Type Here to Get Search Results !

May-05

May-05 Current affairs articles

సాహితీ నోబెల్‌ వాయిదా
2018 సంవత్సరానికి గాను సాహితీ రంగంలో నోబెల్‌ బహుమతి పురస్కారం వాయిదా పడింది. 1949 తర్వాత సాహిత్యంలో నోబెల్‌ వాయిదాపడటం ఇదే ప్రథమం. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే స్వీడిష్‌ కమిటీ సభ్యురాలి భర్తపై లైంగిక వేధింపు ఆరోపణలు రావటం ఈ పరిణామానికి దారి తీసింది.
  • స్వీడన్‌ సాహితీ రంగంలో పలుకుబడి ఉన్న జీన్‌ క్లౌడ్‌ ఆర్నాల్ట్‌ తమపై లైంగిక వేధింపులు, అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ 18 మంది మహిళలు 2017 నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన ‘మీ టూ ప్రచారోద్యమం’లో ఆరోపణలు చేశారు.
  • కవయిత్రి, నోబెల్‌ సాహితీ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలు అయిన క్యాథరినా ఫ్రోస్టెన్సన్‌ భర్తే ఆర్నాల్ట్‌.
  • విజేత పేర్లను ముందే చెప్పేస్తున్నారని కొందరు కమిటీ సభ్యులపై ఆరోపణలొచ్చాయి.
  • అలజడి రేపిన ఈ పరిణామాలు ఎంపిక కమిటీలో విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో కమిటీ శాశ్వత కార్యదర్శి డేరియస్‌తోపాటు ఆరుగురు సభ్యులు రాజీనామా చేశారు. 
  • ఆహారధాన్యాలకు అదనపు బలవర్ధకాల జోడింపునకు 3 జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టు 
    ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తున్న ఆహార ధాన్యాలకు అదనపు బలవర్ధకాలను జోడించడంలో భాగంగా 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టేలా టాటా ట్రస్టుతో అవగాహన ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు అనుమతించింది. మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగించే బియ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యానికి ఈ ప్రాజెక్టును వర్తింపజేయనున్నారు.  
  • ఆంధ్రప్రదేశ్‌లో 108 ఉద్యోగుల వేతనాలు పెంపు
    ఆంధ్రప్రదేశ్‌లో 108 ఉద్యోగుల వేతనాలు రూ.4000 వంతున పెరిగాయి. ప్రస్తుతం 108 అంబులెన్సు డ్రైవర్లకు రూ.11500, అత్యవసర వైద్య సాంకేతిక ఉద్యోగులకు రూ12000 వంతున వేతనాలు ఇస్తున్నారు. గత కొంతకాలం నుంచి వేతనాలు పెంచాలని వీరు కోరుతున్నారు. ఇటీవల వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రూ.4000 వంతున వేతనాలను పెంచుతూ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య 2018 మే 4న ఉత్తర్వులు జారీచేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 108 సర్వీసుకు కేటాయించిన బడ్జెట్‌ నుంచి ఈ అదనపు చెల్లింపు జరగనున్నాయి. 
  • సహలాపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Persons in News

    ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2018 మే 4న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. 5 మండలాల్లో వివిధ అంశాలను తెలుసుకున్నారు. ఆముదాలవలస చక్కెర కర్మాగారం రైతులతో సమావేశమయ్యారు. మూత పడిన ఈ కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రైతులు  చేపట్టిన లక్ష సంతకాల సేకరణ ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించారు. కవిటి మండంలోని సహలాపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 
  • NTPC రీజినల్‌ ఈడీగా దిలీప్‌ కుమార్‌
    Event-Date:05-May-2018
    Level:National
    Topic:Persons in News

    NTPC దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ దూబే బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి ఆయన NTPC రామగుండం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 1981లో ఎన్టీపీసీలో మెకానికల్‌ ఇంజనీర్‌గా చేరిన దూబే ఎన్నో కీలక బాధ్యతలను నిర్వహించారు. NTPC అడ్వాన్స్‌డ్‌ సూపర్‌ క్రికిటల్‌ యూనిట్లలో ఆయన పాత్ర కూడా ఉంది. 
    • NTPC ఛైర్మన్‌ - గురుదీప్‌సింగ్‌
    NTPC-National Thermal Power Corporation 

  • అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  చైర్‌ పర్సన్‌గా క్రిష్‌ ఐయ్యర్‌ 

    Event-Date:05-May-2018
    Level:International
    Topic:Persons in News

    అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కొత్త చైర్‌పర్సన్‌గా వాలీమార్ట్‌ ఇండియా సీఈఓ క్రిష్‌ ఐయ్యర్‌ నియమితులయ్యారు. బోయింగ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రత్యూష్‌ కుమార్‌ స్థానంలో క్రిష్‌ ఎంపికయ్యారు. గౌరవ ప్రెసిడెంట్‌గా యూఎస్‌ అంబాసిడర్‌ టు ఇండియా కెన్నెత్‌ జెస్టర్‌, వైస్‌ చైర్మన్లుగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ప్రెసిడెంట్‌ కంట్రీ హెడ్‌ (ఇండియా) కాకు నఖాటే, కేపీఎంజీ ఇండియా చైర్మన్‌ అండ్‌ సీఈఓ అరుణ్‌ కుమార్‌, సెక్రటరీ అండ్‌ ట్రెజరీగా అతుల్‌ ధావన్‌ ఎంపికయ్యారు.  
  • హైసియా ప్రెసిడెంట్‌గా మురళి బొళ్లు 
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Persons in News

    హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారు సంఘం (హైసియా) 2018-20 కాలానికి గాను నూతన ప్రెసిడెంట్‌గా జెనీక్యూ ఫౌండర్‌ మురళి బొళ్లు ఎన్నికయ్యారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇన్ఫోపీర్స్‌ సొల్యూషన్స్‌ సీఈవో భరణి కె అరోల్‌, సెక్రటరీగా వాల్యూ  మొమెంటమ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఆసియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ రవి ఎస్‌ రావు, ట్రెజరరర్‌గా టెక్‌ మహీంద్రా సెంటర్‌ హెడ్‌ విజయ్‌ రంగినేని, జాయింట్‌ సెక్రటరీగా సీఐ సపోర్ట్‌ సర్వీసెస్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పద్మజ చౌదరి ఎంపికయ్యారు. 
  • 3 ఆస్పత్రులకు డయాలసిస్‌ యూనిట్లు 

    తెలంగాణ రాష్ట్రంలోని మూడు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ 2018 మే 4న ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రి, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ ఏరియా ఆస్పత్రి, హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట బార్కాస్‌ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
  • టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా రాఘవేంద్రరావు
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Persons in News

    శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌ చైర్మన్‌, సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావుకు టీటీడీ ట్రస్ట్‌ బోర్డులో స్థానం దక్కింది. నూతన ధర్మకర్త మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయనను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాఘవేంద్రరావు 2 సం॥ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు.చెన్నైలో ఉన్న టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఎన్‌.కృష్ణకు కూడా ప్రత్యేక ఆహ్వానితులగా గౌరవం దక్కింది. 
  • ఉభయ కొరియాల్లో ఒక్కటే టైం
    ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని 30 నిమిషాలు ముందుకు జరిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య 2018 మే 4 నుంచి ఒకే టైం అమల్లోకి వచ్చినట్లయింది. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల తరువాత సమయంలో మార్పు చేయడం కీలక ముందడుగు అని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది.ఉభయ కొరియా సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ వాటిని ఒకటి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులకు ఉత్తర కొరియా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఉత్తర కొరియా నిర్ణయాన్ని దక్షిణ కొరియా స్వాగతించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది.
  • వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు
    Event-Date:05-May-2018
    Level:National
    Topic:Sports and Games

    గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌ను భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య జాతీయ క్యాంప్‌ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడల కోసం పాటియాలాలో ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న పూనమ్‌ అక్కడి అధికారుల అనుమతి లేకుండా క్యాంప్‌ నుంచి పలుమార్లు బయటకు వెళ్లింది. దీంతో భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య  ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.ఆమె తిరిగి క్యాంప్‌లో చేరాలంటే నాడా ఆధ్వర్యంలో డోపింగ్‌ టెస్ట్‌ పాసవ్వాల్సి ఉంటుంది.  
  • మానవ చరిత్రలో తొలిసారి 410 PPMను దాటిన కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాల స్థాయి 

    భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. మానవ చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దీని ఉద్గారాలు పేరుకుపోయాయి. తొలిసారిగా ఒక నెల మొత్తం గాలిలో కార్బన్‌ డైఆక్సైడ్‌ సరాసరి పరిమాణం 410 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (PPM) స్థాయిని దాటింది. హవాయ్‌లోని మౌనా లోవా అబ్జర్వేటరీ అందించిన డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. 2017లోనూ కొంతకాలం పాటు ఈ వాయు పరిమాణం 410 PPMను దాటింది. అయితే అది నెల మొత్తం సాగలేదు. 2018 ఏప్రిల్‌ నెలకు సంబంధించిన డేటాను తాజాగా విడుదల చేశారు. నెల మొత్తం సరాసరిన 410.31 PPM మేర కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి ఉన్నట్లు స్పష్టమైంది.
    • ఈ వాయువుల స్థాయిని లెక్కలు తీయడం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇది 30 శాతం పెరుగుదల. 1958లో కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి 315 మేర ఉంది. పారిశ్రామిక విప్లవం ఆరంభ సమయంలో 280 PPM మాత్రమే ఉంది. 2013లో తొలిసారిగా 400 PPM స్థాయిని దాటింది. 
    • దానికన్నా ముందు గత 8లక్ష సంవత్సరాల్లో వాతావరణంలో కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి ఎన్నడూ 300 PPM దాటలేదు. 
    • చరిత్రలో 410 కన్నా ఎక్కువగా కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి ఉన్నప్పుడు ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని, సముద్ర మట్టాలు ప్రస్తుతం కన్నా 66 అడుగుల మేర ఎక్కువగా ఉండేవని సముద్ర అవక్షేపం తదితరాల నుంచి సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది. 
    • ప్రస్తుత పోకడ ఇదేరీతిలో కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి వాతావరణంలో కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి 450 నుంచి 500 PPM స్థాయికి చేరుకుంటుంది. దీనివల్ల  వినాశకర పరిణామాలు తప్పవు. మంచు ఫలకాలు వేగంగా కరిగి, సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతాయి. మనం సమర్థంగా సర్దుబాటు చేసుకోగలిగే స్థాయి కన్నా వేగంగా ఈ పెరుగుదల ఉంటుంది. 
    • దీర్ఘకాల భూతాపం మొత్తం మానవ చర్యల కారణంగానే జరుగుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
    • ప్రధానంగా దహనచర్య (కంబషన్‌) కారణంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ వెలువడుతోంది. మనం వినియోగించే శక్తిలో ఎక్కువ భాగం ఈ రసాయన చర్య ద్వారానే ఉత్పత్తవుతోంది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి భారీ స్థాయిలో మానవులు భారీగా దహనచర్యను సాగిస్తున్నారు. ఈ అదనపు కార్బన్‌ డైఆక్సైడ్‌ గాల్లోనే పేరుకుపోయింది.
    • పరమాణు నిర్మాణం కారణంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ గ్రీన్‌హౌస్‌ వాయువుగా ఉంది. భూమి నుంచి అంతరిక్షంలోకి తరలిపోయే వేడిని ఇది పట్టి ఉంచుతుంది.


  • లలిత్‌బాబుకు జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Sports and Games
    జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ లలిత్‌బాబు (ఆంధ్రప్రదేశ్‌) విజేతగా నిలిచాడు. 2018 మే 4న అహ్మదాబాద్‌లో ముగిసిన ఈ టోర్నీలో 11 రౌండ్లకు గాను 9.5 పాయింట్లతో లలిత్‌బాబు అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ మాస్టర్‌ హర్ష భరతకోటి (తెలంగాణ) 8.5 పాయింట్లతో 4వ స్థానం సాధించాడు. 11వ రౌండ్లో స్వప్నిల్‌పై లలిత్‌బాబు, ఈషా కర్వాడెపై హర్ష గెలిచారు. 
  • న్యూయార్క్‌ కోర్టు న్యాయమూర్తిగా భారతీయురాలు
    అమెరికాలో నివసిస్తున్న దీపా అంబేకర్‌(41) అనే భారతీయ మహిళ న్యూయార్క్‌ సిటీ సివిల్‌ న్యాయస్థానం తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భవిష్యత్తులో క్రిమినల్‌ న్యాయస్థానంలో కూడా సేవలందించనున్నారని న్యూయార్క్‌ సిటీ మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో తెలిపారు. మిచిగన్‌ విశ్వవిద్యాలయంలో పట్టభద్రురాలైన దీప, రట్జెర్స్‌ న్యాయపాఠశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు.
    • 2015లో చెన్నైకు చెందిన రాజేశ్వరి అనే భారతీయురాలు క్రిమినల్‌ న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తిగా నియమితులైన రెండో  భారతీయురాలు దీప.

  • పాస్‌వర్డ్‌లు మార్చుకోండి: ట్విటర్‌ 
    ముందు జాగ్రత్త చర్యగా పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ వినియోగదారులకు సూచించింది. పాస్‌వర్డ్‌ రక్షణ విషయంలో తమ వ్యవస్థలో ఓ లోపం జరిగినట్లు తామే గుర్తించామని, దాన్ని సవరించామని పేర్కొంది. అయితే దీని కారణంగా ఏ నష్టమూ జరగలేదని, ఎవరి సమాచారమూ దుర్వినియోగం కాలేదని వివరించింది. వినియోగదారులు పాస్‌వర్డ్‌ను తమ సంస్థలో ఎవరూ చూసేందుకు మీలేకుండా ‘హాషింగ్‌’ ప్రక్రియ ద్వారా వాటిని వేరే రూపంలోకి మార్చుతామని ట్విటర్‌ ముఖ్య సాంకేతిక అధికారి పరాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే ఓ లోపం కారణంగా అంతర్గత లాగ్‌ ఫైల్‌లో పాస్‌వర్డ్‌లు యథాతథంగా నిక్షిప్తం అవుతున్నట్లు గుర్తించామని చెప్పారు. 
  • తెలంగాణలో 3 జాతీయ వనరుల కేంద్రాలు
    ఉన్నత విద్య ఉపాధ్యాయులకు తాజా సిలబస్‌ను అనుసరించి విద్యార్థులకు నూతన మెళకువలు నేర్పించడం, బోధన పద్ధతులపై శిక్షణకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జాతీయ వనరు కేంద్రాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా 75 కేంద్రాలను గుర్తించగా దీంట్లో తెలంగాణలోని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ ఎన్‌ఐటీ, ఐఐటీ(హైదరాబాద్‌)ను ఎంపిక చేసింది. 
  • సీఎం సహాయ నిధికి హడ్కో నగదు పురస్కారం 
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Awards and honours
    రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీల్లో చేపట్టిన 12.50 లక్షల ఆస్తుల మ్యాపింగ్‌ ప్రాజెక్టుకుగాను తెలంగాణ పురపాలకశాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవికి హడ్కో అవార్డు కింద లభించిన రూ.లక్ష నగదు పురస్కారాన్ని ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు 2018 మే 4న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో చెక్కును అందజేశారు.
    • పట్టణాల్లోని 12.5 లక్షల ఆస్తులను జియోమ్యాపింగ్‌ చేయడంతో పాటు ఆస్తికి సంబంధించి రెండు ఫొటోలు అందుబాటులో పెడతారు.
    • ఈ ఆస్తిని భువన్‌ ద్వారా శాటిలైట్‌ సహాయంతో చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా పురపాలకశాఖ ఆస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తీసుకువచ్చారు.
    • ఒక్కరూపాయి పన్ను పెంచకుండా రూ.43 కోట్ల అదనపు ఆదాయం ఆస్తిపన్ను ద్వారా సమకూరింది.


  • హెచ్‌సీయూ ప్రొఫెసర్‌లకు మేధోసంపత్తి హక్కులు 
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Persons in News
    తాగునీటిని శుద్ధి చేసేందుకు నానో పరిజ్ఞానంతో కూడిన పాలిమర్‌ తెరను తయారు చేసిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు అపర్ణ డి.గుప్తా, టి.పి.రాధాకృష్ణన్‌కు భారత మేధోహక్కు సంస్థ పేటెంట్‌ హక్కును ఇచ్చింది.
    • నానో పరిజ్ఞానంతో నీటిశుద్ధిపై ప్రయోగాలు చేస్తున్న ఈ ఇద్దరు పరిశోధించి సూక్ష్మక్రిములకు అడ్డుగా నిలిచే ఒక తెరను తయారు చేశారు.
    • ఈ తెర ద్వారా మరింత నాణ్యమైన రక్షిత నీటిని అందించవచ్చని తెలుసుకున్నాక పేటెంట్‌ హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.


  • తెలంగాణ బాలల న్యాయ నిధి ఏర్పాటు
    బాలల సంక్షేమం, పునరావాసానికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బాలల న్యాయ నిధి ఏర్పాటు చేసింది. బాలల న్యాయచట్టం-2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ. కోటితో ప్రభుత్వం నిధిని సమకూర్చింది. దీనికి ప్రజల నుంచి విరాళాలు, కార్పొరేట్‌ సంస్థల నుంచి సామాజిక బాధ్యత నిధులు సేకరిస్తారు.
    • బాలల న్యాయ నిధి కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా మహిళాశిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా బాల నేరస్థుల సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్లు ఉంటారు.
    నిధుల వినియోగం
    • బాలల సంరక్షణ గృహాల్లోని చిన్నారులకు ఆహ్లాద, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
    • బాలలకు కావాల్సిన న్యాయ సహాయం, వృత్తివిద్య, నైపుణ్య శిక్షణ, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహకారం అందిస్తారు. 
    • 18 ఏళ్లు నిండిన తరువాత సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వెళ్తున్నపుడు ఏకమొత్తంగా కొంత సహాయం చేస్తారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీలుగా చిన్నచిన్న వ్యాపారాలకు పెట్టుబడి సహాయం అందుతుంది. 
    • ప్రత్యేక పరిస్థితుల్లో తీవ్రవాద, ఇతర గ్రూపుల నుంచి సంరక్షించిన వారి పునరావాసం కోసం కొంత వెచ్చిస్తారు. 
    • బాలల స్నేహపూర్వక కోర్టు, పోలీస్‌స్టేషన్లు, బోర్డు, కమిటీలను ఏర్పాటు చేస్తారు. 
    • నేరాల విచారణకు హాజరయ్యే సమయంలో రవాణా భత్యం, పోలీసు సిబ్బంది సౌకర్యాలకు నిధులు ఇస్తారు. 
    • తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల అవసరాలు గుర్తించేలా శిక్షణ ఇవ్వడం, బాలల హక్కులు, నేరాల నిరోధానికి చర్యలపై అవగాహన కల్పిస్తారు. 
    • చిన్నారులపై జరిగే వేధింపులను గుర్తించేందుకు సామాజిక అవగాహన కార్యక్రమాలతో పాటు వారిని ఆదుకునేందుకు నిపుణుల సేవలు వినియోగిస్తారు.


  • పాకిస్థానీ ఆషికీ అలీకి జీవితఖైదు సబబే : ఉమ్మడి హైకోర్టు
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Judiciary and Judgement
    పర్యాటకుడి ముసుగులో భారతదేశం వచ్చి రక్షణశాఖకు సంబంధించిన వివరాల్ని పాకిస్థాన్‌లో ఉన్న వారికి చేరవేయడాన్ని తప్పుపడుతూ పాకిస్థానీ దేశస్తుడు ఆషికీ అలీకి జీవిత ఖైదు విధిస్తూ విచారణ కోర్టు ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. అధికార రహస్యాల చట్టం కింద అలీని నిర్దోషిగా ప్రకటించడాన్ని తప్పుపట్టింది. జాతి రక్షణకు సంబంధించిన సమాచారాన్ని దొంగచాటుగా సేకరించడం.. దానిని పాకిస్థాన్‌ దేశీయుకు చేరవేయడం దేశంపై యుద్దం ప్రకటించడమేనని స్పష్టం చేసింది. ఆషికీ అలీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కైత్‌, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.  
    • డిల్లీ, కాన్పూర్‌ పట్టణాల పర్యాటకుడిగా ఆషికీ అలీ 2001లో భారతదేశం వచ్చాడు.
    • డిల్లీ  వచ్చాక పాస్‌పోర్టును నాశనం చేశాడు. ఆ తర్వాత పాస్‌పోర్టు, వీసా నిబంధనలను ఉల్లంఘించి దేశంలోని పలుప్రాంతాలకు వెళ్లాడు.
    • హైదరాబాద్‌ వచ్చి సికింద్రాబాద్‌ ఆర్మీ కంటోన్మెట్‌ ప్రాంతం, తదితర ప్రాంతాలకు సంబంధించిన వివరాల్ని సేకరించి ఈ-మెయిల్‌ ద్వారా పాకిస్థాన్‌ ఆర్మీ మిటరీ ఇంటెలిజెన్సీకి చేరవేశాడు.
    • పాకిస్థానీయులతో టెలిఫోన్‌ బూత్‌వద్ద మాట్లాడుతూ 2002 జనవరిలో నిజామాబాద్‌లో పోలీసులకు దొరికాడు.
    • ఐపీసీ 121, 121ఎ, ఫారినర్స్‌ చట్టం, అధికార రహస్యాల చట్టం కింద అలీపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన నిజామాబాద్‌ రెండో అదనపు జిల్లా/సెషన్స్‌ కోర్టు అలీని దోషిగా పేర్కొంటూ జీవితఖైదు విధిస్తూ 2004 అక్టోబర్‌లో తీర్పు చెప్పింది. అధికార రహస్యాల చట్టం భారతదేశీయులకే వర్తిస్తుందని విదేశీయుడైన అలీకి వర్తించదని విచారణ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐపీసీ, ఫారినర్స్‌ చట్టం కింద మాత్రమే శిక్షలు విధించింది. అధికార రహస్యాల చట్టం కింద నిర్దోషిగా ప్రకటించింది. జీవితఖైదు విధింపును సవాలు చేస్తూ అషికీ అలీ 2011లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.


  • నీసా సంచాలకులుగా అంజనాసిన్హా
    Event-Date:05-May-2018
    Level:Local
    Topic:Persons in News
    జాతీయ పారిశ్రామిక భద్రతాదళం శిక్షణా కేంద్రం (నీసా) సంచాలకులుగా అంజనాసిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆమె ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో పని చేస్తున్నారు. డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకు వెళ్లిన ఆమె నీసా సంచాలకులుగా నియమితులయ్యారు.
    • జాతీయ పారిశ్రామిక భద్రతా దళం (CISF) బలగాలకు నీసాలో శిక్షణ ఇస్తుంటారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఈ కేంద్రం ఉంది. CISF బలగాలకు శిక్షణ ఇచ్చే కేంద్రం దేశం మొత్తం మీద ఇదొక్కటే.
    • నీసాకు ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే ప్రథమం.
    NISA-National Industrial Security Academy
    CISF-Central Industrial Security Force 
  • 2012-16 మధ్య 530 మంది జర్నలిస్టులు మృతి 
    ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయ వృత్తి ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది. 2012 నుంచి 2016 వరకు 18 మంది భారతీయులు సహా 530 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని యునెస్కో నివేదిక వెల్లడించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకుని యునెస్కో 2018 మే 3న నివేదికను విడుదల చేసింది. 2007-2011లో 316 మంది మృతి చెందారని తెలిపింది. సిరియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 86 మంది మృత్యుఒడికి చేరారు.  
  • 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
    65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం 2018 మే 3న న్యూడిల్లీలో నిర్వహించారు. అవార్డుల ప్రదానోత్సవం ఈసారి వివాదాస్పదంగా మారింది. ప్రతిసారీ రాష్ట్రపతి చేతులమీదుగా జరిగే మొత్తం అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈసారి రెండు విభాగాలుగా మార్చడంతో  సినీ కళాకారుల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమయింది.
    • మొత్తం 141 అవార్డుల్లో కేవలం 11 అవార్డులనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించడం, మిగతా అన్నింటినీ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతిఇరానీ, సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ రాఠోడ్‌ చేతుల మీదుగా ప్రదానం చేయడాన్ని కళాకారులు తీవ్రంగా తప్పుబట్టారు.
    • ఇప్పటివరకూ జాతీయ అవార్డు ప్రదానోత్సవాలన్నింటిలో చివరి వరకు రాష్ట్రపతి పాల్గొనడం ఆనవాయితీగా వచ్చింది. దానిని తొలిసారి మార్చారు.
    • దివంగత నటుడు వినోద్‌ఖన్నాకు ప్రకటించిన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ఆయన సతీమణి కవితాఖన్నా, కుమారుడు అక్షయ్‌ఖన్నాకు రాష్ట్రపతి అందించారు.
    • ఉత్తమనటిగా ఎంపికైన శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్‌, కుమార్తె జాన్వీ, ఖుషీకపూర్‌లు పురస్కారాన్ని అందుకున్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.