మార్చి - 1
|
¤ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త అణ్వాయుధ సంపత్తిని ఆవిష్కరించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నైనా అవి లక్ష్యాన్ని ఛేదించగలవని, వాటిని ఏ రక్షణ వ్యవస్థా నిలువరించలేదని స్పష్టం చేశారు. ఏ దేశం వద్దాలేని క్షిపణులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ¤ శ్వేత సౌధంతో శక్తిమంతమైన కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు హోప్‌హిక్స్ ప్రకటించారు. ట్రంప్ విశ్వసనీయ సహాయకుల్లో ఆమె ఒకరిగా ఉండేవారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల పై విచారణ ముమ్మరం అయిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు. |
మార్చి - 2
|
¤ బాలీవుడ్ నటి అనుష్క శర్మ నటించిన తాజా హిందీ చిత్రం 'పరీ' పై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఇస్లామేతర విలువలు, ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్లు, క్షుద్ర విధానాలను ఈ సినిమా ప్రోత్సహించేలా ఉండటం, కొన్ని దృశ్యాల్లో ఖురాన్ వచనాలను అభ్యంతరకరంగా ఉపయోగించారని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు పేర్కొంది. ¤ అమెరికాలో ఉత్పత్తిదార్లను రక్షించడం కోసం ఉక్కుపై 25%, అల్యూమినియంపై 10% చొప్పున దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్కు దిగుమతుల్లో ఎక్కువ వాటా ఉన్న చైనా (ర్యాంక్ 11) దీన్ని వ్యతిరేకించింది. » అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు దిగుమతిదారు. ఆ తర్వాతి స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా ఉన్నాయి. 2014-16 మధ్య అమెరికాలో ఉక్కు ఉత్పత్తి 11% తగ్గింది. దీంతో గిరాకీ పెరిగింది.ఉత్పత్తి, గిరాకీల మధ్య అంతరాన్ని పూడ్చడానికి కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్, రష్యా, తైవాన్‌లు వేగంగా తమ ఎగుమతులను అమెరికాకు పెంచుకుంటున్నాయి. |
మార్చి - 3
|
¤ పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. » ప్రధాని మోదీ 2015లో సీషెల్స్‌లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. ఈ కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని, రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. » తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తు పదార్థాల రవాణా, పైరసీ లాంటి వాటిని సమర్థంగా ఎదుర్కోవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ¤ అమెరికాలో రైలీ మంచు తుపాను వచ్చింది. తీవ్ర గాలులకు తోడు భారీ వర్షాలు, దట్టంగా మంచు కురుస్తుండటంతో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ¤ కమ్యూనిస్ట్ చైనాలో వార్షిక పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. |
మార్చి - 5
|
¤ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చైనా తన రక్షణ బడ్జెట్‌ను 8.1 శాతం మేర పెంచింది. దీంతో అది భారీగా 175 బిలియన్ డాలర్ల (రూ. 11 లక్షల కోట్ల)కు చేరింది. భారత్‌తో పోలిస్తే ఇది మూడున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. » గతేడాది 7 శాతం మేర కేటాయింపులను పెంచిన చైనా ఈసారి తన సైనిక ఆధునికీకరణకు మరింత ఊతమిచ్చేందుకు 8.1 శాతం మేర కేటాయింపులు పెంచింది. ఈమేరకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)కి సమర్పించిన బడ్జెట్ నివేదిక పేర్కొంది. » ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం విషయంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికా రక్షణ శాఖ 2019 సంవత్సరానికి 686 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కోరింది. భారతదేశ తాజా రక్షణ వ్యయం 46 బిలియన్ డాలర్లు. ¤ అమెరికా నౌకా దళానికి చెందిన విమానవాహక నౌక 'యూఎస్ఎస్ కార్ల్ విన్సన్' వియత్నాం చేరుకుంది. » 1975లో వియత్నాం పోరు ముగిశాక అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌక ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ వాదాన్ని కట్టడిచేసేందుకు రెండు దేశాలూ చేపడుతున్న చర్యలకు ఇది ఊతమిస్తుందని భావిస్తున్నారు. » కార్ల్ విన్సన్ నౌకలో 5 వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. దీనిపై 72 యుద్ధ విమానాలు ఉంటాయి. మధ్య ప్రాంతంలోని తీర నగరమైన డనాంగ్‌కు ఇది చేరుకుంది.
|
మార్చి - 6
|
¤ సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ దేశ గగనతలం ద్వారా ఇజ్రాయెల్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానాలకు అనుమతి మంజూరు చేసింది. » సౌదీ నిర్ణయంతో ఇజ్రాయెల్, భారత్ మధ్య విమాన ప్రయాణ సమయం రెండున్నర గంటలు తగ్గనుంది. » ఇజ్రాయెల్ జాతీయ విమానయాన సంస్థ ఎల్ అల్‌కు అనుమతి ఇవ్వలేదు. » ఇజ్రాయెల్, సౌదీకి మధ్య దౌత్య సంబంధాలు లేవు. అయితే ఇరాన్ పట్ల వ్యతిరేకతతో ఇరు దేశాలు లోపాయికారీగా పనిచేస్తున్నాయి.¤ మత ఘర్షణలు పెరగడంతో శ్రీలంక ప్రభుత్వం 10 రోజుల పాటు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. » కాండీ జిల్లాలో రెండు మత వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.¤ చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ నిరంతరాయంగా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది. ప్రసుత్తం రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాజ్యాంగం అనుమతినిస్తుంది. » ఈ కాల పరిమితిని రద్దు చేస్తూ రూపొందించిన రాజ్యాంగ సవరణ ముసాయిదా బిల్లును అధికార కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) పార్లమెంటు (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో ప్రవేశపెట్టింది.
|
మార్చి - 9
|
¤ భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా సంతకం చేసి ఉన్న అత్యంత ఖరీదైన ఆయన ఫొటో వాషింగ్ట్‌న్‌లో జరిగిన వేలంలో 41,806 డాలర్లు (సుమారు రూ. 27 లక్షలు పైచిలుకు) పలికింది. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు, సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన మదన్ మోహన్ మాలవీయతో కలిసి మహాత్మ గాంధీ నడుస్తూ వెళుతున్న ఈ ఫొటోను 1931 సెప్టెంబరులో లండన్‌లో తీసినట్లు వేలం నిర్వాహక సంస్థ వెల్లడించింది. అప్పట్లో బ్రిటన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తుండగా ఈ ఫొటోను తీశారు. భారత్ జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీజీ ఆ సమావేశానికి హాజరయ్యారు.
|
మార్చి - 11
|
¤ చైనాలోని ఏకపార్టీ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పు చోటు చేసుకుంది. » దేశాధ్యక్షుడి రెండు విడతల పదవీ కాలంపై ఉన్న పరిమితిని ఎత్తివేసే చరిత్రాత్మక రాజ్యాంగ సవరణకు దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. » దీంతో ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ జీవితకాలం పాటు పదవిలో కొనసాగడానికి మార్గం సుగమమైంది. » రెండో దఫా అధికారానికి లాంఛనంగా ఆమోదముద్ర పొందిన 64 ఏళ్ల జిన్‌పింగ్ ప్రస్తుతం అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ)కి, శక్తిమంతమైన సైనిక కమిషన్‌కూ నాయకత్వం వహిస్తున్నారు. » పార్టీ వ్యవస్థాపక ఛైర్మన్ మావో జెడాంగ్ తర్వాత జీవితకాలం పాటు అధికారంలో కొనసాగనున్న రెండో నేతగా ఆయన గుర్తింపు పొందనున్నారు. » ప్రస్తుతం చైనా అధ్యక్ష పదవికి అయిదేళ్ల చొప్పున రెండు సార్లు మాత్రమే అధికారంలో కొనసాగే వీలుంది. అధ్యక్షుడు నియంతలా మారకుండా ఉండేందుకు 1982లో చైనా నాయకుడు డెంగ్ జియావోపింగ్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. » అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడి పదవీ కాలంపై ఉన్న పరిమితిని ఎత్తివేసే ప్రతిపాదనపై చైనా పార్లమెంటు 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' (ఎన్‌పీసీ) లాంఛనంగా ఆమోదం తెలిపింది. » అధికార సూచనలకు అనుగుణంగా నడుచుకుంటుందనే పేరు ఎన్‌పీసీకి ఉంది. అందుకే దీన్ని 'రబ్బర్ స్టాంప్' పార్లమెంటుగా పేర్కొంటారు. తాజా ప్రతిపాదన అదే రీతిలో వ్యవహరించింది. ఎన్‌పీసీలోని 2958 మంది దీనికి అనుకూలంగా ఓటువేశారు. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. » చైనా మొదటి రాజ్యాగం 1954లో అమల్లోకి వచ్చింది. ప్రస్తుత రాజ్యాంగం 1982 నుంచి అమల్లో ఉంది. ఇప్పటివరకూ నాలుగుసార్లు (1988, 1993, 1999, 2004) సవరణలు చేశారు. » 1949 నుంచి అమల్లో ఉన్న ఏకపార్టీ వ్యవస్థలో పదవీకాల పరిమితి తొలగింపే అతిపెద్ద రాజకీయ మార్పుగా పరిగణిస్తున్నారు.¤ ధ్వనికంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలిగే హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా తెలిపింది. దీన్ని ఒక 'ఆదర్శవంతమైన ఆయుధం'గా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. » ఈ 'కింఝాల్' (డాగర్) క్షిపణిని మిగ్-31 సూపర్‌సోనిక్ జెట్ నుంచి ప్రయోగించారు. అత్యాధునిక ఆయుధాల సమీకరణలో భాగంగా ఈ ప్రయోగం చేశారు.
|
మార్చి - 12
|
| ¤ ప్రఖ్యాత రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్ రాసిన అరుదైన లేఖ అమెరికాలోని బోస్టన్‌లో నిర్వహించిన వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. దీనిపై టాల్‌స్టాయ్ సంతకం ఉంది. » తాత్వికవేత్త ప్యాట్ర్ పెట్రోవిచ్ నికోలేవ్‌కు 1903లో ఈ ఉత్తరాన్ని టాల్‌స్టాయ్ రాశారు. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. |
మార్చి - 13
|
¤ అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. వీరిద్దరి మధ్య పలుమార్లు బహిరంగంగానే మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. » టిల్లర్‌సన్ స్థానంలో అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియోను ఎంపిక చేశారు. » తాజా నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలపాలి. » సీఐఏలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న గినా హాస్పెల్‌ను ఆ సంస్థకు కొత్త అధిపతిగా ట్రంప్ ఎంపిక చేశారు. ఈ పదవిలో మహిళలను నియమించడం ఇదే మొదటిసారి. ¤ నేపాల్ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారీ (56) తిరిగి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. » అధ్యక్ష ఎన్నికలో ఆమె తన సమీప నేపాలీ కాంగ్రెస్ నాయకురాలు కుమారి లక్ష్మీరాయ్ పై విజయాన్ని సాధించారు. » నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రత్యేకంగా నిలిచిన ఆమె మరోమారు అదే పదవిలో కొనసాగనున్నారు.
|
మార్చి - 15
|
¤ ప్రపంచ వ్యాప్తంగా పన్ను ఎగవేతల కుంభకోణం 'పనామా పత్రాల' వ్యవహారంలో కేంద్ర బిందువుగా నిలిచిన మొస్సాక్ ఫోన్సెకా తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. » ప్రతిష్ఠ మసకబారడం, మీడియా ప్రచారం, ఆర్థిక పరిణామాలు, పనామాకు చెందిన కొందరు అధికారుల చర్యల వల్ల తమకు కోలుకోలేని నష్టం వాటిల్లినట్లు ఫలితంగా ఈ నెలాఖరు నుంచి పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. » 2016, ఏప్రిల్ 3న మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన డిజిటల్ రికార్డుల నుంచి 11.5 మిలియన్ పత్రాలు లీకయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు తమ అక్రమ సంపాదన కాపాడుకోవడానికి విదేశీ వ్యాపార సంస్థలను సృష్టించిన తీరును అవి కళ్లకుకట్టాయి. ¤ రాకెట్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి చైనా శాస్త్రవేత్తలు కృత్రిమ గుండెను రూపొందించారు. ఇప్పటికే వీటిని ఆరు గొర్రెలకు అమర్చగా అవన్నీ ఆరోగ్యంగా జీవనం సాగిస్తుండటం విశేషం. » 'చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ' శాస్త్రవేత్తలు విద్యుత్తును చోదకశక్తిగా మార్చే రాకెట్ సర్వో సిస్టమ్‌ను ఆధారం చేసుకుని కృత్రిమ గుండె (స్పేస్ హార్ట్)ను తయారు చేశారు. అందుకు టెడా ఇంటర్నేషనల్ కార్డియో వాస్క్యులర్ ఆసుపత్రి వైద్యుల సహాయం తీసుకున్నారు. వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసుకుని 2020 నాటికి ఇది రోగులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారుగా టీవీ వార్తల ప్రయోక్త లేరీ కద్లో (70) నియమితులు కానున్నారు. ఆర్థిక సలహాదారు పదవికి రాజీనామా చేసిన గ్యారీ కోహెన్ స్థానంలో కద్లో బాధ్యతలు చేపడతారు. » అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియాలపై ట్రంప్ భారీగా సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తు కొహెన్ పదవి నుంచి తప్పుకున్నారు.
|
మార్చి - 17
|
¤ అధ్యక్ష పీఠాన్ని షీ జిన్‌పింగ్ రెండోసారి అధిష్ఠించేందుకు చైనాలోని 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)' ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. » ఆయన జీవితాంతం ఇదే పదవిలో కొనసాగేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల రాజ్యాంగానికి సవరణ చేశారు. » 20 లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లోని అత్యున్నత కేంద్ర సైనిక కమిషన్‌కు అధిపతిగా కూడా జిన్‌పింగ్ కొనసాగేందుకు ఎన్‌పీసీ సమ్మతించింది. » జిన్‌పింగ్‌కు నమ్మిన బంటు అయిన 69 ఏళ్ల 'వాంగ్ ఖిషాన్'ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంది. వీరిద్దరూ ఇదే పదవుల్లో జీవితాంతం కొనసాగే అవకాశం ఉంది.¤ బ్రిటన్‌కు చెందిన 23 మంది దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లిపోవాలని రష్యా ఆదేశించింది. » రష్యా నిఘా విభాగంలో అధికారిగా ఉంటూనే బ్రిటన్ తరఫున గూఢచారిగా పనిచేసిన సెర్జీ స్క్రిపాల్, ఆయన కుమారైలపై ఇటీవల బ్రిటన్‌లో విషప్రయోగం జరిగి, వారి ఆరోగ్యం విషమంగా ఉంది. » ఈ విషప్రయోగం చేసింది రష్యానే అని బ్రిటన్ ఆరోపించింది. 23 మంది రష్యా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తూ బ్రిటన్ ప్రధాని థెరెసా మే నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సంబంధాలను కూడా తెంచుకున్నారు.
|
మార్చి - 18
|
¤ రష్యాలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. » ఈ ఎన్నికల్లో పుతిన్‌తోపాటు మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. న్యాయపరమైన కారణాలతో పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. » 2000 నుంచి 2008 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన పుతిన్ ఆ తర్వాత నాలుగేళ్లు ప్రధానిగా ఉన్నారు. 2012లో మూడోసారి అధ్యక్ష పీఠం చేపట్టారు.¤ చైనా ప్రధానమంత్రిగా లీ కెకియాంగ్ రెండోసారి ఎన్నికయ్యారు. » అధికార కమ్యూనిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న లీ (62) మరో ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు.¤ చైనా నూతన అవినీతి నిరోధక వ్యవస్థ (జాతీయ పర్యవేక్షణ కమిషన్)కు అధిపతిగా ఆ దేశ పార్లమెంటు యాంగ్‌షియోడును ఎన్నుకుంది.
|
మార్చి - 19
|
¤ రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం సాధించారు. » తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీనేత పావెల్ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. » తాజా విజయంతో 2024 వరకు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా నియంత జోసఫ్ స్టాలిన్ (24 ఏళ్లు) తర్వాత అత్యధిక కాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు. » పుతిన్ నాలుగోసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.¤ ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా చైనా ప్రధాని లీ కెకియాంగ్ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. » నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. » భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణశాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. » ఉపప్రధానిగా ల్యూహీ ఎంపికయ్యారు. చెన్ వెన్‌కింగ్‌కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించారు. » యీ గ్యాంగ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్‌గా నియమితులయ్యారు. » చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్ కౌన్సిలర్‌గా విదేశాంగ మంత్రి వాంగ్ యీను నియమించారు. భారత్‌తో సరిహద్దు వివాదంలో జరుగుతున్న చర్చల నేపథ్యంలో చైనా ప్రతినిధిగా ఆయన నేతృత్వం వహించనున్నారు.
|
మార్చి - 20
|
¤ ఎన్నికల ఖర్చులకు 2017లో నాటి లిబియా నియంత గడాఫీ నుంచి అక్రమంగా నిధులు పొందిన అభియోగాలపై ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని పోలీసులు నిర్బంధం (కస్టడీ) లోకి తీసుకున్నారు. » సర్కోజీ ఎన్నికల వ్యయానికిగాను గడాఫీ, అతడి కుమారుడు సైఫ్ అల్-ఇస్లామ్‌లు ఓ వ్యాపారవేత్త ద్వారా నిధులు సమకూర్చారన్నది ఒక అభియోగం.¤ పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోకుండా నిరోధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లును ఓషియో రాష్ట్రానికి చెందిన డెమోక్రాట్ సెనెటర్ షెరాడ్ బ్రౌన్ అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశ పెట్టారు. » ప్రతిపాదిత బిల్లు ప్రకారం కాంట్రాక్టులను అప్పగించే సమయంలో విదేశాలకు ఉద్యోగాలను తరలించని కంపెనీలకే అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. » కట్‌సెంటర్ ఉద్యోగాలను విదేశాలకు బదలాయిస్తున్న కంపెనీల జాబితాలను రూపొందించి బహిరంగపర్చాలి. » వినియోగదారు (సర్వీస్ కస్టమర్)కు కాల్ సెంటర్ ఉద్యోగి తాను ఎక్కడి నుంచి పని చేస్తున్నదీ వెల్లడించాల్సి ఉంటుంది. » దానితో పాటు తన కాల్‌ను అమెరికాలోని సర్వీస్ ఏజెంట్‌కు బదిలీ చేయమని కోరే హక్కు కూడా వినియోగదారుకు లభిస్తుంది.¤ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన 'కేంబ్రిడ్జి అనలిటికా' సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం చిక్కిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. ఈ దారుణ వైఫల్యంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది.
|
మార్చి - 21
|
¤ మయన్మార్ అధ్యక్షుడు హితిన్ క్యా తన పదవికి రాజీనామా చేశాడు. అధ్యక్ష విధులు, బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. » దేశ కౌన్సిలర్ ఆంగసాన్ సూకీకి హితిన్ అత్యంత విశ్వాసపాత్రుడు. 72 ఏళ్ల హితిన్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి.¤ అమెరికా వడ్డీ రేట్లు పెంచింది. » దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న భావన కల్పిస్తూ ప్రామాణిక ఫెడరల్ ఫండ్స్ రేటును అమెరికా ఫెడరల్ రిజర్వు పావు శాతం పెంచింది. » తాజా పెంపుతో ఫెడరల్ ఫండ్ రేటు 1.5 - 1.75 శాతానికి చేరింది. » ఈ ఏడాదిలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. » ఆర్థిక సంక్షోభం చేసిన గాయంతో 2008లో వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ 0.25 స్థాయికి తీసుకొచ్చింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత 2015 డిసెంబరులో వడ్డీరేట్లను పావు శాతం పెంచింది. అనంతరం 2016లో ఒకసారి, 2017లో మూడు సార్లు పావు శాతం చొప్పున పెంచుకుంటూ వచ్చింది. ఈ ఐదు సందర్భాల్లోనూ జానెట్ యెలెన్ ఫెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. » ఆమె పదవీ కాలం ముగియడంతో కొత్తగా ఫెడ్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన జెరోమ్ పావెల్ నేతృత్వంలో తాజా వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వెలువడింది.
తేదీ
|
పెంపు
|
వడ్డీరేట్ల శ్రేణి
|
2015 డిసెంబరు 17
|
0.25%
|
0.25% - 0.5%
|
2016 డిసెంబరు 15
|
0.25%
|
0.5% - 0.75%
|
2017 మార్చి 15
|
0.25%
|
0.75% - 1%
|
2017 జూన్ 14
|
0.25%
|
1% - 1.25%
|
2017 డిసెంబరు 13
|
0.25%
|
1.25% - 1.5%
|
2018 మార్చి 21
|
0.25%
|
1.5% - 1.75%
|
|
|
మార్చి - 22
|
¤ చైనాపై ట్రంప్ సర్కారు వాణిజ్య ఆంక్షలు విధించింది. ఆ దేశ దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల వార్షిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. » చైనా కారణంగా అమెరికాలో 60 వేల కర్మాగారాలు మూతపడ్డాయనీ, 60 లక్షల ఉద్యోగాలు పోయినట్లు ఆర్థికవేత్తలు చెప్పారని ట్రంప్ ఆరోపించారు. ఆమెరికా చరిత్రలోనే చైనాతో వాణిజ్యలోటు రికార్డు స్థాయిలో 375 బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.¤ మల్టీవార్‌హెడ్ (బహుళ అస్త్రముఖ) క్షిపణుల అభివృద్ధిని వేగిరపరచేందుకు దోహదపడే శక్తిమంతమైన క్షిపణి గమన వ్యవస్థను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. తనకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయిన చైనా నుంచి దీన్ని కొనుగోలు చేసింది. » భారత్ వద్ద ఉన్న ఖండాంతర క్షిపణి అగ్ని-5 ను సమర్థంగా ఎదుర్కోవాలంటే స్వయం చాలితంగా గురిని నిర్దేశించుకోగల క్షిపణి గమన వ్యవస్థలు పాకిస్థాన్‌కు అవసరమని చైనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
|
మార్చి - 23
|
¤ ట్రంప్ సర్కారు విధించిన వాణిజ్య ఆంక్షలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. » మూడు బిలియన్ డాలర్ల విలువైన 128 రకాల అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపునకు రంగం సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పెద్ద వస్తువుల జోలికి వెళ్లకుండా చిన్నచిన్న ఉత్పత్తులపైనే దృష్టి సారించినట్లు తెలిపింది. » చైనా దిగుమతులపై వార్షిక సుంకాలను 60 బిలియన్ డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు మార్చి 22న కార్యనిర్వాహక ఆదేశాలిచ్చిన క్రమంలో చైనా ఈ ఎత్తు వేసింది.¤ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) పదవి నుంచి లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెక్ మాస్టర్‌ను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. » ఆ స్థానంలో గతంలో ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేసిన జాన్ బోల్టన్‌ను నియమించారు. ¤ ఆస్ట్రేలియా తాజాగా విదేశీ నైపుణ్య ఉద్యోగాలకు కీలకమైన 457 (సబ్ క్లాజ్) కేటగిరీ వీసాలను రద్దు చేసింది. » వీటి స్థానంలో 'టెంపరరీ స్కిల్ షార్టేజి (టీఎస్ఎస్)' వీసా విధానాన్ని మార్చి 18న తీసుకొచ్చింది. ఇందులోని నిబంధనలతో విదేశీ నిపుణుల అవకాశాలకు గండి కొట్టింది. » నాటి అవసరాల మేరకు విదేశీ నిపుణులను త్వరితగతిన, సులువుగా తీసుకునేలా ఆస్ట్రేలియా 1990ల్లో '457 (సబ్‌క్లాజ్) కేటగిరీ వీసాలను' పరిచయం చేసింది. 95 వేల మంది విదేశీ ఉద్యోగులు వీటిని వినియోగిస్తుండగా అందులో 25 శాతానికి పైగా భారతీయులే. యూకే 19.5%, చైనా 5.8% మాత్రమే. » '457' వీసా కింద 650కి పైగా ఉద్యోగాలు దొరికే చోట కొత్త విధానంలో ఆ సంఖ్య 200కు పరిమితమవుతుంది. » ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావించే వారికి పెద్ద అవరోధంగా మారుతుంది.
|
మార్చి - 24
|
¤ 'వరల్డ్ ఎర్త్ అవర్'ను ఘనంగా నిర్వహించారు. » ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాత్రి 8:30 - 9:30ల మధ్య దిల్లీలోని పార్లమెంటు భవన సముదాయం, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, నిర్మాణ్ భవన్, శాస్త్రి భవన్‌ల వద్ద దీపాలను ఆర్పివేశారు.¤ అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యంలో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధించే కీలక ఆదేశంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. » కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ట్రాన్స్‌జెండర్లు సేవలందించేందుకు ఈ ఆదేశం వీలు కల్పిస్తోంది.¤ అమెరికాలో తుపాకుల సంస్కృతిని నిరసిస్తూ దాదాపు 5 లక్షల మంది వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం వరకు ర్యాలీ నిర్వహించారు. » తుపాకుల సంస్కృతిపై ఈ స్థాయిలో ఆందోళన జరగడం ఇదే ప్రథమం.
|
మార్చి - 25
|
| ¤ తుపాకుల సంస్కృతిని నిరసిస్తూ అగ్రరాజ్యంలోని యువత జరుపుతున్న ఆందోళన ర్యాలీల్లో తాజాగా పది లక్షల మందికి పైగా పాల్గొన్నారు. » అమెరికాలోని అన్ని నగరాల్లో యువత రోడ్ల పైకి వచ్చి, ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. |
మార్చి - 26
|
| ¤ భారత్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ను ఉరితీసిన 87 ఏళ్ల తర్వాత తొలిసారిగా దానికి సంబంధించిన కొన్ని దస్త్రాలను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రదర్శనగా అందుబాటులోకి తెచ్చింది. దీనిలో ఆయన ఉరితీతపై కారాగార అధికారుల ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. » బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్‌ను హతమార్చినందుకు భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురులను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. » న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వు ప్రతి, తన తండ్రితో ముఖాముఖి కోసం భగత్ సింగ్ చేసిన దరఖాస్తు, కుమారుడికి ఉరిశిక్ష విధించడం తగదంటూ భగత్‌సింగ్ తండ్రి సర్దార్ కిషన్‌సింగ్ వినతి, తనకు పత్రికలు, పుస్తకాలు సమకూర్చాలంటూ సింగ్ దాఖలు చేసిన విజ్ఞాపన, విప్లవ వీరుడు ప్రాణాలతో లేడని ధ్రువీకరిస్తూ కారాగార పర్యవేక్షకుడు రూపొందించిన పత్రం మొదలగు వాటిని ప్రదర్శనలో అందుబాటులోకి తెచ్చారు.¤ బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారిపై జరిగిన రసాయనిక దాడి సంచలనంగా మారింది. » అమెరికా సహా పలు దేశాలు రష్యాతో దౌత్యపరమైన పరోక్ష యుద్ధానికి దిగేందుకు దారితీసింది. » రసాయనిక దాడికి నిరసనగా తమ దేశాల నుంచి రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, ఉక్రెయిన్, 14 ఐరోపా సమాఖ్య దేశాలు ప్రకటించాయి. » వారి నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే స్వాగతించగా, తమ అధికారులపై వేటును రష్యా విదేశాంగ శాఖ ఆక్షేపించింది. » బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియాలపై ఇటీవల రసాయనిక దాడి జరిగింది. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్క్రిపాల్ పై దాడి చేసింది రష్యా అధికారులేనని ఆరోపణలు వెల్లువెత్తగా రష్యా వాటిని ఖండించింది. |
మార్చి - 28
|
¤ మయన్మార్ నూతన అధ్యక్షుడిగా విన్ మ్యింట్‌ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకుంది. » దేశ కౌన్సిలర్ ఆంగ్‌సాన్ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్‌డీ) అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆయనకు పార్లమెంటులో దాదాపు మూడింట రెండొంతులు ఓట్లు పడ్డాయి.
|
మార్చి - 29
|
| ¤ అంతర్జాతీయ వాహన దిగ్గజాలు టయోటా మోటార్ కార్ప్, సుజుకీ మోటర్కార్ప్‌లు జట్టు కట్టాయి. » భారత్‌లో ఒకరికి ఒకరు కార్ల తయారీ చేసుకునేందుకు ఇరు సంస్థలుఒప్పందం చేసుకున్నాయి. » ఏడాది క్రితం పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం ఈ రెండుజపాన్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. |
మార్చి - 30
|
¤ జలాంతర్గామి నుంచి 450 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ఛేదించగల 'బాబర్ క్షిపణి' (ఎస్ఎల్‌సీఎం)ని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. » అణుదాడిని ప్రతిఘటించే (సెకండ్ స్ట్రెక్) సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. కొన్నేళ్లుగా ఈ పరిజ్ఞానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్థాన్ దీన్ని సొంతం చేసుకుంది. భారత్ వద్ద ఇప్పటికే ఇలాంటి ఆయుధాలున్నాయి.¤ అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా సైన్యం తెలిపింది. సార్మాత్ అనే ఈ అస్త్రాన్ని ప్లెసెటెస్క్ నుంచి ప్రయోగించినట్లు తెలిపారు. » ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరు పొందిన 'వోయేవోడా' (సాతాన్) అనే క్షిపణి స్థానంలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. » సార్మాత్ బరువు 200 టన్నులు. ఇది సాతాన్ కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఉత్తర, దక్షిణ ధ్రువాల గుండా పయనిస్తూ ప్రపంచంలో ఏ లక్ష్యం మీదైనా విరుచుకుపడగలదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇది పెద్ద సంఖ్యలో అణు వార్‌హెడ్లను కూడా మోసుకెళ్లగలదని తెలిపారు. ఇవి శత్రు దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఏమార్చగలదని వివరించారు.
|
|
|