Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 వ్యక్తులు

ఏప్రిల్ - 1
¤ హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి (18) నాట్యం చేస్తూ నేలపై చిత్రాన్ని ఆవిష్కరించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
        »
 హైదరాబాద్ ల్యాంకో హిల్స్ టెన్నిస్ కోర్టులో 140 చదరపు అడుగుల స్థలంలో మూడు గులాబీ పువ్వులు, మూడు ఆకులు, పచ్చదనంతో కూడిన భారీ పెయింటింగ్ వేసి జాహ్నవి గిన్నిస్ రికార్డు సాధించింది.¤ రాజ్యసభ ఎంపీ పదవి నుంచి ఇటీవలే విరమణ పొందిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన రాజ్యసభ సభ్యత్వ కాలంలో వేతనం, ఇతర భృతులుగా తాను అందుకున్న మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.        » ఆరేళ్లలో సచిన్‌కు వేతనం, భృతుల రూపంలో దాదాపు రూ.90 లక్షలు దక్కాయి. ఈ మొత్తాన్ని సహాయనిధికి అందించారు.
ఏప్రిల్ - 2
¤ నాస్కామ్ అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్ బాధ్యతలు స్వీకరించారు.        » ఆర్. చంద్రశేఖరన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో దేవయానిని అధ్యక్షురాలిగా నియమించినట్లు నాస్కామ్ వెల్లడించింది.
ఏప్రిల్ - 3
¤ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో సభా నాయకుడిగా మరోసారి నియమితులయ్యారు.        » ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
ఏప్రిల్ - 5
¤ కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం దోషిగా తేల్చింది.        » వన్యప్రాణుల సంరక్షణ చట్టం సెక్షన్ 9/51 కింద ఆయనకు ఐదేళ్ల కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.        » ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆయన సహనటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలమ్, సోనాలి బింద్రే సహా మరో నిందితుడు దుష్యంత్‌సింగ్‌ను సంశయ లబ్ధి కింద నిర్దోషులుగా ప్రకటించింది.        » తీర్పు అనంతరం పోలీసులు సల్మాన్‌ఖాన్‌ను న్యాయస్థానం నుంచి నేరుగా జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు.        » 1988 అక్టోబరులో జోధ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామం భగోదా కీ ధని లో రెండు కృష్ణ జింకలు హత్యకు గురైనట్టు కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణ సందర్భంగా అక్కడకు వచ్చిన సల్మాన్‌ఖాన్ సహ నటులతో కలిసి వాహనంపై వెళ్తూ జింకల గుంపుపై కాల్పులు జరిపారనీ, దీంతో రెండు కృష్ణ జింకలు చనిపోయాయనీ అభియోగాలు నమోదయ్యాయి.        » సల్మాన్ కృష్ణ జింకలను వేటాడడాన్ని చూశానని పూనమ్ చంద్ బిష్ణోయ్ అనే వ్యక్తి సాక్ష్యమిచ్చాడు. సల్మాన్ కేసులో నేటి తీర్పు బిష్ణోయ్ తెగ పోరాట ఫలితమే. చెట్లు, వన్యప్రాణుల పరిరక్షణే వీరి మత విశ్వాసం.
ఏప్రిల్ - 6
¤ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఆచార్యుడిగా పనిచేస్తున్న పంచాణన్ మొహంతి రెండు కొత్త భాషలను వెలుగులోకి తీసుకొచ్చారు. వీటిని వాల్మీకి, మల్హార్‌గా గుర్తించారు. ఒడిశాలోని కొరాపుట్, ఏపీ సరిహద్దు జిల్లాల్లో పలువురు మాట్లాడుతున్న భాషలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని కొన్ని నెలలపాటు శ్రమించి సేకరించారు.        » యూకేకు చెందిన అంతర్జాతీయ భాషా పరిశోధన జర్నల్‌లో సంబంధిత పరిశోధన పత్రం ఇటీవల ప్రచురితమైందని మొహంతి వెల్లడించారు.
ఏప్రిల్ - 7
¤ కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనకు పడిన శిక్షను నెలరోజుల పాటు నిలుపుదల చేయాలని (సస్పెన్షన్) కోరుతూ సల్మాన్ పెట్టుకున్న దరఖాస్తును కూడా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్ జోషి అనుమతించారు.
ఏప్రిల్ - 9
¤ యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శిఖాశర్మ తన నాలుగో విడత తన పదవీ కాలాన్ని మూడేళ్లు కాకుండా, ఏడు నెలలకు పరిమితం చేయాలని కోరారు. ఆమె అభ్యర్థనను బ్యాంకు బోర్డు అంగీకరించింది. గతంలో నిర్ణయించిన మేరకు, ఈ ఏడాది మే 31 వరకు శిఖాశర్మ పదవీ కాలం ఉంది. మరో విడతగా 2018 జూన్ 1 నుంచి డిసెంబరు ఆఖరు వరకు (ఏడు నెలల పాటు) మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తానన్న శిఖాశర్మ విజ్ఞప్తిని బోర్డు మన్నించింది. దీనికి ఆర్‌బీఐ అనుమతి లభించాల్సి ఉంది.        » 2009 నుంచి బ్యాంకు అధిపతిగా ఉన్న శిఖాశర్మ మే 21న తన మూడో విడత పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు.
ఏప్రిల్ - 14
¤ విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) నూతన అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జే ఎన్నికయ్యారు.        » ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి ఈ పదవికి ఎన్నికలు నిర్వహించారు.        » గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో 190 మందికి పైగా వీహెచ్‌పీ ప్రతినిధులు ఓటు వేశారు. కోక్జేకి 131 ఓట్లు రాగా, ప్రస్తుత అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డికి 60 మందికి ఓటు వేశారు.¤ 'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' కొత్త అధ్యక్షుడిగా 'ది ప్రింట్' పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ శేఖర్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.        » ప్రధాన కార్యదర్శిగా బిజినెస్ స్టాండర్డ్ ఎడిటోరియల్ డైరెక్టర్ ఎ.కె. భట్టాచార్య, కోశాధికారిగా న్యూస్ఎక్స్ టీవీ ఛానల్ ఎడిటర్ షీలాభట్ ఎన్నికయ్యారు.
ఏప్రిల్ - 19
¤ ప్రపంచంలోని వందమందిలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రతిష్ఠాత్మక 'టైమ్స్ మ్యాగజీన్' రూపొందించిన తాజా జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది.        » ఓలా సంస్థ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఉన్నారు.        » అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాకుమారుడు హ్యారీ, ఆయన వివాహమాడనున్న మేఘన్ మార్కెల్, లండన్ మేయర్ సాదిక్ ఖాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.        » ఈ ఏడాది గుర్తించినవారిలో 45 మంది వయసు 40 ఏళ్లలోపే ఉన్నట్లు 'టైమ్స్' తెలిపింది. 14 ఏళ్ల నటి మిల్లీ బాబీ బ్రౌన్ అందులో పిన్న వయస్కురాలని వెల్లడించింది.¤ ప్రపంచ గొప్ప నేతల జాబితాలో అపర కుబేరుడు ముకేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు.        » ఫార్చ్యూన్ మ్యాగజీన్ 50 మందితో ఈ జాబితాను రూపొందించగా అందులో ముకేష్‌కు 24వ స్థానం లభించింది.        » ముకేష్ అంబానీ అత్యధిక వేగం గల మొబైల్ డేటాను కేవలం రెండేళ్లలోనే సామాన్యులకు అందించి, టెలికాం రంగం స్థితినే మార్చేశారని ఫార్చ్యూన్ పేర్కొంది. 2016 సెప్టెంబరులో సేవలను ప్రారంభించి ఇప్పటికే 16.8 కోట్ల వినియోగదారులను సంపాదించుకోవడం విశేషమని ప్రశంసించింది.        » #Me Too ఉద్యమం కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.        » యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, ఫుట్‌బాల్ కోచ్ నిక్ సబాన్, బిల్‌గేట్స్, మిలిందా గేట్స్, సెరీనా విలియమ్స్, జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బారా, డెల్టా ఎయిర్‌లైన్స్ సీఈఓ ఎడ్వర్డ్ బాస్టన్ తదితరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.¤ భవ్యషా అనే 12 ఏళ్ల బాలుడు జైన సన్యాసిగా మారాడు. ఈయన సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడు.
ఏప్రిల్ - 21
¤ అమెరికాలో నిర్వహించే ప్రముఖ క్విజ్ పోటీ 'జియోపర్డీ కాలేజీ ఛాంపియన్‌షిప్‌'లో భారతీయ అమెరికన్ విద్యార్థి ధ్రువ్ గౌర్ ప్రథమ స్థానంలో నిలిచి, రూ.66.21 లక్షల (లక్ష డాలర్లు) నగదు బహుమతిని గెలుచుకున్నాడు.
ఏప్రిల్ - 22
¤ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరిగిన సీపీఎం జాతీయ మహాసభల్లో ఆయన తిరిగి ఎన్నికయ్యారు.
ఏప్రిల్ - 23
¤ ప్రముఖ మానవతావాది, ఐరాసలో వాతావరణ కార్యాచరణపై ప్రత్యేక రాయబారిగా ఉన్న మైఖేల్ బ్లూమ్‌బర్గ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.        » వాతావరణ పరిరక్షణే ధ్యేయంగా 'వాతారవణ మార్పులపై ఐరాస కార్యాచరణ ఒడంబడిక (యూఎన్ఎఫ్‌సీసీసీ)'కు సుమారు రూ.30 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.        » పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంతో యూఎన్ఎఫ్‌సీసీసీకి దాదాపు రూ.30 కోట్ల నిధుల కొరత ఏర్పడుతోంది. ఆ కొరతను భర్తీ చేసేందుకే తాజా విరాళం ప్రకటించినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపారు.
ఏప్రిల్ - 24
¤ తెలంగాణ - మహారాష్ట్ర - చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఏప్రిల్ 22 నుంచి మూడు రోజుల్లో జరిగిన రెండు భారీ ఎదురుకాల్పుల్లో 37 మంది నక్సలైట్లు హతమయ్యారు.
ఏప్రిల్ - 25
¤ పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపును (77) జోధ్‌పూర్ ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించింది. అతడు మరణించేంతవరకు జైల్లోనే ఉండాలంటూ భారత శిక్షాస్మృతి, బాలల న్యాయ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తీర్పునిచ్చింది.
¤ మహారాష్ట్ర అదనపు డీజీపీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 28 ఏళ్ల సుదీర్ఘ సేవలు ముగిశాయి. స్వచ్ఛంద పదవీ విరమణ (పీఆర్ఎస్) కోరుతూ లక్ష్మీనారాయణ చేసుకున్న దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది
.
        » లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినవారు.
ఏప్రిల్ - 26
¤ భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా 'హమ్రో సిక్కిం' పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించారు.        » తృణమూల్ కాంగ్రెస్‌లో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని భూటియా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇకపై సొంత రాష్ట్రం సిక్కింలోనే కుల-మతతత్వ రాజకీయాలు, అవినీతిపై పోరాటం చేయాలన్న లక్ష్యంతో సొంత పార్టీని ప్రారంభించినట్లు వెల్లడించారు.¤ రాజ్యసభ ఎథిక్స్ కమిటీని ఛైర్మన్ వెంకయ్య నాయుడు పునరుద్ధరించారు.        » భాజపా సభ్యుడు నారాయణలాల్ పంచారియా ఛైర్మన్‌గా పనిచేసే ఈ కమిటీలో సభ్యులుగా తెదేపా పార్లమెంటరీ పార్టీనేత సుజనా చౌదరి, తెరాస నేత కె.కేశవరావులను నియమించారు.
ఏప్రిల్ - 27
¤ సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.        » న్యాయవాద వృత్తి నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ఎంపికైన తొలి మహిళ మల్హోత్రానే. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఆమెకన్నా ముందు ఆరుగురు మహిళలు సుప్రీంకోర్టులో జడ్జిలుగా సేవలందించారు. అయితే వీరందరికీ అంతకుముందు హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసిన అనుభవం ఉంది.        » సుప్రీంకోర్టులో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జిలు ఉండటం ఇది మూడో పర్యాయం. 2014 ఆగస్టు నుంచి జస్టిస్ భానుమతి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.        » 1956లో ఇందూ మల్హోత్రా బెంగళూరులో జన్మించారు. 1983లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1988లో సుప్రీంకోర్టులో 'అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌'గా అర్హత సాధించారు. 2007లో ఆమెకు సీనియర్ న్యాయవాది హోదాను సుప్రీంకోర్టు కల్పించింది. న్యాయశాస్త్రంలో విశేష అనుభవం గడించిన మల్హోత్రా ఎన్నో సామాజిక అంశాలపై పోరాటాలు చేశారు. పలు చట్టాలకు మార్గదర్శకాలు రూపొందించారు.¤ సివిల్ సర్వీసుల పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన దురిశెట్టి అనుదీప్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు.        » యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసిన 2017 ఫలితాల్లో మొత్తం 990 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.        » అనుకుమారి, సచిన్ గుప్తా వరుసగా రెండు, మూడో ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
ఏప్రిల్ - 28
¤ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌రెడ్డి (76) వరుసగా ఇది మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2012లో తొలిసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.        » సుధాకర్‌రెడ్డి గతంలో రెండు సార్లు తెలంగాణలోని నల్గొండ నియోజకవర్గం నుంచి (1998 - 99, 2004 - 09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.
ఏప్రిల్ - 30
¤ అఫ్గానిస్థాన్‌లో వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. కాబూల్, కాందహార్‌లలో చోటు చేసుకున్న పేలుళ్లలలో మొత్తం 36 మంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.