¤ భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 6ఏతో సంబంధాలు తెగిపోయాయి. » ఉపగ్రహంలోని విద్యుత్ వ్యవస్థ విఫలం కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ చెప్పారు.
ఏప్రిల్ - 2
¤ చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ - 1 ప్రస్థానం ముగిసింది. నియంత్రణ లేకుండా కొంతకాలంగా కక్ష్యలో తిరుగుతున్న ఈ రోదసి ప్రయోగశాల భూ వాతావరణంలోకి ప్రవేశించి, మండిపోయింది. దీని శకలాలన్నీ దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో పడటంతో ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంది. » 8 టన్నుల బరువున్న తియాంగాంగ్ - 1 దక్షిణ పసిఫిక్‌లోని మధ్య ప్రాంతానికి ఎగువన ఉన్నప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది. » తియాంగాంగ్-1ను 2011 సెప్టెంబరు 29న ప్రయోగించారు. దీని పొడవు 10.4 మీటర్లు. 2022 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న చైనా దానికి సన్నాహకంగా ఈ ప్రయోగశాలను పంపింది. పూర్తిస్థాయి ప్రయోగశాలకు అవసరమైన కీలక పరిజ్ఞానాలను పరీక్షించేందుకు వేదికగా దీన్ని ఉపయోగించుకుంది. ఇది చైనా మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలకు అనేక సేవలు అందించింది. షెంజే - 8, 9, 10 వ్యోమనౌకలతో అనుసంధానమైంది. కక్ష్యలో మానవ తోడ్పాటును, ఆటోమేటిక్ పద్ధతిలోనూ డాకింగ్‌ను ప్రయత్నించడానికి దీన్ని ఉపయోగించారు. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యోమగాములు దీనిలోకి ప్రవేశించి అనేక ప్రయోగాలు నిర్వహించారు. అక్కడి నుంచే విద్యార్థులకు బోధన తరగతిని నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ప్రసారం చేశారు. రెండేళ్ల పాటు సేవలు అందించిన తియాంగాంగ్ - 1 2016 మార్చి నుంచి పనిచేయడం లేదు.
ఏప్రిల్ - 3
¤ విశ్వంలో అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్న ఒక నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. » అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన హబుల్ అంతరిక్ష టెలిస్కోపు దీని ఆచూకీని పసిగట్టింది. » నీల వర్ణంలో ఉన్న ఈ భారీ తారకు 'ఐకారస్' అని పేరు పెట్టారు. విశ్వం నిడివిలో ఇది దాదాపు మధ్య భాగంలో కొలువై ఉంది. ఇంత దూరంలో ఉన్న నక్షత్రాన్ని వీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు ఒక రికార్డు సృష్టించారు. » ఈ నక్షత్రం ఓ శంఖాకార గెలాక్సీలో ఉంది. ఇది ఎంత దూరంలో ఉందంటే దాని కాంతి భూమిని చేరడానికి ఏకంగా 900 కోట్ల సంవత్సరాలు పడుతుంది. గురుత్వాకర్షణ లెన్సింగ్‌తో పాటు హబుల్ టెలిస్కోప్‌కు ఉన్న అద్భుత స్పష్టత సామర్థ్యాన్ని ఉపయోగించుకుని శాస్త్రవేత్తలు ఐకారస్ నక్షత్రాన్ని వీక్షించగలిగారు.
ఏప్రిల్ - 4
¤ ఇస్రో మార్చి 29న షార్ నుంచి ప్రయోగించిన జీశాట్ - 6ఏ ఉపగ్రహంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలుదేశాల అంతరిక్ష సంస్థల సాయంతో జీశాట్ - 6ఏతో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో యత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. » ఈ ఉపగ్రహాన్ని రూ.260 కోట్లతో నిర్మించారు.
ఏప్రిల్ - 6
¤ వాతావరణ పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా మన దేశం మరోసారి 'ఆర్‌హెచ్ (రోహిణి) - 300'సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన ఈ రాకెట్ తిరువనంతపురంలోని తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణంలోని దిగువ అయనావరణంపై పరిశోధనలకు తాజా ప్రాజెక్టు ఉపయోగపడనుంది.
ఏప్రిల్ - 12
¤ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి చేపట్టిన పీఎస్ఎల్‌వీసి41 వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. ఇది దిక్సూచి (నావిగేషన్) వ్యవస్థ కోసం రూపొందించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఐ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లింది. ఇది విజయవంతమైన పీఎస్ఎల్‌వీ 41వ ప్రయోగం. » ఈ ప్రయోగంతో దేశీయంగా అభివృద్ధి చేసిన జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) వ్యవస్థ మరింత సమర్థంగా అందుబాటులోకి రానుంది. ఇది సైనిక, పౌర అవసరాలకు ఉపయోగపడుతుంది. » ఇప్పటివరకు ఇస్రో 9 నావిగేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. దిక్సూచి వ్యవస్థ అందించడానికి ఏడు ఉపగ్రహాలు సరిపోతాయి. అయితే 2013 జులై 1న పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఎ ఉపగ్రహంలోని రుబీడియం గడియారాల్లో సాంకేతిక లోపం తలెత్తి పనిచేయలేదు. దానికి ప్రత్యామ్నాయంగా 2017 ఆగస్టు 31న ఐఆర్ఎన్ఎస్ఎస్ 1 హెచ్ ఉపగ్రహాన్ని పంపించారు. అయితే ఉష్ణకవచం తెరుచుకోకపోవడంతో అది విఫలమైనట్లు ఇస్రో అప్పట్లో ప్రకటించింది. ఆ స్థానంలో ఇప్పుడు ఐఆర్ఎన్ఎస్ఎస్1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. » ఇది నేల, నింగి, సముద్రంలో మార్గనిర్దేశం చేస్తుంది. మత్స్యకారులకు, విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి ట్రాఫిక్ నిర్వహణకు ఉపకరిస్తుంది. మొబైల్ ఫోన్లతో అనుసంధానతలు, సమయాన్ని కచ్చితత్వంతో తెలియజేయడానికి, మ్యాపింగ్‌కు ఉపయోగపడుతుంది. పర్వతారోహకులు, పర్యాటకులకు, వాహన చోదకులకు దృశ్య, స్వర దిక్సూచి సేవలు అందిస్తుంది. » ఉపగ్రహం బరువు 1425 కిలోలు. పరిమాణం 1.58 మీ. × 1.5 మీ. × 1.5 మీ. » పీఎస్ఎల్‌వీ బరువు 321 టన్నులు. ఎత్తు 44.4 మీ.
ఏప్రిల్ - 16
¤ ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1ఐ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. » బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు దశలుగా మండించి పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కి.మీ., అపోజీ (భూమికి దూరంగా) 35,737 కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. » దీంతో ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు.
ఏప్రిల్ - 17
¤ చిమ్మచీకట్లోనూ ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తించగలిగే కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యవస్థను అమెరికా సైనిక పరిశోధన ల్యాబొరేటరీ (ఏఆర్ఎల్) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అప్పటికప్పుడు బయోమెట్రిక్ వివరాలను పరిశీలించడానికి, రాత్రిపూట నిర్వహించిన రహస్య సైనిక ఆపరేషన్‌ను విశ్లేషించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఏప్రిల్ - 19
¤ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) టెస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. » TESS (ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) అనే ఈ ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి ప్రయోగించారు. సౌరవ్యవస్థ ఆవల జీవాన్వేషణ చేసేందుకు దీన్ని ఉపయోగించనున్నారు.
ఏప్రిల్ - 21
¤ జపాన్‌లో 27,000 సంవత్సరాల క్రితం నివసించిన మనిషి పుర్రెను డిజిటల్ విధానంలో త్రీడీ ప్రింటర్ సహాయంతో శాస్త్రవేత్తలు పునర్నిర్మించారు. దక్షిణాసియాలోని తెగలతో ఈ ముఖానికి పోలికలు ఉన్నాయి. జపాన్ ప్రజల మూలాలు తెలుసుకునేందుకు ఇదో కీలక ఆధారంగా మారిందని పరిశోధకులు తెలిపారు. » క్రీస్తు పూర్వం 8000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల మధ్య నివసించిన వారి లక్షణాలు శాస్త్రవేత్తలు సృష్టించిన ముఖంలో కనిపిస్తున్నాయి. » ఈ ముఖాన్ని 2018, జూన్ 17 వరకూ టోక్యో ప్రదర్శనశాలలో ఉంచాలని నిర్ణయించారు.
ఏప్రిల్ - 23
¤ భారత వాయుసేనలో 1988 వరకూ సేవలందించిన 'డకోటా డీసీ-3' రవాణా విమానం మళ్లీ సేవలను ప్రారంభించనుంది. » కాలపరిమితి పూర్తయిన ఈ విమానాన్ని 2011లో తుక్కుగా విక్రయిస్తే రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. లండన్‌కు చెందిన రీఫ్త్లెట్ ఎయిర్ వర్స్క్ లిమిటెడ్‌ను సంప్రదించి, దీన్ని మళ్లీ పునర్వినియోగించేలా మరమ్మతులు చేయించారు. » ఫిబ్రవరి 13న జరిగిన కార్యక్రమంలో దీన్ని వాయుసేన బహుమతిగా స్వీకరించింది. అత్యాధునిక నావిగేషన్ సాంకేతికతను సమకూర్చుకున్న ఈ విమానం మే 4 నుంచి జామ్‌నగర్ వైమానిక స్థావరం నుంచి తిరిగి సేవలు అందించనుంది.
ఏప్రిల్ - 28
¤ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్' మరో మైలురాయిని చేరుకుంది. ఆకాశం నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లే 'బీవీఆర్' క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. » గోవా సముద్ర తీరంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. » హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డీఆర్‌డీవో, ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.
ఏప్రిల్ - 29
¤ భారీ రసాయన ప్రక్రియలు అవసరం లేకుండా ఎన్నిసార్లు అయినా పునర్వినియోగం (రీసైకిల్) చేసుకునేలా కొత్త తరహా ప్లాస్టిక్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలోని కొలరాడో స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు.