¤ అజర్‌బైజాన్ రాజధాని బాకూలో అలీనోద్యమ (ఎన్ఏఎం) దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు. » ప్రపంచ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం పెనుముప్పులా పరిణమించిందని సుష్మా పునరుద్ఘాటించారు.
ఏప్రిల్ - 10
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తొలి 'ఆనంద నగరాల' సదస్సును మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ప్రారంభించారు.» 80 దేశాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగర ప్రణాళిక నిపుణులు, ఆర్కిటెక్ట్‌లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులు హాజరయ్యారు.» వర్ధమాన దేశాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటికి వినూత్న పరిష్కారాలు, నవ్య ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తారు.» అమరావతి నగర బృహత్తర ప్రణాళిక, ఆకృతికి ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) 'గ్రీన్ సిటీ ప్లాటినమ్' పురస్కారం దక్కింది.¤ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సును కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సదస్సును ప్రారంభించారు.» రాష్ట్రాలకు నిధులు బదలాయించడానికి రూపొందించిన పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షపూరితమని మూడు దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించాయి. వీటిని వెంటనే రద్దు చేసి కొత్త విధివిధానాలు రూపొందించాలని డిమాండ్ చేశాయి.» ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ ఆర్థిక మంత్రి టి.ఎం.థామస్, కర్ణాటక తరఫున ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ సామి కూడా హాజరయ్యారు.» ఈ సదస్సుకు తెలంగాణ, తమిళనాడు హాజరుకాలేదు.
ఏప్రిల్ - 11
¤ 16వ అంతర్జాతీయ ఇంధన సదస్సు (ఐఈఎఫ్) మంత్రివర్గ సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు.» ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఇంధనాన్ని అందరికీ అందుబాటు ధరలోకి తీసుకురావాలంటే బాధ్యతాయుత ధరలపై అంతర్జాతీయ ఏకాభిప్రాయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు.
ఏప్రిల్ - 17
¤ బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆధ్వర్యంలో జీఎస్టీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు.
ఏప్రిల్ - 19
¤ రెండో ఎలిజబెత్ రాణి ఛోగమ్ సదస్సును లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ప్రారంభించారు.» ఛోగమ్‌లో సభ్యత్వం ఉన్న 53 దేశాల నుంచి నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.» కామన్వెల్త్ దేశాల కూటమికి అధినేతగా తన స్థానంలో యువరాజు ఛార్లెస్‌ను వారసుడిగా నియమించాల్సిందిగా రాణి విజ్ఞప్తి చేశారు. నిజానికి కామన్వెల్త్ కూటమి అధినాయకత్వం వారసత్వ పదవి కాదు. రాణి తదనంతరం ఛార్లెస్ (69) నేరుగా ఈ పదవిని చేపట్టే అవకాశం లేదు.
ఏప్రిల్ - 20
¤ లండన్‌లోని విండ్‌సర్ కోటలో రెండు రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ దేశాధినేతల (ఛోగమ్) సదస్సు ముగిసింది.» రహస్యంగా జరిగిన ఈ భేటీలో కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ ఛార్లెస్ (69) నియామకానికి 53 దేశాల అధినేతలు ఆమోదముద్ర వేశారు.» ఛార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజిబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు. ప్రధాని మోదీ సహా పలు దేశాధినేతలంతా తమ సహాయకులెవరూ లేకుండానే సదస్సులో పాల్గొన్నారు.