¤ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో దిల్లీలో జరిగిన జీఎస్‌టీ మండలి 26వ సమావేశంలో ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో అంతరాష్ట్ర సరఫరాకు ఈ-వే బిల్లు తప్పనిసరి అని ఆర్థికమంత్రి వెల్లడించారు. » ఒకే రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య (ఇంట్రా స్టేట్) సరకు రవాణాకు ఈ-వే బిల్లు విధానాన్ని ఏప్రిల్ 15 నుంచి దశలవారీగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.¤ దిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో చట్టసభల సభ్యుల జాతీయ సదస్సు 'ప్రగతి కోసం మనం' (వుయ్ ఫర్ డెవలప్‌మెంట్)ను నిర్వహించారు. » కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల చట్టసభల సభ్యులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. » దేశంలోని అత్యంత వెనుకబడిన 115 జిల్లాలు సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయడం అంటే సామాజిక న్యాయం సాధన దిశగా ముందడుగు వేయడమేనని మోదీ అభివర్ణించారు. » వెనుకబడిన (బ్యాక్‌వర్డ్) జిల్లాలను అభ్యుదయేచ్ఛ (ఆస్పిరేషనల్) జిల్లాలుగా పిలవాలని స్పష్టం చేశారు. 'వెనుకబడిన' అనే పదంలో ప్రతికూల భావన ధ్వనిస్తుందన్నారు. » అభ్యుదయేచ్ఛ జిల్లాల్లో యువ కలెక్టర్లను మాత్రమే నియమించాలని, అప్పుడే అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. » లోక్‌సభ సభాపతి సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ రెండురోజుల 'చట్టసభల సభ్యుల జాతీయ సదస్సు'కు తెలుగు మహిళా ఎంపీలు కల్వకుంట్ల కవిత, కొత్తపల్లి గీత సంధానకర్తలుగా వ్యవహరించారు.
మార్చి - 11
¤ భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన 'అంతర్జాతీయ సౌరకూటమి' (ఐఎస్ఏ) తొలి సదస్సులో పాల్గొన్నారు. » పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 2022 నాటికి 175 గిగావాట్ల విద్యుత్తును భారత్ ఉత్పత్తి చేయబోతోందని, ప్రస్తుత సామర్థ్యం కంటే ఇది రెట్టింపు అని ప్రధాని వివరించారు. » సౌర కూటమిలో 121 దేశాలు రావడానికి కీలకపాత్ర పోషించిన మోదీ ఈ సదస్సు వేదికగా 10 కార్యాచరణ అంశాలను ప్రతిపాదించారు. » 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా చూడాలనీ, దీనికి అవసరమైన ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.67 లక్షల కోట్లు)ను సమీకరించాలని ఐఎస్ఏ లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. » వర్ధమాన దేశాల్లో సౌరవిద్యుత్తు ప్రాజెక్టులకు 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9300 కోట్లు) విరాళాన్ని భారత్ ఇస్తుందని ప్రధాని ప్రకటించారు. » తొలి సదస్సు ద్వారా ఐఎస్ఏను లాంఛనంగా ప్రారంభించారు. 23 దేశాధినేతలు సహా అనేకమంది సదస్సులో పాల్గొన్నారు. » 2030 నాటికి ఒక టెరావాట్ సౌరవిద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, సామాజిక సంస్థలు ముందుకు రావాల్సి ఉందని మెక్రాన్ పిలుపునిచ్చారు. ఇందులో తమ వంతుగా బిలియన్ యూరోలు (దాదాపు రూ.8000 కోట్లు) వెచ్చించనున్నట్లు ప్రకటించారు.
మార్చి - 16
¤ 105వ భారత వైజ్ఞానిక సదస్సు (ఇండియన్ సైన్స్ కాంగ్రెస్)ను ఇంఫాల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారంలో శాస్త్ర సాంకేతికతలు కీలక పాత్ర వహిస్తాయని మోదీ పేర్కొన్నారు. ప్రజాహితం కోసం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ప్రయోగశాలల నుంచి సమాజం మధ్యకు విస్తరించాలని పిలుపునిచ్చారు. » విద్యుత్ తయారీలో శిలాజేతర ఇంధనాల వాటాను 2030 కల్లా 40 శాతానికి పెంచాలనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉందని మోదీ వెల్లడించారు.¤ దిల్లీలో న్యూస్-18 ఏర్పాటు చేసిన 'రైజింగ్ ఇండియా' సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. » ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను మోదీ వివరించారు.
మార్చి - 20
¤ డబ్ల్యూటీవో దేశాల మంత్రుల స్థాయి అనాధికార సదస్సును దిల్లీలో నిర్వహించారు. » భారత్ పిలుపు మేరకు ఈ సమావేశాలకు అమెరికా, చైనా సహా 53 డబ్ల్యూటీవో సభ్యదేశాలు తమ ప్రతినిధులను పంపించాయి. » ఉక్కు, అల్యూమినియం పై దిగుమతి సుంకం పెంచుతూ అమెరికా ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం చర్యతో ఇతర దేశాలు కూడా దిగుమతులను పరిమితం చేసే చర్యలకు పూనుకునే అవకాశముందని సూచించాయి. ఫలితంగా వాణిజ్య యుద్ధం తలెత్తే ముప్పు ఉందని భయాందోళన వ్యక్తం చేశాయి.
మార్చి - 29
¤ సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చించడానికి భారత్, పాకిస్థాన్ 'శాశ్వత సింధు కమిషన్' సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు. » సాధారణ, పాలనాపరమైన అంశాలు, వరదల డేటా ప్రాజెక్టులకు సంబంధించిన మొదలైన అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. » భారత బృందంలో సింధు జలాల కమిషనర్ పి.కె. సక్సేనా, పాక్ బృందానికి సయ్యద్ మెహర్ అలీషా నాయకత్వం వహిస్తున్నారు.