో ఉంది. దేశాన్ని అధునాతంగా తీర్చిదిద్దిన పేరుతో పాటు, ఉక్కు పిడికిలితో పాలన సాగించినట్లు విమర్శలున్న మహాథిర్‌ 2003లో రాజకీయాల నుంచి తప్పుకొనేంత వరకు 22ఏళ్లు ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో ఆయన ఇదే సంకీర్ణానికి నాయకత్వం వహించారు. కాగా భారీ అవినీతి, ప్రత్యక్ష పన్నుల విధానం తదితర అంశాలు ఇంతవరకు ప్రధానిగా ఉన్న నజీబ్‌ రజాక్‌పై వ్యతిరేకతను పెంచాయి. వీటితో పాటు, ప్రతిపక్ష ప్రముఖుడు ఇబ్రహీం అన్వర్‌ను జైలులో పెట్టడం తదితర కారణాలతో ఆగ్రహించిన మహాథిర్‌ ప్రతిపక్షాతో కలిపి మళ్లీ బరిలోకి దిగారు.
  • మహాథిర్‌ మాదిరిగానే పలు దేశాల్లో మళ్లీ మళ్లీ పదవుల్లోకి వచ్చిన నేతలున్నారు. బ్రిటన్‌లో విన్‌స్టన్‌చర్చిల్‌ 3 సార్లు పదవిలోకి వచ్చారు. 1915లో అనివార్య పరిస్థితుల్లో రాజీనామా చేసిన ఆయన 1940, 1951ల్లో ప్రధాని పదవిని చేపట్టారు. అలాగే 52 ఏళ్ల వయసులో 2006లో జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షింజోఅబే కుంభకోణాలు, రాజకీయ అసమ్మతితో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పదవిలోకి వచ్చారు. ఇటాలియన్‌ మీడియా దిగ్గజం బెర్లుస్కోనీ 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. ఇజ్రాయిల్‌లో యువ ప్రధానిగా 1996లో బాధ్యతలు చేపట్టిన బెంజమిన్‌ నెతన్యాహు తిరిగి 2009లో ప్రధాని అయ్యారు.
లైంగిక దాడుల బాధితుల పరిహారం పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలి : నల్సా

లైంగిక దాడుల బాధితులకు పరిహారం ఇచ్చేందుకు తాము ప్రతిపాదించిన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందని జాతీయ న్యాయ సేవ సంస్థ (నల్సా) 2018 మే 10న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బాధితులకు పరిహారం మంజూరు చేసే అధికారం తమకు ఇవ్వాలని న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన ధర్మాసనానికి నల్సా విజ్ఞప్తి చేసింది. నల్సా ప్రతిపాదిత పథకానికి సుప్రీంకోర్టు స్వల్ప మార్పులను సూచించింది. పెట్టిన కేసులు తప్పుడువని తేలితే పరిహారాన్ని వాపసు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. 
పతుల కేసులో బిడ్డకు న్యాయమూర్తి నామకరణం
Event-Date:11-May-2018
Level:National
Topic:Persons in News

వేర్వేరు మతాలకు చెందిన తల్లిదండ్రుల దాంపత్య వివాదం నేపథ్యంలో వారి రెండో బిడ్డకు పేరు పెట్టే విషయం  కేరళ హైకోర్టు వరకు రావడంతో చివరకు న్యాయమూర్తే చొరవ తీసుకుని నామకరణం చేయాల్సి వచ్చింది. జోహన్‌ మణి సచిన్‌ అనే పేరుపెట్టాని తల్లి, అభినవ్‌ సచిన్‌ పేరును ఖరారు చేయాలని తండ్రి పట్టుబట్టారు. బిడ్డను బడిలో చేర్చడానికి జనన ధ్రువీకరణపత్రం అవసరం కావడంతో న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.జయశంకర్‌ నంబియార్‌ దీనికొక పరిష్కారం చూపించారు. మధ్యేమార్గంగా ‘జోహన్‌ సచిన్‌’ అనే పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ధ్రువపత్రం జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 
కేంద్ర పథకాల ప్రచారానికి ‘కిసాన్‌ సంవాద్‌’

నరేంద్రమోడి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలపై ప్రచారం కల్పించేందుకు  బీజేపీ కిసాన్‌మోర్చా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనుంది.  ఈ కార్యక్రమానికి  ‘కిసాన్‌ సంవాద్‌’ అనే పేరు పెట్టామని కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు వీరేంద్రసింగ్‌ వెల్లడించారు.  
అమెరికాలో OPT కింద అనుమతి పొందిన విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ 
Event-Date:11-May-2018
Level:National
Topic:Foreign relations

అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అక్కడే ఉండి పని చేయడానికి అధికారికంగా అనుమతి పొందిన వారిలో భారతీయు మొదటి స్థానంలో నిలిచారు. 2004 నుంచి 2014 మధ్య గణాంకాలపై ప్యూ రీసెర్చి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది.
  • 2వ స్థానంలో చైనా వారు, 3వ స్థానంలో దక్షిణకొరియా విద్యార్థులు నిలిచారు.
  • 2004-2016 మధ్య OPT (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) కింద 4,41,000 మంది భారతీయ విద్యార్థులు పని చేసుకోవడానికి అనుమతి పొందారని, ఈ సంఖ్య.. మొత్తం విద్యార్థుల్లో 30 శాతమని ప్యూ రీసెర్చి తెలిపింది.
  • OPT కింద అనుమతి పొందిన చైనా విద్యార్థులు 3,13,500 మంది (21శాతం), దక్షిణ కొరియా విద్యార్థులు 90,800 మంది (ఆరు శాతం).
  • విదేశీ విద్యార్థులు ఎఫ్‌1 వీసా కింద 12 నుంచి 36 నెలల పాటు తాత్కాలికంగా పని చేసుకునేందుకు దొరికే అనుమతే OPT. అభ్యర్థులు తమ చదువుకు సంబంధించిన రంగంలోనే ఈ కార్యక్రమం కింద పని చేయాల్సి ఉంటుంది.
OPT-Optional Practical Training 
అటల్‌టింకరింగ్‌ ల్యాబ్స్‌ నవ కల్పన పోటీలో తెలంగాణ విద్యార్థులకు చోటు 
Event-Date:11-May-2018
Level:Local
Topic:Science and Technology

విద్యార్థుల్లో వినూత్న ఆలోచననలు ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ పోటీలో హైదరాబాద్‌ డిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థుల నవకల్పనకు టాప్‌ 30లో చోటు దక్కింది. పాఠశాలకు చెందిన అద్వయిత్‌ గౌరిశెట్టి, మణికంఠ చవ్వాకు, మనీష్‌ మల్లాపూర్‌ రూపొందించిన ‘ఫామ్‌ టెక్‌’ను ఉత్తమ వినూత్న కల్పన కింద ఎంపిక చేశారు. పాఠశాల ఉపాధ్యక్షుడు ఎం.సుభాష్‌ వీరికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు.
  • ఆరు నెలల పాటు నిర్వహించిన అటల్‌ టింకరింగ్‌ మారథాన్‌లోని విద్యార్థులు రూపొందించిన నవ కల్పనను వడపోసి అంతిమంగా ఎంపిక చేసిన 30 అత్యుత్తమ ఆలోచననలు పుస్తకరూపంలో 2018 మే 10న నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ విడుదల చేశారు. స్వచ్ఛ ఇంధనం, నీటివనరుల సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవసాయ సాంకేతిక రంగాల్లో ఈ పోటీ నిర్వహించారు. 
కెన్యాలో బద్దలైన ఆనకట్ట: 47 మంది మృతి 

కెన్యాలోని నకురు పట్టణంలోని సొలాయ్‌ ప్రాంతంలో గల  ఆనకట్ట ‘‘ద ప్రైవేట్‌ పటేల్‌ డామ్‌’’ 2018 మే 9న బద్దలై జల ప్రళయం సృష్టించింది. మహోగ్రంగా దూసుకొచ్చిన నీటి ప్రవాహం పరిసరాల్లోని వంద ఇళ్లను అమాంతం ఈడ్చుకెళ్లింది. దీంతో 47 మంది మృతి చెందారు. వీరిలో 20 మంది పిల్లలున్నారు. వరుస కరవు తర్వాత ఇక్కడ వారాల తరబడి కుంభవృష్టి వానలు కురిసాయి. దీంతో నదులు ఉద్ధృతంగా ప్రవహించి లోతట్టు ప్రాంతాలు బురదమయం అయ్యాయి.  
పీసా హార్మ్యం గుట్టు రట్టు
Event-Date:11-May-2018
Level:International
Topic:Places in News

ఇటలీలో ఒకవైపు ఒరిగి ఉండే పీసా హార్మ్యం 1280 నుంచి బలమైన భూకంపాలను సైతం తట్టుకుని ఎలా నిలబడగలిగిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా భూకంపాలు వస్తే ఎంతటి అధునాతన భవనమైనా పేకమేడలా కూలిపోతుంటుంది. అలాంటిది 1280 నుంచి కనీసం నాలుగు బలమైన భూకంపాలు సంభవించినప్పటికీ.. 5 డిగ్రీల మేర ఒకవైపు ఒరిగి ఉండే ఈ కట్టడం చెక్కు చెదరలేదు. ఎన్నో ఏళ్లుగా దీని వెనుకనున్న మర్మాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
  • ఈ మేరకు బ్రిటన్‌లోని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వారు సహా మొత్తం 16 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉన్న భూకంప, భౌగోళిక, నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు.
  • ఈ భవనం విషయంలో అసాధారణమైన ‘క్రియాశీల మట్టి నిర్మాణ ప్రతిస్పందనలు’ చోటుచేసుకున్నట్లు చెప్పారు.
  • కట్టడం ఎత్తు, దృఢత్వం, పునాది మట్టిలో ఉండే మృదుత్వం కలిసి.. భూకంపం కారణంగా ఏర్పడిన ప్రకంపనల తీవ్రతను గణనీయంగా మార్చేస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల భూకంప ప్రకంపనలతో కట్టడం అనునాదం చెందడం లేదని, ఫలితంగా భవనం సురక్షితంగా ఉంటోందని వివరించారు.
స్విట్జర్లాండ్‌లో 104 ఏళ్ల ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్‌ గూడాల్‌ బలవన్మరణం 
Event-Date:11-May-2018
Level:International
Topic:Persons in News

స్వదేశంలో ఆత్మహత్యకు అనుమతించడం లేదన్న అసంతృప్తితో స్విట్జర్లాండ్‌కు చేరుకున్న 104 ఏళ్ల ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్‌ గూడాల్‌ బవన్మరణానికి ప్పాడ్డారు. 2018 మే 10న బాసెల్‌లో డేవిడ్‌ ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ‘ఎగ్జిట్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ డైరెక్టర్‌ ఫిలిప్‌ నిష్కె వెల్లడించారు. లైఫ్‌ సైకిల్‌ అనే ఓ క్లినిక్‌లో నెంబుటాల్‌ అనే మందును ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించడంతో డేవిడ్‌ మరణించారని తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా ఆత్మహత్యకు సంబంధించిన విషయాల గురించి డేవిడ్‌ యోచిస్తున్నారని నిష్కె చెప్పారు. స్వయంగా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మాత్రం ఆయనలో గతేడాదే మొదలయ్యిందని పేర్కొన్నారు. వృద్ధాప్యం కారణంగా తన జీవన నాణ్యత బాగా క్షీణించడమే అందుకు కారణమని చెప్పారు. బలవన్మరణానికి పాల్పడటంతో తమ సంస్థ సహాయం తీసుకున్న తొలి వ్యక్తి ఆయనేనని వెల్లడించారు.
  • ఆత్మహత్యకు ముందురోజు 2018 మే 9న డేవిడ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ఇంకొన్నాళ్లు బతికే కోరిక నాకు ఏమాత్రం లేదు. రేపు జీవితాన్ని ముగించే అవకాశమున్నందుకు చాలా సంతోషిస్తున్నా. ఆ అవకాశాన్ని నాకిస్తున్న వైద్యవృత్తిని అభినందిస్తున్నా. ఆస్ట్రేలియాలోనే చనిపోయేందుకు నేను మొగ్గుచూపేవాణ్ని. అక్కడి చట్టాలు అందుకు అనుమతించడం లేదు’’ అని పేర్కొన్నారు.
సియాచిన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన 
Event-Date:11-May-2018
Level:National
Topic:Persons in News

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధక్షేత్రం సియాచిన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 మే 10న పర్యటించారు. ఇక్కడి సైనిక శిబిరాన్ని సందర్శించిన ఆయన విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్న భరోసా పౌరులకు కలగడానికి వారి ధైర్యసాహసాలే కారణమని ఆయన కొనియాడారు. సైనికులకు, వారి కుటుంబాలకూ భారత ప్రభుత్వం, పౌరుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించేందుకు తాను సియాచిన్‌ను సందర్శించానని ఆయన చెప్పారు.
  • జమ్ముకశ్మీర్‌లో సముద్రమట్టానికి 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ను సందర్శించిన రెండో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం కూడా రాష్ట్రపతిగా ఉండగా 2004లో ఇక్కడకు వచ్చారు.
నమోదిత కంపెనీ బోర్డుల్లో భారీ మార్పులకు సెబీ శ్రీకారం

నమోదిత కంపెనీ బోర్డుల్లో భారీ మార్పులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పదవిని విడదీయాల్సిందిగా కంపెనీలను ఆదేశించింది.
  • కంపెనీ బోర్డులో కనీసం ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలని, అందులో ఒక మహిళకు చోటు కల్పించడం తప్పనిసరి చేసింది.
  • కొత్త మార్పులకు దశలవారీగా తుది గడువు విధించింది. స్వతంత్ర డైరెక్టర్ల ఏర్పాటుకు తుది గడువును 2019 ఏప్రిల్‌ 1గా సెబీ నిర్ణయించింది. సీఎండీ పదవి విడదీయడానికి 2020 ఏప్రిల్‌ 1 వరకు గడువు ఇచ్చింది.
  • కార్పొరేట్‌ పరిపానపై ఉదయ్‌ కోటక్‌ ప్యానెల్‌ చేసిన 80 సిఫారసుల్లో 40 సిఫారసులకు మార్చిలో సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే సెబీ తాజా ఆదేశాలు జారీచేసింది. 2017 అక్టోబరులో ప్యానెల్‌ తమ నివేదికను సెబీకి సమర్పించింది.
  • కొత్త నిబంధనల ప్రకారం.. నమోదిత కంపెనీలు, అనుబంధ సంస్థలు అన్ని రకాల లావాదేవీల వివరాలను తెలియజేయడంతో పాటు సెక్రటేరియల్‌ ఆడిట్‌ను సెబీ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అగ్రగామి 100 నమోదిత కంపెనీలు తమ వార్షిక సర్వసభ్య సమావేశాలను వెబ్‌కాస్ట్‌ ద్వారా ప్రసారం చేయాల్సిందిగా ఆదేశించింది. కొత్త నిబంధనలు రెండు దఫాల్లో అమల్లోకి రానున్నాయి. ఎక్కువ శాతం మార్పులు 2019 ఏప్రిల్‌ 1, 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సెబీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
  • కొత్త నిబంధనల ప్రకారం 2020 ఏప్రిల్‌ 1 నుంచి అగ్రగామి 500 నమోదిత కంపెనీల్లో ఛైర్‌పర్సన్‌ తప్పనిసరిగా నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉండాలి. ఈ నిర్ణయం ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవి విభజనకు దారితీయనుంది. ప్రస్తుతం చాలా కంపెనీల్లో సీఎండీగా ఒక్కరే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బోర్డు, మేనేజ్‌మెంట్‌ కంటే సీఎండీకి ఎక్కువ నిర్ణయాధికారం ఉండటంతో కొన్ని సందర్భాల్లో ఆయాచిత బ్ధి చేకూర్చడానికి కారణమవుతోందని సెబీ భావిస్తోంది.
  • 2019 ఏప్రిల్‌ 1కి అగ్రగామి 500 కంపెనీలు తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డైరెక్టర్‌ను నియమించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బోర్డుల్లో మహిళా డైరెక్టర్‌ ఉంటే చాు. వీరు స్వతంత్ర లేదా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. 
  • ఇకపై ఒక వ్యక్తి ఏడు నమోదిత కంపెనీల కంటే ఎక్కువ వాటిల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేయకూడదని సెబీ ఆదేశించింది. 
  • కంపెనీల్లో అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ వ్యవహారాల్లోనూ సెబీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన సంస్థాగత మదుపర్లు, ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ వంటి ద్వారా సమీకరించిన నిధుల వివరాలను వార్షిక నివేదికల్లో కంపెనీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిటర్‌ వివరాలు, ఆడిట్‌ ఫీజు, ఫీజుల్లో మార్పులు, ఆడిటర్‌ రాజీనామాకు సవివరమైన కారణాలను సైతం తెలియజేయాల్సి ఉంటుంది. 
  • ఆర్థిక సంవత్సరం ముగిసిన 5 నెలల్లో అగ్రగామి 100 కంపెనీలు ఏజీఎంను నిర్వహించాలి. 
  • 2019 ఏప్రిల్‌ 1 నుంచి అగ్రగామి 1000 కంపెనీ బోర్డు సమావేశాలకు ముగ్గురు డైరెక్టర్లు హాజరు కావడం తప్పనిసరి. 2020 ఏప్రిల్‌ నుంచి 2000 అగ్రగామి కంపెనీలకు ఇదే నిబంధన వర్తిస్తుంది. 
  • 75 ఏళ్ల పైబడిన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల నియామకానికి ప్రజా వాటాదార్ల ఆమోదం తెలపాలి. 
  • అగ్రగామి 500 కంపెనీల్లో సైబర్‌ భద్రతకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇక పెద్ద సంఖ్యలో అనుబంధ సంస్థలు కలిగిన నమోదిత కంపెనీలు.. బోర్డు డైరెక్టర్లతో కూడిన అత్యున్నత కమిటీ ద్వారా వాటి పరిపాలనను పర్యవేక్షించాల్సిందిగా సెబీ ఆదేశించింది.
మొక్కజొన్న, జొన్నకు క్వింటాలుకు రూ.200 

మొక్కజొన్న, జొన్న రైతుకు ధరల స్థిరీకరణ పథకం కింద క్వింటాలుకు రూ.200 చొప్పున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 100 క్వింటాళ్ల వరకు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. దీనివల్ల వారికి రూ.20,000 వరకు ప్రయోజనం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది.
  • 2018 మే 16 నుంచి రైతు నమోదు ప్రారంభమవుతుంది.
  • మండల వ్యవసాయాధికారి ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రం, సాగు విస్తీర్ణం, దిగుబడి తదితర వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలి. వీటిని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది తమ వద్ద ఉండే అడంగల్‌ వివరాలతో సరిచూసుకుని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు.
  • సమగ్ర పరిశీలన అనంతరం జిల్లా అధికారులకు, అక్కడ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు జాబితాలు  చేరతాయి.
  • 2018 జులై 10 నుంచి రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేయడం ప్రారంభమవుతుంది.
అతిపెద్ద జెండాను ఆవిష్కరించిన పవన్‌ కల్యాణ్‌
Event-Date:11-May-2018
Level:Local
Topic:Places in News

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 2018 మే 10న హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జెండా ఆవిష్కరణ వేడుకను నిర్వహించారు. ఈ జెండా 122 అడుగుల పొడవు, 183 అడుగుల వెడల్పుతో 22,326 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది.
  • 1857 మే 10న తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు.
  • వైబ్రంట్స్‌ కలాం ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 
ఓర్వకల్లులో జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన 
Event-Date:11-May-2018
Level:Local
Topic:Miscellaneous(General)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 మే 10న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 
ఉత్తర కొరియా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లు విడుదల
Event-Date:11-May-2018
Level:International
Topic:Persons in News

దేశ విద్రోహ కుట్రకుపాల్పడుతున్నారన్న ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్న ముగ్గురు అమెరికన్లు కిమ్‌ డోంగ్‌ చుల్‌, కిమ్‌ హక్‌-సాంగ్‌, టోనీ కిమ్‌ను ఉత్తర కొరియా 2018 మే 9న విడుదల చేసింది. మే 10న ఉత్తర కొరియా నిర్బంధం నుంచి విముక్తి పొంది స్వదేశానికి చేరుకున్న ఈ ముగ్గురికి ఆండ్రూస్‌ వైమానిక స్థావరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సతీమణి  మెలానియాతో కలిసి స్వాగతం పలికారు. విమానం కిందకు దిగగానే సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్‌ విమానంలోకి ప్రవేశించారు. ముగ్గురు మాజీ బందీలతో ఉద్వేగంగా మాట్లాడారు. అత్యంత సంతోషంతో వారిని స్వదేశానికి స్వాగతించారు.  
న్యూయార్క్‌లో అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల సమావేశం

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చరిత్రాత్మక భేటీకి ముహూర్తం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 2018 జూన్‌ 12న సింగపూర్‌లో సమావేశం కానున్నారు.  
భారత్‌పై WTOలో అమెరికా ఫిర్యాదు 
Event-Date:11-May-2018
Level:National
Topic:Foreign relations

వరి, గోధుమకు ఇచ్చే మద్దతు ధరను భారత్‌ బాగా తక్కువ చేసి చూపిస్తోందంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు అమెరికా ఫిర్యాదు చేసింది. WTO పరిధిలోని వ్యవసాయ కమిటీకి ఈ మేరకు 2018 మే 4న ‘వ్యతిరేక ప్రకటన’ (కౌంటర్‌ నోటిఫికేషన్‌)ను సమర్పించామని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైటజర్‌, వ్యవసాయ కార్యదర్శి సోనీ పెర్‌డ్యూ తెలిపారు.
  • వ్యవసాయ ఒప్పందంపై ఒక దేశంపై మరో దేశం ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమం.
WTO-World Trade Organization 
రైతుబంధు పథకం ప్రారంభం 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో రైతుబంధు పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు ఎకరానికి సీజన్‌కు రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడంతోపాటు భూదస్త్రాల ప్రక్షాళనకు సంబంధించిన కొత్త పాస్  పుస్తకాలను ధర్మారాజ్‌పల్లి గ్రామ రైతుకు అందించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేటందర్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
15వ ఆర్థిక సంఘం సలహా మండలి ఏర్పాటు
Event-Date:11-May-2018
Level:National
Topic:Economic issues

వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 15వ ఆర్థికసంఘం సలహా మండలిని ఏర్పాటు చేసుకొంది. ఈ మండలిలో వివిధ రంగాలకు చెందిన ఆరుగురు ఆర్థిక నిపుణులు సభ్యులుగా నియమితులయ్యారు. 
ఆర్థిక సంఘం సలహా మండలి సభ్యులు
  1. అరవింద్‌ వీర్‌మణి, ప్రెసిడెంటు, ఫోరం ఫర్‌ స్ట్రాటెజిక్‌ ఇనిషియేటివ్‌
  2. సుర్జీత్‌ ఎస్‌.భల్లా, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలిలో తాత్కాలిక సభ్యుడు, ఆక్సుస్‌ రీసెర్చి అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఛైర్మన్‌
  3. సంజీవ్‌ గుప్త, ఐఎంఎఫ్‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌
  4. పినాకి చక్రవర్తి, ప్రొఫెసర్‌ (ఎన్‌ఐపీఎఫ్‌ప్మీ)
  5. సజ్జద్‌ చినాయ్‌, చీఫ్‌ ఇండియా ఎకనామిస్ట్‌, జేపీమోర్గాన్‌
  6. నీలకంఠ మిశ్ర, ఎండీ, క్రెడిట్‌ సుయెస్సె ఇండియా ఎకనమిస్ట్‌, స్ట్రాటజిస్ట్‌ 
  • 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ - ఎన్‌.కె.సింగ్‌ (నందకిశోర్‌సింగ్‌)
  • 15వ ఆర్థిక సంఘం సభ్యులు :
    1. శక్తికాంతదాస్‌
    2. ప్రొ॥ అనూప్‌సింగ్‌
    3. అశోక్‌ లహిరి
    3. ప్రొ॥ రమేష్‌ చంద్‌
    4. అరవింద్‌ మెహతా 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.