¤ ప్రభుత్వ రంగ బ్యాంకులు 2014 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబరు మధ్యకాలంలో రూ.2.41 లక్షల కోట్ల మేర రుణాలు రద్దు (రైట్ - ఆఫ్) చేసినట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. » ఆస్తులు అప్పుల పట్టిక నుంచి నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలను తీసివేసేందుకే బ్యాంకులు ఈ రుణాలను రద్దు చేసినట్లుగా పేర్కొంటాయని, అయితే రుణ గ్రహీతలు ఎప్పటికైనా వాటిని తిరిగి చెల్లించాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా రాజ్యసభలో ప్రకటించారు.
ఏప్రిల్ - 5
¤ 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను ముంబయిలో ప్రకటించింది. తొలి సమీక్షలో భాగంగా ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన భేటీ అయి తగు నిర్ణయాలను తీసుకుంది. » రెపో రేటు యథాతథంగా 6 శాతం వద్దే కొనసాగించారు. రివర్స్ రెపో రేటు 5.75 శాతం, బ్యాంక్ రేటు 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) యథాతథంగా 4 శాతంగా కొనసాగించారు. » 2018 - 19 తొలి భాగంలో ద్రవ్యోల్బణ అంచనాల తగ్గింపు 4.7 - 5.1 శాతానికి, మలి భాగంలో 4.4 శాతానికి కుదించారు. » 2017 - 18లో 6.6 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు 2018 - 19లో 7.4 శాతానికి చేరవచ్చు. ఇది 2018 - 19 ప్రథమార్థంలో 7.3 - 7.4 శాతంగా ద్వితీయార్థంలో 7.3 - 7.5 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. » వర్చువల్ కరెన్సీలపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. అదే సమయంలో బిట్ కాయిన్‌ల తరహాలో సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికోసం ఒక అంతర్విభాగ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురావడంలోని సాధ్యాసాధ్యాలపై పరిశోధన చేసి మార్గదర్శకాలను జారీ చేస్తుంది. » వినియోగదార్ల సమాచార భద్రత నిమిత్తం దేశంలోని అన్ని చెల్లింపుల వ్యవస్థ ఆపరేటర్లు మొత్తం సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని ఆర్‌బీఐ సూచించింది. ఆ ఆదేశాలను పాటించడానికి ఆరు నెలల గడువును ఇస్తున్నట్లు పేర్కొంది. » తదుపరి పరపతి విధాన కమిటీ సమావేశం జూన్ 5, 6 తేదీల్లో జరగనుంది.
ఏప్రిల్ - 10
¤ పాన్ దరఖాస్తుల్లో ఇకపై ట్రాన్స్‌జెండర్లకు స్వతంత్ర కేటగిరీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించింది.
ఏప్రిల్ - 12
¤ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నెలకొల్పే అంకురాలకు పెట్టుబడులు (ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చినవి సహా) రూ. 10 కోట్లలోపు ఉంటే పూర్తిస్థాయి పన్ను మినహాయింపును పొందడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. » వాణిజ్య, పరిశ్రమల శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 100% పన్ను మినహాయింపు వర్తించాలంటే సదరు అంకుర సంస్థలో వాటాను కొనుగోలు చేసే ఏంజెల్ ఇన్వెస్టరుకు కనీసం రూ. 2 కోట్ల నికర విలువ ఉండాలి లేదా అంతక్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున రూ. 25 లక్షలకు పైగా సగటు ఆదాయాన్ని పొంది ఉండాలి.
ఏప్రిల్ - 19
¤ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విక్రయాలను నమోదు చేసిన వాహనాలలో మారుతీ ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. తొలి 10 కార్లలో ఏడు మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన మోడళ్లు ఉన్నాయి. » భారత వాహన తయారీదార్ల సంఘం సియామ్ (SIAM) నివేదిక ప్రకారం 'హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందిన మూడు మోడళ్లు జాబితాలో చోటు సంపాదించాయి. » 2017 - 18లో అత్యధికంగా 2,58,549 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి. 2016 - 17లో మూడో స్థానంలో ఉన్న డిజైర్, ఈ సారి రెండో స్థానానికి ఎగబాకింది. బాలెనో మూడో స్థానంలో నిలవగా, స్విఫ్ట్ రెండో స్థానం నుంచి అయిదో స్థానానికి పరిమితమైంది.
ఏప్రిల్ - 27
¤ భారత రుణ రేటింగ్‌ను పెంచడానికి వరుసగా 12వ ఏడాదీ ఫిచ్ నిరాకరించింది. స్థిరమైన భవిష్యత్ అంచనాతో బీబీబీ - (అతి తక్కువ పెట్టుబడుల (గ్రేడ్) రేటింగ్‌ను ఆ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ కొనసాగించింది. బలహీన ద్రవ్య సమతౌల్యతలు కొనసాగడం రేటింగ్ సవరణకు అడ్డుగా నిలిచిందని తెలిపింది. » ఆగస్టు 1, 2006న భారత సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ బీబీబీ+ నుంచి బీబీబీ- (స్థిర భవిష్యత్ అంచనాలతో)కు పెంచింది. ఆ తర్వాత రేటింగ్‌ను పెంచలేదు.