Type Here to Get Search Results !

Dec-2018 Persons

డిసెంబరు - 1
¤ జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా హాజరుకానున్నారు.
        
 »
 జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా బ్యూనస్‌ ఎయిర్స్‌లో సిరిల్‌తో భేటీ అయిన ప్రధాని మోదీ ఆయనను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. ¤ ఐక్యరాజ్య సమితిలో ఇండియన్‌ పర్మినెంట్‌ మిషన్‌ డిప్యూటీ చీఫ్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి కాకనూర్‌ నాగరాజు నాయుడు నియమితులయ్యారు. ఈయన నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.         » దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి (పశ్చిమ ఐరోపా)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం న్యూయార్క్‌లోని ఐరాస డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌గా నియమించింది. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. 1998లో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా నియమితులయ్యారు.         » 13 ఏళ్లపాటు చైనాలో పనిచేశారు. దిల్లీలోని భారత విదేశాంగ కార్యాలయంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎకనామిక్‌ డిప్లొమసీ విభాగానికి నేతృత్వం వహించారు. ప్రధానమంత్రి మానస పుత్రిక ‘ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌' ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం భారత్‌లో ఏర్పాటు చేసిన ఆ సంస్థకు తొలి చీఫ్‌ కో-ఆర్డినేటర్‌గా సేవలందించారు.
డిసెంబరు - 3
¤ ‘జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం' (జెడ్‌బీఎన్‌ఎఫ్‌)గా రైతులు అనుసరిస్తున్న పాలేకర్‌ వ్యవసాయ విధానం పేరును ‘సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయం' (ఎస్‌పీఎన్‌ఎఫ్‌)గా మార్చినట్లు సుభాష్‌ పాలేకర్‌ వెల్లడించారు.
డిసెంబరు - 4
¤ దేశంలో 2018లో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారని ప్రముఖ సెర్చింజన్‌ యాహూ తెలిపింది.         » ‘యాహూ ఇయర్‌ ఇన్‌ రివ్యూ' పేరిట యాహూ సంస్థ ప్రతి ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచిన ప్రముఖులతో ఓ జాబితా రూపొందిస్తుంది.         » 2018 జాబితాలో మోదీ తర్వాత రాహుల్‌ గాంధీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఉన్నారు.         » బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారస్తులు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలు వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచారు.         » బాలీవుడ్‌ జంట దీపికా పదుకుణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ఈ జాబితాలో ‘జంట' కేటగిరిలో చోటు దక్కించుకున్నారు.         » వివిధ కేటగిరీల వారీగా వార్తల్లో నిలిచిన ప్రముఖుల్లో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, పారిశ్రామిక రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ, పురుష సెలబ్రిటీల్లో సల్మాన్‌ ఖాన్, మహిళా సెలబ్రిటీల్లో సన్నీ లియోనీలు ప్రథమ స్థానాల్లో నిలిచారు. ¤ ఏడేళ్ల అమెరికా బుడతడు రేయాన్‌ ఆటలాడే బొమ్మలను సమీక్షించి రూ.155 కోట్లు (2.2 కోట్ల డాలర్లు) ఆర్జించి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2018లో యూట్యూబ్‌లో అత్యధిక ఆదాయం గడించిన వాడిగా రికార్డులకెక్కాడు.         » రేయాన్‌ అనేక స్టోర్ల నుంచి రకరకాల బొమ్మల్ని కొని వాటితో ఆసక్తిగా ఆడుతుంటాడు. ఆ సన్నివేశాల్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో ట్విటర్‌ సహా సామాజిక మాధ్యమాల్లో అతడి పేరు మార్మోగింది.         » యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న రేయాన్‌ టాయ్స్‌ రివ్యూస్‌ ఛానల్‌ ద్వారా విడుదలైన డిస్నీ టాయ్స్, పా పెట్రోలింగ్‌ అనే రెండు వీడియోలను సుమారు రెండు కోట్ల మంది వీక్షించారు. దీంతో రేయాన్‌ ఛానల్‌లో ప్రదర్శితమవుతున్న ప్రకటనలకు (ప్రాయోజిత ప్రకటనలతో కలిపి) రూ.155 కోట్లు ఆర్జించాడు.         » 2017 ఫోర్బ్స్‌ జాబితాలో రేయాన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.¤ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ పౌరుడు క్రిస్టియన్‌ మిషెల్‌ (54)ను అధికారులు దుబాయ్‌ నుంచి దిల్లీకి తీసుకొచ్చారు. అతడిని సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.         » ఈ కేసులో సీబీఐ, ఈడీల దర్యాప్తు ఆధారంగా అతన్ని అప్పగించాలంటూ 2017లోనే భారత్‌ యూఏఈని కోరింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థ నుంచి అతడు సుమారు రూ.225 కోట్లు లంచంగా పొందినట్లు ఆరోపిస్తూ 2016 జూన్‌లో ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది         » 2010లో కుదిరిన ఈ ఒప్పందం కారణంగా భారత ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది.
డిసెంబరు - 5
¤ భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన నూరు శాతం ప్రజా ధనాన్ని తిరిగి చెల్లిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.9000 కోట్ల మేర చెల్లించాల్సిన ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు.¤ భారతీయ సెలబ్రిటీల సంపాదనపై ప్రతిష్ఠాత్మక సంస్థ ఫోర్బ్స్‌ ఓ జాబితాను విడుదల చేసింది.ముఖ్యాంశాలు: 2017 అక్టోబరు 1 నుంచి 2018 సెప్టెంబరు 30 మధ్యకాలంలో దేశంలోనే అత్యధికంగా ఆర్జించిన 100 మంది ప్రముఖులతో ఈ జాబితాను రూపొందించారు ఈ జాబితాలో సల్మాన్‌ఖాన్‌ (రూ.253.25 కోట్ల ఆదాయం) అగ్రస్థానంలో నిలిచారు. సల్మాన్‌ అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి. విరాట్‌ కోహ్లీ (రూ.228.09 కోట్లు) రెండోస్థానంలో, అక్షయ్‌కుమార్‌ (రూ.185 కోట్లు), దీపికా పదుకొణె (రూ.112.8 కోట్లు), మహేంద్రసింగ్‌ ధోని (రూ.101.77 కోట్లు)లు వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. 6 నుంచి 10 స్థానాల్లో వరుసగా అమీర్‌ ఖాన్‌ (రూ.97.5 కోట్లు), అమితాబ్‌ బచ్చన్‌ (రూ.96.17 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.84.67 కోట్లు), సచిన్‌ తెందుల్కర్‌ (రూ.80 కోట్లు), అజయ్‌ దేవగణ్‌ (రూ.74.5 కోట్లు)లు నిలిచారు. బ్యాడ్మింటన్‌ తార పీవీ సింధు రూ.36.5 కోట్లతో క్రికెటేతర క్రీడాకారుల్లో అగ్రస్థానంలో, మొత్తం జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. 100 మంది జాబితాలో 21 మంది క్రీడాకారులు చోటు సంపాదించారు. అందులో 14 మంది క్రికెటర్లే. తెలుగు చిత్రసీమకు చెందిన పవన్‌కళ్యాణ్‌ (24వ స్థానం - రూ.31.33 కోట్లు), ఎన్టీఆర్‌ (28వ స్థానం - రూ.28 కోట్లు), మహేష్‌బాబు (33 - రూ.24.33 కోట్లు), నాగార్జున (36 - రూ.22.25 కోట్లు), కొరటాల శివ (39 - రూ.20 కోట్లు), అల్లు అర్జున్‌ (64 - రూ.15.67 కోట్లు), రామ్‌చరణ్‌ (72 - రూ.14 కోట్లు), విజయ్‌ దేవరకొండ (72 - రూ.14 కోట్లు)లు జాబితాలో చోటు పొందారు.
డిసెంబరు - 6
¤ ‘పరారీలో ఉన్న నిందితుడి'గా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనపై నింద వేయడాన్ని విజయ్‌మాల్యా సుప్రీంకోర్టులో సవాలుచేశారు. ఈ నిందను తొలగించాలంటూ ఆయన కోరారు.¤ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు.         » ఆయనకు కోటీ 48 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.         » కోటీ 22 లక్షల మంది అనుసరిస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు జాకో విడోడో రెండో స్థానంలోను, కోటిమంది ఫాలోవర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మూడో స్థానంలో ఉన్నారు.¤ 100 మంది అత్యంత శక్తిమంత మహిళలతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో మన దేశం నుంచి నలుగురికి చోటు లభించింది.         » హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ రోష్ని నాడార్‌ (51వ స్థానం), బయోటెక్నాలజీ దిగ్గజం కిరణ్‌ మజుందార్‌ షా (60), ప్రసార మాధ్యమాల నుంచి శోభనా భర్తియా (88), బాలీవుడ్‌ నటీమణి ప్రియాంక చోప్రా (94) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.         » తొలి ఐదు స్థానాలు: జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే, ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టీన్‌ లగార్డే, జనరల్‌ మోటార్స్‌ సీఈఓ మేరీ బారా, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఈఓ అబిగైల్‌ జాన్సన్‌.
డిసెంబరు - 8
¤ చైనాలోని సన్యా నగరంలో జరిగిన మిస్‌వరల్డ్‌ 2018 పోటీల్లో మెక్సికోకు చెందిన 26 ఏళ్ల వెనెస్సా పోన్స్‌ డి లియోన్‌ను ‘ప్రపంచ సుందరి' కిరీటం వరించింది.
         » థాయ్‌లాండ్‌కు చెందిన నికాలీన్‌ పిచాపా లిమ్‌ నూకాన్‌ మొదటి రన్నరప్‌గా, మరియా వలిలెవిచ్‌ (బెలారస్‌) రెండో రన్నరప్‌గా నిలిచారు. తర్వాతి స్థానాల్లో కదీజా రాబిన్సన్‌ (జమైకా), క్విన్‌ అబెనాక్యో (ఉగాండా) ఉన్నారు
.
         » ఈ పోటీల్లో 118 మంది సుందరీమణులు పాల్గొన్నారు. ఇవి 68వ మిస్‌వర‌ల్డ్ పోటీలు. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తమిళనాడు విద్యార్థిని అనుక్రీతివాస్‌ 19వ స్థానంలో నిలిచి టాప్‌ 30లో చోటు దక్కించుకుంది.
డిసెంబరు - 10
¤ ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
         » ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐకి 24వ గవర్నరుగా 2016 సెప్టెంబరు 5న బాధ్యతలు చేపట్టారు
.
         » 1992 తర్వాత అత్యంత స్వల్పకాలం ఈ పదవిలో ఉన్న వ్యక్తి ఉర్జిత్‌
.
         » స్వతంత్ర భారత్‌లో రాజీనామా చేసిన ఆర్‌బీఐ గవర్నర్లలో అయిదో వ్యక్తి పటేల్‌. అంతక్రితం బెనెగల్‌ రామారావు (1957), కేర్‌పురి (1977), ఆర్‌ఎన్‌ మల్హోత్రా (1990), ఎస్‌.వెంకట రమణన్‌ (1992)లు కూడా పదవీకాలంలో ఉండగానే నిష్క్రమించారు.
డిసెంబరు - 11
¤ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తాత్కాలిక సభ్యుడి పదవికి డిసెంబరు 1న రాజీనామా చేసినట్లు ప్రముఖ ఆర్థికవేత్త, వ్యాసకర్త సుర్జీత్‌ భల్లా వెల్లడించారు.
         » తాజాగా భల్లా రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించారు.
         » ప్రభుత్వానికి, ప్రధానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో సలహాలు ఇవ్వడానికి ఈఏసీ-పీఎంను ఏర్పాటు చేశారు. ఈ మండలిలో ప్రస్తుతం ప్రముఖ ఆర్థికవేత్తలు వివేక్‌ దెబ్రాయ్, శ్రీరతన్‌ పి వతాల్, రతిన్‌ రాయ్, ఆషిమా గోయల్, శమికా రవి ఉన్నారు.
¤ టర్కీలోని సౌదీ అరేబియా కాన్సులేట్‌లో హత్యకు గురైన పాత్రికేయుడు జమాల్‌ ఖషోగ్గీని ఈ ఏడాది మేటి వ్యక్తిగా టైమ్‌ మ్యాగజీన్‌ ప్రకటించింది.
డిసెంబరు - 12
¤ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్, తెహల్కా వారపత్రిక మాజీ ముఖ్య సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌లపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకుంది. సంస్థలో వారికి ఉన్న సభ్యత్వాలను తాత్కాలికంగా రద్దు చేసింది.
డిసెంబరు - 13
¤ ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ దృఢ సంకల్పంతో భారత్‌లో ఎత్తయిన ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించిన సాహసి అరుణిమా సిన్హా (30) తాజాగా అంటార్కిటికాలోని అత్యంత ఎత్తయిన మౌంట్‌ విన్సన్‌ శిఖరారోహణకు బయలు దేరింది. అంటార్కిటికాకు వెళ్లడానికి ముందు ఆమె ప్రధాని మోదీని కలుసుకున్నారు.         » అరుణిమా ఇప్పటికే మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా), మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (ఐరోపా), మౌంట్‌ అకాన్‌క్వగా (దక్షిణ అమెరికా) శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు.         » జాతీయ స్థాయి వాలీబాల్, ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ అయిన ఆమె సీఐఎస్‌ఎఫ్‌లో చేరేందుకు పరీక్ష రాయడానికి 2011లో లఖ్‌నవూ నుంచి దిల్లీకి రైలులో వెళ్తుండగా దొంగలు బయటికి తోసేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో రైలు ఆమె కాలు మీదుగా వెళ్లిపోయింది. దీంతో అరుణిమాకు కృత్రిమ కాలు అమర్చారు.
డిసెంబరు - 16
¤ సీనియర్‌ నటుడు కార్తీక్‌ ‘మనిథ ఉరిమై కాక్కుం కట్చి' పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు.
         » ఇంతకుముందు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత నాడాళుమ్‌ మక్కళ్‌ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు
.
         » ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్‌ ‘మనిథ ఉరిమై కాక్కుం కట్చి' పార్టీని ప్రారంభించారు.
డిసెంబరు - 17
¤ బ్యాంకాక్‌లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో ‘విశ్వసుందరి కిరీటం-2018' ఫిలిప్పీన్స్‌కు చెందిన కత్రియోనా గ్రేకు దక్కింది.
         » మొదటి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్‌ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టెఫానీ గ్యూటిరెజ్‌ నిలిచారు
.
         » బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో కత్రియోనాకు మాజీ విశ్వసుందరి డెమీ లీ నెల్‌ పీటర్స్‌ కిరీటాన్ని అలంకరించారు
.
¤ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను దిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన జీవించినంత కాలం జైల్లోనే ఉంచాలని తీర్పు చెప్పింది
.
         » 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులే కాల్చి చంపారు. దీంతో దిల్లీలో, దేశవ్యాప్తంగానూ సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఊచకోతలు జరిగాయి. అందులో భాగంగా దిల్లీలో జరిగిన అల్లర్లు, హత్యల కేసులో సజ్జన్‌ కుమార్‌ సహా ఆరుగురు నిందితులుగా ఉన్నారు. నాడు సజ్జన్‌ ఎంపీగా ఉన్నారు.
డిసెంబరు - 18
¤ దిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా గవర్నింగ్‌ కౌన్సెల్‌లో కార్యనిర్వాహక సభ్యులుగా ఎంపీ జితేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఎంపికయ్యారు.         » రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.         » ప్యానల్‌లో సాంస్కృతిక కార్యదర్శిగా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా జితేందర్‌ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు లతోపాటు డి.రాజా, సుప్రియా సూలే, తారిఖ్‌ అన్వర్, సతీష్‌ చంద్ర మిశ్రా, కేసీ త్యాగి, సురేంద్ర సింగ్, సందీప్‌ దీక్షిత్, అజయ్‌ సంచేటి ఎన్నికయ్యారు.¤ ప్రేమ కోసం సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లో జైలు పాలైన ముంబయివాసి హమిద్‌ నిహాల్‌ అన్సారీ ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు విడుదలయ్యాడు. అత్తారి - వాఘా సరిహద్దు వద్ద తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు.         » ముంబయికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హమిద్‌ నిహాల్‌ అన్సారీ (33) ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైన అమ్మాయిని కలుసుకునేందుకు 2012లో అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి ఆ దేశ నిఘా వర్గాలకు చిక్కాడు.¤ అసమానతలకు అతీతంగా మహిళలు స్వతంత్రంగా ఎదిగి ధైర్యంగా ముందడుగేసేలా చేయడమే లక్ష్యంగా వారికోసం ప్రత్యేకంగా ‘జాతీయ మహిళా పార్టీ - ఎన్‌డబ్ల్యూపీ' పేరిట ఓ పార్టీని దిల్లీలో శ్వేతాశెట్టి అనే మహిళ ఏర్పాటు చేశారు.         » అమెరికాలో ఎన్నో దశాబ్దాల నుంచి మనుగడలో ఉన్న నేషనల్‌ విమెన్స్‌ పార్టీయే స్పూర్తిగా తాను ఎన్‌డబ్ల్యూపీని స్థాపించినట్లు శ్వేతాశెట్టి వెల్లడించారు.
డిసెంబరు - 19
¤ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (మైసూరు) సంచాలకుడిగా ఆచార్య డి.మునిరత్నం నాయుడును కేంద్ర మానవ వనరుల శాఖ నియమించింది.         » చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసి, 2017లో పదవీ విరమణ పొందారు. తాజా పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు.         » కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడంతో పరిశోధన కోసం మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ (సీఐఐఎల్‌) ఆవరణలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
డిసెంబరు - 20
¤ జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ఛైర్మన్‌గా హార్షకుమార్‌ బన్వాలాను ఏడాదిపాటు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది         » బన్వాలా 2013 డిసెంబరు 18 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.¤ పలు రంగాల్లో విశేష కృషితో ఈ ఏడాది ప్రపంచంపై తమదైన ముద్రవేసిన 25 మంది అత్యంత ప్రభావశీల టీన్స్‌ (13-19 ఏళ్ల మధ్య వయసున్నవారు) జాబితాను ప్రఖ్యాత టైమ్స్‌మ్యాగజీన్‌ ప్రకటించింది.         » ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు కావ్య కొప్పరపు, రిషబ్‌ జైన్, అమికా జార్జ్‌లకు చోటు దక్కింది. రిషబ్, కావ్య భారతీయ అమెరికన్లు కాగా, అమికా బ్రిటన్‌ వాసి.         » కావ్య హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. మెదడు క్యాన్సర్‌ బాధితుల నుంచి సేకరించిన కణజాలాన్ని స్కాన్‌ చేసి వాటి సాంద్రత, రంగు, కణాల రూపురేఖల్ని విశ్లేషించగల డీప్‌ లెర్నింగ్‌ కంప్యూటర్‌ వ్యవస్థను ఆమె అభివృద్ధి చేశారు. అవసరానికి తగ్గట్లు ఆయా వ్యక్తులకు చికిత్సలో మార్పులు చేసి వ్యాధిని నయం చేయడంలో ఇది తోడ్పడుతుంది.         » రిషబ్‌ 8వ గ్రేడ్‌ చదువుతున్నాడు. క్లోమ క్యాన్సర్‌ను నయం చేసే సామర్థ్యమున్నట్లు భావిస్తున్న క్రమసూత్ర పద్ధతి (ఆల్గరిధమ్‌)ను అతడు అభివృద్ధి చేశాడు.         » బ్రిటన్‌లో ఇప్పటికీ చాలా మంది విద్యార్థినులు అవసరమైన ఉత్పత్తులు కొనగోలు చేయలేక బహిష్ఠు సమయంలో పాఠశాలకు గైర్హాజరు అవుతున్నట్లు గుర్తించిన అమికా తీవ్రంగా కలత చెందారు. ఉచిత బహిష్ఠు పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేయలేని అమ్మాయిలకు ప్రభుత్వం వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేసే పిటిషన్‌పై దాదాపు రెండు లక్షల మంది సంతకాలను సేకరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.