గణపతి, ఛత్రపతి ఉత్సవాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన బాలగంగాధర్ తిలక్‌ను ‘ఉగ్రవాదానికి మూల పురుషుడు’గా పేర్కొనటం వివాదమైంది. రాజస్తాన్ ప్రభుత్వం హిందీలో ప్రచురించే పాఠ్యపుస్తకాలను మథురలోని ఓ సంస్థ ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రచురిస్తుంది. వీటిని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బోధిస్తున్నారు.
- 8వ తరగతి పాఠ్య పుస్తకం 22వ చాప్టర్‌లోని 18,19వ శతాబ్దాల్లో జాతీయోద్యమ ఘటనలు అనే పాఠ్యాంశంలో ‘తిలక్ జాతీయోద్యమానికి ఒక బాటను చూపారు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అంటారు’ అని ఉంది.
-------------------------------------------------------------------------------------------
మట్టి కోర్టులో వరుసగా 50వ విజయం సాధించి రఫెల్ నాదల్ రికార్డు
స్పెయిన్ టెన్నిస్ యోధుడు రఫెల్ నాదల్ మట్టి కోర్టులో వరుసగా 50వ విజయం సాధించి జర్మనీ దిగ్గజం జాన్ మెకన్రో రికార్డును బద్దలు కొట్టాడు. 1984లో మెకన్రో వరుసగా 49 విజయాతో రికార్డు నెకొల్పాడు. మాడ్రిడ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో డీగో ష్వార్జ్‌మన్‌ను ఓడించడం ద్వారా 34 ఏళ్ల మెకన్రో రికార్డును అధిగమించాడు.
భారత్ బయోకు జాతీయ సాంకేతిక అవార్డు
వివిధ వ్యాధి నిరోధక టీకాల పరిశోధనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారత్ బయోటెక్‌కు జాతీయ సాంకేతిక అవార్డు లభించింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా డిల్లీలో 2018 మే 11న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈ అవార్డును సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.కృష్ణమోహన్, వైరల్ వ్యాక్సిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.వి.జె.ఏ.హర్షవర్దన్‌కు అందజేశారు. రొటావ్యాక్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
20వ జాతీయ సాంకేతికత దినోత్సవం
పోఖ్రాన్ పరీక్ష వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2018 మే 11న న్యూడిల్లీలో 20వ జాతీయ సాంకేతికత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోఖ్రాన్‌లో 1998లో చేపట్టిన అణు పరీక్షలతోనే భారతీయుల వైజ్ఞానిక సామర్థ్యమెంతో ప్రపంచానికి తెలిసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.
మహారాష్ట్ర అదనపు డీజీపీ హిమాంశు ఆత్మహత్య
మహారాష్ట్ర అదనపు డీజీపీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మాజీ చీఫ్ హిమాంశురాయ్ (54) 2018 మే 11న ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న రాయ్ నారీమన్‌పాయింట్‌లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. హిమాంశురాయ్ 26/11 ముంబై దాడి మొదలుకుని ఎన్నో కీలక కేసుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
- 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించి మహారాష్ట్ర అదనపు డీజీపీ వరకు ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలున్న అధికారిగా పేరొందారు.
- 2016 నుంచి సుదీర్ఘ సెలవులో ఉన్న రాయ్ మూడేళ్లుగా కేన్సర్‌కు దేశ, విదేశాల్లో చికిత్స పొందినా ఎలాంటి మార్పులేకపోవటంతో బలవన్మరణాకికి పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలగిన రవి వెంకటేశన్
ఇన్ఫోసిస్ బోర్డు నుంచి స్వతంత్ర డైరెక్టర్ రవి వెంకటేశన్ తప్పుకున్నారు. సరికొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. స్వతంత్ర డైరెక్టరుగా 2011లో బాధ్యతలు చేపట్టిన వెంకటేశన్, కొంతకాలం పాటు సహ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2017 ఆగస్టులో నందన్ నిలేకని ఛైర్మన్ కాకముందు వెంకటేశన్ ఈ బాధ్యతలు నిర్వర్తించారు.
ఉత్తమ యాజమాన్య సంస్థల్లో HUL
దేశంలోని ఉత్తమ యాజమాన్య సంస్థల్లుగా హిందుస్థాన్ యునిలీవర్ (HUL), టాటా కమ్యూనికేషన్స్, ఆదిత్యా బిర్లా గ్రూపుకు చోటు దక్కింది. అంతర్జాతీయ వృత్తి నిపుణల సేవల సంస్థ ఏఅన్ రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 16 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఒబెరాయ్ గ్రూపు, ఏజిస్, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, బేయర్, డీబీఎస్ ఇండియా, డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్, గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్, మారియట్ హోటల్స్, రిలయన్స్ నిప్పో లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్, షెల్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
HUL-Hindustan Unilever Limited
NCDRC సభ్యుల పదవీ కాలం పొడిగింపు
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఛైర్మన్, సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ 2018 మే 11న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తవారు నియమితులయ్యే వరకు ఇప్పుడున్నవారు పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. న్యాయసేవల్లో అంతరాయం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
- ట్రైబ్యునళ్లు, ఇతర ప్రాధికార సంస్థల సభ్యుల నియామకాన్ని సవాళ్లు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉండడంతో NCDRC సభ్యుల నియామకం చేపట్టలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నవారినే సుప్రీంకోర్టు కొనసాగించింది.
NCDRC-National Consumer Disputes Redressal Commission
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేశవ్‌యాదవ్
భారతీయ యువజన కాంగ్రెస్ (IYC) అధ్యక్షుడిగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కేశవ్‌యాదవ్ నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్ నియమితులయ్యారు. IYC అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిపారు.
IYC-Indian Youth Congress
శ్రీదేవి మరణంపై దర్యాప్తునకు సుప్రీం తిరస్కరణ
సినీనటి శ్రీదేవి మృతిపై దర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2018 మే 11న కొట్టివేసింది. సినీ దర్శకుడు సునీల్‌సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
- పిటిషన్‌దారు తరఫున మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ మరణంపై విచారణ జరిపించాలని కోరారు. ఒమన్ దేశంలో ఆమె పేరిట రూ.250 కోట్లకు జీవిత బీమా ఉందని, ఆమె మరణించిన తరువాత మాత్రమే వారసులు ఆ సొమ్ము తీసుకోవచ్చన్న నిబంధన ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2018-19 స్వచ్ఛత కార్యాచరణ ప్రణాళిక ఖరారు
స్వచ్ఛభారత్ పథకం(SBM) కింద పలు కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను 71 మంత్రిత్వ శాఖలకు రూ.16,500 కేటాయించింది. కేంద్ర కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హా నేతృత్వాన 2018 మే 11న సమావేశం జరిగింది. 2018-19 స్వచ్ఛత కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. ఎస్‌ఏపీ కింద 2017-18లో రూ.18 వేల కోట్లు కేటాయించారు.
SBM-Swachh Bharat Mission
డేటా దుర్వినియోగంపై భారత్‌కు ఫేస్‌బుక్ సమాధానం
5.62 లక్షల మంది భారతీయుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగం ఆరోపణలపై ఫేస్‌బుక్ స్పందించింది. తమ ఖాతాదారుల డేటా భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని, విధానపరంగా కూడా చాలా మార్పులు చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి సమాధానమిచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాదారుల డేటా దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మాత్రం ఇంకా తన స్పందనను తెలియజేయలేదు.
అమెరికాలోనే అత్యంత వృద్ధురాలు మృతి
అమెరికాలోనే అత్యంత వయస్కురాలైన డెల్ఫిన్ గిబ్సన్(114) 2018 మే 9న మృతి చెందింది. 1903 ఆగస్టు 17న దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించిన డెల్ఫిన్, 1928లో టేలర్ గిబ్సన్‌ను పెళ్లి చేసుకునే వరకు వ్యవసాయంలో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. 1980లో భర్తను కోల్పోయింది. మంచి ఆహారం, దేవునిపై విశ్వాసమే తనను దీర్ఘాయుష్కురాల్ని చేసిందని డెల్ఫిన్ చెబుతుండేది.
దక్షిణార్థ గోళంలోనే అతి ఎత్తైన రాకాసి అల
దక్షిణార్థ గోళంలో భారీ ఎత్తైన రాకాసి అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు వెల్లడించారు. అల ఎత్తు 8 అంతస్తుల మేడకు సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన ఈ ఘటన జరిగినట్లు వివరించారు. 2012లో కూడా ఇదే ప్రాంతంలో 22.03 మీటర్ల ఎత్తుగల భారీ అల సంభవించింది. వీటికంటే అతి భారీ అలలు సంభవిస్తాయని భావిస్తున్నట్లు వివరించారు.
- ఇప్పటివరకూ భూమి మీద అతిపెద్ద రాకాసి అల అలస్కా తీరంలోని లితుయా అగాథం వద్ద సంభవించింది. 1958లో సంభవించిన ఓ భారీ భూకంపం కారణంగా ఇక్కడ అలలు 30.5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి.