ద్రవ్యోల్బణం
* దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం* స్థూల జాతీయ సమస్య
ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు
1. గుణాత్మక ద్రవ్యోల్బణం (క్వాలిటీ థియరీ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్): వస్తువుల అమ్మకం ద్వారా సేకరించిన కరెన్సీని అమ్మకందారులు భవిష్యత్తులో మార్పు చేసుకోవాలనే అంచనాలపై ఆధారపడిన ధరల పెరుగుదల.2. పరిమాణాత్మక ద్రవ్యోల్బణం (క్వాంటిటీ థియరీ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్): ద్రవ్య సప్లయి, చెలామణి, ద్రవ్యమారకాల సమీకరణాలపై ఆధారపడిన ధరల పెరుగుదల.
3. రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం (సెక్టోరల్ ఇన్‌ఫ్లేషన్): ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరల పెరుగుదల.
4. ధర శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం (ప్రైసింగ్ పవర్ ఇన్‌ఫ్లేషన్): పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం.
5. కోశ సంబంధ ద్రవ్యోల్బణం (ఫిస్కల్ ఇన్‌ఫ్లేషన్): ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం.
అంచానా వేసే పద్ధతులు
ఎ) వినియోగదారుల ధరల సూచిక (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ - సీపీఐ)
1. సీపీఐ-ఐడబ్ల్యూ: వినియోగదారుల ధరల సూచిక - ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీపీఐ-ఐడబ్ల్యూ)లో 260 అంశాలు, సేవలు ఉన్నాయి. దీని ఆధార సంవత్సరం 2001 (మొదటి ఆధార సంవత్సరం 1958-59)
2. సీపీఐ-యూఎన్ఎమ్ఈ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ - అర్బన్ నాన్-మాన్యువల్ ఎంప్లాయీస్): దీని ఆధార సంవత్సరం 1984-85. దీన్ని నెలవారీగా గణిస్తారు. భారతదేశంలోని విదేశీ కంపెనీల ఉద్యోగుల కరవు భత్యాన్ని దీని ఆధారంగా గణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలో 'క్యాపిటల్ గెయిన్స్' విలువను నిర్ణయించడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) గణిస్తుంది.
3. సీపీఐ-ఏఎల్ (సీపీఐ ఫర్ అగ్రికల్చరల్ లేబరర్స్): దీని ఆధార సంవత్సరం 1986-87. నెలవారీ ప్రతిపాదికగా 600 గ్రామాల నుంచి గణిస్తారు. 260 వస్తువుల సమూహంతో దీన్ని గణిస్తారు.
4. సీపీఐ-ఆర్ఎల్ (సీపీఐ ఫర్ రూరల్ లేబరర్స్): దీని ఆధార సంవత్సరం 1986-87. దీన్ని కూడా నెలవారీగా లెక్కిస్తారు.
సీపీఐ నవీకరణ
బి) టోకు ధరల సూచిక (హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ - డబ్ల్యూపీఐ)
* టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ప్రధాన లోపం విద్య, ఆరోగ్యం, రవాణా లాంటి సేవలను పరిగణించకపోవడం.
* పశ్చిమ దేశాలు డబ్ల్యూపీఐకి బదులు పీపీఐ (ఉత్పత్తిదారుల ధరల సూచిక)ని వినియోగిస్తున్నాయి.
ఉత్పత్తిదారుల ధరల సూచిక (పీపీఐ)
* మార్కెట్‌లోని ప్రాథమిక, మధ్యంతర, పూర్తిగా తయారైన వస్తువులు, సేవల ధరల్లో వచ్చే మార్పులను పీపీఐ గణిస్తుంది.* వస్తువులతోపాటు సేవలను కూడా ఇది లెక్కిస్తుంది. డబ్ల్యూపీఐ లెక్కించదు.
* ప్రభుత్వం పన్నులు వేయక ముందు ధరలను లెక్కించేది పీపీఐ.. పన్నులు విధించిన తర్వాత లెక్కించేది డబ్ల్యూపీఐ.
స్థూల దేశీయోత్పత్తి ప్రత్యోల్బణ సూచిక (జీడీపీ డిప్లేటర్)
* దేశీయ ఆదాయంలోని ధరలను తటస్థం చేయడాన్ని ప్రత్యోల్బణ సూచిక అంటారు.* ద్రవ్యోల్బణాన్ని జీడీపీ డిప్లేటర్ సహాయంతో కూడా లెక్కించవచ్చు .
* ప్రస్తుత ధరల్లో జీడీపీ = స్థిర ధరల్లో జీడీపీ. అయితే అక్కడ జీడీపీ డిఫ్లేటర్ విలువ ఒకటి వస్తే ధరల స్థాయిలో మార్పు లేదు. జీడీపీ డిఫ్లేటర్ విలువ రెండు అయితే అక్కడ ధరలస్థాయి రెట్టింపు అని అర్థం.
* డబ్ల్యూపీఐ, సీపీఐ కంటే డిఫ్లేటర్ మెరుగైన సూచిక.. ఎందుకంటే ఇది దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తుసేవలను పరిగణనలోకి తీసుకుంటుంది.
ప్రధాన ద్రవ్యోల్బణం (కోర్ ఇన్‌ఫ్లేషన్)
* తాత్కాలిక, ఎక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే ఆహారం, శక్తి లాంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తు ధరల్లో మార్పులను లెక్కిస్తే ప్రధాన ద్రవ్యోల్బణం వస్తుంది.* తాత్కాలిక ఒడిదుడుకుల కంటే శాశ్వత ఒడిదుడుకుల్లోని మార్పులను తెలుసుకుని, దానికి అనుగుణంగా దీర్ఘకాలిక విధానాలను రూపొందించడానికి ఉపయోగపడేది ప్రధాన ద్రవ్యోల్బణం.
జీవనప్రమాణ వ్యయ సూచీ (కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్)
* వినియోగదారుల సూచీ లాంటిదే జీవన ప్రమాణ వ్యయ సూచీ.* దీనిలో స్థిర ఆదాయాలను, కాంట్రాక్టు ఆదాయాలను, వాటి వాస్తవిక విలువను నిలకడగా ఉంచడానికి తగిన సవరణలు చేయవచ్చు
వినియోగదారుడి వ్యయ అవ్యక్త ప్రత్యోల్బణ సూచిక (కన్స్యూమర్ ఎక్స్‌పెండీచర్ ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్)
మూలధన వస్తువుల ధరల సూచిక (క్యాపిటల్ గూడ్స్ ప్రైస్ ఇండెక్స్)
ప్రతి ద్యవ్యోల్బణ సూచిక (ప్రైస్ డిఫ్లేటర్)
ద్రవ్యోల్బణానికి కారణాలు
1. డిమాండ్ పెరుగుదలను ప్రేరేపించే అంశాలు
* ప్రభుత్వ వ్యయం పెరుగుదల * జనాభా పెరుగుదల
* ప్రభుత్వ లోటు బడ్జెట్
* ప్రజల వినియోగం పెరుగుదల
* సులభ ద్రవ్య విధానం
* ఎగుమతుల్లో పెరుగుదల
* ప్రభుత్వం పూర్వం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం
* ద్రవ్య సప్లయి పెరుగుదల
2. సప్లయిలో తగ్గుదలను కలిగించే అంశాలు
* ప్రకృతి వైపరీత్యాలు * ఉత్పత్తి కారకాల సప్లయి కొరత
* వ్యాపారులు వస్తువులను దాచివేయడం
* వినియోగదారులు వస్తువులను ముందుగానే కొని నిల్వచేసుకోవడం
* అధిక వేతన రేట్లు
* అధిక పన్ను రేట్లు
* ఉత్పత్తిదారులు అధిక లాభాలు నిర్ణయించుకోవడం
భారతదేశంలో ద్రవ్యోల్బణం - పోకడలు
ఆర్థిక సంస్కరణలకు పూర్వం ద్రవ్యోల్బణం
* ఆర్థిక సంస్కరణలకు పూర్వం.. 1960లలో ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. దీనికి కొంతవరకు 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, 1965-66లోని పంటల వైఫల్యం కారణంగా చెప్పవచ్చు.* 1970లలో ద్రవ్యోల్బణం 20 శాతం కంటే పెరిగి ఆందోళన కలిగించింది. దీనికి వ్యవసాయ ఉత్పత్తుల వైఫల్యం, అంతర్జాతీయ ముడి చమురు ధరల విపరీత పెరుగుదల కారణంగా చెప్పవచ్చు.
* 1957-58, 1960-61 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 3 నుంచి 7 శాతం వరకు నమోదైంది.
* 1970వ దశకం ద్రవ్యోల్బణం చరిత్రలో ఎంతో అనిశ్చితిని ప్రదర్శించిందని చెప్పవచ్చు.
* స్వతంత్ర భారతదేశంలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం 1974 సెప్టెంబరులో 33.3%గా నమోదైంది.
* 1980వ దశకంలో ద్రవ్యోల్బణ సగటు 7.2 శాతంగా నమోదైంది.
* 1985-86లో 4.4 శాతం నుంచి 1990-91లో 10.1 శాతం వరకు నమోదైంది.
* టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) మీద ఆధారపడిన ద్రవ్యోల్బణం 1950, 1960 దశకాల్లో 7 శాతం కంటే తక్కువగా ఉన్నా, 1970వ దశకం మొదటి భాగంలో త్వరితంగా పెరిగి రెండు అంకెల స్థాయిని చేరింది. కానీ 1970వ దశకం రెండో భాగంలో తగ్గుతూ 1980వ దశకంలో సగటు 7.2 శాతానికి చేరింది.
ఆర్థిక సంస్కరణల తర్వాత.. (1992-93 నుంచి)
* 1991 మార్చి చివరి నుంచి 1992 మార్చి చివరి వరకు రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 37 శాతం క్షీణించింది. ఇది తీవ్రమైన ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీసింది.* 1990 మొదటి దశకంలో చమురు ధరల నిరంతర పెరుగుదల, నిత్యావసర వస్తువుల సప్లయి - డిమాండ్ వ్యత్యాసం ద్రవ్యోల్బణం రెండు అంకెల స్థాయిని నమోదు చేయడానికి కారణమయ్యాయి.
* 1995-96 నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 1996-97 నుంచి 2000-01 మధ్యకాలంలో గణనీయంగా తగ్గింది.
* వినియోగదారుడి ధరల సూచీ విధానపు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05కు మార్చారు.
* 2011లో ఉన్న ద్రవ్యోల్బణ రేటు 9.35 శాతం నుంచి 2012లో 7.55 శాతానికి తగ్గింది.
* 2010-13 మధ్య కాలంలో ద్రవ్యోల్బణ రేటు 7.18 శాతంగా ఉంది.
ద్రవ్యోల్బణ సూచికలు - ప్రస్తుత పరిస్థితి
* రిజర్వు బ్యాంకు ఏ ద్రవ్యోల్బణ సూచికను దాని ద్రవ్య విధానానికి లక్ష్యంగా ఉపయోగించాలో ఒక దశాబ్దంపాటు చర్చ జరిగింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) లేదా విని యోగదారుల ధరల సూచీ (సీపీఐ) ల మధ్య తర్జనభర్జనల తర్వాత భారత రిజర్వు బ్యాంకు 2014 నుంచి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ)ను లక్ష్యంగా నిర్ణయించింది.* ద్రవ్యవిధానం ముఖ్య ఉద్దేశం ధరల స్థిరత్వాన్ని సాధించడం.
* అన్ని కేంద్ర బ్యాంకుల ధరల స్థిరత్వాన్ని 2 నుంచి 5 శాతం వరకు ద్రవ్యోల్బణం ఉండటంగా నిర్వచిస్తారు.
* వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (ఏవైతే ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయో), వినియోగదారుల ధరల సూచీని వినియోగిస్తున్నాయి. ఎందుకంటే వాటి లక్ష్యం వినియోగదారుల సంక్షేమం, వినియోగ వస్తువుల ధరలను కొలిచే సూచీ సీపీఐ కాబట్టి.
మాదిరి ప్రశ్నలు
1. ద్రవ్యోల్బణానికి కింది వాటిలో వేటిని కారణాలుగా చెప్పవచ్చు?ఎ) ప్రభుత్వ లోటు బడ్జెట్ బి) ప్రజల ఆదాయంలో పెరుగుదల సి) సులభ ద్రవ్యవిధానం డి) పైవన్నీ
జ: (డి)
2. కిందివాటిలో ఏది ద్రవ్యోల్బణ ప్రభావం?
ఎ) ప్రజల కొనుగోలు శక్తి క్షీణత బి) ఆదాయాల్లో వ్యత్యాసాలు పెరగడం సి) వస్తువుల సాపేక్ష ధరల మీద ప్రభావం డి) పైవన్నీ
జ: (డి)
3. టోకుధరల సూచీలో అత్యధిక భారం ఉన్నదేది?
ఎ) ప్రాథమిక వస్తువులు బి) ఇంధనం సి) పారిశ్రామిక ఉత్పత్తులు డి) అన్నింటికీ సమాన భారం
జ: (సి)
Posted on 15-10-2015
గంగినేని ధనుంజయ్