సినర్జీస్ కాస్టింగ్ సంస్థ అల్ల్యుమినియం అల్లాయ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కారు చక్రాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏటా 18 అంగుళాల 2.4 మిలియన్ చక్రాల తయారీ ఈ ప్లాంట్ ప్రత్యేకత. విశాఖలో ప్లాంట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈవో జె.క్రిష్టకిశోర్, సినర్జీస్ కాస్టింగ్ సంస్థ ప్రెసిడెంట్ శేఖర్ మెవ్వ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 2018 మే 1న హైదరాబాద్‌లో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
_______________________________________________________
వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపు
వింబుల్డన్ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. 2017తో పోలిస్తే 7.6 శాతం పెరుగుదలతో మొత్తం రూ. 309 కోట్లకు చేరింది. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతకు తలా రూ.20.47 కోట్లు దక్కనుంది. గత ఏడాది కంటే దాదాపుగా రూ. 50 లక్షలు అదనం. గాయాలతో క్రీడాకాయి తొలి రౌండ్లోనే వైదొలుగుతున్న సంఖ్య ప్రతీసారి పెరుగుతుండటంతో దాన్ని అరికట్టడం కోసం నిర్వాహకులు కొత్త నిబంధన తీసుకొచ్చారు. ముందే గాయమున్నా టోర్నీ ఆడి తొలి రౌండ్ మధ్య నుంచి నిష్క్రమించే క్రీడాకారులకు ప్రైజ్‌మనీ ఇవ్వకూడదని నిర్ణయించారు.
IRDAI ఛైర్మన్‌గా సుభాష్ చంద్ర కుంతియా
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) నూతన ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు. 3 సం॥ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కుంతియా నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని IRDAI పేర్కొంది. ఇంతకు ముందు ఛైర్మన్‌గా ఉన్న టీఎస్ విజయన్ అయిదేళ్ల పదవీ కాలం 2018 ఫిబ్రవరి 21తో ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.
IRDAI-Insurance Regulatory and Development Authority
212 మీ.ల ఎత్తుతో ముంబయిలో శివాజీ విగ్రహం
మహారాష్ట్ర రాజధాని ముంబయి తీరంలో అరేబియా సముద్రంలో నిర్మించతలపెట్టిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఎత్తును మరో 2 మీటర్లు పెంచాలని నిర్ణయించినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నిర్మాణం పూర్తయ్యేనాటికి ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సాధించేందుకు ఈ మార్పు చేశామని పేర్కొన్నారు. చైనాలో స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా విగ్రహాన్ని 208 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తలపెట్టారు. ఇటీవల ఆ విగ్రహం అడుగు భాగంలో కొన్ని నిర్మాణ పనులు చేయడంతో దాని ఎత్తు 210 మీటర్లకు పెరిగింది. దీంతో శివాజీ విగ్రహం ఎత్తును 210 నుంచి 212 మీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.2.5 వేల కోట్లతో చేపడుతున్న ఈ విగ్రహ నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు.
సైబర్ భద్రతపై NCERT మార్గదర్శకాలు

పాఠశాలల్లో సైబర్ భద్రత, సురక్షితపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రులకు బాధ్యతలను నిర్దేశించింది. కంప్యూటర్ ల్యాబ్‌కు అథీకృత వ్యక్తులనే అనుమతించడం, యూఎస్‌బీ వినియోగాన్ని నిషేధించడం, పాప్ అప్స్‌లను అడ్డుకోవడం, డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షమయ్యే అపరిచిత ఐకాన్‌పై కన్నేసి ఉంచడం వంటివి ఇందులో ఉన్నాయి.
విద్యార్థులు సురక్షితంగా, న్యాయబద్ధంగా, నైతిక పద్ధతిలో ఇంటర్నెట్‌ను వినియోగించేలా చూడటం ఈ మార్గదర్శకాల ఉద్దేశం. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్రను NCERT నిర్వచించింది.
ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులకు దిగే సైబర్ బుల్లీలతో సంబంధాలు సాగించడం, వారితో వాదనకు దిగడం వంటివి మానుకోవాలని విద్యార్థులకు బోధించాలి. వారితో వాగ్వాదం మరింత దుష్ప్రవర్తనకు దారితీయవచ్చు.
సైబర్‌బుల్లీల నుంచి ఈమెయిల్, సందేశాల రూపంలో మరిన్ని వేధింపులు తావులేకుండా చూసేందుకు అంతర్గత ఫిల్టర్ లను ఉపయోగించాలి.
ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పరిచయమైన వ్యక్తిని ప్రత్యక్షంగా కలవకూడదని విద్యార్థులకు చెప్పాలి.
ఇతరుల సమక్షంలో చేయదగని పనులను ఆన్‌లైన్‌లో చేయకూడదు.
విద్యార్థుల వ్యవహారశైలిలో వస్తున్న మార్పులను ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.
విద్యార్థులు ఇతరుల పేర్లతో లాగిన్ కావడం వారి ఈమెయిల్స్‌ను చదవడం, వారి ఆన్‌లైన్ వివరాలను గందరగోళ పరచడం, వైరస్‌తో దాడి చేయడం, ఇతరుల కంప్యూటర్లను వినియోగానికి పనికిరాకుండా చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
గుర్తుతెలియని అటాచ్‌మెంట్లను తెరవడం కానీ, డౌన్‌లోడ్ చేయడం కానీ చేయకూడదు.
సైబర్ భద్రతలోని ప్రధానాంశాలపై విద్యార్థుల, ఉపాధ్యాయుల కోసం పాఠశాలలు కోర్సులను, కార్యకలాపాలను ప్రవేశపెట్టాలి.
NCERT-National Council of Educational Research and Training
ఆర్థికవేత్త అశోక్‌మిత్ర మృతి
కమ్యూనిస్టు మేధావి, ప్రముఖ ఆర్థికవేత్త అశోక్‌మిత్ర(90) 2018 మే 1న మృతి చెందారు. ఇందిరాగాంధీ హయాంలో 1970-72 వరకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1977-87 వరకు జ్యోతిబసు హయాంలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. బంగ్లాదేశ్‌లో జన్మించిన మిత్ర బెనారస్ హిందూ విశ్వవిద్యాయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ, నెదర్లాండ్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రపంచబ్యాంకులో పనిచేయడంతో పాటు ఐఐఎం-కోల్‌కతా, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లఖ్‌నవూ విశ్వవిద్యాయంలో విద్యాబోధన చేశారు.
AMD డైరెక్టర్‌గా వర్మ
అణు ఖనిజ అన్వేషణ, పరిశోధన సంస్థ (అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్-AMD) డైరెక్టర్‌గా నియమితులైన ఎం.బి.వర్మ 2018 మే 1న బాధ్యతలు స్వీకరించారు. అణు ఇంధన సంస్థ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ) పరిధిలో ఎఎండీ పని చేస్తుంది.
AMD-Atomic Minerals Directorate for Exploration and Research
కృష్ణా బోర్డు ఛైర్మన్ వై.కె.శర్మ బదిలీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ వై.కె.శర్మ బదిలీ అయ్యారు. కేంద్ర జలసంఘం సభ్యునిగా నియమిస్తూ జలవనరుల మంత్రిత్వశాఖ 2018 మే 1న ఆదేశాలు జారీ చేసింది. గోదావరి నదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్‌గా ఉన్న సాహుకే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
హృద్రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే యాప్
హృద్రోగుల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా పర్యవేక్షించే సరికొత్త యాప్‌ను ఐఐటీ-రూర్కీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీనికి ధడ్‌కన్‌గా నామకరణం చేశారు. అత్యవసర సమయాల్లో సాయం అందించడం దీని ప్రత్యేకత. ఆరోగ్యంలో ఏమైనా విపరీతమైన తేడాలు కనిపిస్తే ఇది రోగులతోపాటు వైద్యులకూ సమాచారం చేరవేస్తుంది. ఎయిమ్స్ నిపుణుల సాయంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. నిర్దేశిత సమయానికి ఇది రోగుల రక్త పోటు, గుండె కొట్టుకునే వేగం, బరువు తదితర సమాచారం తీసుకుంటుంది. దీన్ని వైద్యులు లేదా నర్సులకు పంపిస్తుంది.
సౌర విద్యుత్‌ను నిల్వచేసే జలాధార బ్యాటరీ
పవన, సౌర విద్యుత్‌ను నిల్వచేసే జలాధార బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. అవసరమైనప్పుడు ఇవి గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయగలవు. 3 అంగుళాల ఎత్తుండే ‘మాంగనీస్-హైడ్రోజన్ నమూనా బ్యాటరీ’ని ప్రొఫెసర్ యూ కుయ్ బృందం రూపొందించింది. ఎల్‌ఈడీ కాంతులకు సమానంగా 20 మిల్లీవాట్ గంటల విద్యుత్‌ను ఇది నిక్షిప్తం చేయగలదు.
సిద్దిపేట మెడికల్ కాలేజికి MCI అనుమతి
తెలంగాణలోని సిద్దిపేటలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల నెలకోల్పడానికి భారతీయ వైద్య మండలి(MCI) అనుమతించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 7 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసినట్లు అయింది. తెలంగాణ వచ్చాక మహబూబ్‌నగర్ వైద్యకళాశాలను మొదటగా నెలకోల్పగా ఇది రెండోది. సిద్ధిపేట వైద్యకళాశాలకు నూతన అనుమతితో పాటు మహబూబ్‌నగర్ వైద్యకళాశాలకు మూడో ఏడాదికి 150 సీట్లను, ఈఎస్‌ఐ వైద్యకళాశాలకు 100 సీట్లను, నిజామాబాద్ వైద్యకళాశాలకు 100 సీట్లను కూడా 2019-20 వైద్య విద్య సంవత్సరానికి ఎంసీఐ పునరుద్ధరించింది.
MCI-Medical Council of India
హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ-ఆఫీస్ విధానం ప్రారంభం
అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ పోలీసు 2018 మే 1న కాగిత రహిత పరిపాలనను ప్రవేశపెట్టారు. అంతర్గత అవసరాలతో పాటు సంస్థలు, ప్రజలు, ఆయుధాల అనుమతుల వంటి వాటికి ఎక్ట్రానిక్ పద్ధతి ద్వారా అనుమతులు ఇస్తున్నారు.