Type Here to Get Search Results !

TS Economy-3

 వృద్ధిరేటు తగ్గుదల
* ఖమ్మంలో అధికంగా ఎస్టీలు

  •  భౌగోళిక ప్రాంత అభివృద్ధి అయినా అక్కడి మౌలిక వనరులతో పాటు మానవ వనరులపై కూడా ఆధారపడి ఉంటుంది. మానవ వనరుల్లో ప్రత్యేకించి యువశక్తి కీలకం. ఇలాంటి యువ జనాభా బలం తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంది. మానవ వనరుల్లో తెలంగాణ బలం, బలగం ఎలా ఉందో గణాంకాల్లో తెలుసుకుందాం.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 15-59 సంవత్సరాల వయసువారు ఉన్నారు. మొత్తం జనాభా 3,50,03,674 (ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లోని 327 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తర్వాత) కాగా.. ఇందులో 2,20,56,942 మంది పైన తెలిపిన వయసు (15-59 ఏళ్లు) వారే ఉన్నారు (స్టాటికల్ ఇయర్ బుక్ 2015 ప్రకారం). ఇందులో స్త్రీ, పురుష జనాభా కొంచెం హెచ్చుతగ్గులతో ఉంది. పురుష జనాభా 176.12 లక్షలు కాగా మహిళలు 173.92 లక్షలు. మొత్తం జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో 61.12 శాతం, పట్టణ ప్రాంతాల్లో 38.88 శాతం నివసిస్తున్నారు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది మహిళలుగా ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 1000 మంది పురుషులకు 1000 మందికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తిలో పెరుగుదల కనిపిస్తోంది. ఇది 1991లో 967గా ఉంటే 2001లో 971 మందికి, 2011 నాటికి 988 మందికి పెరిగింది. అయితే 0-6 ఏళ్ల పిల్లల్లో స్త్రీ, పురుష నిష్పత్తిలో ఈ దశాబ్దంలో చాలా తగ్గుదల కనిపించింది. ఇది 2001 నాటికి 957 ఉండగా 2011 నాటికి 932 కి పడిపోయింది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జీవనసరళిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

  • తగ్గుతున్న పెరుగుదల రేటు
  • తెలంగాణ రాష్ట్ర పరిధిలో 1991-2001 మధ్య ఉన్న జనాభా పెరుగుదల రేటు 18.77 శాతం ఉండగా.. అది 2001-2011 నాటికి 13.58 శాతానికి తగ్గింది. 1951-61 నాటికి ఉన్న జనాభా పెరుగుదల రేటు 16.48 శాతం నుంచి క్రమంగా పెరుగుతూ 1981-91 నాటికి అత్యధిక పెరుగుదల 29.77 శాతంగా ఉంది. అక్కడి నుంచి ప్రతి దశాబ్దానికి ఈ పెరుగుదల రేటు తగ్గుతూ వస్తోంది. గత దశాబ్దంతో పోలిస్తే 5 శాతం తగ్గుదల కనిపిస్తోంది. అయితే పట్టణ జనాభా మాత్రం పెరుగుతోంది. పట్టణ జనాభా పెరుగుదల రేటు 2001-2011 మధ్య 38.12 శాతం. అంతకుముందు.. 1991-2001 నాటికి అది 25.13 శాతంగా ఉండేది. పట్టణ జనాభాలో 30 శాతం హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.
  • ఎస్టీ, ఎస్సీ జనాభా
  • తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా 9.08 శాతం. ఎస్టీ జనాభా అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 6,56,577 ఉండగా.. తర్వాత స్థానంలో వరంగల్ జిల్లాలో 5,30,656గా ఉంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48,937గా ఉంది. తర్వాత అత్యల్పంగా కరీంగనర్ జిల్లాలో 1,06,745 గా ఉంది.
  • తెలంగాణ మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా 15.45 శాతం. ఎస్సీ జనాభా అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 7,09,757 కాగా.. రెండో స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 7,08,954 మంది ఉన్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌లో 2,47,927 మంది ఉండగా రెండో అత్యల్ప స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో 3,71,074 మంది ఉన్నారు.
  • అక్షరాస్యత తీరు

  • ఒఅక్షరాస్యతలో తెలంగాణ మరింత పురోభివృద్ధిని సాధించాల్సి ఉంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 66.54 శాతం. ఇందులో పురుషుల్లో అక్షరాస్యత 75.04 శాతం కాగా మహిళల అక్షరాస్యత 57.99 శాతం. హైదరాబాద్‌లో అత్యధికంగా 83.25 అక్షరాస్యత ఉండగా.. మహబూబ్‌నగర్‌లో అత్యల్పంగా 55.04 శాతం ఉంది. అక్షరాస్యతలో వెనుకబాటుతనం అన్ని సమస్యలకు మూలం.
  • హైదరాబాద్‌లో అధిక జనసాంద్రత

  • ఒక చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభాను జనసాంద్రత అంటారు. జనసాంద్రత తక్కువగా ఉందంటే.. ఎక్కువ భూభాగంలో తక్కువ జనాభా నివసిస్తున్నట్లు అర్థం. ఇది ఆ భౌగోళిక ప్రాంత అభ్యున్నతికి శుభ పరిణామం. జనసాంద్రత ఎక్కువగా ఉంటే ఆర్థిక, సామాజిక పరంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రతను పరిశీలిస్తే.. ఒక చదరపు కిలోమీటరుకు సగటున 312 మంది నివసిస్తున్నారు. రాష్ట్రంలో జనసాంద్రత అతి తక్కువగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ (చదరపు కిలోమీటరుకు 170 మంది) కాగా.. ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ (చదరపు కిలోమీటరుకు 18,172 మంది).
  • మాదిరి ప్రశ్నలు
    1. జనాభా ప్రాతిపదికన దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
    ఎ) 10 బి) 12 సి) 8 డి) 15 
    జ: (బి)
    2. అత్యధిక జనాభా ఉన్న జిల్లా ఏది?
    ఎ) రంగారెడ్డి బి) ఆదిలాబాద్ సి) మహబూబ్‌నగర్ డి) నల్గొండ 
    జ: (ఎ)
    3. అత్యల్ప జనాభా ఉన్న జిల్లా?
    ఎ) నల్గొండ బి) మెదక్ సి) నిజామాబాద్ డి) వరంగల్ 
    జ: (సి) 
    4. పురుషుల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లా?
    ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) కరీంనగర్ 
    జ: (ఎ) 
    5. పురుషుల జనాభా అతి తక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) ఖమ్మం బి) నిజామాబాద్ సి) రంగారెడ్డి డి) వరంగల్
    జ: (బి)
    6. స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) రంగారెడ్డి బి) ఆదిలాబాద్ సి) నల్గొండ డి) మెదక్
    జ: (ఎ)
    7. స్త్రీల జనాభా అతి తక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) ఖమ్మం బి) మెదక్ సి) ఆదిలాబాద్ డి) నిజామాబాద్
    జ: (డి)
    8. లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) కరీంనగర్ బి) నిజామాబాద్ సి) రంగారెడ్డి డి) మహబూబ్‌నగర్
    జ: (బి)
    9. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) హైదరాబాద్ బి) మెదక్ సి) నల్గొండ డి) ఆదిలాబాద్
    జ: (ఎ)
    10. జనసాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) హైదరాబాద్ బి) ఆదిలాబాద్ సి) మెదక్ డి) వరంగల్ 
    జ: (ఎ)
    11. జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లా?
    ఎ) ఆదిలాబాద్ బి) కరీంనగర్ సి) రంగారెడ్డి డి) మెదక్
    జ: (ఎ)
    12. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా ఉన్న జిల్లా?
    ఎ) కరీంనగర్ బి) వరంగల్ సి) మహబూబ్‌నగర్ డి) మెదక్
    జ: (సి)
    13. గ్రామీణ ప్రాంతాల్లో అత్యల్ప జనాభా ఉన్న జిల్లా?
    ఎ) రంగారెడ్డి బి) ఆదిలాబాద్ సి) కరీంనగర్ డి) నల్గొండ
    జ: (ఎ)
    14. పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
    ఎ) హైదరాబాద్ బి) రంగారెడ్డి సి) నిజామాబాద్ డి) కరీంనగర్
    జ: (ఎ)
    15. పట్టణ ప్రాంత జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది?
    ఎ) నిజామాబాద్ బి) మెదక్ సి) మహబూబ్‌నగర్ డి) వరంగల్
    జ: (ఎ)
    Posted on 24-10-2015

    జల్లు సద్గుణరావు

    Post a Comment

    0 Comments
    * Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.