May-03
జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హంతకులకు జీవితఖైదు
| Event-Date: | 03-May-2018 |
| Level: | National |
| Topic: | Judiciary and Judgement |

దేశంలో సంచలనం రేపిన జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్, మరో 8 మందికి ముంబయిలోని మోకా న్యాయస్థానం జీవితఖైదు, రూ.26 లక్షల వంతున జరిమానా విధించింది. మొత్తం 9 మందిని దోషులుగా తేలుస్తూ న్యాయమూర్తి సమీర్‌అడ్కర్ 2018 మే 2న తీర్పును వెలువరించారు.
- రాజన్‌ను హత్యకు పురిగొల్పినట్లు ఆరోపణలెదుర్కొన్న మాజీ జర్నలిస్టు జిగ్నావోరా, ఈ కుట్రకు ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు అభియోగాలున్న పాల్సన్ జోసెఫ్‌ను న్యాయస్థానం విడుదల చేసింది. తనను నిర్దోషిగా ప్రకటించగానే వోరా న్యాయస్థానంలోనే తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
- అథోజగత్తు నేత ఛోటా రాజన్‌ను 2015లో ఇండొనేసియాలో అరెస్టు చేసిన తర్వాత అతనికి పడిన తొలి పెద్దశిక్ష ఇదే. 2017లో నకిలీ పాస్‌పోర్టు కేసులో డిల్లీ న్యాయస్థానం అతనికి ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. తీహార్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఛోటా రాజన్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ ప్రక్రియలో పాల్గొన్నాడు. జడ్జి తనను దోషిగా ప్రకటించగానే రాజన్ ‘ఠీక్ హై’ అని పేర్కొన్నాడు.
- ‘మిడ్ డే’ పత్రికలో నేర పరిశోధక విభాగం ఎడిటర్‌గా పనిచేస్తున్న జ్యోతిర్మయ్ డే (56) 2011 జూన్ 11న తన ఇంటికి వెళుతుండగా ముంబయి ఉపనగర్ పొవాయ్ ప్రాంతంలో రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఇదంతా సీసీ టీవీ కెమేరాల్లో నమోదైంది. తీవ్రంగా గాయపడిన డే ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అనంతరం మృతి చెందారు.
- హత్యోదంతం మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడంతో నిందితులంతా వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పోలీసులు వారిని పట్టుకున్నారు.
- ముంబయికి చెందిన 20మంది గ్యాంగ్‌స్టర్ల జీవితాలపై పుస్తకం రాయాలని డే అప్పట్లో నిర్ణయించారు. అలాగే ఛోటా రాజన్ ఆరోగ్యం, అథోజగత్తులో అతని ప్రాబల్యం క్షీణిస్తున్నాయంటూ డే కథనాలు రాస్తుండేవారు.
- దీంతో ఛోటా రాజనే అతని హత్యకు కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇందుకుగాను రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొదట చార్జిషీట్ దాఖలు చేసిన నేర పరిశోధక విభాగం పోలీసులు తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారు.
- మొత్తం 13మంది నిందితులకు గాను ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఛోటా రాజన్‌తో పాటు కాల్పులు జరిపిన సతీష్ కలియా, వోరా సహా మొత్తం 12మందిని అప్పట్లో అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన వినోద్ అస్రానీ విచారణ సమయంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు.
- ------------------------------------------------------------------------------------------డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ
Event-Date: 03-May-2018 Level: Local Topic: Sports and Games బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ గుంటూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2018 మే 2న గుంటూరు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ కోన శశిధర్‌కు శ్రీకాంత్ రిపోర్టు చేశాడు.
- భారత మహిళల హాకీ కెప్టెన్‌గా సునీత
Event-Date: 03-May-2018 Level: National Topic: Sports and Games కొరియాలో 2018 మే 13న ప్రారంభమయ్యే ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు సునీత లక్రా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఆమె స్థానంలో సునీత బాధ్యతలు చేపట్టనుంది. కొత్త కోచ్ షోర్డ్ మారిన్ ఆధ్వర్యంలో ఆడుతున్న తొలి టోర్నీ ఇదే.
- మలేసియా మ్యాచ్ ఫిక్సర్‌లపై BWF 20 ఏళ్ల నిషేధం
Event-Date: 03-May-2018 Level: International Topic: Sports and Games బ్యాడ్మింటన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఇద్దరు మలేసియా క్రీడాకారులకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) భారీ శిక్షలు ఖరారు చేసింది. మళ్లీ ఆడే అవకాశం లేకుండా 25 ఏళ్ల జుల్ఫాడ్లి జుల్కిఫ్లిపై 20 ఏళ్లు, 31 ఏళ్ల టాన్ చున్ సియాంగ్‌పై 15 ఏళ్ల్ల నిషేధం విధించింది.
- చాలా కాలం వారిద్దరు అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని, 2013లో చాలా టోర్నీల్లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ నిబంధననలు ఉల్లంఘించినట్లు BWF తేల్చింది.
- టాన్ చున్ 2010లో థామస్ కప్ ఆడిన మలేసియా జట్టులో సభ్యుడు. జుల్ఫాడ్లి 2011లో విక్టర్ అక్సెల్సెన్ ఓడిరచి ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు.
- సాత్విక్‌కు రూ.40 లక్షల నజరానా
Event-Date: 03-May-2018 Level: Local Topic: Sports and Games కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం గెలిచిన తెలుగుతేజం ఆర్.సాత్విక్ సాయిరాజ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.40 లక్షల బహుమతి అందిస్తామని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సాత్విక్ 2018 మే 2న సచివాలయంలో సీఎంను కలిసి కామన్వెల్త్ క్రీడల్లో తాను సాధించిన పతకాలను చూపించాడు. ఈ సందర్భంగా అతణ్ని అభినందించిన చంద్రబాబు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు.
- అమెరికాలో 2.1 లక్షల మంది భారతీయ విద్యార్థులు
Event-Date: 03-May-2018 Level: International Topic: Foreign relations
అమెరికా విశ్వవిద్యాలయాల్లో 2.1 లక్షల మందికి పైగా భారతీయులు చదువుకుంటున్నట్లు వెల్లడైంది. అమెరికాలో చైనీయుల తర్వాత భారత విద్యార్థుల సంఖ్యే అధికమని తేలింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్స్ హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌కు చెందిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్(సెవిస్) ఈ వివరాలు వెల్లడించింది.
- అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో 3,77,070 మంది చైనా విద్యార్థులు, 2,11,703 మంది భారతీయ విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
- అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 49 శాతం మంది భారత్, చైనాకు చెందినవారే ఉన్నారు.
- చైనా, భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా సగటున 1-2 శాతం చొప్పున పెరుగుతోంది.
- సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, యెమెన్ నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల తగ్గుముఖం పట్టింది.
- పాకిస్థాన్, మయన్మార్, కాంబోడియా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
- అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 77 శాతం మంది ఆసియావాసులే ఉన్నారు.
- వేడుకల్లో ప్లాస్టిక్ ముక్కలను వెదజల్లే పరికరాలపై నిషేధం: CPCB
Event-Date: 03-May-2018 Level: National Topic: Govt Schemes and Programmes పుట్టినరోజు వంటి వేడుకల్లో రంగురంగుల పేపర్లు, ప్లాస్టిక్ ముక్కలను వెదజల్లేందుకు ఉపయోగించే స్వల్పస్థాయి విస్ఫోటక పరికరాలైన పార్టీ పాపర్లపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) నిషేధం విధించింది. వాటి వినియోగంతో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ పరికరాల్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ ముక్కల్లో ఎర్రటి భాస్వరం, పొటాషియం క్లోరేట్, పొటాషియం పర్‌క్లోరేట్ వంటి హానికర రసాయనాలను తాము గుర్తించామని తెలిపింది. అవి ఆరోగ్యానికి హానికరమని తేల్చిచెప్పింది.
CPCB-Central Pollution Control Board - గిరిజన యువతకు వాణిజ్య వాహనాలు
Event-Date: 03-May-2018 Level: Local Topic: Govt Schemes and Programmes
నిరుద్యోగులైన గిరిజన యువత స్వయం ఉపాధి కోసం ట్రైకార్ ఆధ్వర్యంలో తేలికపాటి, చిన్న తరహా వాణిజ్య వాహనాలు అందజేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. వాహనాల ఎంపిక, ధరల నిర్ణయం, మైలేజీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.కమిటీ ఛైర్మన్‌గా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్, సభ్యులుగా ట్రైకార్ డీజీఎం, గిరిజన సంక్షేమ జేడీ, రవాణా అదనపు కమిషనర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ ఉంటారు.
- అలంకరణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు 3వ స్థానం
Event-Date: 03-May-2018 Level: Local Topic: Places in News
స్వచ్ఛ రైల్వే స్టేషన్లలో దేశంలో 2వ స్థానంలో నిలిచిన సికింద్రాబాద్ స్టేషన్ మరో అవార్డును సొంతం చేసుకుంది. అలంకరణ విభాగంలో భారతీయ రైల్వేలో 3వ స్థానం దక్కించుకుంది.
- 11 జోన్ల నుంచి 62 రైల్వే స్టేషన్లు పోటీ పడగా మొదటి స్థానంలో బలార్షా, చంద్రాపూర్ స్టేషన్లు నిలిచాయి. 2వ స్థానంలో మధుబని, మధురై, 3వ స్థానంలో సికింద్రాబాద్‌తో పాటు గాంధీదాం, కోట స్టేషన్లు నిలిచాయి.
- వరంగల్ దగ్గరలోని చేర్యాల కళాకారులు పెయింటింగ్స్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చెందిన రెండు ప్రధాన ప్రవేశ మార్గాల దగ్గర గోడకు అతికించి అలంకరించారు. ఇందులో బతుకమ్మ, తెలుగింటి సంప్రదాయ వివాహ ఉత్సవం, గంగిరెద్దుల ప్రదర్శన, మట్టి కుండల తయారీ, వాటిని అమ్మకానికి తరలించడం, వ్యవసాయ పనులకు సంబంధించి వేసిన చిత్రాలను ఆకర్షణీయంగా అలంకరించారు.
- స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, జీవనశైలిని ప్రతిబింబించేవిగా ఉండే చిత్రలేఖనాలతో రైల్వే స్టేషన్లను అందంగా తీర్చిదిద్దాలని రైల్వే మంత్రిత్వశాఖ పోటీ నిర్వహించింది.
- కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
Event-Date: 03-May-2018 Level: National Topic: Govt Schemes and Programmes ప్రధాని నరేంద్రమోడి నేతృత్వాన 2018 ఏప్రిల్ 3న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
- ప్రధానమంత్రి వయ వందనా యోజన (PMVVY)లో పెట్టుబడుల పరిమితిని రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. ఈ పథకం కింద డిపాజిట్ చేసుకునేందుకు 2018 మే 3తో గడువు ముగుస్తోంది. దీంతో ఈ కాలపరిమితిని మరో 2 సం॥ల పాటు (2018 మే 4 నుంచి 2020 మార్చి 31 వరకు) పొడిగించింది. దీంతో వృద్ధులు నెలకు రూ.10 వేల వరకు పింఛను పొందేందుకు వీలు కల్పించింది. ఎల్‌ఐసీ ద్వారా అమలవుతున్న PMVVYలో 2018 మార్చి వరకు మొత్తం 2.23 లక్షల మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. PMVVY-Pradhan Mantri Vaya Vandana Yojana
- టన్ను చెరకుకు రూ.55 చొప్పున చక్కెర కర్మాగారాలకు ఉత్పత్తి రాయితీ అందించాలని నిర్ణయం
- రూ.5,082 కోట్లతో చెన్నై, గౌహతి, లక్నో విమానాశ్రయాల విస్తరణకు ఆమోదం
- ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పునఃవ్యవస్థీకరణకు ఆమోదం
- సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత ర్యాంకును మెరుగుపరచాలని నిర్ణయం. ఇందులో భాగంగా వాణిజ్య కోర్టులు, న్యాయపీఠాలు, హైకోర్టుల్లోని వాణిజ్య పునర్విచారణ పీఠాల చట్ట సవరణ’పై అత్యవసరాదేశానికి ఆమోదం. కనీస వివాద విలువను రూ.కోటి నుంచి రూ.3 లక్షలకు తగ్గించింది. ప్రస్తుతమున్న 1,445 రోజుల పరిష్కార గడువును మరింత తగ్గించాలని నిర్ణయించింది.
- 11 రకాల వ్యవసాయ పథకాలను ఏకతాటిపైకి తెస్తూ 2017లో ప్రభుత్వం తీసుకొచ్చిన కృషోన్నతి యోజన 2020 మార్చి 31 వరకు పొడిగింపు
- పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం. పొగాకు నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించాలని నిర్ణయం
- పెట్రోలియం, భద్రతా సంస్థ (PESO)లో గ్రూప్-ఏ సర్వీసు కింద సాంకేతిక శ్రేణిని సృష్టించే ప్రతిపాదనకు ఆమోదం భారత పెట్రోలియం, విస్ఫోటక భద్రతా సేవల కింద ఈ కేడర్ ఏర్పాటు కానుంది.
- మైనారిటీ వర్గాలకు సామాజిక, ఆర్థిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం(MSDP) పేరును ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమంగా మార్చుతూ, పునః వ్యవస్థీకరించేందుకు అంగీకారం
- 12వ పంచవర్ష ప్రణాళికలో లక్షించిన ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన(PMSSY) 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగింపు
- నైరుతి డిల్లీలోని నజఫ్‌గఢ్‌లో రూ.95 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, సౌత్ ఆఫ్రికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఎకౌంటెంట్స్‌లు పరస్పర గుర్తింపు ఇచ్చుకునేందుకు ఆమోదం