నిర్లక్ష్యం.. తారుమారైన ఫలితం 91 మార్కులకు బదులు 19 మార్కులు పునః పరిశీలనతో తేలిన నిజం
అనంతపురం, న్యూస్‌టుడే: మూల్యాంకనం సమయంలో అధికారుల నిర్లక్ష్యం.. ఒక విద్యార్థిని ప్రాణంతో చెలగాటమాడింది. ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో రాణిస్తున్న ఆ విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో పరీక్ష తప్పినట్లు ఫలితాల్లో కనిపించడంతో ఆ కుటుంబం 26 రోజులపాటు తీవ్ర ఆవేదనకు గురైంది. అనంతపురం గుల్జార్‌పేట వాసి రామ్‌కిశోర్ కుమార్తె నాగనవ్య నగరంలో ఇంటర్ ఎంఈసీ పూర్తిచేసింది. గత నెల 12న ఇంటర్ ద్వితీయ ఫలితాలు విడుదలయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో అనుత్తీర్ణురాలైనట్లు ఫలితాల్లో కనిపించడంతో కుటుంబమే కాదు, కళాశాల యాజమాన్యం దిగ్భ్రాంతికి గురైంది. ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు 483 వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలోనూ అన్ని సబ్జెక్టుల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించింది. ఒక్క ఎకనామిక్స్‌లో మాత్రం 19 మార్కులే వచ్చినట్లు జాబితాలో కనిపించాయి. తల్లిదండ్రులు పునఃపరిశీలనకు దరఖాస్తు చేశారు. మంగళవారం పునఃపరిశీలన ఫలితాలు వెల్లడయ్యాయి.
962 మార్కులతో ఉత్తీర్ణత మంగళవారం పునఃపరిశీలన ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్లో ఉంచింది. పరిశీలించగా నాగనవ్యకు (హాల్‌టిక్కెట్ నంబరు 1811214749) ఎకనామిక్స్ పేపరు-2లో గతంలో 19 మార్కులు రాగా, కొత్తగా 91 మార్కులు వచ్చినట్లు మార్కుల జాబితా కనిపించింది.