Type Here to Get Search Results !

May-06

May-06 Current affairs articles

కారుణ్య మరణాలకు అనుమతించాలని రాష్ట్రపతికి ఒడిశా  రైతుల ఉత్తరాలు
ఒడిశాలోని బరగఢ్‌ జిల్లాలో అంగనదిపై సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి నిరసనగా ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులు కారుణ్య మరణాలకు అనుమతి కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 2018 మే 5న ఉత్తరాలు రాశారు.
  • 20 సం॥ల క్రితం అప్పటి ప్రభుత్వం అంగనదిపై భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మించేందుకు సర్వే చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బరగఢ్‌ జిల్లాలోని 6 పంచాయతీ పరిధిలో వేలాది కుటుంబాలు నిర్వాసితులుగా మారనున్నారు.
  • దీంతో వారు అప్పటి నుంచి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా విరోద్‌ కమిటీ ఏర్పాటు చేసి రైతులు ఆందోళన చేస్తున్నారు.
  • ఇటీవల ప్రభుత్వం అంగనదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటూ డిమాండు చేస్తుండడంతో రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు.
  • ఈ నేపథ్యంలో విరోద్‌ కమిటీ అధ్యక్షుడు రమేష్‌ బారిక్‌ ఆధ్వర్యంలో రైతులు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి పేరున ఉత్తరాలు రాసి బరగఢ్‌ తపాలా కార్యాలయం నుంచి పంపారు. 

-------------------------------------------------------------------------------------------

సీతారాముల చిత్రాలతో ముస్లిం పెళ్లి పత్రిక
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యానికి ప్రతీకగా తమ హిందూ మిత్రుల కోసం ప్రత్యేకంగా శుభలేఖలు ముద్రించి తన స్నేహబాంధవ్యాన్ని చాటుకొంది. భాగ్‌సరాయ్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ సలీం 2018 ఏప్రిల్‌ 29న తన కుమార్తె జహనా బానోను యూసఫ్‌ మహమ్మద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ముస్లిం మిత్రుల కోసం సంప్రదాయ ఇస్లామిక్‌ శైలిలో శుభలేఖలు ముద్రించారు. హిందువుల కోసం కేండర్‌ తరహాలో పెళ్లి పత్రికలు అచ్చువేయించారు. వీటిపై సీతారాములు, కలశం, దివ్వెలు, అరటి ఆకులు, కొబ్బరికాయ, పూజా పళ్లెం వంటి చిత్రాలు ఉన్నాయి.  

2017లో 50 కోట్ల కాల్‌రికార్డును సేకరించిన అమెరికా నిఘా సంస్థ
అమెరికాలో 2017లో 50 కోట్లకు పైగా ఫోన్‌ కాల్‌ రికార్డు వివరాలను ఆ దేశ నిఘా సంస్థ(NSA) సేకరించింది. సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
  • 2016లో NSA సేకరించిన కాల్‌రికార్డు సంఖ్య 15.1 కోట్లు. ఒక్కసారిగా రికార్డు సేకరణ ఇంతగా ఎందుకు పెరిగిందన్నదానిపై సంస్థ సమాచారం ఇవ్వలేదు. ఈ సంఖ్యలో ఏటేటా హెచ్చుతగ్గులు నమోదవ్వచ్చని NSA వర్గాలు తెలిపాయి.
  • కాల్‌రికార్డును పొందే పద్ధతిలో ఎలాంటి మార్పూ జరగలేదని.. కోర్టు ఆమోదించిన షరతుల ఆధారంగానే నిఘా పెట్టాల్సిన ఫోన్‌ నెంబర్లను ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నాయి.
  • NSA పొందే కాల్‌ రికార్డు వివరాల్లో.. ఫోన్‌ నెంబర్లు, కాల్‌ చేసిన స్థలం, సమయం వంటి ‘మెటా డేటా’ ఉంటుంది. వ్యక్తుల మధ్య ఏ సంభాషణ జరిగిందన్న సమాచారం NSAకు చేరదు.
  • గతంలో రోజూ వంద కోట్ల కాల్‌ రికార్డును NSA గుట్టుగా సేకరిస్తుండేది. ఈ ఉదంతాన్ని 2013లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే ప్రజావేగు బహిర్గతం చేశాడు.
  • దీంతో గంపగుత్తగా కాల్‌ రికార్డు సేకరించకుండా చీూAను నియంత్రిస్తూ 2015లో అమెరికా చట్టం చేసింది.
NSA-National Security Agency

వివాదాస్పదమైన ‘స్వచ్ఛ’ ఉద్యమ పుస్తకంపై పాక్‌ బాలిక చిత్రం
Event-Date:06-May-2018
Level:National
Topic:Books and Authors
బిహార్‌లో ‘స్వచ్ఛ’ ఉద్యమ ప్రచారానికి సంబంధించి రూపొందించిన ఓ పుస్తకంపై పాకిస్థాన్‌ బాలిక చిత్రం ఉండటం తీవ్ర వివాదాస్పదమైంది. అందులో ఆమె నవ్వుతూ పాక్‌ జెండాను చిత్రిస్తున్నట్లుగా ఉంది. జముయీ జిల్లాలో ‘స్వచ్ఛ జముయీ.. స్వస్థ జమయీ’ ప్రచారానికి గాను ఈ పుస్తకాలను ముద్రించారు.   
తెల్లవారుజాము దాకా కేసుల విచారణ చేపట్టిన బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి
పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌. షారుఖ్‌ జె కథావాలా 2018 మే 4 ఉదయం నుంచి మే 5 తెల్లవారుజాము 3.30 గంటల  దాకా కేసు విచారణను కొనసాగించారు. మహారాష్ట్ర హైకోర్టుకు వేసవి సెలవులు మొదలౌతున్న నేపథ్యంలో జస్టిస్‌. షారుఖ్‌ జె కథావాలా ఈ చర్య చేపట్టారు.  
కూచిభొట్ల శ్రీనివాస్‌ హంతకుడికి జీవిత ఖైదు
Event-Date:06-May-2018
Level:International
Topic:Persons in News

తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కూచిభొట్లపై జాతి విద్వేషంతో కాల్పులు జరిపి హతమార్చిన అమెరికన్‌ ఆడమ్‌ ప్యూరింటన్‌కు జీవిత ఖైదు పడింది. 2017లో అమెరికాలోని కేన్సస్‌ నగరంలో ప్యూరింటన్‌ ఈ దాడికి పాల్పడ్డాడు. అమెరికా నావికాదళ మాజీ అధికారి అయిన ప్యూరింటన్‌ ఈ నేరం చేసినట్లు మార్చిలోనే రుజువైంది. దాదాపు 78 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అతడికి వందేళ్లు పూర్తయితే కానీ బెయిలు జారీకాకుండా కేన్సస్‌లోని ఫెడరల్‌ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కోర్టు తీర్పును శ్రీనివాస్‌ భార్య సునయన స్వాగతించారు. 
NWDA డైరెక్టర్‌ జనరల్‌గా ఎం.కె.శ్రీనివాస్‌ 
Event-Date:06-May-2018
Level:National
Topic:Persons in News

జాతీయ జల అభివృద్ధి సంస్థ(NWDA) డైరెక్టర్‌ జనరల్‌గా ఎం.కె.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు జాతీయ జల అభివృద్ధి సంస్థకు హైదరాబాద్‌ కేంద్రంగాఉన్న దక్షిణ ప్రాంతానికి ఆయన చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఈయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జల వనరుల సంఘంలో చేశారు. మూడు దశాబ్దాలుగా ఆ రంగంలో పని చేయడంతోపాటు నదుల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారుచేయడంలో కీలకపాత్ర పోషించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాలపై 40కి పైగా పత్రాలు సమర్పించారు.
NWDA-National Water Development Agency

‘మాదిగ మహాయోగి..’ గ్రంథావిష్కరణ 
Event-Date:06-May-2018
Level:Local
Topic:Books and Authors

నిజామాబాద్‌ ఎంపీ కవిత 2018 మే 5న హైదరాబాద్‌లో తెలంగాణ తొలి దళిత కవి ‘మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు’ తత్వగ్రంథావిష్కరణ చేశారు. తెలంగాణ వికాస సమితి (తెవిస) ఆధ్వర్యంలో ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇద్దాసు మునిమనుమడు దున్న విశ్వనాథం ఈ గ్రంథ సంపాదకుడు. 
  • తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు - దేశపతి శ్రీనివాస్‌ 
  • తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు - నందిని సిధారెడ్డి
  • తెలంగాణ గ్రంథాయ పరిషత్తు అధ్యక్షుడు - అయాచితం శ్రీధర్‌
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు కేంద్ర పురస్కారం 
Event-Date:06-May-2018
Level:Local
Topic:Awards and honours
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)కు జాతీయ పురస్కారం లభించింది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్య యోజన(DBUGKY) కింద నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 3వ స్థానంలో నిలిచింది.
  • జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌దాస్‌, కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నుంచి ప్రశంసాపత్రం, షీల్డ్‌ను APSSDC సీఈవో కె.సాంబశివరావు, DBUGKY రాష్ట్ర మేనేజర్‌ ఎం.విజయకుమార్‌లు అందుకున్నారు.
  • నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడంలో ఒడిశా, కేరళ తర్వాత స్థానంలో రాష్ట్రం నిలిచింది.
  • 2017-2018లో 17,972 మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వగా 10,923 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి.
APSSDC-Andhra Pradesh State Skill Development Corporation
DBUGKY-Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana 
నంది టీవీ పురస్కారాల ప్రకటన 
Event-Date:06-May-2018
Level:Local
Topic:Awards and honours
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది టీవీ పురస్కారాలను ప్రకటించింది.  ప్రతి సంవత్సరానికి వచ్చిన ఎంట్రీల్లో ఉత్తమ టీవీ సీరియళ్లు, ఫీచర్‌ కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు, నటీనటుల వివరాలను మూడేళ్లకు కలిపి ఒకేసారి వెల్లడించారు. వీటితో పాటు టెలీ ఫిల్ములు, పిల్లల చిత్రాలు, యాంకర్లు, ఇతర సాంకేతిక విభాగాలు తదితర కేటగిరీల్లో నందులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు. 2018 మే 5న  విజయవాడలో మూడేళ్లలో జ్యూరీ కమిటీలకు ఛైర్మన్లుగా వ్యవహరించిన వారు ఆయా విజేతల వివరాలను వెల్లడించారు. నందులకు ఎంపికైన వారి జాబితాను ముఖ్యమంత్రికి చూపించి ఆయన అనుమతితోనే ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, రంగస్థ రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ వెల్లడించారు.
  • టీవీ విభాగంలో నంది పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించి ఈ ఏడాదికి పాతికేళ్లు పూర్తయ్యాయి.
  • 2014లో 9  కేటగిరీల్లో 71 అవార్డులు, 2015లో 8 కేటగిరీల్లో 80 అవార్డులు, 2016లో 6 కేటగిరీల్లో 102 అవార్డులను ప్రకటించారు.
  • 2014 ఏడాదికి టీవీ దర్శకుడు సాంబశివరావు, 2015కు టీవీ నటి రూపాదేవి, 2016 ఏడాదికి నటి సన ఎంపిక కమిటీకు ఛైర్మన్లుగా వ్యవహరించారు.
అంగారకుడి పైకి ‘ఇన్‌సైట్‌’ ల్యాండర్‌ను ప్రయోగించిన నాసా 
అంగారకుడిపైకి మానవులను పంపేందుకు సన్నాహకంగా కీలక వివరాలను సేకరించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కీలక వ్యోమనౌకను ప్రయోగించింది. అరుణగ్రహ నేల లోతుల్లో చోటుచేసుకునే ప్రకంపనలను ఆలకించడానికి తొలిసారిగా ‘ఇన్‌సైట్‌’ అనే ల్యాండర్‌ను నింగిలోకి పంపింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ వైమానిక స్థావరం నుంచి భారత కాలమానం ప్రకారం 2018 మే 5న సాయంత్రం 4.35 గంటలకు ఇన్‌సైట్‌ నింగిలోకి పయనమైంది. భారీ అట్లాస్‌-5 రాకెట్‌ దీన్ని మోసుకెళ్లింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి ప్రయోగించిన మొట్టమొదటి గ్రహాంతర వ్యోమనౌక ఇదే. దాదాపు 7 నెలల పాటు విశ్వంలో 30 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించి 2018 నవంబర్‌ 26న ఇది అరుణగ్రహంపై కాలుమోపుతుంది. ఒకే చోట స్థిరంగా ఉండి అంగారకుడి భూకంపాల తీరు తెన్నులను శోధిస్తుంది. భూమి వంటి గ్రహాల పుట్టుక రహస్యాలను విప్పుతుంది. ఇందుకోసం అంగారక గ్రహాన్ని ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో 16 అడుగుల లోతు వరకూ తవ్వుతుంది.
  • నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్‌’ ల్యాండర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2012లో క్యూరియాసిటీ రోవర్‌ను ప్రయోగించాక అరుణగ్రహ ఉపరితంపైకి ఒక వ్యోమనౌకను పంపడం ఇదే మొదటిసారి. 
  • ఇంటీరియర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ యూజింగ్‌ సైస్మిక్‌ ఇన్వెస్టిగేషన్స్‌, జియోడెసీ అండ్‌ హీట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఇన్‌సైట్‌)ను 99.3 కోట్ల డాలర్లతో నిర్మించారు. దీని బరువు 360 కిలోలు.
  • వందల కోట్ల ఏళ్ల కిందట భూమి, అంగారకుడు, శుక్రుడు, బుధుడు వంటి శిలామయ గ్రహాలు ఏర్పడిన తీరును వెలుగులోకి తీసుకురావడం.
  • అంగారకుడి మధ్య రేఖా ప్రాంతానికి ఉత్తరాన ఉన్న ‘ఎల్సియం ప్లానీషియా’ అనే మైదాన ప్రాంతంలో ఈ వ్యోమనౌక దిగుతుంది. క్యూరియాసిటీ రోవర్‌ కాలుమోపిన ప్రాంతానికి ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌, రాత్రి సమయంలో మైనస్‌ 73 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉంటాయి.
  • ఇన్‌సైట్‌లోని ‘సైస్మిక్‌ ఎక్స్‌పెరిమెంట్‌ ఫర్‌ ఇంటీరియర్‌ స్ట్రక్చర్‌’ అక్కడి ప్రకంపనలను కొలుస్తుంది.
  • అంగారకుడి ఉపరితంలో 10 నుంచి 16 అడుగుల లోతు వరకూ డ్రిల్లింగ్‌ చేసే ‘హీట్‌ ఫ్లో అండ్‌ ఫిజికల్‌ ప్రాపర్టీస్‌ ప్యాకేజీ’ కూడా ఈ వ్యోమనౌకలో ఉంది. ఇంత లోతులో అంగారక గ్రహాన్ని ఏ వ్యోమనౌక కూడా లోగడ తవ్వలేదు. ఉపరితలం కింద ఉష్ణ ప్రవాహం తీరును ఇది పర్యవేక్షిస్తుంది. ఒక హైడ్రోజన్‌ పరమాణువు వ్యాసార్ధంలో సగం మేర ఉండే సైస్మిక్‌ తరంగాన్ని కూడా ఈ పరికరం కొలవగలదు.
  • మరో పరికరం భూమి నుంచి ఈ వ్యోమనౌకకు మధ్య ఉన్న దూరాన్ని నిర్దిష్టంగా లెక్కిస్తుంది. తద్వారా అంగారకుడి ఊగిసలాటను పరిశీలిస్తుంది. ఈ ఊగిసలాట పరిమాణం, నిడివి ఆధారంగా అంగారకుడిలోని కోర్‌ భాగం ద్రవ రూపంలో ఉందా ఘన రూపంలో ఉందా అన్నది తేల్చవచ్చు.
  • NASA ప్రధాన కార్యాలయం - వాషింగ్టన్‌
  • NASA ఏర్పాటు - 1958 జులై 29
NASA-National Aeronautics and Space Administration 
InSight-Interior Exploration using Seismic Investigations, Geodesy and Heat Transport

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.