మూలధన మార్కెట్
* పెట్టుబడుల రక్షణ కవచం సెబీ* భారత మార్కెట్ స్వరూపం
సెక్యూరిటీల మార్కెట్
* ద్రవ్యం లేదా విత్త సంబంధ ఆస్తులపై ఉన్న హక్కును తెలియజేసే పత్రాలను సెక్యూరిటీలు అంటారు.* దీర్ఘకాలిక వ్యవధి ఉన్న సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను నిర్వహించే మార్కెట్‌ను సెక్యూరిటీల మార్కెట్ అంటారు.
* దీన్ని ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్, ప్రైవేటు సెక్యూరిటీల మార్కెట్‌గా విభజిస్తారు.
ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా శ్రేష్ఠ సెక్యూరిటీల మార్కెట్
* కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, ప్రభుత్వ పోర్ట్ ట్రస్టులు, రాష్ట్ర విద్యుత్తు మండళ్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ అభివృద్ధి బ్యాంకులు జారీచేసిన సెక్యూరిటీలను ప్రభుత్వ సెక్యూరిటీలు అంటారు.* ప్రభుత్వం హామీ ఉంటుంది కాబట్టి వీటిలో నష్టభయం ఉండదు. అందువల్ల వీటిని శ్రేష్ఠ (గిల్ట్ ఎడ్జెడ్) సెక్యూరిటీలు అంటారు.
* 1991 నుంచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో బ్యాంకులు, బీమా సంస్థలే కాకుండా ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. (పట్టిక-1 చూడండి)
పారిశ్రామిక లేదా కార్పొరేట్ సెక్యూరిటీల మార్కెట్
* ప్రైవేట్ సెక్యూరిటీల మార్కెట్‌ను పారిశ్రామిక లేదా కార్పొరేట్ సెక్యూరిటీల మార్కెట్ అంటారు. ఇది రెండు రకాలు.. 1) కొత్త జారీల మార్కెట్, 2) పాత జారీల మార్కెట్ లేదా ద్వితీయ మార్కెట్.
కొత్త జారీల మార్కెట్
* దీన్ని ప్రాథమిక మార్కెట్ అంటారు.* కొత్త జారీలు ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్ల రూపంలో ఉంటాయి.
* వీటి ద్వారా నిధులు సమకూర్చుకునే సంస్థలు కొత్తవి లేదా విస్తరణకు ప్రయత్నిస్తున్న పాత సంస్థలు కావచ్చు.
* కొత్త జారీలను ప్రజలకు విడుదల చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి.అవి..
ప్రాస్పెక్టస్ విడుదల చేయడం
దీనిలో సంస్థకు సంబంధించిన వివరాలైన జారీ, హామీ, సంస్థ పూర్తి ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. ప్రజలను వాటాదారులుగా చేరాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించడమే ఈ విధానం.
ప్రైవేటు ప్లేస్‌మెంట్
వాటా మూలధనాన్ని బహిరంగంగా, ప్రజలందరికీ ఆహ్వానం ద్వారా సమకూర్చకుండా ప్రైవేటుగా కొంతమంది వ్యక్తులకు లేదా సంస్థలకు విజ్ఞప్తి చేసి వారికి వాటాలను అమ్మే విధానం.
రైట్స్ ఇష్యూ
ప్రస్తుతం వాటాదారులుగా ఉన్నవారికి కొత్త జారీలో కొంతభాగం లేదా మొత్తం కొనడానికి హక్కు జారీ చేయడం ద్వారా కంపెనీలు వాటా మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. వాటాదారుల వద్ద ఉన్న ప్రస్తుత వాటాలు, మొత్తం వాటాల మధ్య నిష్పత్తి ఆధారంగా హక్కులు పొందుతారు.
ఆఫర్ ఫర్ సేల్
ఈ పద్ధతిలో వాటాలను నేరుగా ప్రజలకు విక్రయించరు. ఎవరో ఒక వ్యక్తికి లేదా మూడో సంస్థకు విక్రయిస్తే తర్వాత వారు ఒక ప్రకటన ద్వారా వాటాలను ప్రజలకు అమ్ముకుంటారు. దీనివల్ల కంపెనీలకు మూడో వ్యక్తి లేదా సంస్థ నుంచి ద్రవ్యం ముందుగానే లభిస్తుంది. (పట్టిక-2 చూడండి)
పాత జారీల మార్కెట్ లేదా ద్వితీయ మార్కెట్
* అప్పటికే అమల్లో ఉన్న సెక్యూరిటీలు లేదా పాత జారీల క్రయవిక్రయాలను ఈ మార్కెట్ నిర్వహిస్తుంది. ఇలాంటి సెక్యూరిటీలకు పాత జారీల మార్కెట్ ద్రవ్యత్వం కల్పిస్తుంది.* ద్వితీయ మార్కెట్‌లో నిరంతర లావాదేవీలు కొత్త జారీల విక్రయానికి దోహదపడతాయి.
* ద్వితీయ మార్కెట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా నిర్వహిస్తారు.
* మూలధన మార్కెట్‌లో అనేక రకాల మధ్యవర్తిత్వ సంస్థలు పనిచేస్తాయి. అవి..
మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు
* కార్పొరేట్, ఇతర సెక్యూరిటీలను మార్కెట్ చేయడమే మర్చంట్ బ్యాంకింగ్ పని.* సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం లేదా చందా కట్టడానికి నిర్వహణ, సంప్రదించడం, సలహా ఇవ్వడం లేదా కార్పొరేట్ సేవలతో సంబంధమున్న జారీ నిర్వహణ వ్యాపారంలోని వ్యక్తిని 'మర్చంట్ బ్యాంకర్' అంటారు.
* మర్చంట్ బ్యాంకులు ప్రధానంగా ఈక్విటీ మూలధనానికి సంబంధించిన పబ్లిక్ ఇష్యూలను నిర్వహిస్తాయి.
* పబ్లిక్ ఇష్యూ నిర్వహణలో సెక్యూరిటీల విక్రయానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఈ బ్యాంకులు నిర్వహిస్తాయి.
* మర్చంట్ బ్యాంకులు సెబీ పర్యవేక్షణకు లోబడి పనిచేస్తాయి. వీటిని సెబీ వద్ద నమోదు చేయించుకోవాలి.
లీజింగ్, హైర్ పర్చేజ్ కంపెనీలు
* పరిశ్రమలకు.. ముఖ్యంగా చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ప్లాంట్ అండ్ మెషినరీ సేకరించడంలో లీజింగ్ పద్ధతి చాలా ఆదరణ పొందింది.* యంత్రాలను, పరికరాలను సమకూర్చే సంస్థకు అద్దె చెల్లించి నిర్ణీత కాలానికి వాటికి వాడుకునే విధంగా కుదుర్చుకున్న ఒప్పందమే లీజు.
* సేవారంగం ఎక్కువగా లీజింగ్ సేవలను వినియోగిస్తోంది. వీటిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఆసుపత్రులు, రవాణా కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి.
* నాన్ బ్యాంకింగ్ విత్త కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఎల్ఐసీ, జీఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ, అఖిల భారత విత్త సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని రాష్ట్రస్థాయి సంస్థలు లీజింగ్ ఫైనాన్స్ సంస్థలుగా సేవలు అందిస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్
* ప్రజల నుంచి పొదుపును సేకరించి స్టాక్ మార్కెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం వీటి ప్రధాన లక్ష్యం.* ఇటీవలి కాలంలో ఇవి చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాయి.
* మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్స్‌కు తమ పొదుపును మళ్లిస్తారు.
* మ్యూచువల్ ఫండ్ల సంస్థలు సెబీ పర్యవేక్షణ, అజమాయిషీ, క్రమబద్ధీకరణకు లోబడి పనిచేస్తాయి. (పట్టిక-3 చూడండి)
వెంచర్ క్యాపిటల్ నిధులు (వీసీఎఫ్)
* ఇటీవలి కాలంలో భారతీయ మూలధన మార్కెట్‌లో ప్రవేశించిన విభాగం వెంచర్ క్యాపిటల్.* సాంకేతికంగా కొత్తవి, అంతవరకు సమర్థత రుజువు కాని ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమకూర్చే మూలధనమే వెంచర్ క్యాపిటల్.
* దీర్ఘఫలన కాలం, ఉన్నత స్థాయి సాంకేతిక పద్ధతులు, అధిక నష్ట భయంతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడులు వెంచర్ క్యాపిటల్‌లో ఒక భాగం. (పట్టిక-4 చూడండి)
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు
* వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఒక ముఖ్యమైన భాగం.* పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, ఇతర సెక్యూరిటీల క్రయవిక్రయాలు జరిగే వ్యవస్థనే స్టాక్ మార్కెట్ అంటారు.
* స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను దేశంలోని ఆర్థిక వాతావరణానికి 'భారమితి'గా వ్యవహరిస్తారు.
* స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు 1956 సెక్యూరిటీ కాంట్రాక్టుల (క్రమబద్ధం) చట్టం ప్రకారం పనిచేస్తాయి.
* స్టాక్ ఎక్స్ఛేంజ్ సెక్యూరిటీలకు ద్రవ్యత్వం చేకూరుస్తుంది
* స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు పరిశ్రమల అధిక మూలధన సమీకరణకు తోడ్పడటం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరిస్తాయి.
* దేశంలోని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఎక్కువ వ్యాపారం జరుగుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ)
* మొదట రుణ మార్కెట్ విభాగాన్ని ప్రారంభించారు. ఎన్ఎస్ఈలోని ఈక్విటీ మార్కెట్ విభాగంలో 1994 నవంబరు 3 నుంచి లావాదేవీలు కొనసాగుతున్నాయి.
* అన్ని రకాల సెక్యూరిటీలు - ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, డెరివేటివ్స్‌లలో క్రయవిక్రయాలకు అవకాశం కల్పిస్తుంది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)
* 1875లో అప్పటి బొంబాయిలో 'ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్'గా ఏర్పడిన సంస్థ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా మారింది.* సుమారు 5,500 కంపెనీలు బీఎస్ఈలో నమోదు అయ్యాయి.
* బీఎస్ఈ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 2015 మార్చి నాటికి 1.68 యూఎస్ ట్రిలియన్ డాలర్లుగా ఉంది. (పట్టిక-5 చూడండి)
భారతదేశంలో స్టాక్ మార్కేట్ సూచీలు
1. సెన్సెక్స్: దీన్ని 'సెన్సిటివ్ ఇండెక్స్' అంటారు. ఇది బీఎస్ఈకి సంబంధించిన సూచిక. దీనిలో 30 ప్రాతినిధ్య సంస్థలు ఉన్నాయి. ఆదార సంవత్సరాన్ని 1978-1979 = 100 గా తీసుకున్నారు.2. నిఫ్టీ: దీన్ని ఎన్ఎస్ఈ ఫిఫ్టీ అంటారు. ఈ సూచికను ఎన్ఎస్ఈ తయారు చేస్తుంది. దీనిలో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలను చేర్చారు. ఆధార సంవత్సరం 1995. ఆధార విలువను 1000గా తీసుకున్నారు.
మూలధన మార్కెట్ సంస్కరణలు - సెబీ
Posted on 27-10-2015
గంగినేని ధనుంజయ్