Type Here to Get Search Results !

May-04

May-04

ఎస్సీ, ఎస్టీ తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ 
ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు 2018 మే 3న నిరాకరించింది. ఈ వర్గాల ప్రజల  హక్కుల పరిరక్షణకు తాము వందశాతం కట్టుబడి ఉన్నామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చామని ధర్మాసనం స్పష్టం చేసింది.
  • ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 కింద తక్షణ అరెస్టు నిబంధనలపై కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న తీర్పు వెలువరించింది. తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. తీర్పును ధర్మాసనం సమర్థించుకుంది. 

-------------------------------------------------------------------------------------------

శాప్‌ పాలకమండలి నియామకం
Event-Date:04-May-2018
Level:Local
Topic:Sports and Games
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(క్రీడల శాఖ) ఎల్వీ సుబ్రమణ్యం 2018 మే 3న జీఓ 34 జారీ చేశారు. ఛైర్మన్‌గా పి.అంకమ్మ చౌదరి, సభ్యుగా బి.శ్రీధర్‌ వర్మ, వై.వేణుగోపాలరాయుడు, పి.గిరిధర్‌రెడ్డి, నీలంశెట్టి లక్ష్మీ, ఇ.రజిని, పి.రవీంద్రనాథ్‌ను నియమించారు. శాప్‌ ఎండీ అనధికారిక(ఎక్స్‌ అఫిషియో) సభ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
SAAP-Sports Authority of Andhra Pradesh 

ఆస్ట్రేలియా జట్టు నూతన కోచ్‌ లాంగర్‌ 
Event-Date:04-May-2018
Level:International
Topic:Sports and Games
మాజీ టెస్టు ఓపెనర్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆసీస్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2018 మే 22న బాధ్యతలు స్వీకరించనున్న లాంగర్‌ 4 సం॥ల పాటు పదవిలో ఉంటాడు.
  • బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం నేపథ్యంలో డారెన్‌ లీమన్‌ తప్పుకోవడంతో ఆసీస్‌ కోచ్‌ పదవికి ఖాళీ ఏర్పడింది.
  • 47 ఏళ్ల లాంగర్‌ ఇంతకుముందు వెస్టర్న్‌ ఆస్ట్రేలియా, పెర్త్‌ స్కార్చర్స్‌ కోచ్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
  • ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45.27 సగటుతో 7696 పరుగులు చేశాడు.లాంగర్‌ 8 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు.

వేలంలో ట్రంప్‌ నగ్న విగ్రహానికి రూ.18 లక్షలు
Event-Date:04-May-2018
Level:International
Topic:Persons in News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పరిహసించేలా తీర్చిదిద్దిన వివాదాస్పద నగ్న విగ్రహం వేలంలో రూ.18 లక్షలకు అమ్ముడుపోయింది.
  • గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ తీరుకు నిరసనగా ‘ఇన్‌డిక్లైన్‌’ అనే కళాకారుల బృందం ఇలాంటి 5 విగ్రహాలను రూపొందించి వివిధ నగరాల్లో ఏర్పాటు చేసింది.
  • వీటిలో ధ్వంసం కాకుండా మిగిలిన చివరి విగ్రహాన్ని జులియన్స్‌ ఆక్షన్స్‌ సంస్థ తాజాగా వేలం వేసింది.
  • ‘దెయ్యాల కోసం గాలిస్తూ’ టీవీ కార్యక్రమాలను రూపొందించే జాక్‌ బేగన్స్‌ అనే వ్యక్తి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు.

చదువు, వ్యాపారం కోసం పింఛను సొమ్మును తీసుకోవచ్చు : PFDRA
జాతీయ పింఛను పథకం(NPS) ఖాతాదారులు  ఉన్నత చదువులు, వ్యాపారం నిమిత్తం తమ సొమ్మును పాక్షికంగా వెనక్కు తీసుకునే వీలు కల్పిస్తూ పింఛను నిధి, నియంత్రణ, అభివృద్ధి సంస్థ (PFDRA) నిర్ణయం తీసుకుంది.
  • ప్రైవేటు ఉద్యోగుల ఈక్విటీల్లో పెట్టుబడులను ప్రస్తుతమున్న 50% నుంచి 75% వరకూ పెంచుకునేందుకూ వీలు కల్పించింది.
  • 50 ఏళ్ల వయసు వచ్చేవరకూ ‘యాక్టివ్‌ ఛాయిస్‌’ కింద వీరు ఈ మేరకు మదుపు చేసుకోవచ్చు.
  • ఈ ఛాయిస్‌ను యాక్టివేట్‌ చేసుకున్నవారు- ఈక్విటీలు, ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లతో పాటు ప్రత్యామ్నాయ పెట్టుబడుల నిధి కింద మరో 5% నిధులను మదుపు చేసుకోవచ్చు.
  • మొత్తం కార్పొరేట్‌ బాండ్లలో ‘ఏ’ గ్రేడ్‌ బాండ్లు 10 శాతానికి మించకూడదని PFDRA నిర్ణయించింది. NPSతో పాటు అటల్‌ పింఛను యోజనను PFDRA పర్యవేక్షిస్తోంది.
NPS-National Pension Scheme
PFDRA-Pension Fund Regulatory and Development Authority 

ఉమాంగ్‌ యాప్‌లో పింఛను పాస్‌బుక్‌
పింఛనుదారులు ఇక నుంచి తమ పాస్‌బుక్‌ను ఉమాంగ్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చని EPFO 2018 మే 3న వెల్లడించింది. ఉమాంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులో ‘వ్యూ పాస్‌బుక్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పింఛను చెల్లింపు క్రమం, పుట్టిన తేదీని నమోదు చేయాలి. తర్వాత నమోదిత మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని టైప్‌ చేయగానే పాస్‌బుక్‌ తెరుచుకుంటుంది.
EPFO-Employees' Provident Fund Organisation 

కారుణ్య మరణం కొరకు స్విట్జర్లాండ్‌ వెళ్లిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త
Event-Date:04-May-2018
Level:International
Topic:Persons in News
ఆస్ట్రేలియాకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ డేవిడ్‌ గుడాల్‌ కారుణ్య మరణం కోసం 2018 మే 2న స్విట్జర్లాండ్‌ బయల్దేరారు. 104 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్య సమస్యలేమీ లేనప్పటికీ జీవితంపై ఆసక్తి కోల్పోయిన గుడాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.
  • ఆస్ట్రేలియాలో కారుణ్య మరణం చట్టవిరుద్ధం కాగా విదేశీయులకు అనుమతించే ఏకైక దేశం స్విట్జర్లాండ్‌.
  • లండన్‌లో జన్మించిన గుడాల్‌ పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నివాసం ఉండేవారు.
  • ఆయన ‘ఎకోసిస్టమ్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అనే 30 పుస్తకాల సంపుటిని ఎడిట్‌ చేశారు.
  • తన శాస్త్రీయ పరిశోధనలతో ప్రతిష్ఠాత్మక ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’లో సభ్యత్వం కూడా పొందారు.
  • పెర్త్‌లోని ఓ యూనివర్సిటీలో స్వచ్ఛందంగా పనిచేసే ఆయన తనను తొలగించడంతో 2016లో 102వ ఏట ఆ విశ్వవిద్యాలయంపై పోరాడి విజయం సాధించారు. 

స్థాయీ సంఘం పరిశీలనకు చిట్‌ఫండ్‌ సవరణ బిల్లు
లోక్‌సభలో ప్రవేశపెట్టిన చిట్‌ఫండ్‌ సవరణ బిల్లును ఆర్థిక రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపిస్తూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 31 మంది సభ్యులు ఉన్న ఈ స్థాయీ సంఘానికి కాంగ్రెస్‌ ఎంపీ ఎం.వీరప్ప మొయిలీ అధ్యక్షునిగా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా ఈ కమిటీలో సభ్యుడు.
  • చిట్‌ఫండ్‌ రంగానికి సంబంధించిన చట్టబద్ధ, నియంత్రణ, వ్యవస్థాగత నిబంధనలను సమీక్షించడం, ఆ రంగం క్రమబద్ధ అభివృద్ధి, సామర్థ్యం పెంపునకు సలహాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించింది.
  • ఆ బృందం సూచన మేరకు చిట్‌ ఫండ్‌ చట్టం-1982లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
  • రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా చిట్‌ఫండ్‌ను ఏర్పాటు చేయకూడదన్నది ఈ సవరణల్లో ప్రధాన అంశం.
  • చిట్‌ వేలం జరిగే సమయంలో ఇద్దరు చందాదారులు స్వయంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ తప్పనిసరిగా పాల్గొనేటట్టు చూడాలన్నది మరో సవరణ.
  • చిట్‌ వేలంను తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది.
  • చిట్‌ఫండ్‌ కంపెనీ యాజమాన్యం తరఫున వ్యవహరించే ఫోర్‌మన్‌ కమీషన్‌ను 5 నుంచి 7 శాతానికి పెంచాలని కూడా ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించారు.



రైళ్లలో చెరకు పళ్లాల్లో ఆహారం
ప్రయాణికులకు పర్యావరణహిత పళ్లాల్లో ఆహారం అందజేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇంతవరకు ప్లాస్టిక్‌ పళ్లాల్లో ఆహారం ఇస్తుండగా, ఇకపై చెరకు పిప్పితో తయారు చేసిన పళ్లాల్లో సరఫరా చేయనుంది. చక్కెర కర్మాగారాల్లో మిగిలిన పిప్పి (బగాసీ)తో పళ్లాలు తయారు చేయడం ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తోంది.
  • వీటిని ప్రయోగాత్మకంగా సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అమల్లోకి తెచ్చింది. అనంతరం ఇతర రైళ్లల్లో ఉపయోగించనుంది. ఒక్కో ప్లాస్టిక్‌ పళ్లెం ధర రూ.1-5 మధ్య ఉండగా, చెరకు పళ్లెం ధర రూ.4-8 మధ్య ఉంది.

‘నేతలు పోస్ట్‌ చేసిన ఫొటో’ల్లో 2017లో అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రంగా మోడి ఫొటో
Event-Date:04-May-2018
Level:National
Topic:Persons in News
ప్రధాని నరేంద్రమోడి 2017 ఏప్రిల్‌లో భువనేశ్వర్‌లోని లింగరాజ్‌ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో ‘నేతలు పోస్ట్‌ చేసిన ఫొటో’ల్లో 2017లో అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రంగా నిలిచింది. ఈ వివరాలను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెల్లడించింది. మోడి అక్కడ దిగిన ఫొటోతో పాటు ‘లింగరాజ్‌ ఆలయం, ప్రాంగణం వైభవం ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది’ అంటూ సోషల్‌ మీడియాలో మోడి పోస్ట్‌ చేశారు. 

కేంబ్రిడ్జ్‌ అనలిటికా కార్యకలాపాలు నిలిపివేత
డేటా లీక్‌ కుంభకోణంలో కేంద్ర బిందువుగా ఉన్న కేంబ్రిడ్జ్‌ అనలిటికా తన కార్యకలాపాలను నిలిపివేసింది. వ్యాపారంలో నష్టం వాటిల్లినందునే మూసేసినట్లు ప్రకటించింది.
  • ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న 8.7 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికా దుర్వినియోగం చేసిందని, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తనను విశ్లేషించడానికి ఈ డేటాను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.  
  • తమ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తున్నామని, దివాళా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కేంబ్రిడ్జ్‌ అనలిటికా తెలిపింది.
  • తమ ఉద్యోగులు నైతికంగా, చట్టబద్ధంగానే పని చేసినా మీడియా చేసిన ప్రతికూల కవరేజితో తమ వినియోగదారులు, సరఫరాదారులు దూరమయ్యారని తెలిపింది.
  • ఈ సంస్థ మూతబడినా డేటా ఉల్లంఘన కుంభకోణంపై తాము చేస్తున్న దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్రిటిష్‌ అధికారులు  వెల్లడించారు.

కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి
ఆదిలాబాద్‌ జిల్లా కుప్టి మండలం నేరడిగొండ గ్రామ సమీపంలో నిర్మించనున్న కుప్టి బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.794.33 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కడెం ప్రాజెక్టుకు అనుబంధంగా 5.30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జీవో సంఖ్య ఎంఎస్‌ 34ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి విడుదల చేశారు.
TMC-Thousand Million Cubic 

విలు విద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖకు రూ.76 లక్షలు
Event-Date:04-May-2018
Level:Local
Topic:Sports and Games
అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి, ఆసియా క్రీడల్లో పతకం సాధించిన అర్జున అవార్డు గ్రహీత వి.జ్యోతిసురేఖకు రూ.76.53 లక్షలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులనిచ్చింది. జ్యోతికి ముఖ్యమంత్రి రూ.కోటి బహుమతి ప్రకటించారు. ఇందులో రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం కొంత మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ జారీ చేసింది. 


ఉద్యోగుల సమస్యలపై ఈటల ఛైర్మన్‌గా కమిటీ 
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులతో ఓ కమిటీని నియమించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. పరిశ్రమలు, విద్యుత్‌ శాఖ మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డిలు సభ్యులుగా వ్యవహరిస్తారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం, నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం నేతలతో ఆర్థికమంత్రి ఈట రాజేందర్‌ చర్చలు జరుపుతారు.
  • తెలంగాణలో అయిదేళ్లుగా సాధారణ బదిలీలు జరగడం లేదు. పీఆర్‌సీ గడువు త్వరలో ముగియనుంది. దీంతోపాటు ఏపీలో 1000 మందికిపైగా తెలంగాణ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. భాగస్వామ్య పింఛను పథకం రద్దు చేయాలని ఉద్యోగు లు కోరుతున్నారు. వీటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రమోద్‌ కే నాయర్‌‌కు విజిటర్స్‌ అవార్డు 
Event-Date:04-May-2018
Level:National
Topic:Awards and honours
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ప్రమోద్‌ కే నాయర్‌ రాష్ట్రపతి ప్రదానం చేసే విజిటర్స్‌ అవార్డు అందుకున్నారు. 2018 మే 2న డిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సెంట్రల్‌ వర్సిటీ వీసీ సదస్సు సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరిశోధకులకు అవార్డును ప్రదానం చేశారు. మానవీయ, ఆర్ట్స్‌, సాంఘిక శాస్త్రంలో పరిశోధనకు గానూ ప్రమోద్‌నాయర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.  
ప్రపంచ వాయు కాలుష్య నగరాల్లో డిల్లీకి 3వ స్థానం
Event-Date:04-May-2018
Level:National
Topic:Places in News
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా డిల్లీ మరోసారి అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గాలిలో ప్రతీ 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున 292 మైక్రోగ్రాముల ధూళి అణువులతో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరాల్లో డిల్లీ 3వ స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 14 భారత్‌లోనే ఉన్నాయని నివేదికలో వెల్లడైంది.
  • గాలిలో ప్రతీ ఘనపు మీటరు(2.5 పీఎం)లో అత్యంత సూక్ష్మ ధూళి కణాలున్న పట్టణంగా కాన్పూర్‌ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది.
  • తర్వాతి స్థానంలో ఫరీదాబాద్‌, వారణాసి, గయ పట్టణాలున్నాయి. పట్నా, ఆగ్రా, ముజఫర్‌నగర్‌, శ్రీనగర్‌, గురుగ్రామ్‌, పాటియాలా, జోధ్‌పూర్‌లోనూ వాయుకాలుష్యం దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది.
  • ప్రపంచ జనాభాలో ప్రతీ 10 మందిలో 9 మంది కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారంది. దీని కారణంగా 2016లో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారు.
  • పంట వ్యర్థాలు కాల్చడం, వాహనాలు, పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం, ఇళ్లల్లో వాడే ఇంధన వ్యర్థాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
  • గాలిలో ప్రతీ ఘనపు మైక్రోమీటరులో 173 అత్యంత సూక్ష్మ ధూళి కణాలతో కాన్పూర్‌ ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరసగా ఫరీదాబాద్‌ (172), వారణాసి (151), గయ (149), పట్నా (144), డిల్లీ (143), లక్నో (138), ఆగ్రా (131), ముజఫర్‌పూర్‌ (120), శ్రీనగర్‌ (113) ఉన్నాయి. 
ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అనుచరులున్న ప్రపంచ నాయకుడిగా నరేంద్రమోడి
Event-Date:04-May-2018
Level:International
Topic:Persons in News
ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అనుసరించే ప్రపంచ నాయకుడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి రికార్డు సృష్టించారు. మోడిని ఫేస్ బుక్లో 4.32 కోట్ల మంది అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2.31 కోట్ల మంది అనుచరులతో ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. ‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నాయకులు’ పేరిట బర్సన్‌ కోన్‌ అండ్‌ వోల్ఫ్‌ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. 650 మంది దేశాధిపతులు, ప్రభుత్వాధినేతలు, విదేశాంగ మంత్రులకు చెందిన ఫేస్‌బుక్‌ పేజీలను సంస్థ విశ్లేషించింది. 2017 జనవరి 1 నుంచి సమాచారాన్ని పరిశీలించింది. 
  • గత 14 నెలల్లో ట్రంప్‌ ఫేస్‌బుక్‌ పేజీపై ఎక్కువ సంభాషణలు నమోదయ్యాయి. ఆయన పేజీలో వ్యాఖ్యలు, లైక్‌లు, షేర్‌ల మొత్తం సంఖ్య 20.49 కోట్లుగా ఉంది. మోడి పేజీపై నమోదైన సంభాషణ(11.36 కోట్లు) కంటే రెట్టింపుగా ఉంది.
  • ఇండోనేసియా అధ్యక్షుడు జాకో విడోడో, కాంబోడియా ప్రధాని శాండెక్‌ హున్‌ సేన్‌, అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మక్రి పేజీల్లోనూ వరుసగా 4.6, 3.6, 3.34 కోట్ల సంభాషణలు నమోదయ్యాయి.
  • ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో 91 శాతం (175) దేశాలకు అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలున్నాయి. దీనికి అదనంగా 109 మంది దేశాధిపతులు, 86 మంది ప్రభుత్వాధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులకు వ్యక్తిగత ఫేస్‌బుక్‌ పేజీలున్నాయి.
  • 2018, మార్చి 15 నాటికి ప్రపంచ నాయకులందరి ఫేస్‌బుక్‌ పేజీల్లో అనుచరుల మొత్తం సంఖ్య 30.9 కోట్లుగా ఉంది. 2017, జనవరి 1 నుంచి మొత్తంగా వీరు 5,36,644 పోస్ట్‌లు చేశారు. వీటిపై 90 కోట్ల సంభాషణలు నమోదయ్యాయి.
  • 2017లో ఎక్కువ మంది లైక్‌చేసిన ఫోటోల్లో ఐదింటినీ మోడినే షేర్‌ చేశారు. ఒడిశాలోని ప్రఖ్యాత లింగరాజ్‌ దేవాలయ సందర్శన సమయంలో మోడి తీసుకున్న ఫోటో ఎక్కువ మంది మెచ్చిన ఫోటోగా రికార్డు సృష్టించింది. 
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నియామక బోర్డు ఏర్పాటు 
గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నియామక బోర్డును (టెరీ-ఆర్‌బీ) ఏర్పాటు చేసింది.
  • గురుకులాల్లో కొత్తగా మంజూరయ్యే పోస్టులు, వాటికి సంబంధించిన నియామక ప్రకటనలు బోర్డు నుంచి వెలువడుతాయి.
  • గురుకుల పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీ క్రమపద్ధతిలోకి తీసుకువచ్చినందున ఇక నియామక బాధ్యతలను సంబంధిత సొసైటీతో ఏర్పాటయ్యే ప్రత్యేక బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
  • గురుకుల సొసైటీల్లో అత్యంత సీనియర్‌ కార్యదర్శి బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహిస్తారని పేర్కొంది.
  • బోర్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీ కార్యదర్శులు, పాఠశా విద్యాశాఖ, NCERT ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.