Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 మరణాలు

ఏప్రిల్ - 3
¤ నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా మాజీ భార్య, వర్ణ వివక్ష ఉద్యమకారిణి విన్నీ మండేలా (81) జోహన్నెస్‌బర్గ్‌లోని మిల్‌పార్క్ ఆసుపత్రిలో మార్చి 29న మరణించారు.
        »
 ఫైర్‌బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆమె సాగించిన స్ఫూర్తిదాయక పోరాటాల నేపథ్యంలో ఆమెను 'జాతికి మాతృమూర్తి'గా ఆరాధిస్తుంటారు.        » విన్నీ మాడికిజెలా మండేలా 1936లో జన్మించారు. సామాజిక సేవలో శిక్షణ పొందారు. 1950లలో నెల్సన్ మండేలాతో జరిగిన పరిచయం పరిణయానికి దారితీసింది. వారి వైవాహిక జీవితం 38 ఏళ్లపాటు సాగింది. 1992లో వారు విడిపోయారు.
ఏప్రిల్ - 15
¤ ప్రముఖ వైద్యుడు, 104, 108 అంబులెన్సు వాహనాల వ్యూహకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శి డాక్టర్ అయితరాజు పాండు రంగారావు (75) హైదరాబాద్‌లో మరణించారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభ గ్రామం.
ఏప్రిల్ - 17
¤ ప్రసిద్ధ పాత్రికేయుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత టీవీఆర్ షెణాయ్ (77) బెంగళూరులో మరణించారు.        » షెణాయ్ 'ది వీక్' పత్రిక సంపాదకుడిగా, ప్రసార భారతి కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మాతృభూమి, గల్ఫ్ న్యూస్ పత్రికలకు పనిచేశారు. 2003లో పద్మభూషణ్ అందుకున్నారు.
ఏప్రిల్ - 21
¤ కెనడా సైనికులు 'శ్వేత దేవత'గా పిలుచుకునే ఫ్రాన్స్‌కు చెందిన సిస్టర్ ఆగ్నెస్ మేరీ వలోయిస్ (103) ఫ్రాన్స్‌లోని డియెప్‌లో మరణించారు.        » 1942 ఆగస్టు 19వ తేదీ నాటి (రెండో ప్రపంచ యుద్ధ సమయంలో) డియెప్ దాడుల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న సంకీర్ణదళాల కెనడా సైనికులకు సిస్టర్ ఆగ్నెస్ నిస్వార్థంగా సేవలు చేసి వారిని కాపాడారు. జర్మనీ అధికారులతో మాట్లాడి గాయపడిన సైనికులకు చికిత్సను అందించారు. జర్మనీ దేశస్థుల కోసం కేటాయించిన సరకులను అపహరించి వారికి కడుపునిండా తిండి పెట్టేవారు. అందుకే ఆమెను అంతా ప్రేమగా 'శ్వేత దేవత' అని పిలిచేవారు.
ఏప్రిల్ - 22
¤ దశాబ్దాల పాటు లక్షలాది తెలుగు హృదయాలను ఉర్రూతలూగించిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంతరావు (99) విజయవాడలో మరణించారు.        » 1941లో చెన్నై ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, విజయవాడ ఆకాశవాణి కేంద్ర సంచాలకుడిగా 1978లో పదవీ విరమణ చేశారు. విజయవాడ ఆకాశవాణి అంటే రజనీగా, రజనీ అంటే ఆకాశవాణి అనేంతగా తన అనుబంధాన్ని పెంచుకున్నారు. విజయవాడ కేంద్రం నుంచి భక్తి రంజని, సంస్కృత పాఠాలు, ఉషశ్రీ ధర్మ సందేహాలు, ఈ మాసపు పాట, పిల్లల కార్యక్రమాలు లాంటివి ఆయన ఎన్నో ప్రారంభించారు. ఇవన్నీ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందాయి.        » వేటూరి సుందరరామ్మూర్తి ప్రసిద్ధ రచన 'సిరికాకొలను చిన్నది' రూపకాన్ని విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం చేశారు.        » స్వర్గసీమ, గృహ ప్రవేశం, పేరంటాలు, రత్నమాల, ద్రోహి, బంగారు పాప తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు.        » ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ (1981), కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (1961), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న (2007) పురస్కారాలు అందుకున్నారు.¤ జపాన్‌కు చెందిన 117 ఏళ్ల బామ్మ నబి తజిమా మృతి చెందింది. 1900, ఆగస్టు 4న కగోషిమా ప్రాంతంలోని కికాయ్ ద్వీపంలో ఆమె జన్మించిందని అధికారులు పేర్కొన్నారు.        » దేశంలో వందేళ్లు పైబడిన స్త్రీ పురుషులు 68 వేల మంది వరకు ఉన్నారని జపాన్ ప్రభుత్వం గతేడాది ప్రకటించింది.
ఏప్రిల్ - 28
¤ మెదడు సంబంధిత అనారోగ్యంతో ఏడాదికి పైగా అపస్మారక స్థితిలో ఉన్న బ్రిటన్ 'న్యాయపోరాట' బాలుడు అల్ఫీ ఎవాన్స్ (23 నెలలు) లివర్‌పూల్‌లోని ఆసుపత్రిలో మరణించారు.        » ఎవాన్స్‌ను ఇటలీలోని ఆసుపత్రికి తరలించి కాపాడుకోవాలని అతడి తల్లిదండ్రులు కోర్టులో నాలుగు నెలల పాటు న్యాయపోరాటం చేశారు. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఎవాన్స్ తల్లిదండ్రులకు మద్దతుగా ఉద్యమాలూ జరిగాయి. పోప్ ఫ్రాన్సిస్, పోలెండ్ అధ్యక్షుడు కూడా వారికి అండగా నిలిచారు.        » ఎవాన్స్‌కు ఇటలీ తమ దేశ పౌరసత్వం మంజూరు చేసింది. అయితే తదుపరి చికిత్సల వల్ల ప్రయోజనం లేదని వైద్యులు నివారించడంతో ఎవాన్స్ తల్లిదండ్రుల అభ్యర్థులను బ్రిటన్‌లోని కోర్టు ఇటీవల తిరస్కరించింది. బాలుడిని తరలించేందుకు అనుమతి నిరాకరించింది.        » 'ప్రయోజనం కన్నా, భారమే ఎక్కువ కలిగించే చికిత్సలు చిన్నారులకు కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్లు చేయకూడదని బ్రిటన్‌లో చట్టాలున్నాయి.
ఏప్రిల్ - 29
¤ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి (98) హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు.        » సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో 1929, డిసెంబరు 3న రామచంద్రారెడ్డి జన్మించారు.        » 1962 నుంచి 1989 వరకు వరుసగా సంగారెడ్డి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా నిలిచారు.        » 1989లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసన సభాపతిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.
ఏప్రిల్ - 30
¤ భారత వాయుసేన (ఐఏఎఫ్) మాజీ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ (94) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.
        » 1923 జూన్ 9న హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశాక 18 ఏళ్ల వయసులోనే ఐఏఎఫ్‌లో చేరారు. యుద్ధ విమానాలను నడపడంలో అపార అనుభవం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా యూకే వెళ్లి అధునాతన యుద్ధ విమానాలను నడపడంలో శిక్షణ పొందిన కొద్ది మంది భారతీయ పైలట్లలో ఆయన ఒకరు. 1971 యుద్ధంలో లతీఫ్ కీలక సేవలు అందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.