మార్చి - 1
|
¤ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, సాహితీవేత్త నాయుని కృష్ణమూర్తి (67) అనారోగ్యంతో బెంగళూరులో మరణించారు. » ఈయన తీసుకొచ్చిన 'మాబడి', 'పాఠశాల' పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. సుమారు మూడున్నర దశాబ్దాల కిందట ఏడు, పదోతరగతి విద్యార్థులు సులభరీతిలో పరీక్షలు గట్టెక్కడానికి ప్రతి సబ్జెక్టులోనూ అన్ని అంశాలను విశ్లేషిస్తూ నాయుని కృష్ణమూర్తి ఈ పుస్తకాలను ప్రతినెలా ప్రచురించేవారు. వీటి ప్రచురణకకు గాను అప్పట్లోనే మారుమూల గ్రామమైన చౌడేపల్లెలో 'విజయవాణి' ముద్రణాలయాన్ని స్థాపించారు. ఈ ప్రచురణల వల్ల చౌడేపల్లెకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు లభించింది.
|
మార్చి - 9
|
¤ ప్రఖ్యాత పంజాబీ సూఫీ గాయకుడు ప్యారేలాల్ వడాలీ (75) అమృతసర్‌లో మరణించారు. పంజాబీ సూఫీ గాయకుల ద్వయంగా ఖ్యాతిగాంచిన ప్యారేలాల్ తన అన్నయ్య పూరన్‌చంద్ వడాలీతో కలిసి అనేక పాటలు పాడారు. వీరిద్దరూ కలిసి 'తూ మానే యానామానే', 'రంగ్రీజ్ మేరే' లాంటి విజయవంతమైన పాటల్ని ఆలపించారు.
|
మార్చి - 14
|
¤ ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా (55) మహారాష్ట్రలోని వాడా సమీపంలో తన ఫాంహౌస్‌లో గుండెపోటుతో మరణించారు. హిందీ సీరియల్స్‌తో బుల్లి తెర నటుడిగా ప్రస్థానం ప్రారంభించి వెండితెర అవకాశాలను సొంతం చేసుకొని రయీస్, కాబిల్, హైదర్ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో ఛత్రపతి, యమదొంగ, లెజెండ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ¤ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత స్టీఫెన్ హాకింగ్ (76) బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న తన స్వగృహంలో మరణించారు. » కృష్ణబిలాలు, విశ్వం పుట్టుక, విస్తరణ, అంతంపై మన్నికైన సూత్రాలతో సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో స్టీఫెన్ హాకింగ్ వెలుగులు నింపారు. భౌతికశాస్త్ర చరిత్రలో స్రష్ఠలుగా నిలిచిన న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత ఆ స్థాయి ప్రతిభావంతుడిగా హాకింగ్ ఖ్యాతిగాంచారు. » 1942, జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్ 21 ఏళ్ల వయసులోనే అమైట్రోపిక్ లేటరల్ స్ల్కేరోసిస్ (ఏఎల్ఎస్) అనే నాడీ క్షీణత వ్యాధి బారిన పడ్డారు. లోవ్ గెహ్రిగ్స్ వ్యాధిగా కూడా పిలిచే ఈ రుగ్మత వల్ల సాధారణంగా కొన్నేళ్లలోనే మరణం సంభవిస్తుంది. కానీ హాకింగ్ 55 ఏళ్లపాటు జీవించారు. అయితే శరీరమంతా చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. రోజూవారీ జీవనానికి ఇతరుల పైన, సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడ్డారు. ఆ దశలోనూ ఆయన అధైర్యపడలేదు. తన వైకల్యాన్నే తన బలంగా మార్చుకున్నారు. విశ్వంలోని విచిత్రమైన కృష్ణబిలాలు, విశ్వవిస్తరణ, క్వాంటం హెచ్చుతగ్గులు లాంటి అంశాలపై అద్భుత సిద్ధాంతాలను వెలువరించారు. » 1988లో హాకింగ్ ప్రచురించిన 'ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్'తో ఆయన తారాపథానికి చేరారు. ఏకబిగిన 237 వారాల పాటు 'ద సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్స్' జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా అది గిన్నిస్ రికార్డుల్లోకి చేరింది. కోటి ప్రతులకు పైగా అమ్ముడుపోయాయి. తెలుగు సహా 40 భాషల్లో అనువాదమైంది. » హాకింగ్‌ను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు, వుల్ఫ్ ప్రైజ్, కోప్లీ మెడర్, ఫండమెంటల్ ఫిజిక్స్ పురస్కారం, విలియం హాప్కిన్స్ పురస్కారం, రాయల్ ఆస్ననామికల్ సొసైటీ, సండేటైమ్స్ పురస్కారం, బ్రిటానికా విశిష్ట పురస్కారం లభించాయి. » బ్రిటిష్ పౌరుడైనప్పటికీ అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెంట్స్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్'ను 2009లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబమా నుంచి అందుకున్నారు. » హాకింగ్ ఇతివృత్తంగా 2014లో 'ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్' అనే హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. ఇందులో హాకింగ్ పాత్రను పోషించిన ఏడీ రెడ్‌మేన్‌కు ఆస్కార్ అవార్డు దక్కింది. » కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్‌గా పనిచేసిన హాకింగ్ పలు ప్రఖ్యాత పుస్తకాలను రచించారు. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, మై బ్రీఫ్ హిస్టరీ, దిగ్రాండ్ డిజైన్, ద యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్, జార్జ్స్ సీక్రెట్ కీటు యూనివర్స్, బ్లాక్‌హోల్స్ అండ్ బేబీ యూనివర్సెస్ మొదలైనవి. » కేంబ్రిడ్జ్‌లో 'లూకాసియన్ ప్రొఫెసర్ ఆఫ్ మేథమేటిక్స్'గా 1979లో హాకింగ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త న్యూటన్ కూడా ఒకప్పుడు ఈ పదవిని చేపట్టారు. » 1966 నాటి కృష్ణ బిలాల సిద్ధాంతానికి 2004లో హాకింగ్ సవరణ చేశారు. కృష్ణ బిలాలు తమ మార్గంలో ఉన్నవాటన్నింటినీ స్వాహా చేస్తాయని, అంతరిక్ష యాత్రలకు ఇవి ఏ మాత్రం సహకరించవని వెల్లడించారు. 2007, ఏప్రిల్‌లో శూన్య గురుత్వాకర్షణ శక్తి ఆవరణలో గడిపిన తొలి పక్షవాత బాధితుడిగా హాకింగ్ రికార్డు సృష్టించారు. » 2001లో భారత్‌కు వచ్చిన హాకింగ్ 16 రోజులపాటు దేశంలో పర్యటించారు. అందులో భాగంగా ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్‌లో జరిగిన ఒక సెమినార్‌లో ప్రసంగించారు. దిల్లీలోని జంతర్‌మంతర్, కుతుబ్ మీనార్‌లను సందర్శించారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌తో సమావేశమయ్యారు.
|
మార్చి - 31
|
¤ దాదాపు అర్ధశతాబ్దం కిందట హైజాక్‌కు గురైన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి పైలట్‌గా ఉన్న కెప్టెన్ ఎమ్‌కే కచ్రూ (93) హరియాణాలోని ఫరీదాబాద్‌లో మరణించారు. » 1971 జనవరిలో శ్రీనగర్ నుంచి జమ్ముకు వెళ్తున్న విమానానికి కచ్రూ పైలట్‌గా పని చేశారు. ఇద్దరు కశ్మీరీ వేర్పాటువాదులు దీన్ని హైజాక్ చేసి లాహోర్‌కు మళ్లించారు. అప్పుడు పాక్ ప్రభుత్వమూ హైజాకర్లకు మద్దతుగా నిలిచింది. » భారత్‌లో ఉన్న కొందరు ఖైదీలను విడుదల చేయాలని హైజాకర్లు డిమాండ్ చేశారు. అయితే భారత్ ఇందుకు అంగీకరించలేదు. చివరికి విమానంలోని 26 మంది ప్రయాణికులను, నలుగురు సిబ్బందిని హైజాకర్లు విడిచిపెట్టగా వారు భూమార్గంలో భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని హైజాకర్లు తగలబెట్టారు. » దీంతో భారత్ తమ గగన తలం గుండా పాక్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించింది.¤ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంత్యక్రియలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ కళాశాలకు సమీపంలోని ఒక చర్చి వద్ద నిర్వహించారు.
|
|
|