Type Here to Get Search Results !

TS Economy-4

తెలంగాణ వ్యవ‌సాయ‌రంగం

* తెలంగాణ వృద్ధికి కీలకం
* 55.49 శాతం జనాభాకు ఆధారం

  • తెలంగాణలో సగానికి పైగా జనాభాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయమే ఆధారం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం ఎంతో ఉంది. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ఇంతటి కీలక రంగమైన వ్యవసాయానికి సంబంధించి.. తెలంగాణ జిల్లాల్లో పండే పంటలు, భూకమతాలు, సాగునీటి పారుదల, సాగు విస్తీర్ణం, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం అవసరం.
    వ్యవసాయం అంటే కొందరు అనుకున్నట్లు కేవలం పంటలు వేయడం కాదు. భూమి, నీటి నుంచి ఆహారాన్ని, గ్రాసాన్ని ఉత్పత్తి చేయడం. వ్యవసాయం లేకుండా ఓ నగరం, ఓ స్టాక్ మార్కెట్, బ్యాంకు, విశ్వవిద్యాలయం, ప్రార్ధనా మందిరం, సైన్యం ఏవీ మనలేవు. నాగరికతకు, సమస్తమైన సుస్థిర ఆర్థిక వ్యవస్థలకు వ్యవసాయమే పునాది. - అలన్ శావరీ
    వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడూ కీలకమైన అజెండానే. తెలంగాణలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారమైంది. నానాటికీ తరిగిపోతున్న భూగర్భ జలాల మీద ఇది గణనీయంగా ఆధారపడింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 55.49 శాతం మంది తమ జీవనోపాధి కోసం ఏదో విధంగా వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు. పేదరికాన్ని తగ్గించడానికి, తెలంగాణలో సంపద వృద్ధిని నికరంగా సాధించడానికి వ్యవసాయ ఆదాయాలను పెంచడం చాలా అవసరం. ఈ రంగంలో అధికంగా ఉన్న శ్రామిక బలగాన్ని నైపుణ్యాల అభివృద్ధి ద్వారా గ్రామీణ పరిశ్రమలు లాంటి వ్యవసాయేతర రంగాలకు మళ్లించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈమేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్), గ్రామీణ జీవనోపాధి కల్పన, సామాజిక- ఆర్థిక అభివృద్ధి పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.. నిరంతరంగా ఆహారభద్రతను సాధించడం.. అధిక ఆదాయాన్నిచ్చే రీతిలో ఉపాధి కల్పనకు ఏర్పాట్లు చేయడం లాంటి చర్యలు అవసరం.
    * రాష్ట్ర జీఎస్‌డీపీకి వ్యవసాయం అందిస్తున్న వాటా 2014 - 15లో వర్తమాన ధరల వద్ద 9.3 శాతం.
    * 2014 - 15 ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి రూ.4,30,599 కోట్లు.
    * వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా రూ.77,061 కోట్లు.
    * రాష్ట్ర జనాభాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న జనాభా సగానికిపైగా ఉంది.
    * తెలంగాణలో వ్యవసాయం ఒక జీవన విధానంగా, ఒక సంప్రదాయంగా, తెలంగాణ ప్రజల సాంస్కృతిక, ఆర్థిక జీవనానికి రూపాన్ని ఇచ్చింది. దేశం, రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగాన్ని రుతుపవనాలతో జూదం ఆడటం లాంటిదిగా పేర్కొంటారు.
    * తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 114.84 లక్షల హెక్టార్లు (1 హెక్టారు = 2.471 ఎకరాలు)
    * తెలంగాణ రాష్ట్ర స్థూల పంట సాగు విస్తీర్ణం: 62.88 లక్షల హెక్టార్లు.
    * తెలంగాణ రాష్ట్ర నికరసాగు విస్తీర్ణం 49.61 లక్షల హెక్టార్లు
    * భౌగోళిక విస్తీర్ణంలో నికరసాగు విస్తీర్ణ శాతం 43.20%.
    * రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో (జీఎస్‌డీపీ) వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 17.9% (ప్రస్తుత ధరల ప్రకారం 2014-15)

    రాష్ట్ర వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అంశాలు:
         1) భూకమతాలు
         2) పంటల సాంద్రత
         3) సాగునీటి పారుదల
         4) సాగు విస్తీర్ణం
    భూకమతాలు:
    * రాష్ట్రంలో మొత్తం భూకమతాల పరిమాణం 61.77 లక్షల హెక్టార్లు.
    * రాష్ట్ర సగటు భూకమత పరిమాణం: 1.11 హెక్టార్లు
    * దేశంలో సగటు భూకమత పరిమాణం: 1.7 హెక్టార్లు
    * రాష్ట్రంలో అత్యధిక సగటు కమత పరిమాణం ఉన్న జిల్లా: ఆదిలాబాద్ (1.40 హెక్టార్లు)
    * రాష్ట్రంలో అత్యల్ప సగటు కమత పరిమాణం ఉన్న జిల్లా: నిజామాబాద్ (0.92 హెక్టార్లు)
    * రాష్ట్రంలో భూకమతాలు ఉన్నవారి సంఖ్య: 55.54 లక్షలు
    * వ్యవసాయం పెనుభారం కావడానికి ప్రధాన కారణం భూకమతాల పరిమాణం చిన్నవిగా ఉండటం.
    * రాష్ట్రం మొత్తం రైతుల్లో ఉపాంత రైతుల శాతం: 62% (1 హెక్టారు కంటే తక్కువ కమత పరిమాణం ఉన్నవారు)
    * రాష్ట్రంలో ఉపాంత రైతులు అధికంగా ఉన్న జిల్లా: మెదక్ (67.9%)
    * రాష్ట్రంలో ఉపాంత రైతులు అతి తక్కువగా ఉన్న జిల్లా: ఆదిలాబాద్ (49.8%)
    * రాష్ట్రం మొత్తం రైతుల్లో చిన్నరైతులు: 23.9% (1 - 2 హెక్టారుల కమత పరిమాణం ఉన్నవారు)
    * రాష్ట్రంలో మొత్తం భూకమతాలు ఉన్నవారిలో ఉపాంత, చిన్నరైతులు: 85.9%
    పంటల సాంద్రత:
    * స్థూల, నికర పంటల సాగు విస్తీర్ణాలకు మధ్య నిష్పత్తిని పంట సాంద్రత అంటారు.
    * రాష్ట్ర సగటు పంట సాంద్రత: 1.27
    * అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా: నిజామాబాదు
    * అత్యల్ప పంట సాంద్రత ఉన్న జిల్లా: ఆదిలాబాదు
    సాగు నీటి పారుదల, విస్తీర్ణం:
    * రాష్ట్రంలో స్థూల సాగునీటి పారుదల ఉన్న భూమి 31.64 లక్షల హెక్టార్లు.
    * నికరసాగు నీటి పారుదల భూమి 22.89 లక్షల హెక్టార్లు.
    * కాలువల ద్వారా: 5 లక్షల హెక్టార్లు
    * చెరువుల కింద : 3 లక్షల హెక్టార్లు
    * బావుల కింద : 23 లక్షల హెక్టార్లు
    * నికర సాగు నీటి పారుదల ఉన్న భూమిలో 76% బావుల ద్వారానే జరుగుతుంది.
    పంట కాలాలు
    పంటసాగు కాలాన్ని అనుసరించి సంవత్సరానికి 3 వ్యవసాయ రుతువులుగా విభజించారు. అవి: 1) ఖరీఫ్ 2) రబీ 3) జయిద్
    1) ఖరీఫ్:
    * నైరుతి రుతుపవనకాలం: జూన్ - అక్టోబరు
    * పంట కాలం: 5 నెలలు
    * ముఖ్యమైన ఖరీఫ్ పంటలు: వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, పత్తి, పొగాకు.
    2) రబీ: 
    * నవంబరు - ఫిబ్రవరి మధ్యకాలంలో ఉంటుంది.
    * పంటకాలం - 4 నెలలు
    * ముఖ్యమైన రబీ పంటలు: గోధుమ, బార్లీ, పప్పుదినుసులు, చిక్కుడు.
    3) జయిద్:
    * వేసవి కాలం - మార్చి నుంచి మే వరకు
    * పంట కాలం: 3 నెలలు
    * ముఖ్యమైన జయిద్ పంటలు: వరి, దోస, పుచ్చకాయ, కూరగాయలు, మొక్కజొన్న
    పంటలు - రకాలు 
    1) ఆహార పంటలు: వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జ, జొన్న, రాగులు, పప్పు దినుసులు.
    ఇవి 2 రకాలు: ప్రధాన ధాన్యాలు: వరి, గోధుమ, మొక్కజొన్న. తృణ ధాన్యాలు: జొన్న, సజ్జ, రాగులు.
    2) వాణిజ్య పంటలు: పత్తి, పొగాకు, జనుము, చెరకు, నూనెగింజలు.
    3) తోటపంటలు: కాఫీ, తేయాకు, కొబ్బరి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు.
    4) ఉద్యానవన పంటలు: పండ్లు, పూలు, కూరగాయలు.

    వాతావరణ మండలాలు 
    నేలలు, వర్షపాతం ఆధారంగా రాష్ట్రాన్ని 4 వ్యవసాయ మండలాలుగా విభజించారు.
    1) ఉత్తర తెలంగాణ మండలం:
    ప్రధాన కేంద్రం: జగిత్యాల
    జిల్లాలు: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్
    2) మధ్య తెలంగాణ మండలం:
    ప్రధాన కేంద్రం: వరంగల్
    జిల్లాలు: వరంగల్, మెదక్, ఖమ్మం
    3) దక్షిణ తెలంగాణ మండలం:
    ప్రధాన కేంద్రం: పాలెం
    జిల్లాలు: మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి
    4) అధిక ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల మండలం:
    ప్రధాన కేంద్రం: చింతపల్లి
    ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎత్తయిన, గిరిజన ప్రాంతాలు.
    ముఖ్యాంశాలు:
    * తెలంగాణలో విస్తీర్ణం, మండలాల సంఖ్య పరంగా పెద్ద వ్యవసాయ వాతావరణ మండలం - దక్షిణ తెలంగాణ మండలం. (39.3 వేల చ.కి.మీ., 164 మండలాలు)
    * చిన్న వ్యవసాయ వాతావరణ మండలం - అధిక ఎత్తు, గిరిజన ప్రాంతాల మండలం (4.66 వేల చ.కి.మీ., 13 మండలాలు)
    * పరిశోధన సంస్థల పరంగా పెద్ద వ్యవసాయ వాతావరణ మండలం - మధ్య తెలంగాణ మండలం (7 మండలాలు).
    * బంజరు భూములు అధికంగా ఉన్న జిల్లా - నల్గొండ, తక్కువగా ఉన్న జిల్లా - రంగారెడ్డి
    * నికర సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా - మహబూబ్‌నగర్, తక్కువగా ఉన్న జిల్లా- రంగారెడ్డి
    * సాగు విస్తీర్ణంలో 60% ఆహారపంటలు.
    * ఆహార పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా - మహబూబ్‌నగర్, తక్కువగా ఉన్న జిల్లా: రంగారెడ్డి
    * ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా- ఆదిలాబాద్, తక్కువగా ఉన్న జిల్లా: రంగారెడ్డి
  • Posted on 18-09-2015

    దాసరి రాజేందర్

    Post a Comment

    0 Comments
    * Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.