Type Here to Get Search Results !

May-13

May-13 Current affairs articles

జంతువుల్లో స్మృతుల నెమరివేత
జంతువులు మేతనే కాకుండా స్మృతులను కూడా నెమరువేసుకుంటాయని ఇండియానా విశ్వవిద్యార్థులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. జంతువుల్లో జరిగే జ్ఞప్తి ప్రక్రియ మనుషుల మతిమరుపు సమస్యకు పరిష్కారం చూపగలదని వారు భావిస్తున్నారు. జోనాథాన్‌ క్రిస్టల్‌ బృందం జంతువుల్లోని స్పేషియల్‌, ఎపిసోడిక్‌ మెదడు భాగాలను పరిశీలించింది.  
-------------------------------------------------------------------------------------------
స్మారక భవనంగా అంబేడ్కర్‌ లండన్‌ నివాస గృహం
Event-Date:13-May-2018
Level:International
Topic:Places in News
లండన్‌ మహానగరం చారిత్రక అంశాల్లో బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా చోటు లభించనుంది. వందేళ్ల కింద ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన అంబేడ్కర్‌ అక్కడి కింగ్‌హెన్రీ రోడ్‌లోని ప్క్రెంరోజ్‌ హిల్‌, నంబర్‌ 10 ఇంట్లో నివసించారు. దీన్ని స్మారక భవనంగా మార్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది.
  • ఈ భవనం కింది అంతస్తులో సమావేశ మందిరాన్ని, ఒకటి, రెండో అంతస్తుల్లో ఫొటో గ్యాలరీని, పై అంతస్తులో అంబేడ్కర్‌ సాహిత్యాన్నీ ఉంచారు. తొలి అంతస్తులో అంబేడ్కర్‌ విగ్రహానికి ఎదురుగా రీడిరగ్‌ రూం ఏర్పాటు చేశారు.
  • మూడేళ్ల కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని కొనుగోల చేసినప్పటికీ నిర్వహణ బాధ్యతలను బ్రిటిష్‌ ప్రభుత్వమే చేసుకుంటుంది. 
  • కింగ్‌ హెన్రీ రోడ్‌లోని 10వ నంబర్‌ ఇంటి యజమాని కుమార్తె పేరు ఫాన్నీ ఫిట్జెరాల్డ్‌. ఆమె తల్లి ఫాన్నీ ఫిట్జెరాల్డ్‌ను ముద్దుగా ‘ఎఫ్‌’ అని పిలుచుకునేవారు. 1920-23 మధ్య అంబేడ్కర్‌ లండన్‌లోని మేడం ఎఫ్‌ ఇంట్లో నివాసం ఉన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడుతున్న అంబేడ్కర్‌ భావజాలం, ఆయా వర్గాల పట్ల అతడి నిబద్ధత మేడం ఎఫ్‌ను కాలేజీ రోజుల్లోనే అమితంగా ప్రభావితం చేశాయి.
  • అణగారిన వర్గాల విముక్తి కోసం అహరహం పాటుపడిన పోరాట యోధుడిగా అంబేడ్కర్‌ ఆమె మనసులో బలమైన ముద్రవేశారని అంబేడ్కర్‌ సెక్రటరీగా పనిచేసిన నానక్‌ చంద్‌ రట్టూ తాను రాసిన ‘లిటిల్‌ నోన్‌ ఫాసెట్స్‌ ఆఫ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
  • లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనసాగిస్తున్నప్పుడు అంబేడ్కర్‌కి పరిశోధనలోనూ, రాతకి సంబంధించిన విషయాల్లోనూ మేడం ఎఫ్‌ సాయపడేవారు. ఆయన రీసెర్చ్‌కు సంబంధించిన గుట్టల కొద్దీ మెటీరియల్‌ని టైప్‌ చేసి ఇచ్చేవారట. లండన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఉద్యోగిగా ఉన్నా ఖాళీ సమయంలో అంబేడ్కర్‌ రచనల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ సంపూర్ణ సహకారం అందించేవారట. ఇప్పడు మేడం ఎఫ్‌ ఇంటిని మ్యూజియంగా మార్చి బ్రిటిష్‌ ప్రభుత్వం భారత ప్రజల ప్రియతమ నాయకుడికి మరింత గౌరవం తెచ్చిపెట్టింది.
మెలాక ఐటీఎఫ్‌ గ్రేడ్‌-4 టెన్నిస్‌ డబుల్స్‌ విజేత శివాని 
Event-Date:13-May-2018
Level:International
Topic:Sports and Games
మలేషియాలో జరిగిన మెలాక ఐటీఎఫ్‌ గ్రేడ్‌-4 అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విజేతగా తెలంగాణ టెన్నిస్‌ క్రీడాకారిణి అమినేని శివాని నిలిచింది. మలేషియాలో 2018 మే 12న జరిగిన ఫైనల్‌లో ప్రిస్కా(ఇండోనేషియా)తో కలసి శివాని యుజియో-హూన్‌(చైనా) జోడీపై గెలిచింది.  
పాక్‌ హాకీ దిగ్గజం మన్సూర్‌ అహ్మద్‌ మృతి 
Event-Date:13-May-2018
Level:International
Topic:Sports and Games
పాకిస్థాన్‌ హాకీ దిగ్గజం మన్సూర్‌ అహ్మద్‌ 2018 మే 12న మృతి చెందాడు. 49 ఏళ్ల అహ్మద్‌ దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతడు భారత్‌లో చికిత్స చేయించుకోవాలనుకున్నాడు. గోల్‌కీపర్‌ అయిన అహ్మద్‌ 1994లో ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో సభ్యుడు. మొత్తంగా 338 మ్యాచ్‌ల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 
త్రీడీ సాంకేతికతతో తుంటి మార్పిడి ఆపరేషన్‌
అత్యాధునిక 3డీ ముద్రిత సాంకేతికతతో రూపొందించిన అవయవంతో, తుంటి జాయింట్‌ మార్పిడి శస్త్రచికిత్సను డిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సాంకేతికతతో శస్త్రచికిత్స చేయడం మన దేశంలోనే మొదటిసారి. 2018 ఏప్రిల్‌ 25న 8 గంటల పాటు అమిత్‌ బహ్నోత్‌(40) అనే వ్యక్తికి ఆపరేషన్‌ చేశారు.
అంగారకుడిపై హెలికాప్టర్‌  విహారం
అంగారకుడి వాతావరణంలో తొలిసారిగా ఒక చిన్న హెలికాప్టర్‌ను గగనవిహారం చేయించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది. 2020లో ప్రయోగించే కొత్త తరం రోవర్‌లో భాగంగా దీన్ని పంపుతున్నట్లు వివరించింది.
  • ‘మార్స్‌ హెలికాప్టర్‌’ అనే విమానాన్ని కారు పరిమాణంలో ఉండే రోవర్‌తో పాటు అంగారకుడి పైకి పంపుతారు.
  • హెలికాప్టర్‌ను అరుణ గ్రహ ఉపరితలంపై ఉంచాక రోవర్‌ సురక్షిత దూరం వెళుతుంది. బ్యాటరీలు ఛార్జి అయ్యాక హెలికాప్టర్‌తో గగనవిహారం చేయిస్తారు. పలుచగా ఉండే అంగారకుడి వాతావరణంలో ఎగిరేలా దీన్ని తీర్చిదిద్దుతారు. రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో అది పనిచేస్తుంది.
NASA-National Aeronautics and Space Administration 
హెచ్‌-4 వీసాదారుల్లో 93% భారతీయులే
Event-Date:13-May-2018
Level:National
Topic:Foreign relations
అమెరికాలో ఉద్యోగ అనుమతులు పొందిన హెచ్‌-4 వీసాదారుల్లో 93% మంది భారతీయులే ఉన్నారు. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఓ స్వతంత్ర కమిటీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఉద్యోగ అనుమతులు పొందిన హెచ్‌-4 వీసాదారుల్లో ఐదింట ఒక వంతు మంది కాలిఫోర్నియాలోనే నివసిస్తున్నట్లు తేలింది.
  • లబ్ధిదారుల సంఖ్యలో భారత్‌ తర్వాతి స్థానంలో చైనా (5%) నిలిచింది. మొత్తంగా హెచ్‌-4 కింద ఉద్యోగ అనుమతులు పొందినవారిలో 93% మంది మహిళలు, 7% మంది పురుషులు ఉన్నారు. 2015 మే నుంచి 2017 డిసెంబర్‌ వరకు హెచ్‌-4 వీసాదారుల్లో 1.26 క్ష మందికి ఉద్యోగ అనుమతులు జారీ చేసినట్లు అమెరికా వలస విభాగం తెలిపింది.
ఐఎస్‌పై విజయం తర్వాత తొలిసారి ఇరాక్‌లో ఎన్నికలు
ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)పై విజయం తర్వాత ఇరాక్‌లో 2018 మే 12న తొలిసారిగా పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులపై విజయం తన వల్లే సాధ్యమైందని, కుర్దు స్వాతంత్య్ర ఉద్యమాన్ని అదుపు చేశానని చెప్పుకొంటూ.. ప్రధాని హైదర్‌ అల్‌-అబాదీ ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థించారు. మాజీ ప్రధాని నూరి అల్‌ మాలికి, ప్రధాన షియా పారామిలిటరీ దళం నాయకుడు హదీ అల్‌అమీరీ నుంచి అబాదీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. 
మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌పై ప్రయాణ నిషేధం
Event-Date:13-May-2018
Level:International
Topic:Persons in News
మలేసియా ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రధాని పదవిని కోల్పోయిన నజీబ్‌ రజాక్‌ ఎక్కడికీ వెళ్లరాదంటూ ఆయన ప్రయాణాలపై కొత్త ప్రభుత్వం నిషేధం విధించింది. వేల కోట్ల డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నజీబ్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఈ ప్రకటన చేసింది. 92 ఏళ్ల వయసులో ప్రధాని పదవిని చేపట్టిన మహాథిర్‌ మహమ్మద్‌ దీన్ని ధ్రువీకరించారు. 
ఫాల్కన్‌-9 రాకెట్‌ ప్రయోగం
అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ శక్తిమంతమైన ఫాల్కన్‌-9 రాకెట్‌ను 2018 మే 12న విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు చెందిన తొలి కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. పునర్‌వినియోగ రాకెట్‌ పరిజ్ఞానంలో ఇదో ముందడుగు. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి జరిగింది.
  • ఫాల్కన్‌-9లో బ్లాక్‌-5 శ్రేణి రాకెట్‌.. బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు-1 ఉపగ్రహాన్ని 35వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
  • ప్రయోగం తర్వాత ప్రధాన బూస్టర్‌.. రాకెట్‌ నుంచి విడిపోయి, భూమికి తిరిగొచ్చింది. దీన్ని కనీసం 10 ప్రయోగాల కోసం వినియోగించొచ్చు. తక్కువ నిర్వహణ, మరమ్మతుతో తదుపరి ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. దీనివల్ల చాలా తరచూగా ప్రయోగాలు చేపట్టవచ్చు. వ్యయం కూడా తగ్గుతుంది.
  • ఇది మానవులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. 2018 చివర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ISS)కి వ్యోమగాములను తరలిస్తుంది. అంగారకుడిపైకి మానవులను తరలించడానికి ఉద్దేశించిన ‘బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌’కు ఇది సన్నాహకం.  
  • బంగబంధు-1 ఉపగ్రహం బంగ్లాదేశ్‌ పురోగతికి నిదర్శనమని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా పేర్కొన్నారు. దీనిద్వారా బంగ్లాదేశ్‌ జాతీయ జెండాను అంతరిక్షంలో ఆవిష్కరించామన్నారు.
  • ఈ ఉపగ్రహం బంగ్లాదేశ్‌, దాని ప్రాదేశిక జలాలు, భారత్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, ఇండొనేషియాలో వీడియో, కమ్యూనికేషన్‌ సేవలను అందిస్తుంది. గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సంధానతను పెంచుతుంది. 15 ఏళ్ల పాటు సేవలు  అందిస్తుంది.
ISS-International Space Station 
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 
ప్రపంచవ్యాప్తంగా 2018 మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. న్యూడిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 35 మందికి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులు ప్రదానం చేశారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని  ప్రతి సంవత్సరం మే 12న ఇంటర్నేషనల్‌ నర్స్‌ డేను నిర్వహిస్తారు.
  • 2018 ఇంటర్నేషనల్‌ నర్స్‌ డే యొక్క థీమ్‌- Nurses: Inspire, Innovate, Influence
మాజీ భర్తపై కూడా గృహహింస కేసు పెట్టొచ్చు : సుప్రీంకోర్టు
గృహహింస నిరోధక చట్టం కింద మాజీ భర్తపై కూడా మహిళలు ఫిర్యాదు నమోదు చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. విడాకులు మంజూరైనా వేధింపులకు తెగబడితే ఈ చట్టాన్ని ఆశ్రయించొచ్చని స్పష్టీకరించింది. ఈ అంశంపై జస్టిస్‌ రంజన్‌ గొగోయి, జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతోకూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైవాహిక బంధంలో లేనప్పటికీ బాధిత మహిళకు న్యాయం జరిగేలా కోర్టు చర్యలు తీసుకోవచ్చని ఇదివరకు రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కలగజేసుకునేందుకు నిరాకరించింది.
  • హైకోర్టు తీర్పుతో విభేదిస్తూ ఓ మాజీ భర్త దాఖలు చేసిన అభ్యర్థననూ తోసిపుచ్చింది. ‘వేధింపులకు పాల్పడిన వ్యక్తితో జీవితంలో ఏదోఒక సమయంలో బాధితురాలు వైవాహిక బంధంలో పాల్గొంటే గృహహింస నిబంధనలు వర్తిస్తాయి. చట్టం అమలులోకి రాకముందు వైవాహిక బంధంలోవున్నా సరే..’అని ఆనాడు హైకోర్టు తీర్పునిచ్చింది. ‘విడాకులు తీసుకున్న అనంతరం భార్య పనిచేస్తున్నచోటుకు వచ్చి ఇబ్బంది పెట్టడం, మళ్లీ బంధం పెట్టుకొనేందుకు ప్రయత్నించడం, ఆమె కుటుంబ సభ్యులపై హింసకు పాల్పడటం లాంటి చర్యలకు మాజీ భర్తలు తెగబడితే.. మహిళలు గృహహింస చట్టాన్ని ఆశ్రయించొచ్చు’అని తెలిపింది. 
జాతీయ ప్రతిభా స్కాలర్‌షిప్‌ రెట్టింపు
రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష విభాగం ఏటా నవంబరులో నిర్వహించే జాతీయ ప్రతిభా  స్కాలర్‌షిప్‌ను కేంద్రం రెట్టింపు చేసింది. గతంలో రూ.6 వేలు ఉండగా దీన్ని రూ.12 వేలకు పెంపు చేసింది. గతంలో విడతల వారీగా ఇస్తుండగా ఈసారి నుంచి ఒకే విడతగా ఇవ్వనున్నారు.
  • ప్రభుత్వ పాఠశాల్లో 7వ తరగతిలో 55శాతానికి పైగా మార్కులు సాధించిన 8వ తరగతి విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.
  • ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ బడులు, జూనియర్‌ కళాశాల్లో చదివితేనే స్కాలర్‌షిప్‌  వస్తుంది. 
నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకరరావు మృతి
Event-Date:13-May-2018
Level:Local
Topic:Persons in News
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మాజీ శాసనసభ్యుడు శిమ్మ ప్రభాకరరావు(63) 2018 మే 12న విశాఖపట్నంలో మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావంతో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
విజయవాడలో హజ్‌హౌస్‌ శంకుస్థాపన 
విజయవాడలో రూ.80 కోట్లతో 1.20 ఎకరాల్లో నిర్మించబోయే హజ్‌హౌస్‌ పనులకు సీఎం చంద్రబాబునాయుడు 2018 మే 12న శంకుస్థాపన చేశారు. ఇక్కడ 1200 మందికి బస లభిస్తుంది.
యాసంగి వరి ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రికార్డు
యాసంగి వరి ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రైతులు కొత్త రికార్డు సృష్టించారు. గత ఐదేళ్ల యాసంగి సీజన్‌లో అత్యధికంగా ఈసారి అరకోటి టన్నులకు పైగా వరి ధాన్యం, వాటినుంచి 33.41 లక్షల టన్నుల బియ్యం దిగుబడి వచ్చినట్లు అర్థ, గణాంకశాఖ విడుదల చేసిన 3వ ముందస్తు దిగుబడుల అంచనా నివేదికలో ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరాని(2017-18)కి సంబంధించిన 3వ నివేదికను కేంద్రానికి పంపింది.
  • గత యాసంగి సీజన్‌లో అత్యధికంగా వరి పండటంతో ఐదేళ్ల యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. పంట సాగు విస్తీర్ణం 8.79 లక్షల హెక్టార్లకు పెరగడంతో పాటు ఉత్పాదకత హెక్టారుకు 3801 కిలోలు రావడం కొత్త రికార్డుగా నమోదయ్యాయి. 
అంతర్జాతీయ కరాటే పోటీల్లో తెలంగాణ గిరిజన విద్యార్థులకు రజత పతకాలు
Event-Date:13-May-2018
Level:Local
Topic:Sports and Games
దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా ఏజెన్సీకి చెందిన గిరిజన బిడ్డలు మెరిశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన నలుగురు విద్యార్థులు దుబాయ్‌లో జరిగిన పోటీల్లో వివిధ విభాగాల్లో రజత పతకాలను సాధించారు.
  • 2017 డిసెంబర్‌లో పుణెలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో గురుకులానికి చెందిన బాదావత్‌ గణేష్‌, భూక్య రమేశ్‌, పోదెం హరీష్‌, కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన సనప శ్రీదివ్య, ధారవతు పౌనిక దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు తెలంగాణ నుంచి ఎంపికయ్యారు.
  • ఈ విషయాన్ని గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా గిరిజన సంక్షేమశాఖ నుంచి ఖర్చు భరించి దుబాయ్‌లో జరిగే పోటీలకు 2018 మే 9న పంపారు.
  • అక్కడ మూడు రోజులపాటు జరిగిన పోటీల్లో 14ఏళ్ల బాలికల విభాగంలో సనప శ్రీదివ్య, 18ఏళ్ల విభాగంలో భూక్య రమేశ్‌, 16ఏళ్ల విభాగంలో బాదావత్‌ గణేష్‌, 16ఏళ్ల, 47కిలో విభాగంలో పోదెం హరీష్‌ స్పారింగ్‌, కాటా పోటీల్లో ప్రతిభ చాటి రజత పతకాలు సాధించారు.
స్టోరీ ఆఫ్‌ ఆర్‌టీఐ పుస్తక ఆవిష్కరణ
Event-Date:13-May-2018
Level:National
Topic:Books and Authors
మంథన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 2018 మే 12న నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ వ్యవస్థాపకురాలు అరుణరాయ్‌  స్టోరీ ఆఫ్‌ ఆర్‌టీఐ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆర్‌టీఐలోని ప్రధాన అంశాలను ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. ఎందరో మేధావులు వివిధ అంశాలపై చేసిన రచనలను ఇందులో చేర్చారు.
ముంబై దాడులపై నవాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు
Event-Date:13-May-2018
Level:National
Topic:Foreign relations
పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని అంగీకరించారు. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్‌ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు.
  • ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు. అయితే, ఆ ఉగ్రవాదులకు పాక్‌ ప్రభుత్వంతో ప్రమేయం లేదని, పాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రతండాలు రాజ్యేతర శక్తులని ఆయన డాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
  • 2008 నవంబర్‌ 26న 10 మంది పాక్‌ ఉగ్రవాదులు భారీ ఆయుధాలు, బాంబులతో విరుచుకుపడి ముంబైలో మారణహోమం సృష్టించారు.
  • ఈ భయానక ఉగ్రవాద దాడిలో తొమ్మిదిమంది ఉగ్రవాదులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • సజీవంగా చిక్కిన ఉగ్రవాది కసబ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంతో అతన్ని ఉరితీశారు.
  • ముంబైలో జరిగిన ఈ ఉగ్రదారుణంపై భారత్‌ ప్రభుత్వం ఎన్ని ఆధారాలు సమర్పించినా పాక్‌ మాత్రం తమ ప్రమేయం లేదని బుకాయిస్తూ వచ్చింది.
  • ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హజీఫ్‌ సయీద్‌ అని స్పష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించినా పాక్‌ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించింది.
  • ఇప్పుడు మాజీ ప్రధానమంత్రే 26/11 ముంబై దాడులు తమ పనేనని అంగీకరించడం పాక్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.