Type Here to Get Search Results !

May-14

May-14  Current affairs articles

బ్రిటన్‌ సంపన్నుల జాబితాలో హిందూజా సోదరులకు 2వ స్థానం
Event-Date:14-May-2018
Level:International
Topic:Persons in News
భారత్‌లో జన్మించిన హిందూజా సోదరులు బ్రిటన్‌లో అత్యంత కుబేరులుగా 2017లో తొలిస్థానం దక్కించుకోగా 2018లో మాత్రం 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018 మే 13న విడుదలైన 1000 మంది బ్రిటన్‌ సంపన్నుల జాబితాలో (సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌లో) రసాయనాల వ్యాపారి జిమ్‌ రాట్‌క్లిఫ్‌ 21.05 బిలియన్‌ పౌండ్ల సంపదతో (సుమారు రూ.1,91,555 కోట్లు) తొలిస్థానంలో నిలిచారు. శ్రీచంద్‌ హిందూజా, గోపీచంద్‌ హిందూజాలు 20.64 బిలియన్‌ పౌండ్లతో (సుమారు రూ.1,87,824 కోట్లు) 2వ స్థానం పొందారు.
  • ఉక్కు దిగ్గజం లక్ష్మీనివాస్‌ మిత్తల్‌ (14.66 బిలియన్‌ పౌండ్లు) 4 నుంచి 5వ స్థానానికి తగ్గారు.
  • సరిగా చదువుకోలేకపోయినవారు, నడివయసు వచ్చేవరకు వ్యాపారాన్నే ప్రారంభించనివారు, గుడ్లు/ చాక్లెట్లు వంటివి విక్రయించేవారు ఈసారి జాబితాలో స్థానం సంపాదించారని దీనిని రూపొందించిన రాబర్ట్‌ వాట్స్‌ వెల్లడించారు.
  • 141 మంది మహిళలకు జాబితాలో స్థానం దక్కింది.



-------------------------------------------------------------------------------------------



సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007కి కీలక సవరణలు
వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007కి కీలక సవరణలు చేసింది.
  • తల్లిదండ్రుల(60 ఏళ్లపైబడిన వారిని)ను నిర్లక్ష్యం చేసినా లేక వేధించినా ఇది వరకు 3 నెలల శిక్ష విధించేవారు. కానీ, తాజా ముసాయిదా చట్టం ప్రకారం దానిని 6 నెలలకు మార్చారు. 
  • తల్లిదండ్రులకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నెల రోజుల శిక్ష విధించేలా సవరణలు చేశారు. ఈ మేరకు ట్రిబ్యూనల్స్‌కు అధికారాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
  • 2017లో ఓ సర్వేలో వెల్లువైన వివరాల ప్రకారం.. 44 శాతం మంది వృద్ధులు తమ పిల్లలు తమ పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. దుర్భషలాడటం, చెయ్యి చేసుకోవటం లాంటి పరిణామాలు ఎదురయ్యాయని చాలా మంది తెలిపారు. దీంతో ఈ సర్వేను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
  • దీంతోపాటు దత్తత తీసుకున్న వారిని, అల్లుళ్లు, కోడళ్లు, మనవళ్లు-మునిమనవరాళ్లను కూడా వారసుల జాబితా పరిధిలోకి తీసుకురానుంది.ఈ చట్టం అమలులోకి వస్తే గనుక నిస్సహయులైన వృద్ధులకు వారి వారి వారసులు రూ.10 వేలు నెలనెలా భరణంగా చెల్లించటం తప్పనిసరి అవుతుంది.



అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీలో గగన్‌ నారంగ్‌కు స్వర్ణ పతకం
Event-Date:14-May-2018
Level:National
Topic:Sports and Games
భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌ జర్మనీలోని హనోవర్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచాడు.  నారంగ్‌, ముకుంద్‌, గౌరవ్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ విభాగంలో 1839.7 పాయింట్లతో కాంస్యం నెగ్గింది. అమెరికా(1859.7), కజకిస్థాన్‌ (1842) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 



ఈ-నాం’ పరిధిలో మరో 200 మార్కెట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మరో 200 టోకు వ్యవసాయ మార్కెట్లను ‘ఈ-నాం’ పరిధిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌(ఈ-నాం) విధానాన్ని 2016 ఏప్రిల్‌లో ప్రారంభించగా, ప్రస్తుతం 14 రాష్ట్రాల్లోని 585 మార్కెట్లు దీని పరిధిలో ఉన్నాయి. ఈ-నాం యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. 73.50 లక్షల మంది రైతులు, 53,163 మంది కమీషన్‌ ఏజెంట్లు, లక్షకుపైగా వ్యాపారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
eNam-electronic National Agriculture Market


ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత భారత్‌లోనే ఎక్కువ
దక్షిణాసియా దేశాల్లోని ప్రజలు 2017 మే నుంచి 2018 ఏప్రిల్‌ మధ్య 97 సార్లు ఇంటర్నెట్‌ సేవలకు దూరమైతే వాటిలో 82 సందర్భాలు భారత్‌లోనే చోటు చేసుకున్నాయి. దక్షిణాసియా పత్రికా స్వేచ్ఛ నివేదిక 2017-18 పేరుతో యునెస్కో- అంతర్జాతీయ పాత్రికేయుల సమాఖ్య దీనిని ఇటీవల విడుదల చేసింది.
  • పాకిస్థాన్‌లో 12 సార్లు, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో ఒక్కోసారి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్‌ను నిలిపివేయడాన్ని పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ మదింపులో ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
  • సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు అధికారిక ఉత్తర్వుతో ఇలా సేవలను నిలుపు చేస్తుంటారు.
  • మన దేశంలో ఇంటర్నెట్‌ను స్తంభింపజేసిన సందర్భాల్లో సగానికి సగం కశ్మీర్‌కు సంబంధించినవే ఉన్నాయి.
  • ఎక్కువసేపు ఇంటర్నెట్‌ సేవల్ని నిలుపుదల చేసిన 6 సందర్భాల్లో 5 భారత్‌కు చెందినవే.
  • డార్జిలింగ్‌(పశ్చిమబెంగాల్‌)లో ఏకంగా 45 రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవల్ని ఆపేశారు.


వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయి : నవాజ్‌ షరీఫ్‌
Event-Date:14-May-2018
Level:International
Topic:Persons in News
ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని పాకిస్థానే చేయించిందని స్పష్టంగా ప్రకటించిన పదవీచ్యుత ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒకరోజు వ్యవధిలోనే మాట మార్చారు. తన వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాలు తీవ్రస్థాయిలో వక్రీకరించాయని 2018 మే 13న వివరణ ఇచ్చారు. ‘షరీఫ్‌ వ్యాఖ్యలకు భారతదేశ ప్రసార మాధ్యమాలు తప్పుడు భాష్యం చెప్పాయి. పాకిస్థాన్‌లోనూ కొన్ని మాధ్యమాలు తెలిసో తెలియకో అదే పనిచేశాయి. ఆయన ప్రకటనలోని పూర్తి వాస్తవాలను తెలుసుకోలేదు’ అని మాజీ ప్రధాని తరఫు ప్రతినిధి వెల్లడించారు. 


పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌పై కేంద్రం నిబంధనలు
ఎస్సీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ‘కేంద్ర ప్రాయోజిత పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతన పథకం’ పరిధిలోకి వచ్చే విద్యా సంస్థ కోసం కేంద్రం కొత్త నిబంధనను తెచ్చింది. లబ్ధిదారుల్లో కనీసం 50 శాతం మంది ఉత్తీర్ణులై, ఎగువ తరగతికి వెళ్లేలా చూడాలని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది. లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది. సవరించిన నిబంధనలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ 2018 మే 12న నోటిఫై చేసింది. విద్యాసంస్థలు అవకతవకలకు పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చర్యలను చేపట్టినట్లు వివరించింది. సవరించిన నిబంధనల ప్రకారం.. నిర్వహణ భత్యం, నాన్‌-రీఫండబుల్‌ రుసుమును ఇక నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తారు. 
ఆరుగురు విద్యార్థులకు సీబీఎస్‌ఈ ప్రత్యేకంగా పరీక్షలు 
దేశంలోనే మొదటిసారిగా సీబీఎస్‌ఈ ఆరుగురు విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది. వీరంతా మన దేశం తరఫున విదేశాల్లో వివిధ క్రీడావిభాగాల్లో పాల్గొన్నారు. ఇందులో నలుగురు పదో తరగతి కాగా మరో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు. విజయవాడలోని సెయింట్‌ జాన్స్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న కె.వెంకటాద్రి కూడా వీరిలో ఒకరు. ఢాకాలో ఇటీవల నిర్వహించిన దక్షిణాసియా విలువిద్య ఛాంపియన్‌షిప్‌లో వెంకటాద్రి మూడు వెండి పతకాలు సాధించాడు.
  • సీబీఎస్‌ఈ ఇటీవల విడుదల చేసిన కొత్త క్రీడా మార్గదర్శకాల ప్రకారం 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ క్రీడల కోసం ఓ పీరియడ్‌ ఉండాల్సిందే. 
ఆరు దశాబ్దాల పాటు రక్తదానంతో 24 లక్షల శిశువులకు ప్రాణదానం చేసిన జేమ్స్‌ హారిసన్‌ 
Event-Date:14-May-2018
Level:International
Topic:Persons in News
ఆరు దశాబ్దాలుగా రక్తదానం చేస్తూ లక్షలాది మంది పాలిట ప్రాణదాతగా నిలిచిన ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ హారిసన్‌ 2018 మే 11న చివరిసారిగా రక్తదానం చేశారు. జేమ్స్‌ హారిసన్‌ చేసిన రక్తదానంతో 24 లక్షల మంది శిశువుల ప్రాణాలు నిలబడ్డాయి.
  • ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ హారిసన్‌కు 1951లో 14ఏళ్ల వయస్సులో ఛాతి శస్త్రచికిత్స జరిగింది. అప్పట్లో ఆయన మూడు నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ముక్కూమొహం తెలియని వారెవరో 13 యూనిట్ల రక్తదానం చేయడం వల్ల నీ ప్రాణాలు నిలబడ్డాయని తండ్రి చెప్పిన మాటలు హారిసన్‌ హృదయంలో నాటుకున్నాయి.  దీంతో జీవితాంతం రక్తదానం చేయాలని జేమ్స్‌ హారిసన్‌ నిర్ణయించుకున్నాడు. వెంటనే రక్తదానం చేద్దామని భావించినప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వ చట్టాల ప్రకారం కనీసం 18ఏళ్లు నిండితేనే రక్తదానానికి అర్హులు కావడంతో కుదరలేదు. దీంతో రక్తదానం చేయడానికి హారిసన్‌ నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 18 ఏళ్లు నిండగానే ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ సర్వీస్‌కు వెళ్లి రక్తదానం చేయడం ప్రారంభించారు.
  • మరోవైపు, ఆస్ట్రేలియాలో 1967వరకు గర్భస్రావాలు, మృతపిండాలు జన్మించడం, పుట్టిన శిశువు మెదడుల్లో లోపాలు ఎక్కువగా ఉండేవి. ఏటా వేలాది మంది శిశువులు మరణించేవారు. ఎందుకిలా జరుగుతుందో వైద్యులకు సైతం తెలిసేది కాదు. నవజాత శిశువులలో రక్తవిరుగుడు వ్యాధి (హెచ్‌డీఎన్‌) ఎక్కువగా కనిపించేది. ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ రక్తం గల మహిళ గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలోని శిశువుకు ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ రక్తం ఉంటే ఎక్కువగా హెచ్‌డీఎన్‌ వ్యాధి వస్తుంది. అరుదైన ప్రతిరక్షక పదార్థం ఉన్న రక్తంలోని ద్రవపదార్థాన్ని (ప్లాస్మా) మహిళకు ఎక్కిస్తే హెచ్‌డీఎన్‌ నిరోధించవచ్చునని తర్వాత జరిగిన పరిశోధనలు తేల్చాయి. దీంతో వైద్యులు ఇలాంటి రక్తం ఎవరికి ఉందని రక్తనిధి కేంద్రాల్లో శోధన ప్రారంభించి చివరకు న్యూ సౌత్‌వేల్స్‌లో ఉన్న జేమ్స్‌ హారిసన్‌ను గుర్తించారు.
  • ఆ తర్వాత పరిశోధకలు హారిసన్‌ రక్తంలోని ద్రవపదార్థంతో యాంటీ-డి ఇంజెక్షన్‌ అభివృద్ధి చేశారు. తొలిసారిగా 1967లో ఈ ఇంజెక్షన్‌ను రాయల్‌ ప్రిన్స్‌ ఆల్‌ఫ్రెడ్‌ ఆసుపత్రిలో ఓ గర్భవతికి చేశారు. 60 ఏళ్లుగా ఈ మహాదాత నుంచి సేకరించిన రక్తంలోని ద్రవపదార్థంతో లక్షలాది యాంటీ-డి ఇంజెక్షన్లు తయారుచేశారు. ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రం అంచనా ప్రకారం హారిసన్‌ రక్తదానం మొత్తం 24 లక్షల మంది శిశువులకు ఉపయోగపడింది.
  • 2018 మే 11న హారిసన్‌ చివరిసారిగా రక్తదానం చేశారు. 81 ఏళ్లు రావడంతో ఇకపై ఆయన రక్తదానం చేయడం కుదరదు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా కూడా రక్తం స్వీకరించడాన్ని నిలిపివేయాని రెడ్‌క్రాస్‌ నిర్ణయించింది. 2003లో జేమ్స్‌ గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకున్నారు.
టీజేఏసీ ఛైర్మన్‌గా రఘు 
Event-Date:14-May-2018
Level:Local
Topic:Persons in News
తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజేఏసీ) నూతన ఛైర్మన్‌గా కె.రఘు, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పురుషోత్తం ఎన్నికయ్యారు. 2018 మే 13న జరిగిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కోదండరాం టీజేఏసీ ఛైర్మన్‌ పదవికి గతంలోనే రాజీనామా సమర్పించారు. ఇప్పటి వరకూ టీజేఏసీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘును నూతన ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. టీజేఏసీని 2009లో ఏర్పాటు చేశారు. 
‘మంగళాపురం కథలు’ ఆవిష్కరణ
Event-Date:14-May-2018
Level:Local
Topic:Books and Authors
ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ ఆనందరాం సతీమణి విమల రాసిన ‘మంగళాపురం కథలు’ పుస్తకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ 2018 మే 13న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 
అసెంట్‌ నివేదికలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు 47వ స్థానం
Event-Date:14-May-2018
Level:Local
Topic:Persons in News
లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మరో మైలురాయిని చేరుకున్నారు. కెనడాకు చెందిన అసెంట్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ డేటా సంస్థ వెలువరించిన ‘2017 టాప్‌ 100 హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అండ్‌ స్లేవరీ ఇన్‌ఫ్లుయెన్స్‌ లీడర్స్‌’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
  • లైంగిక అక్రమ రవాణా, ఆధునిక బానిసత్వం నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న 100 మంది జాబితాను ఈ సంస్థ ఎంపిక చేసింది.
  • అసెంట్‌ సంస్థ తరఫున యూనివర్సిటీ ఆఫ్‌ నోటర్‌ డేమ్‌ ఎంబీఏ లూకాస్‌ టేలర్‌ ఈ నివేదికను రూపొందించారు.
  • జాబితాలో మహేశ్‌భగవత్‌కు 47వ స్థానం దక్కింది.
  • తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఈ ఐపీఎస్‌ అధికారి పదమూడేళ్లుగా లైంగిక అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
  • మహేశ్‌ భగవత్‌ ఇదివరకే యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ ‘2017 ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్‌ రిపోర్ట్‌ హీరో’ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
  • రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 25 వ్యభిచార గృహాలు(5 హోటళ్లు, 20 రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్లు)ను సీజ్‌ చేయడంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 350 మంది చిన్నారుల్ని ఇటుకబట్టీల చెర  నుంచి విడిపించినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. తాజాగా అసెంట్‌ సంస్థ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఇండోనేసియాలో చర్చిలపై ఆత్మాహుతి దాడులు 
Event-Date:14-May-2018
Level:International
Topic:Places in News
ఇండోనేసియాలో చర్చిలే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులు చేపట్టారు. సామూహిక ప్రార్థనలు చేస్తున్నవారిపై ఆత్మాహుతి పేలుళ్లకు ఒడిగట్టారు. దీంతో 13 మంది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సురాబయలో 2018 మే 13న మూడు చర్చిల్లో ఈ పేలుళ్లు జరిగాయి. వీటిని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు చేపట్టారు. వీరంతా తమ ముష్కరులేనని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ప్రకటించింది.
బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించారు. టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలిగిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. అందులో భాగంగా గత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి 2018 ఏప్రిల్‌ 16వ తేదీన రాజీనామా తీసుకొంది. 
  • కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి 1989 నుంచి 2004వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
  • 1991 నుంచి 1994 వరకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో క్రీడలు, యువజన సర్వీసులు, సహకారం, కార్మిక, ఉపాధి, శిక్షణ మంత్రిగా ఇండిపెండెంట్‌ దాలో పనిచేశారు. 
  • వై.ఎస్‌ మంత్రివర్గంలో ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఆయన 2004 నుంచి 2014 వరకు పని చేశారు
  • సహకార, రవాణాశాఖ, భారీ పరిశ్రమలు, వాణిజ్యం, గృహనిర్మాణం, వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశారు.. 
  • 2017 అక్టోబరు 27న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి తెలంగాణ ‘ఉద్దీపన’ 
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధి నకిరేకల్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల్లో స్వచ్ఛత కోసం జరిగిన ప్రయోగాత్మక ‘ఉద్దీపన’ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరించనుంది. దీనిని అన్ని రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది.
  • నకిరేకల్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంపై రెండు జిల్లాల యంత్రాంగాలు దీనిని అధిగమించేందుకు ఉద్దీపన పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టాయి.
  • దీనికి అవసరమైన ఆర్థికసాయం అందించేందుకు ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుకొచ్చారు. ఆయన అధ్యక్షతన జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ టి. విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల యంత్రాంగాల సహకారంతో కోర్‌ కమిటీ ఏర్పాటై కార్యాచరణ చేపట్టింది.
  • 2017 జులై నుంచి 2018 ఏప్రిల్‌ వరకు దీనిని నిర్వహించారు.
  • నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని 40 పాఠశాలల్లో స్థితిగతులపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య, నీటి స్వచ్ఛత, వ్యక్తిగత పరిశుభ్రత లోపాలను, ఇతర సమస్యలను గుర్తించారు.
  • వీటి పరిష్కారానికి మొత్తం 100 పాఠశాలల్లో ఉద్దీపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2017 జులై 11న దీనిని ప్రారంభించారు.
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన తరగతులు నిర్వహించారు.
  • ప్రతి పాఠశాలలో 4, 5, 6, 7 తరగతుల్లో అయిదుగురు చొప్పున విద్యార్థులతో స్వచ్ఛదూత్‌ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై శిక్షణ ఇచ్చారు.
  • ప్రతి పాఠశాలకు ప్రథమ చికిత్స కిట్‌, మధ్యాహ్న భోజనం చేసే వంట వారికి ఆఫ్రాన్లు, గ్లౌజు, మాస్క్‌లు, టోపీలు ఇచ్చారు. చేతులు పరిశుభ్రం చేసుకునేందుకు లిక్విడ్‌ను సరఫరా చేశారు. పారిశుద్ధ్య నాయకత్వం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు పరిశుభ్రత సామగ్రి తయారీపై శిక్షణ ఇచ్చారు.
  • టర్బోసాఫ్‌ పేరిట మహిళలే పారిశుద్ధ్య ఉత్పత్తులను రూపొందించి, పాఠశాలలకు పంపిణీ చేశారు. ఈ చర్యలతో నకిరేకల్‌ నియోజకవర్గంలోని పాఠశాలల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. అక్కడ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ మెరుగైంది. మధ్యాహ్న భోజనంలో పారిశుద్ధ్య సమస్యలు తొలగిపోయాయి.
  • దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణపై కేంద్ర మానవ వనరుల శాఖ అన్ని రాష్ట్రాల నుంచి ఇటీవల నివేదికను కోరింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్దీపన ప్రగతిని పేర్కొంటూ నివేదికను పంపింది. ఈ నివేదికను పరిశీలించిన కేంద్రం ఉద్దీపన ఫలితాలను ప్రశంసించింది. ఈ తరహా కార్యక్రమాన్ని దేశమంతటా విస్తరించాలని నిర్ణయించింది. 
శత్రువులపై దాడికి భారత సైన్యం కొత్త వ్యూహం ‘ఎయిర్‌ క్యావరీ’ 
భారత సైన్యం ‘ఎయిర్‌ క్యావరీ’ పేరుతో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. శత్రు దేశపు భూతల దళాలను గుర్తించి, నాశనం చేయడానికి వియత్నాం యుద్ధంలో అమెరికా ఈ తరహా ఎత్తుగడను ప్రయోగించింది. ఇటీవల రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌ వద్ద ఎడారిలో ‘విజయ్‌ ప్రహార్‌’ పేరుతో నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో ఈ వ్యూహాన్ని పరీక్షించారు.
  • భూమి మీద ట్యాంకు, సాయుధ శకటాలతో సమన్వయం చేసుకుంటూ వాయు మార్గంలో శత్రువులపై విరుచుకుపడటం ద్వారా భూతల యుద్ధ తీరుతెన్నులను పునర్‌నిర్వచించడం దీని ఉద్దేశం.
  • దాడి హెలికాప్టర్లను కొత్తగా సమీకరించుకోవడం   ద్వారా వాయు పోరాట వ్యవస్థను భారత సైన్యం బలోపేతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌పై దృష్టితో తాజా కసరత్తును చేపట్టింది.
  • సాధారణంగా యుద్ధాల్లో నేల మీదున్న సైనిక బలగాలు.. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల వంటి కారణాల వల్ల లక్ష్యంపై దాడి చేయలేని సందర్భాల్లో మాత్రమే సాయుధ హెలికాప్టర్ల సాయాన్ని కోరతాయి.
  • ‘ఎయిర్‌ క్యావరీ’ వ్యూహంలో సాయుధ హెలికాప్టర్లను ట్యాంకు, సాయుధ శతఘ్నులతో పూర్తిగా అనుసంధానిస్తారు. అందువల్ల అవి భూతల దళాలతో కలసి ముందుకు సాగుతాయి. దీనికి అత్యధిక స్థాయిలో కచ్చితత్వం, సమన్వయం, నిరంతర ఆధునికీకరణ అవసరం.
పుంగ్యే-రి కేంద్రాన్ని ధ్వంసం చేయనున్న ఉత్తర కొరియా 
అణు పరీక్షలకు స్వస్తి పలుకుతూ ఉత్తర కొరియా ‘పుంగ్యే-రి’ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేయనుంది. ప్రత్యేకంగా ఆహ్వానించిన విదేశీ వార్తాసంస్థల ప్రతినిధుల సమక్షంలో 2018 మే 23-25 మధ్య అణు పరీక్షా కేంద్రాన్ని నాశనం చేసే ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఉత్తర కొరియా నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 2018 జూన్‌ 12న సింగపూర్‌లో సమావేశం కానున్నారు. 
  • ఈశాన్య ఉత్తర కొరియాలోని నిర్మానుష్య కొండప్రాంతంలో పుంగ్యే-రి ఉంది. ఇప్పటివరకు ఆ దేశం నిర్వహించిన 6 అణు పరీక్షలు ఇక్కడే జరిగాయి.
  • ఈ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేసే ప్రక్రియల్లో భాగంగా దాని సొరంగాలను పేల్చేస్తారు. వాటి ప్రవేశ మార్గాలను పూర్తిగా మూసివేస్తారు. అన్ని పరిశీలన కేంద్రాలు, పరిశోధన సంస్థలను తొలగిస్తారు.
  • చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్‌, దక్షిణ కొరియాకు చెందిన విలేకరుల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని ఉత్తర కొరియా వెల్లడించింది. కొండప్రాంతంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముండటం వల్లే ఎక్కువ దేశాల మీడియా ప్రతినిధులను ఆహ్వానించలేకపోతున్నట్లు తెలిపింది.
  • ఉత్తర కొరియా నిర్ణయాన్ని దక్షిణ కొరియా స్వాగతించింది.






















Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.