ఏప్రిల్ - 5
|
¤ జాతీయ నౌకాయాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. » డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దార్శనికత వల్లే మన దేశం నౌకాయాన రంగంలో విశేష ప్రగతిని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. » 'మన నౌకాయాన రంగం అభివృద్ధి వెనకున్న ప్రేరణ శక్తి డాక్టర్ బాబా సాహెబ్. జలశక్తి, జలరవాణా మార్గాలు, సాగునీరు, కాలువ వ్యవస్థలు, నౌకాశ్రయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగంలో ఆయన కృషి మన దేశం సుసంపన్నత సాధించడానికి బాటలు పరిచింది'అని ప్రధాని పేర్కొన్నారు.
|
ఏప్రిల్ - 10
|
¤ ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా 'ఆయుష్' మంత్రిత్వ శాఖ దిల్లీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శాస్త్రీయ సదస్సును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
|
ఏప్రిల్ - 15
|
¤ జమ్ముకశ్మీర్ లైట్ ఇన్‌ఫ్యాంట్రీ (జాక్లీ) రెజిమెంట్ 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. » భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
|
ఏప్రిల్ - 21
|
¤ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. » వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వ్యూహాలు, ప్రాథమ్య కార్యక్రమాలతో కూడిన రెండు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాల అధికారులు, కేంద్ర, రాష్ట్రాల సంస్థలకు అవార్డులు అందజేశారు. » తొలి నగదురహిత దీవిగా అవతరించిన మణిపూర్‌లోని మారుమూల ద్వీపం కరంగ్‌ను మోదీ ప్రశంసించారు. బిష్ణుపూర్ జిల్లాలోని ప్రధాన భూభాగంతో అనుసంధానమేలేని కరంగ్‌లో ఒకప్పుడు ఉగ్రవాదం రాజ్యమేలింది. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో ఇక్కడి ప్రభుత్వాధికారులు క్రియాశీలకంగా పని చేశారు. ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహకాలను అందిస్తూ కరంగ్ వాసులకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఆధార్, జన్‌ధన్ ఖాతాలనూ చేరువ చేశారు. దీంతో విద్యుత్ బిల్లులు డిజిటల్ విధానంలో చెల్లించేవారి సంఖ్య ప్రస్తుతం 97 శాతానికి పెరిగింది.
|
ఏప్రిల్ - 24
|
¤ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. » ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో 'రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. గిరిజనులు అధికంగా నివసించే మాండ్లా జిల్లాలోని రామ్‌నగర్‌లో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్ తదితర కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కుమారైలకు సురక్షిత వాతావరణం కల్పించాలంటే కుమారులను మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. » దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 'రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్' అమలుకు ప్రధాని శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల స్వావలంబన, ఆర్థిక స్థిరత్వం సాధించేలా, మరింత సమర్థంగా పనిచేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. పంచాయతీల్లో ప్రగతికి అవాంతరాలుగా నిలుస్తున్న సంక్లిష్ట అంశాలను ఈ పథకం పరిష్కరిస్తుంది. » గిరిజన నేతలతో సహా తెరవెనుక ఉండిపోయిన స్వాతంత్య్ర సంగ్రామ యోధుల సేవలు అందరికీ తెలిసేలా దేశవ్యాప్తంగా మ్యూజియంలను నిర్మించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. » జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారాలను మాండ్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. » ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జిల్లాగా ఎంపికైన కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ; పరిపాలన, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా సంబంధాలు, ఈ-ప్రగతి తదితర సామాజిక కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి సర్పంచి గారపాటి శ్రీలక్ష్మి ఈ పురస్కారాలను అందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కిర్లంపూడి, బూరుగుపూడి, చిత్తూరు జిల్లా వెంకటగిరి, విశాఖ జిల్లా అచ్యుతాపురం పంచాయతీ సర్పంచులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఉత్తమ మండల పురస్కారాలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కర్నూలు జిల్లా నందికొట్కూరు, గుంటూరు గ్రామీణం, ప్రకాశం జిల్లా సింగరాయ కొండలు ఎంపికయ్యాయి. » తెలంగాణకు ఈ-పంచాయతీ విశిష్ట పురస్కారం లభించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ శోభారాణి, సిద్దిపేట, శ్రీరాంపూర్ మండల పరిషత్ అధ్యక్షులు యాదయ్య, సారయ్య గౌడ్‌లు, గ్రామ పంచాయతీ విభాగంలో ముష్టిపల్లి, ఇర్కోడు, గంట్లవల్లి, వెలిచాల సర్పంచులు బాలయ్య, వినిత, లలిత, నర్సింగ్‌రావులు పురస్కారాలు అందుకున్నారు. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా దుద్దెనపల్లి గ్రామ సర్పంచి రాజయ్య అందుకున్నారు. ఈ పురస్కారాలను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రదానం చేశారు.
|
|
|