| 
| 
| 
ఏప్రిల్ - 1 |  | రాష్ట్రీయం-ఏపీ¤ రాజధాని అమరావతి హరిత అభివృద్ధి ప్రాజెక్టు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు.       » ఈ ప్రాజెక్టుకు రూ.1484 కోట్లు రుణమిచ్చేందుకు ప్రపంచబ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. |  
| 
ఏప్రిల్ - 3 |  | రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య కోటికి పైగా (1.07 కోట్లు) ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఉన్నారు.       » రాష్ట్రంలో రోజూ సగటున 2,345 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లు వెల్లడైంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 1943 వాహనాలు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడాదికి సగటున 0.56 లక్షల చొప్పున వాహనాలు పెరుగుతున్నాయి.రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలియజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ వెళ్లారు. స్వయంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని వివిధ పార్టీల నేతలకు వివరించారు. |  
| 
ఏప్రిల్ - 4 |  | 
రాష్ట్రీయం- ఏపీ, టీఎస్ ¤ ప్రపంచ స్థాయి విద్యాసంస్థల ఎంపిక కోసం దేశ వ్యాప్తంగా చివరి వడపోతకు చేరిన 20 విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యాసంస్థల్లో నాలుగు తెలుగు రాష్ట్రాలకు చెందినవి.       » తెలంగాణ నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ), ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్‌వీయూ) ఉన్నాయి.¤ ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆరు రైల్వే స్టేషన్లను రైల్వే బోర్డు ఎంపిక చేసింది.       » తెలంగాణలో వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు ఏపీలో వియజవాడ, గుంటూరు, గుంతకల్లు, కర్నూలు, విశాఖపట్నం స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.  » స్టేషన్ పునరాభివృద్ధి కింద ఒక్కో స్టేషన్‌కు కనీసం రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర నిధులు అందనున్నాయి.       » ఈ నిధులతో రైల్వే స్టేషన్లలో పిల్లలకు పాలిచ్చేందుకు బాలింతలకు ప్రత్యేక గదులు, మరిన్ని ఏసీ, నాన్ ఏసీ విశ్రాంతి గదులు, డార్మిటరీలు, బ్యాటరీ కార్లు, పాదచారుల వంతెనలు లాంటి తదితర సౌకర్యాల్ని కల్పిస్తారు.రాష్ట్రీయం - టీఎస్¤ కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ పథకం కింద రూ.1,00,016కు పెంచిన మొత్తానికి సంబంధించిన పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలోనే మొదటి చెక్కును సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో అందజేశారు.రాష్ట్రీయం-ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.బి.రామన్న దొర, ఉపాధ్యక్షుడిగా కె. సీతారమ్ గెలుపొందారు. |  
| 
ఏప్రిల్ - 5 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి దశ అటవీ అనుమతులు లభించాయి.       » ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ పరిధిలోని 205.48 హెక్టార్ల (507.75 ఎకరాలు) అటవీ భూమిని బదలాయించేదుకు కేంద్రం ఆమోదం తెలిపింది. |  
| 
ఏప్రిల్ - 6 |  | 
రాష్ట్రీయం - ఏపీ ¤ 2016 - 17 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి - నిర్వహణ, రెవెన్యూ వసూలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల తీరు తెన్నులు, స్థానిక సంస్థలకు సంబంధించిన అనేక అంశాలను కాగ్ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.       » రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణా తీరు నుంచి ప్రభుత్వరంగ సంస్థల్లో నష్టాల వరకు, పన్నుల వసూళ్లలో లోటుపాట్ల నుంచి అంచనాలు పెరుగుతూ పోతున్న ప్రాజెక్టుల వరకు కాగ్ విమర్శలు చేసింది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా రూ.76,888 కోట్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉందని, ఈ భారం బడ్జెట్‌లపై ఎంతో ప్రభావం చూపుతుందని, ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.రాష్ట్రీయం - టీఎస్¤ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి బి.జె.ఆర్.నగర్‌లో వైద్య ఆరోగ్య శాఖ, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బి.జె.ఆర్. నగర్‌తో పాటు మరో 17 బస్తీ దవాఖానాలు కూడా ప్రారంభమయ్యాయి.       » హైదరాబాద్ మహానగరంలో నిరుపేదలకు వైద్య సదుపాయాలు అందించడానికి ప్రతి 10 వేల మందికి ఒకటి చొప్పున వెయ్యి బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు.¤ కూలీలతో వెళ్తున్న ట్రాక్టరు కాల్వలో తిరగబడిన ఘటనలో ఒకే తండాకు చెందిన ఎనిమిది మంది మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం వద్దిపట్ల సమీపంలో చోటుచేసుకుంది. ఆ ఘటనలో మరణించినవారు అందరూ పడమటి తండాకు చెందినవారు. |  
| 
ఏప్రిల్ - 7 |  | 
రాష్ట్రీయం - టీఎస్
  ¤ కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి యుద్ధ భూమిలో సామంతరాజు అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు నిర్ధారణ అయింది. దీన్ని రూఢీ పరుస్తూ నాటి శిల్పం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో వెలుగు చూసిన ఒక శాసనం వల్ల ఆమె మరణం మిస్టరీగా మారింది. రుద్రమదేవి, ఆమె సేనాని మల్లికార్జున నాయకుడు 1289, నవంబరులో శివలోక ప్రాప్తి పొందినట్లు శాసనం వెల్లడించింది. అప్పటికి రుద్రమదేవి వయసు దాదాపు 82 ఏళ్లు. » గతంలో వరంగల్ కోట సమీపంలోని బొల్లికుంట గ్రామంలో వెలుగు చూసిన రెండు శిల్పాల ఆధారంగా రుద్రమదేవి వీరమరణం పొందినట్లు పురావస్తు అధికారులు అంచనా వేశారు.
 » భీకరంగా పోరాడుతూ రుద్రమదేవి నేలకొరిగినట్లు అప్పట్లో ఆమె సమకాలికులు చెక్కించిన శిల్పం తాజాగా సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం బెక్కల్లులో లభించింది. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కాకతీయుల నాటి విష్ణాలయం గర్భగుడిలో ఈ శిల్పాన్ని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఏ) శాఖ అనుబంధంగా ఉన్న దేవాలయ సర్వేక్షణ విభాగం అధికారులు కనుక్కున్నారు.
 |  
| 
ఏప్రిల్ - 9 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ పోలీసు సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్ (స్టేట్ సెక్యూరిటీ కమిషన్) ను నియమించింది.       » హోంశాఖ మంత్రి ఈ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, పోలీసు దళాల అధిపతు (డీజీపీ)లు ఇందులో సభ్యులుగా ఉంటారు.¤ చంద్రన్న పెళ్లి కానుక పథకంలో భాగంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 30 వేల నుంచి రూ. 35 వేలకు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.¤ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో తొలి వాయిదా కింద రూ. 3 వేల కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రీయం - టీఎస్¤ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రాంతంలో చమురు నిక్షేపాలున్నట్లు భారత ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ ఉపగ్రహం ద్వారా పసిగట్టింది. |  
| 
ఏప్రిల్ - 10 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కార్పొరేషన్లకు తెదేపా ప్రభుత్వం ఛైర్మన్‌లను నియమించింది. కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు, ఆర్టీసీ, కాపు కార్పొరేషన్, శాప్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ లాంటి 17 సంస్థలకు ఛైర్మన్‌లను నియమించింది.       » తితిదే ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల రామయ్య, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా దాసరి రాజారావు (రాజా మాస్టర్), క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్‌గా పి.అంకమ్మచౌదరి, నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా దివి శివరాం, మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్.ఎమ్. జియావుద్దీన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎండీ హిదాయత్, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా వై. నాగేశ్వరరావు యాదవ్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా నామన్ రాంబాబు, ఏపీ ఎస్సీ సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకరరావు, ఏపీ కాపు సంక్షేమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు నియమితులయ్యారు.రాష్ట్రీయం - టీఎస్¤ సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్టెకట్కూర్ గ్రామానికి చెందిన ఐకేపీ వీవోఏ (గ్రామ దీపిక) జూపల్లి నీరజ జాతీయ స్థాయిలో స్వచ్ఛ దూత్ పురస్కారాన్ని దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ఈమె కీలక పాత్ర వహించారు. |  
| 
ఏప్రిల్ - 11 |  | 
రాష్ట్రీయం - ఏపీ ¤ ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూధార్ ప్రయోగాత్మక అమలు పథకాన్ని ప్రారంభించారు.       » మనిషికి ఆధార్ లాగానే భూమి గుర్తింపునకు భూధార్ ఉపయోగపడుతుంది. రెవెన్యూ, పురపాలక, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, అటవీశాఖల అనుసంధానం ద్వారా భూధార్ అమల్లోకి రాబోతోంది. దీని వల్ల 20 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మే 30వ తేదీ నాటికి కృష్ణా జిల్లా వ్యాప్తంగా, అక్టోబరు 2వ తేదీనాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూసేవ ప్రాజెక్టు పూర్తికాబోతోంది.       » కృష్ణా జిల్లా ఉయ్యూరు, జగ్గయ్యపేట మండలాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.¤ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పథకాన్ని సాధించిన రాగాల వెంకట రాహుల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.30 లక్షల నజరానా ప్రకటించారు.¤ స్వచ్ఛత కోసం కృషి చేసినందుకు చిత్తూరు జిల్లా మత్యం పంచాయతీకి చెందిన వీసీవో ఎ.రమేష్ ప్రధాని మోదీ నుంచి స్వచ్ఛగ్రాహి పురస్కారం అందుకున్నారు.       » ఏప్రిల్ 10న బిహార్‌లో జరిగిన చంపారణ్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పది రాష్ట్రాల్లో స్వచ్ఛత కోసం కృషి చేసిన వారికి అవార్డులు అందించారు.¤ విజయవాడ నగరంలోని గుణదలలో క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ గుహ బయట పడిందని అమరావతి సాంస్కృతిక కేంద్రం ప్రకటించింది.రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దేశంలో ఎక్కడ చదువుతున్నావారికి పూర్తిగా బోధన రుసుంలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.       » ఇప్పటికే కొన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఈ పథకం అమలు చేస్తుండగా, తాజాగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రత్యేక చట్టాల కింద ఏర్పాటైన అన్ని సంస్థలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 230 ప్రఖ్యాత విద్యా సంస్థలను గుర్తించింది. |  
| 
ఏప్రిల్ - 12 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ మంగళగిరిలోని పోలీసు పటాలంలో నూతనంగా నిర్మించిన పోలీసు సాంకేతిక సౌధాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.       » ఈ భవనాన్ని రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మించారు. రాష్ట్ర అత్యవసర స్పందన వ్యవస్థ (ఎస్ఈఆర్ఎస్) కేంద్రాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేశారు.       » ఏపీ పోలీసు సాంకేతిక సౌధంలో ఏపీ పోలీసు సాంకేతిక సేవల విభాగం, ఫోరెన్సిక్ ప్రయోగశాల, ఆక్టోపస్, పోలీసు నియామక మండలి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేశారు. ¤ మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆనంద నగరాల సదస్సు ముగిసింది.       » చర్చాగోష్ఠులు, మేధోమథనాల్లో వచ్చిన సలహాలు, సూచనలను క్రోడీకరించి సిద్ధం చేసిన డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆనంద నగరాల ఇన్నోవేషన్ ల్యాబ్‌ని ఆయన ప్రారంభించారు.       » 'నవ్య, సమీకృత భూసేకరణ పథకం' పేరుతో సీఆర్‌డీఏ ప్రణాళికా విభాగం రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.       » ఈ సదస్సులో 'హ్యాపీ సిటీ డిక్లరేషన్... అమరావతి 2018' పేరుతో ఒక తీర్మానం చేశారు. ఆనంద నగరాల లక్ష్యం సాకారం చేసుకోవాలన్నా, ప్రజలు సంతోషంగా జీవించేందుకు అవసరమైన వాతావరణం కల్పించాలన్నా ఆరు మౌలిక అంశాలు అవసరమని అందులో పేర్కొన్నారు. అవి: 1. పరిపాలన, 2. నిర్మించుకున్న వాతావరణం, 3. సహజ వాతావరణం, 4. ఆర్థిక పురోభివృద్ధి జీవనోపాధి, 5. సంస్కృతి సమాజం, 6. భౌతిక మానసిక ఆరోగ్యం.¤ మంగళగిరిలో పోలీసు సాంకేతిక సౌధం భవనం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర నేర గణాంక నివేదిక 2017ను విడుదల చేశారు.ముఖ్యాంశాలు  ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నాలుగైదు నిమిషాలకు ఒక నేరం.. ఘోరం జరుగుతోంది. సగటున రాష్ట్రంలో రోజుకు 311 కేసులు నమోదవుతున్నాయి.  2016తో పోలిస్తే 2017లో 19.97 శాతం మేర పెరిగాయి. 2016లో నేరాలు 94,664 జరగ్గా, 2017లో 1,13,573 నమోదయ్యాయి.  కడప, గుంటూరు గ్రామీణ, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అత్యధిక నేరాలు జరిగాయి.రాష్ట్రీయం-టీఎస్¤  తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.       » అనురాగ్ శర్మ పదవీ విరమణ తర్వాత 2017 నవంబరు 12న మహేందర్‌రెడ్డి నూతన డీజీపీగా నియమితులయ్యారు. అప్పట్లో ఆయనను ఇన్‌ఛార్జి డీజీపీగా మాత్రమే ప్రభుత్వం నియమించింది.       » సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎన్నుకోవాల్సి ఉంది. కాగా, డీజీపీ ఎంపిక అధికారం తమవద్దనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా మహేందర్‌రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి ఆయన నాలుగేళ్ల (పదవీ విరమణ)వరకు డీజీపీ హోదాలో కొనసాగనున్నారు.¤ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ 2018 సంవత్సరానికి ఆసియా పసిఫిక్ పారిశ్రామిక పురస్కారానికి (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ఎంపికయ్యారు.       » సమర్థ నాయకత్వంతో సింగరేణి సంస్థను ప్రగతి పథంలో నడపడం, వాణిజ్య, గనుల రంగాల్లో అభివృద్ధికి ఎంటర్‌ప్రైజ్ ఆసియా సంస్థ ఈ పురస్కారానికి ఆయన్ను ఎంపిక చేసింది. |  
| 
ఏప్రిల్ - 13 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ సీఎం కేసీఆర్ బెంగళూరులో మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను ఆయన నివాసంలో కలుసుకున్నారు.       » దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, భాజపా మినహాయించి ఇతర రాజకీయ పక్షాలతో 'ప్రజా కూటమి' (పీపుల్స్ ఫ్రంట్) ఏర్పాటు చేయనున్నట్లు ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రకటించారు.రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించారు.       » బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. ఈశ్వరన్, టాటాసన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సింగపూర్ రాయబారి గోపీనాథ్ పిళ్లైలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.       » హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టీ) సంస్థ నిర్వహించిన హెచ్‌టీమింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. |  
| 
ఏప్రిల్ - 14 |  | 
రాష్ట్రీయం-టీఎస్¤ డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్‌రావు పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల్లో ఆయన ప్రథమ వర్ధంతి జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.¤ కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజనను కేంద్ర సహజ వనరులు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూర్యాపేటలో ప్రారంభించారు.       » జిల్లాకు చెందిన 20 మంది లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందించి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.¤ సాగర్ ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకానికి ఆద్యులు, గడ్డిపల్లి కృషి విజ్ఞానకేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి గడ్డిపల్లిలో మరణించారు.       » సాగర్ ఎడమ కాల్వపై రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని (మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం) నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 6 వేల ఎకరాలకు పైగా బీడు భూములను సాగులోకి తేవడానికి ఆయన కృషిచేశారు.రాష్ట్రీయం - ఏపీ¤ అమరావతిలోని శాఖమూరులో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 20 ఎకరాల్లో రూ.100 కోట్లతో నిర్మించబోయే అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఆకృతిని ఆవిష్కరించారు. |  
| 
ఏప్రిల్ - 15 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణలో మొదటిసారి కరీంనగర్‌లో చేపట్టిన మల్లికార్జున స్వామి వెయ్యినూటపదహారు పట్నాల మహోత్సవం వైభవంగా జరిగింది.       » రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన కొమురవెల్లి, ఐనవోలు, ఓదెలు, పర్వాతాల, నిర్మల్, కౌటాల, గట్టు తదితర చోట్ల నుంచి తరలివచ్చిన 1116 మంది ఒగ్గు పూజారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.       » కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ హాజరయ్యారు.రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌లో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరం (బీఎల్ఎఫ్) ముందుకొచ్చింది. వృద్ధికి అవకాశం ఉన్న రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది.       » ఈ క్రమంలో బీఎల్ఎఫ్, ఇండియా ట్రేడ్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఐటీఈసీ) విడివిడిగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ)తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. |  
| 
ఏప్రిల్ - 16 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా పేలుళ్ల కేసులో నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన ప్రత్యేక కోర్టు, నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె.రవీంద్ర కుమార్‌రెడ్డి తీర్పు వెలువరించారు.       » ఈ కమిటీలో తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి రవీందర్ పదవికి రాజీనామా చేసి, లేఖను ఉమ్మడి హైకోర్టుకు పంపించారు.¤ హైదరాబాద్ పాత బస్తీని రూ.వెయ్యి కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సమృద్ధిగా మంచినీటి వసతి కల్పిస్తామని, వరదలు, మురికినీరు, ట్రాఫిక్, విద్యుత్ సమస్యలు లేని ప్రాంతంగా మారుస్తామని తెలిపారు.రాష్ట్రీయం - ఏపీ¤ తిరుమల తిరుపతి దేవస్థానం 2018 - 19 వార్షిక బడ్జెట్‌ను రూ.2893.94 కోట్లతో ఆమోదించింది.¤ రాష్ట్రంలో ఆక్వారంగ సుస్థిర అభివృద్ధి సాధించే లక్ష్యంతో 9 కోస్తా జిల్లాల్లో ఆక్వా జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.       » ఆక్వా జోన్లలో విద్యుత్తు లైన్లు, రహదారులు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. తద్వారా పర్యావరణ సమతౌల్యం కాపాడుతూ ఉత్పాదక సామర్థ్యాన్ని, ఎగుమతులను పెంచుతారు.       » కర్నూలులో డాక్టర్ మౌర్వీ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ పేరుతో ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీగా మార్చాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. |  
| 
ఏప్రిల్ - 17 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లను తెలంగాణ శాసనసభ నుంచి బహిష్కరించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. వారిరువురిని బహిష్కరిస్తూ మార్చి 13న సభ జారీ చేసిన ఉత్తర్వులు, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్గొండ, అలంపూర్ నియోజక వర్గాలు ఖాళీ అయినట్లు జారీచేసిన ప్రకటనలను రద్దు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో వారి సభ్యత్వం పునరుద్ధరణ అవుతుందని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలుగా వారి మిగిలిన పదవీకాలం అన్ని అంశాల్లో యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.       » మార్చి 12న తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లను శాసనసభ బహిష్కరించింది. దాన్ని సవాలు చేస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రాష్ట్రంలోని బ్యాంకులు వివిధ రంగాలకు రుణ పంపిణీ ద్వారా రూ.83,388.87 కోట్లు ఇవ్వచ్చని అంచనా వేసినట్లు నాబార్డు రాష్ట్ర ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు.       » గతేడాది నిర్ణయించిన వార్షిక రుణ ప్రణాళిక మొత్తం (రూ.65,590 కోట్ల) కంటే ఈ ఏడాది 27 శాతం అధికంగా పెంచినట్లు (రూ.83,388 కోట్లకు) తెలిపారు. దీనిలో నాబార్డు నుంచి నేరుగా రాష్ట్రానికి రూ.12,200 కోట్ల ఆర్థిక సాయం అందుతుందన్నారు.¤ తెలంగాణలో చేనేత, జౌళి రంగాల అభివృద్ధి కోసం కొత్తగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ (టీహెచ్‌డీసీ), రాష్ట్ర మరమగ్గాలు, జౌళి అభివృద్ధి సంస్థ (టీపీటీడీసీ) పేరిట వీటిని స్థాపించాలని ఆదేశించింది.       » ప్రభుత్వం ఒక్కో కార్పొరేషన్‌కు రూ.5.10 కోట్ల మూలధనాన్ని కేటాయించింది. వీటికి సంచాలకులుగా రాష్ట్ర చేనేత కమిషనర్ శైలజా రామయ్యర్, ఉపకార్యదర్శి కిరణ్‌కుమార్‌లను నియమించింది.       » కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు దృష్ట్యా టెస్కో రద్దు కానుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆప్కోను విభజించి, తెలంగాణకు టెస్కోను ఏర్పాటుచేశారు. |  
| 
ఏప్రిల్ - 18 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణ పంచాయతీ రాజ్ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. దీనిలోని తొమ్మిది అంశాలు మినహా మిగతావన్నీ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.       » తెలంగాణలో ఇప్పటివరకు 1994 నాటి పంచాయతీ రాజ్ చట్టం అమల్లో ఉంది. దీని స్థానంలో కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవల ఉభయసభల్లో బిల్లును ప్రవేశ పెట్టింది. బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారినా, అమలు తేదీ ఖరారుపై జాప్యం ఏర్పడింది. గవర్నర్ నరసింహన్ చట్టం అమలు తేదీని ఏప్రిల్ 18గా నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.       » పురపాలక చట్టంలో ఇటీవల చేపట్టిన కొన్ని సవరణలు కూడా అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ¤ తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్‌డీసీ) కొత్త చిహ్నం (లోగో)ను సంస్థ ఛైర్మన్ పి.రామ్మోహన్ రావు, ఎండీ అరవింద్ కుమార్‌లు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.       » ఈ లోగోను యాదాద్రి భువనగిరి జిల్లాలోని కదిరేని గూడెంకు చెందిన దని ఏలే రూపొందించారు.రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ భోపాల్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 వరకు 'దక్షిణ మధ్య రైల్వే -2022 వైపునకు పరివర్తనా యాత్ర'నినాదంతో జరిగిన జాతీయస్థాయి ప్రదర్శనలో దక్షిణ మధ్య రైల్వేకు ప్రథమ బహుమతి లభించింది.       » 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వేకు గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారంతో పాటు ఆరు సామర్థ్య విభాగాల్లో పురస్కారాలు లభించాయి. |  
| 
ఏప్రిల్ - 19 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ బోదకాలు వ్యాధితో బాధపడుతున్న వారికి మే నుంచి ప్రతినెలా రూ.1000 చొప్పున పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.¤ గృహనిర్మాణ ప్రక్రియలో అవలంబించిన స్ఫూర్తివంతమైన విధానాలకు కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రకటించింది.       » ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా దిల్లీలో ఈ పురస్కారాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి అందుకుంటారు. ¤ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కి అరుదైన గౌరవం దక్కింది.       » పట్టణ, గ్రామీణ పేదలకు నాణ్యత, సృజనాత్మకతతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు హడ్కో అవార్డు ప్రకటించింది.       » దిల్లీలో ఏప్రిల్ 25న హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రదానం చేయనున్నారు.       » ఉన్నత ప్రమాణాలతో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న ఆసుపత్రులకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్న 'కాయకల్ప' అవార్డుల్లో జిల్లా ఆసుపత్రుల విభాగంలో ఖమ్మం జిల్లా ఆసుపత్రి తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కింగ్ కోఠి ఆసుపత్రి నిలిచింది.       » దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఈ అవార్డులు అందజేశారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి రూ.50 లక్షలు, కింగ్‌కోఠి ఆసుపత్రికి రూ.20 లక్షల చొప్పున నగదు బహుమతులు దక్కాయి.       » ఏరియా ఆసుపత్రుల విభాగంలో బాన్సువాడ ఆసుపత్రికి రూ.15 లక్షల నగదు బహుమతి వచ్చింది.రాష్ట్రీయం - ఏపీ¤ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన రాగాల వెంకట రాహుల్‌కు అమరావతిలో అభినందన సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు రూ.50 లక్షల నగదు బహుమతిని చెక్కు రూపేణా అందజేశారు. రాహుల్‌కు గ్రూప్ - 2 ప్రభుత్వోద్యోగాన్ని కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.¤ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని అందుకున్నారు. |  
| 
ఏప్రిల్ - 20 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి మార్చి 16వ తేదీని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.¤ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు.రాష్ట్రీయం - టీఎస్ ¤ అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) పత్రాన్ని కలిగి ఉన్న రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున 'రైతు బంధు' చెక్కులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.       » దశాబ్దాలుగా అటవీ భూములను సాగు చేస్తూ పంటలు పండిస్తున్న వారికి ప్రభుత్వం గతంలో ఈ పత్రాలు ఇచ్చింది.       » ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మొత్తం 7 లక్షల మంది రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పత్రాలు అందించారు. వీరిలో 4 లక్షల మంది ఏపీలో, 3 లక్షల మంది తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు.       » తాజాగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల వినతి మేరకు వీరికి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ¤ చిన్నారులు, మైనర్లపై లెంగిక దాడుల కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు హైదరాబాద్ పోలీసులు, న్యాయశాఖ సంయుక్తంగా 'చిన్నారుల మిత్ర' పేరుతో ఏప్రిల్ 7న ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశాయి.       » పోక్సో (లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ) చట్టం - 2012 కింద నమోదైన కేసుల విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులకు సాంత్వన కల్పించి సత్వర న్యాయం అందించేందుకు న్యాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ కోర్టును అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో దీన్ని ప్రారంభించారు.       » దిల్లీ, గోవా, బెంగళూరులో ఈ తరహా కోర్టులను పరిశీలించి వాటికంటే అత్యాధునికంగా ఈ కోర్టును రూపొందించారు.¤ తెలంగాణలో ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారికంగా లేఖ పంపింది.       » 2018 - 19 కేంద్ర బడ్జెట్‌లో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.3825 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రికి అనుమతిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. |  
| 
ఏప్రిల్ - 21 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం - 2014 అమలుపై అధ్యయనం చేయాలని కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని హోంశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ణయించింది.       » ఈ సంఘం సభ్యుడిగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై అధ్యయనం చేయాలని కోరుతూ ఛైర్మన్ చిదంబరానికి వినతిపత్రం సమర్పించారు.       » దిల్లీలో నానాటికీ దిగజారుతున్న ట్రాఫిక్ నిర్వహణ, రాజ్యాంగంలోని 371 - జె ఆర్టికల్ ప్రకారం కర్ణాటకలోని హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా అమలుపై కూడా ఈ స్థాయీ సంఘం అధ్యయనం చేయనుంది.       » 2014కి ముందు హోంమంత్రి హోదాలో చిదంబరం ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలకపాత్ర పోషించారు.రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణలోని ప్రభుత్వోద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.       » కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 18 మంది క్రీడాకారులు ప్రగతి భవన్‌లో సీఎంను కలిసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ¤ ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి ఉత్కృష్ఠ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు అందుకున్నారు.       » సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా పీఎంఏవై పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో సమర్థంగా అమలు చేయడంలో భాగంగా చేపట్టిన లక్ష రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి గుర్తింపుగా జనార్ధన్ రెడ్డి, ప్రజా పరిపాలన, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి పథకం విజయవంతంగా అమలు చేసినందుకు సర్ఫరాజ్ అహ్మద్‌లు ఈ అవార్డు అందుకున్నారు. |  
| 
ఏప్రిల్ - 22 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్రంలో బహిరంగ మల, మూత్ర రహిత (ఓడీఎఫ్) - ప్లస్ కార్యక్రమాల కోసం రూ.1915.74 కోట్లతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీనికోసం కేంద్ర నిధులు రూ.1149.44 కోట్లు, రాష్ట్రం నుంచి మరో రూ.766.30 కోట్లు ఖర్చు చేయనున్నారు.రాష్ట్రీయం - టీఎస్¤ ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం పరిధిలోని అటవీశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్లు విజయవంతంగా చేపట్టిన హరితహారం ఫలితాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. |  
| 
ఏప్రిల్ - 23 |  | 
రాష్ట్రీయం - ఏపీ ¤ విజయవాడలోని ఆర్అండ్‌బీ కార్యాలయ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీసీఎస్ఓసీ)ను ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.       » ప్రభుత్వ శాఖలు, సంస్థలు, పరిశ్రమలు ఎదుర్కొనే సైబర్ దాడులను నిరోధించేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో ఏపీపీఎస్ఓసీని ప్రారంభించినట్లు సీఎం పేర్కొన్నారు.       » ఈ సందర్భంగా సీఎం 'సైబర్ సెక్యూరిటీ విధాన ముసాయిదా'ను ఆవిష్కరించారు.రాష్ట్రీయం - టీఎస్  ¤ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలో వెలుగు చూసిన ఒక శాసనంలో ఆ కాలంలో 'నందిధాత' అనే తెలుగు సంవత్సరం ఉండేదనే విషయం వెల్లడైంది.       » ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు సంవత్సరాల పేర్లలో ఈ పేరు లేకపోవడంతో అది పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తోంది.       » మరోవైపు హన్మకొండలో వేయి స్తంభాల గుడి కట్టించిన రుద్రదేవుడి శాసనం మరొకటి జనగామ జిల్లా రాజవరం గ్రామంలో బయటపడింది. దీంతో రుద్రదేవుడికి సంబంధించి వెలుగుచూసిన శాసనాల సంఖ్య 19కి చేరింది. |  
| 
ఏప్రిల్ - 24 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని ద్వారపూడిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.       » ఎల్ఈడీ దీపాల ఏర్పాటులో తూర్పుగోదావరి జిల్లా నూరు శాతం అభివృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని సీఎం ప్రకటించారు.       » 'చంద్రకాంతి' అనే కార్యక్రమాన్ని సీఎం ఈ సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 27 లక్షల ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. |  
| 
ఏప్రిల్ - 25 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో గృహ నిర్మాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి హడ్కో అవార్డులు లభించాయి.» 48వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలో ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
 » తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లకు ఈ అవార్డులు లభించాయి.
 
  ¤ తెదేపా సీనియర్‌నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి (67) సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. » వివేకానంద రెడ్డి 1999, 2004లో నెల్లూరు పట్టణ నియోజక వర్గం నుంచి, 2009లో గ్రామీణ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 ¤ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోస్ట్‌గార్డ్ స్టేషన్ ఆధ్వర్యంలో డీజీపీ ఎం.మాల కొండయ్య 'ఇంటర్‌సెప్టార్ బోట్ చార్లీ - 438'ను ప్రారంభించారు.
 రాష్ట్రీయం - టీఎస్¤ సిద్దిపేట మార్కెట్ యార్డు ఐఎస్ఓ 9001 - 2015 ధ్రువపత్రాన్ని అందుకుంది.
 » తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మార్కెట్ యార్డు ఇదే.
 » హైదరాబాద్‌కు చెందిన హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్థ సిద్దిపేటలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖమంత్రి హరీశ్‌రావుకు ఈ పురస్కారాన్ని అందజేసింది.
 |  
| 
ఏప్రిల్ - 26 |  | 
రాష్ట్రీయం-ఏపీ¤ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు.       » ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఛైర్మన్ సురేష్ ఎన్.పటేల్, వివిధ బ్యాంకుల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కౌలు రైతుల రుణంపై చర్చించారు.       » 2017-18 ఖరీఫ్‌లో 3.59 లక్షల మందికి రూ. 2691 కోట్ల రుణాలు అందించినట్లు బ్యాంకర్లు వెల్లడించారు.¤ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు 'న్యూ అండ్ ఇన్నోవేటివ్ టౌన్ డిజైన్ సొల్యూషన్స్, ఎకోసిటీస్', విభాగంలో హడ్కో పురస్కారం లభించింది.       » అమరావతిలో పర్యావరణ పరిరక్షణ, భూ వినియోగ ప్రణాళిక, పార్కులు-మౌలిక సదుపాయాలను అనుసంధానిస్తూ రూపొందించిన విధానానికి అవార్డు లభించింది.రాష్ట్రీయం - టీఎస్¤ హైదరాబాద్ యూనివర్సిటీ కోర్టు సభ్యులుగా కె. కేశవరావు, జీవీఎల్ నరసింహారావులను నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.¤ అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తూ మెరుగైన సేవల కోసం మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబరు 155209ను ప్రారంభించారు. |  
| 
ఏప్రిల్ - 27 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ ప్రముఖ రచయిత, పండితులు శ్రీపాద కృష్ణమూర్తి (85) విశాఖపట్నంలో మరణించారు.       » రాజమండ్రిలోని ఓరియంటల్ కళాశాల విశ్రాంత ఆచార్యులు అయిన కృష్ణమూర్తి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రతిభాశాలిగా గుర్తింపు పొందారు. |  
| 
ఏప్రిల్ - 28 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ - జేకేవై) కింద గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మూడోస్థానంలో నిలిచి అవార్డు సాధించింది. మే 5న రాంచీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ అవార్డును ప్రదానం చేస్తారు.       » ఒడిశా, కేరళ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.రాష్ట్రీయం - టీఎస్¤ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా ప్రవాసులకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందించేందుకు రూ. 50 కోట్ల నిధితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.¤ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022 నాటికి వంట నూనెల ఉత్పత్తి కార్యాచరణ 'రోడ్ మ్యాప్' తయారీపై జాతీయ సదస్సు నిర్వహించారు. |  
| 
ఏప్రిల్ - 29 |  | 
రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణ జన సమితి (టీజీఎస్) పార్టీ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహించారు.       » పార్టీ అధ్యక్షుడిగా ఆచార్య కోదండరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. |  
| 
ఏప్రిల్ - 30 |  | 
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల సలహామండలి ఛైర్మన్‌గా రఘుపతుల రామ్మోహన్‌రావును ప్రభుత్వం పునర్ నియమించింది.¤ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 2018-2020 విధానానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
 » రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి లాంటి ముఖ్య నగరాలతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది.
 
  ¤ తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ప్రముఖ సంఘ సేవకురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. » ఈమె మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి.
 |  |  |