మార్చి - 1
|
రాష్ట్రీయం - టీఎస్¤ రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వైమానిక సెజ్‌లో టాటా బోయింగ్ వైమానిక ఉత్పత్తుల పరిశ్రమను కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, టాటాసన్స్ ఛైర్మన్ రతన్‌టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్‌లతో కలిసి ప్రారంభించారు. » ఇక్కడ తయారవుతున్న అపాచీ హెలికాప్టర్ - 64 భాగాలను, వైమానిక పరికరాలను ఈ సందర్భంగా వీరు పరిశీలించారు. » ఈ ప్రాజెక్టును 2016, జూన్ 18న అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిధులు అప్పట్లో తెలిపారు. 20 నెలల వ్యవధిలోనే పూర్తి చేశారు. » అపాచీ హెలికాప్టర్లకు ఇప్పుడు అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉంది. అమెరికా సైన్యం వీటిని యుద్ధంలో ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2300 అపాచీ హెలికాప్టర్లు వాడుకలో ఉన్నాయి. ¤ క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్సలో భాగంగా రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు, ముందస్తు గుర్తింపు పరీక్షలు, శిక్షణ, పరిశోధన, సాంకేతిక సహకారం, అనుభవజ్ఞులైన వైద్యుల సలహాలు, సూచనలు, మౌలిక వసతుల కల్పనలో తోడ్పాటు తదితర అంశాలపై టాటా ట్రస్టుతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.. » హైదారబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రతన్‌టాటా, మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు. » క్యాన్సర్ కేసుల్లో దేశం మొత్తం మీద తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 9(3) కింద చెప్పినట్లుగా రాష్ట్రంలో అత్యాధునిక గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. » అమరావతి సమీపంలో 250 ఎకరాల్లో రెండు యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది.
|
మార్చి - 2
|
రాష్ట్రీయం - టీఎస్, ఏపీ¤ హైదరాబాద్‌లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో మార్చి నెలాఖరు వరకూ తెలుగు రాష్ట్రాలు ఎంత నీరు వినియోగించుకోవాలో ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 26.38 టీఎంసీలు, తెలంగాణకు 19 టీఎంసీలను కేటాయించారు. » శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి కూడా అవసరమైన నీరు తీసుకునేందుకు నిర్ణయించారు. ¤ డిజిటల్ ప్రొవైడర్లకీ, చిత్ర పరిశ్రమకీ మధ్య వర్చువల్ ప్రింట్ ఫీజు (వి.పి.ఎఫ్) విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. నిర్మాతలు తమ చిత్రాలకు సంబంధించిన ప్రింట్‌ను ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 1600 థియేటర్లలో ప్రదర్శనలు ఆగిపోయాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు, కేరళలో పూర్తి ప్రదర్శనలు నిలిచిపోగా, కర్ణాటక, తమిళనాడులో పాక్షికంగా నిలిచిపోయాయి. రాష్ట్రీయం - ఏపీ¤ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కరణ కేంద్ర (ఇన్నోవేషన్ సెంటర్) ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే వారణాసిలో ఒక కేంద్రం అందుబాటులో ఉండగా, దక్షిణ భారతదేశంలో ఏపీని ఎంచుకుంది. |
మార్చి - 3
|
| రాష్ట్రీయం - టీఎస్¤ ఆస్ట్రేలియాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాదీ అమ్మాయి బుడ్డా అరుణ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల నజరానా అందించింది. |
మార్చి - 4
|
రాష్ట్రీయం - టీఎస్¤ రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ ఏర్పడింది. తెలంగాణ ప్రజల పార్టీ పేరుతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అధ్యక్షతన నూతన పార్టీని స్థాపించారు.¤ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం బుడ్డా అరుణ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ రూ.2 కోట్లు నజరానా ప్రకటించారు. » ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున అరుణకు మంత్రి పద్మారావు రూ.20 లక్షలు ప్రోత్సాహకంగా అందించారు.రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, అయిదేళ్లలోపు పిల్లల కోసం గిరి చంద్రన్న దీవెన పేరుతో ప్రతినెలా పౌష్టికాహారాల బుట్ట (న్యూట్రీ బాస్కెట్) ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.¤ రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఆరోగ్య బులెటిన్లను సీఎం చంద్రబాబు ఉండవల్లి ప్రజా దర్బార్ మందిరంలో విడుదల చేశారు. చిన్నారుల ఆరోగ్యం కోసం నిర్వహించే పలకరింపు కార్యక్రమాన్ని కూడా ఇదే వేదిక నుంచి సీఎం ప్రారంభించారు. » ప్రతి నెలా 4న రాష్ట్ర స్థాయి ఆరోగ్య బులెటిన్‌ను తాను విడుదల చేస్తానని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. » పలకరింపులో భాగంగా మార్చి 5 నుంచి 31 వరకు రాష్ట్రంలోని 50 లక్షల చిన్నారుల ఇళ్లకు 57,555 బృందాలకు చెందిన అంగన్‌వాడీ, ఆశ, మెప్మా కార్యకర్తలు వెళ్లి వివరాలను సేకరిస్తారు.
|
మార్చి - 5
|
రాష్ట్రీయం - ఏపీ¤ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. » ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, ఇచ్చిన హామీల ప్రకారం ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వం నిధులతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, రైల్వేజోన్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అమరావతికి ఆర్థిక సాయం, నెల్లూరులో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తదితర అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. » 2029 వరకూ క్రమం తప్పకుండా 12 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.¤ రాష్ట్రంలో తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (1800 425 1899)ను ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రీయం - ఏపీ, టీఎస్ ¤ స్వచ్ఛ భారత్ మిషన్ కింద నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 29,47,240; తెలంగాణలో 22,30,093 మరుగుదొడ్లు నిర్మించినట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. ఇప్పటి వరకూ ఏపీలో 11.56 శాతం, తెలంగాణలో 17.62 శాతం కుటుంబాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని వెల్లడించింది.
|
మార్చి - 6
|
రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వే స్టేషన్‌గా అవతరించింది. దక్షిణ మద్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ ఈ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఇక్కడి కార్యకలాపాల నిర్వహణను మొత్తం మహిళలకే అప్పగించారు. » అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చంద్రగిరిని మహిళా రైల్వేస్టేషన్‌గా ప్రకటించింది. హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్‌ను సైతం ఈ విభాగంలో ఎంపిక చేశారు.రాష్ట్రీయం - ఏపీ¤ విశాఖలోని రుషికొండ బీచ్ 'బ్లూఫ్లాగ్' ధ్రువీకరణకు ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈవిధంగా ఎంపికైన ఏకైక బీచ్ ఇదే.
|
మార్చి - 8
|
రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వీహబ్)ను హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. » అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయ ప్రాంగణంలోని టీ శాట్ కార్యాలయంలో వీహబ్‌ను వంద సీట్లతో ప్రారంభించారు.¤ స్వయం ఉపాధి పథకాల్లో ఎస్సీ, ఎస్టీల తరహాలో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీ) రాయితీలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. » బీసీలకు రూ. లక్ష నుంచి రూ.12 లక్షల వరకు విలువైన యూనిట్లు నెలకొల్పేలా ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఎంబీసీలకు రూ.లక్ష రుణాలకు 80 శాతం (రూ.80 వేలు), రూ.2 లక్షల లోపు రుణాలకు 70 శాతం, రూ.212 లక్షల రుణాలకు 60 శాతం (గరిష్ఠంగా రూ.5 లక్షలు) రాయితీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎంబీసీలకు అమలు చేయనున్న స్వయం ఉపాధి పథకాల రాయితీ దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.¤ ప్రతిష్ఠాత్మక నారీశక్తి అవార్డును బండారి జయమ్మకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. » సెక్స్‌వర్కర్ల కుటుంబాల రక్షణ, హెచ్ఐవీ కేసుల నియంత్రణకు బండారి జయమ్మ కృషిచేస్తున్నారు. ¤ తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రై.స.స.) సంస్థ మొట్టమొదటి ఛైర్మన్, డైరెక్టర్‌గా నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » సమితి ఎండీగా రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్, డైరెక్టర్లుగా ఉద్యానవన సంచాలకుడు ఎల్. వెంకట్రామి రెడ్డి, మార్కెటింగ్ సంచాలకులు జి.లక్ష్మీబాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా సీహెచ్‌వీ సాయిప్రసాద్ వ్యవహరిస్తారు. » రైతు సమన్వయ సమితి లాభరహిత సంస్థగా కంపెనీల చట్టం కింద ప్రభుత్వం నమోదు చేసింది. » సుఖేందర్ రెడ్డి 1995 నుంచి 1999 వరకూ ఏపీ రాష్ట్ర పాడి ఉత్పత్తిదారుల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1998లో జాతీయ పాడి ఉత్పత్తిదారుల అభివృద్ధి మండలి సంచాలకునిగా పనిచేశారు.రాష్ట్రీయం - ఏపీ¤ తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, శాస్త్ర సాంకేతిక సహాయమంత్రి సుజనా చౌదరి తమ పదవులకు రాజీనామా చేశారు.¤ భాజపాకు చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను అమరావతిలో సీఎం చంద్రబాబుకు అందజేశారు.¤ పశ్చిమ గోదావరి జిల్లాలోని రుద్రంకోట, తూర్పు గోదావరిలోని రాయినిపేట గ్రామాల్లో 250కు పైగా ఆదిమానవుల సమాధులను గుర్తించి తవ్వకాలు చేపట్టారు. ఈ సమాధుల్లో వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అనేక ఆనవాళ్లను గుర్తించారు.
|
మార్చి - 9
|
రాష్ట్రీయం - తెలంగాణ¤ వ్యవసాయ విద్యుత్ రాయితీల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017 - 18)లో మొత్తం రూ.4466.89 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో)కు వీటిని నెలవారీగా విడుదల చేస్తోంది.రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్¤ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో సవివరంగా వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో 50 పేజీల్లో 19 అంశాలపై దృష్టి పెట్టి విశదీకరించారు. దీన్ని తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రచురించాలని నిర్ణయించింది.
|
మార్చి - 10
|
రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్¤ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను గెలుచుకుంది. ఆసియా అత్యంత ప్రశంసాత్మక బ్రాండ్ అవార్డుతోపాటు, భారతదేశంలో 50లోపు బెస్ట్ సీఎఫ్‌వో(చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్) అవార్డును సొంతం చేసుకుంది.¤ తమిళనాడులో తెలుగు సాంస్కృతిక కేంద్రం, తెలుగు అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
|
మార్చి - 11
|
రాష్ట్రీయం-టీఎస్¤ 2018 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది. ¤ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ సీనియర్ నాయకురాలు చెన్నబోయిన కమలమ్మ (90) హైదరాబాద్‌లో మరణించారు. » సై సై గోపాల్‌రెడ్డి పాటతో నిజాంను గడగడలాడించిన వీరవనితగా కమలమ్మ పేరొందారు. భర్త అప్పన్నతో కలిసి సాయుధ పోరాటంలో ఆమె పాల్గొన్నారు. ఆ క్రమంలోనే కొడుకుని ఓ తండాలోని గిరిజనులకు అప్పగించి పోరుబాటలో కొనసాగారు.
|
మార్చి - 12
|
రాష్ట్రీయం - టీఎస్ ¤ తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగించారు.ముఖ్యాంశాలు 'ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 4 శాతం. అప్పటి భారతదేశ వృద్ధిరేటు 5.9 శాతం కన్నా తక్కువగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-17 మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 8.6 శాతానికి పెరిగింది. ఇది ఇప్పటి జాతీయ సగటు 7.5 శాతం కన్నా అధికం. జాతీయ తలసరి ఆదాయం రూ. 1.03 లక్షలైతే, తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1.54 లక్షలైంది' అని గవర్నర్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశామని గవర్నర్ వెల్లడించారు. గత జనవరి ఒకటి నుంచి దాదాపు 23 లక్షల పంపు సెట్లకు, ఎత్తిపోతల పథకాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధనలో భాగంగా ప్రస్తుతం 15,344 మెగావాట్ల విద్యుత్తు సమకూర్చుకోగలుగుతున్నామని, మరో 12,931 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణ దశల్లో ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర సౌర విధానం దేశంలోనే అత్యుత్తమమైందని, 3283 మెగావాట్ల స్థాపిత సౌరవిద్యుత్‌తో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. నేతన్నకు చేయూత పథకం కింద పొదుపు నిధిలో ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మండలి కేంద్రాలను జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసేందుకు 4665 కిలోమీటర్ల రోడ్లను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదల రోజువారీ అవసరాలను తీర్చేందుకు సామాజిక భద్రత పథకం కింద 41.78 లక్షల మందికి లబ్ది చేకూర్చినట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.¤ బడ్జెట్ సమావేశాల తొలిరోజు శాసనసభ నిరసనలతో మొదలైంది. గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలింది. » గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపి భాజపా సభ్యులు సైతం బయటికి వెళ్లిపోయారు.¤ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా బి.మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. » రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పేర్వారం రాములు సమక్షంలో ఆయన విధుల్లో చేరారు.¤ జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ 'ఇసె (ఐఎస్ఈ) ఫుడ్స్' తెలంగాణలో పరిశ్రమలను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. » సిద్దిపేట జిల్లా నర్మెట్ల గ్రామంలో 140 ఎకరాల్లో కోడిగుడ్ల శుద్ధి, వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ పరిశ్రమలను, సుజుకీ కంపెనీ భాగస్వామ్యంతో లిథియం అయాన్ బ్యాటరీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
|
మార్చి - 13
|
రాష్ట్రీయం-టీఎస్¤ కాంగ్రెస్ శాసనసభ పక్షనాయకుడు సహా 11 మందిని, శాసనమండలిలో విపక్షనేత సహా ఆరుగురు సభ్యులను బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ, మండలిలో నిర్ణయం తీసుకున్నారు. » నల్గొండ, అలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దుచేస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంది. » సభా కార్యకలాపాలకు భంగం కలిగించడంతో పాటు దాడికి పాల్పడినందుకు వీరిపై ఈ చర్యలను తీసుకుంది. » ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేయటం దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే తొలిసారి.రాష్ట్రీయం-ఏపీ¤ రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ) నివేదిక- 2017ను విడుదల చేసింది.ముఖ్యాంశాలు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని పేదరిక, మానవాభివృద్ధి విభాగం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2005-06లో రాష్ట్ర జనాభాలో 41.6 శాతంగా ఉన్న బహుముఖ పేదల సంఖ్య 2016-17 నాటికి 21 శాతానికి తగ్గింది. ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ నివేదికతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ 51వ స్థానంలో (ఎంపీఐ విలువ 0.0825) ఉండగా, భారత్ 66వ స్థానంలో (0.1911) నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని 21 శాతం జనాభా విద్య, ఆరోగ్యంతోపాటు ఇతర జీవన ప్రమాణాల్లో వెనుకబడి ఉంది. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఇలాంటి వారిసంఖ్య అత్యధికంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా అత్యంత మెరుగ్గా ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తారు. అందుకు భిన్నంగా గత కొంతకాలంగా విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలకు సంబంధించిన మొత్తం పది అంశాలను ఆధారంగా చేసుకుని పేదరికాన్ని గణిస్తున్నారు. వీటిల్లో మూడొంతులు అంతకంటే ఎక్కువ అంశాలను పొందలేని వారిని బహుముఖ పేదలుగా పేర్కొంటున్నారు. ఇంటి నుంచి కనీసం 30 నిమిషాల దూరం నడిస్తేకానీ సురక్షిత తాగునీరు పొందలేనివారు 12 శాతం ఉన్నారు. ఈ సమస్య రాష్ట్రం మొత్తంమీద కర్నూలులో ఎక్కువగా ఉంది. ఆ జిల్లా జనాభాలో 30 శాతం మంది ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పక్కా ఇళ్లకు నోచుకోని వారు 14 శాతం ఉన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం మధ్య జీవించనివారు 29 శాతం ఉన్నారు. విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత అధికం. విద్యుత్తు సౌకర్యం లేనివారు 2 శాతం ఉన్నారు. బడి వయసు బాలల్లో కనీసం ఒక్కరినైనా పాఠశాలకు పంపని కుటుంబాలు 3 శాతం ఉన్నాయి. సామాజిక వర్గాలవారీగా బహుముఖ పేదరికం ఇలా ఉంది: ఎస్సీ 24%, ఎస్టీ 31 శాతం, ఓబీసీ 21 శాతం, జనరల్ 16 శాతం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా బహుముఖ పేదరికం 19, 22 శాతాలుగా ఉంది. జిల్లాలవారీగా బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ) ఎలా ఉంది.
తూర్పు గోదావరి
|
-
|
0.0468
|
నెల్లూరు
|
-
|
0.0610
|
చిత్తూరు
|
-
|
0.0696
|
శ్రీకాకుళం
|
-
|
0.0696
|
పశ్చిమ గోదావరి
|
-
|
0.0705
|
గుంటూరు
|
-
|
0.0731
|
కృష్ణా
|
-
|
0.0816
|
కడప
|
-
|
0.0851
|
ప్రకాశం
|
-
|
0.0865
|
విశాఖపట్నం
|
-
|
0.0884
|
అనంతపురం
|
-
|
0.1079
|
కర్నూలు
|
-
|
0.1191
|
విజయనగరం
|
-
|
0.1271
|
|
ఈ సూచిక 0 నుంచి 1 మధ్య ఉంటుంది. 0 అంటే ఉత్తమమైందిగా పరిగణిస్తారు. 1 అంటే అధ్వాన్నస్థితిలో ఉన్నట్లుగా పరిగణిస్తారు.
|
మార్చి - 14
|
రాష్ట్రీయం - తెలంగాణ ¤ రాబోయే ఏడాది నుంచి ఎకరానికి రూ.8 వేల చొప్పున ఇచ్చే పెట్టుబడి పథకానికి 'రైతులక్ష్మి' అనే పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పథకం కింద చెక్కులను ఏప్రిల్ నుంచి 3 దఫాలుగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది.¤ తెలంగాణలో జీవశాస్త్రాల రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్ణయించింది.రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్¤ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సేవా సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఆదరణ పథకాన్ని సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. కులవృత్తి/చేతి వృత్తిదారుల ఆదాయాన్ని పెంచడానికి ఆధునిక పనిముట్ల పంపిణీని ఆదరణ పథకం కింద చేపడతారు. మార్కెట్ అవసరాలకు తగిన విధంగా నాణ్యమైన సేవలందించేలా, ఆధునిక శిక్షణ అందిస్తారు. » ఆదరణ పథకం ద్వారా రూ.10,000, 20,000, 30,000ల మొత్తాన్ని 3 స్థాయిల్లో ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. దీనిలో 70% సబ్సిడీ, 20% రుణం, 10% లబ్దిదారుల వాటాతో ఆధునిక పనిముట్లకోసం కేటాయిస్తారు.
|
మార్చి - 15
|
రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్¤ ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగింది. భాజపాతో పొత్తుకి స్వస్తి పలికింది. విభజన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ మంత్రుల్ని వెనక్కి తీసుకున్న తెదేపా తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.¤ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని 41వ ఏట అడుగిడుతున్న సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అంతా కలిసి అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు.
|
మార్చి - 18
|
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి ఉగాది సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా 47 మందికి కళారత్న అవార్డులు, 99 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు అందజేశారు.¤ రైతులకు ఎలాంటి ఇబ్బంది రానీయకుండా ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన కందుల నిల్వలన్నీ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.¤ ప్రకాశం జిల్లాకు చెందిన రైతు కట్టా రామకృష్ణ జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారు. » భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ)ల నుంచి ఫెలో (అవుట్‌స్టాండింగ్ డిగ్రీ) సాధించారు. » దిల్లీలో మూడు రోజులుగా ఐసీఏఆర్ - ఐఏఆర్ఐ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి ఉన్నతి మేళాలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా రామకృష్ణ ఈ డిగ్రీ అవార్డును స్వీకరించారు. » పంటల్లో సూక్ష్మ పోషకాలు, వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, సేంద్రీయ వ్యవసాయం తదితర అంశాలపై సుమారు 40 కథనాలు (ఆర్టికల్స్) రాయడంవల్ల ఈ అవార్డు ఇచ్చారు.
|
మార్చి - 19
|
రాష్ట్రీయం-ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌కు 5 అఖిల భారత పరిశోధనా మండలి ప్రాజెక్టులు మంజూరయ్యాయి. » ఆముదాలు - అనంతపురం, నువ్వులు - తిరుపతి, వెర్రినువ్వులు - చింతపల్లి, విత్తనోత్పత్తి కేంద్రం (ఐకార్) - నెల్లూరు, మొక్కజొన్న - విజయరాయి, మొక్కజొన్న (ఐకార్)- పెద్దాపురంలో ఏర్పాటు చేయనున్నారు.¤ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరప్పల గ్రామంలో పెద్ద పిడకల ఉత్సవాన్ని నిర్వహించారు. » గ్రామంలో వీరభద్రస్వామి, కాలమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏటా ఉగాది మరుసటి రోజు పిడకల సమరాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. » గ్రామస్థులంతా ఒక చోటుకి చేరి రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకోవడం ఈ ఉత్సవంలో ప్రత్యేకం.¤ విభజన హామీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గత నాలుగేళ్లలో 29 సార్లు దిల్లీకి వెళ్లారు. » 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తొలిసారిగా దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసిన ఆయన చివరిసారిగా ఈ ఏడాది జనవరి 12న ప్రధానితో, 17న కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని, రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.¤ ప్రాథమిక విద్యలో 2016 - 17లో రాష్ట్ర స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్) 82.79 శాతం ఉండగా, జాతీయ సగటు 99.21 శాతంగా నమోదైంది. » ఒకసారి బడిలో చేరిన పిల్లలందరూ పై తరగతులకు వస్తున్న దాన్ని బట్టి స్థూల ప్రవేశాల నిష్పత్తిని లెక్కిస్తారు. బడిబయట పిల్లల సంఖ్య అధికంగా ఉండడంతో జీఈఆర్ తగ్గిపోతోంది. » అధికారిక లెక్కల ప్రకారమే ప్రాథమిక స్థాయిలో 2.15 శాతం మంది బడి మానేస్తున్నారు. దీంతో స్థూల ప్రవేశాల నిష్పత్తి తగ్గుతోంది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో పాఠశాలకు దూరమవుతున్నవారు 1.56 శాతం ఉండగా, తొమ్మిది, పదిలో చదువు మానేస్తున్నవారు 1.3 శాతం మంది ఉన్నట్లు వెల్లడైంది.రాష్ట్రీయం - టీఎస్¤ దేశంలో కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా బలమైన సమాఖ్య కూటమి (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ కోల్‌కతాలో పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ¤ కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లికోసం అందించే ఆర్థిక సహాయం మొత్తాన్ని రూ. 75,116 నుంచి రూ. 1,00,116 కు పెరచుతున్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. » ఏప్రిల్ 1 తర్వాత వివాహం చేసుకునే పేదింటి ఆడపిల్లలకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల కింద ఈ ఆర్థిక సాయం అందుతుంది.
|
మార్చి - 20
|
రాష్ట్రీయం - ఏపీ ¤ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), ఎన్టీఆర్ కాలనీ కింద పట్టణ పేదల కోసం మరో 23,962 ఇళ్లు కేటాయించారు. » పేదలు సొంత స్థలాల్లో తామే ఇళ్లు నిర్మించుకునే (బీఎల్‌సీ) విధానంలో వీటిని 13 పురపాలక, నగరపాలక సంస్థలకు కేటాయించారు. » ఇదే పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 84 పట్టణాల్లో 1,02,977 ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. 2017 - 18 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో మరో విడతగా 23,962 ఇళ్ల కేటాయింపులు చేశారు. » ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రూ.లక్ష, లబ్దిదారుల వాటా రూ.25 వేలు, బ్యాంకు రుణం రూ.75 వేలు ఉంటుంది.¤ రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి 13 జిల్లాల నుంచి 40 పాఠశాలలు ఎంపికయ్యాయి. » తాగునీరు, మరుగుదొడ్లు, చేతుల శుభ్రత యూనిట్ల ఏర్పాటుతో పాటు నిర్వహణ, స్వచ్ఛ వాతావరణం, పిల్లల జీవనశైలిలో మార్పు ఆధారంగా సర్వశిక్ష అభియాన్ అధికారులు వీటిని ఎంపిక చేశారు. » ఈ 40 పాఠశాలలు జాతీయస్థాయి పురస్కార ఎంపిక ప్రక్రియకు అర్హత సాధించాయి.
|
మార్చి - 21
|
| రాష్ట్రీయం-ఏపీ¤ మత్స్యకారుల్లో 50 సంవత్సరాలు దాటినవారికి నెలకు రూ. 1000 పింఛనుగా అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.¤ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. |
మార్చి - 22
|
రాష్ట్రీయం - ఏపీ ¤ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి ఎన్.వి. సురేంద్ర బాబు నియమితులయ్యారు. »1987 బ్యాచ్‌కు చెందిన ఆయనకు డీజీపీగా పదోన్నతి కల్పించడంతో పాటు ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » ప్రస్తుతం డీజీపీగా వ్యవహరిస్తున్న ఎం. మాలకొండయ్యే ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా నియామకంతో సురేంద్రబాబు ఆ బాధ్యతలను చేపట్టనున్నారు.¤ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రూ.4.5 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో ప్రస్తావించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ జి.అహిర్ రాజ్యసభలో ప్రకటించారు.¤ రాష్ట్రంలోని హిజ్రాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. » 2011 జనాభా గణన ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 43,769 మంది హిజ్రాలు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల్లో దాదాపు 18 వేల మంది ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది.రాష్ట్రీయం - టీఎస్¤ మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో ఐటీని విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రకటించారు.
|
మార్చి - 23
|
రాష్ట్రీయం - ఏపీ¤ చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీ సమీపంలోని మదనపాలెం సమీపంలో 636 ఎకరాల్లో నిర్మించబోయే హీరో మోటోకార్ప్ మొదటి దశ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. » ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న హీరో దక్షిణ భారతంలో మొదటి యూనిట్‌ను మన రాష్ట్రంలోనే స్థాపించడం విశేషం. » హీరోకు ఇప్పటికే దేశంలో 7 ప్లాంట్లు ఉండగా ఇది 8వ ప్లాంటు. » హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.¤ విజయవాడ మధురానగర్‌లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కొత్త కార్యాలయాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు.¤ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రం నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా తెదేపా రెండు, వైకాపా ఒక స్థానాన్ని దక్కించుకుంది. » తెదేపా నుంచి సీఎం రమేష్, కనక మేడల రవీంద్రకుమార్, వైకాపా నుంచి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యారు.రాష్ట్రీయం-టీఎస్ ¤ జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జీహెచ్ఐఏఎల్) ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవ కార్యక్రమాన్ని జీఎంఆర్ గ్రూప్ హైదరాబాద్‌లో నిర్వహించింది. » ఈ కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. » దక్షిణాసియాలోనే అతిపెద్ద సమావేశ మందిరాన్ని (కన్వెన్షన్ సెంటర్) విమానాశ్రయ ప్రాంగణంలో నిర్మించనున్నారు. ఈ పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. » ఈ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి అనుసంధాన (కనెక్టివిటీ) కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ శ్రేణి కంపెనీలను ఆకర్షించడానికి దేశంలోనే తొలి ఎయిర్‌పోర్ట్ సిటీని అభివృద్ధి చేయడానికి జీఎంఆర్ శ్రీకారం చుట్టింది. ఈ పనులను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.¤ తెలంగాణలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మూడింటిని కైవసం చేసుకుంది. » బండా ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్‌లు గెలుపు సాధించారు. » కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్ ఓటమి పాలయ్యారు.
|
మార్చి - 24
|
| రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పరిషత్ కార్యనిర్వాహక అధికారిగా యు.రఘురామశర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.¤ ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఎండ్ టీబీ' కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2020 నాటికి క్షయను రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం ప్రతినెలా రూ.500 అందించనున్నట్లు సీఎం తెలిపారు. దీనికోసం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.78 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు.రాష్ట్రీయం - టీఎస్¤ రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలనే బిల్లును శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ బిల్లు ప్రవేశపెట్టారు. » రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర మాధ్యమాల (ఉర్దూ, తమిళం, మళయాలం) విద్యాసంస్థలు, కేంద్ర, అంతర్జాతీయ, ఇతర స్థాయిలో సిలబస్ బోధిస్తున్న సంస్థల్లోనూ తెలుగు మొదటి భాషగా బోధించాల్సిందే. » 2018-19 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతుల్లో తెలుగును మొదటి భాషగా అమలు చేస్తూ, క్రమంగా ఒక్కో ఏడాది తరగతులు పెంచుతామని మంత్రి తెలిపారు.¤ తెలంగాణలో 21 నగర పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా (అప్‌గ్రేడ్) ఉన్నతీకరించింది. » సీఎం నియోజకవర్గమైన గజ్వేల్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.¤ ఓరుగల్లులో తొలితరం కాకతీయులు నిర్మించిన ఒక సైనిక స్థావరం వెలుగులోకి వచ్చింది. » హన్మకొండ సిద్దేశ్వర గుట్టపై చెట్ల పొదల్లో పురావస్తు శాఖ కనుగొన్న కొండగుహను క్రీ.శ. 1116-1157 కాలంనాటి కాకతీయుల తొలిపాలకుల్లో ఒకరైన రెండో ప్రోలరాజు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. » గుహలోపల బంకమన్ను, సున్నం జాజుతో గోడలపై ఉన్న చిత్రలేఖనల ఆనవాళ్లు కనుగొన్నారు. బంకమన్నుపై వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. సహజమైన రాతిగుహనే, భవనంలా మలచుకొని సైనిక స్థావరంగా వినియోగించుకున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. |
మార్చి - 25
|
రాష్ట్రీయం - ఏపీ ¤ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి అదనంగా దేవాదాయశాఖ బాధ్యతలు అప్పగించారు. » భాజపా మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పి. మాణిక్యాలరావు రాజీనామాతో వైద్య ఆరోగ్యశాఖ, దేవాదాయ శాఖలు ఖాళీ అయ్యాయి. అప్పట్నుంచి దేవాదాయశాఖ సీఎం చంద్రబాబు వద్దే ఉంది. తాజాగా కేఈకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
|
మార్చి - 26
|
రాష్ట్రీయం - ఏపీ¤ ఆర్టీసీ నూతన ఎండీగా ఎన్.వి. సురేంద్ర బాబు బాధ్యతలు స్వీకరించారు.¤ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. » వక్ఫ్ చట్టం - 1995ను అనుసరించి మార్చి 13న ప్రభుత్వం సభ్యులను నియమించింది. » ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం జలీల్ ఖాన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి.ప్రకాష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. » దీనిపై గవర్నరు నిర్ణయం వెలువడాల్సి ఉంది.
|
మార్చి - 28
|
రాష్ట్రీయం - ఏపీ
¤ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అప్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. » డబ్బులున్నవారు దాన్ని బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పిస్తే అందుకు ప్రతిగా వారికి బాండ్లు జారీ చేస్తామని ప్రకటించారు. వీటిని తీసుకున్నవారికి బ్యాంకులు ఇస్తోన్న దానికంటే అదనంగా రెండు లేదా మూడు శాతం అధికంగా వడ్డీ చెల్లిస్తామన్నారు.¤ తక్కువ కాలంలో ఎక్కువ మరుగుదొడ్లను నిర్మించిన జిల్లాగా చిత్తూరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. » స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 2,39,644 మరుగుదొడ్లను నిర్మించారు. » 2017 అక్టోబరు నాటికి జిల్లాలో 32 శాతం కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండగా, ఈ ఆరు నెలల్లో దీన్ని 96 శాతానికి తీసుకురావడం గమనార్హం. » మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ (2,38,141) రెండో స్థానం, బిహార్‌లోని సితమర్హి (2,27,616), ససారం (2,21,900), పశ్చిమ్ బంగాలోని ముర్షిదాబాద్ జిల్లా (2,21,356) వరుసగా మూడు, నాలుగు, అయిదో స్థానాల్లో నిలిచాయి. » మార్చి 28 నాటికి ఏపీలో 94.35 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
|
మార్చి - 29
|
రాష్ట్రీయం - ఏపీ¤ విశాఖలోని మధురవాడ ఐ.టి. హిల్ - 2పై కాండ్యుయంట్, తురాయా, ప్రొసీడ్ ఐ.టి. సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ఫ్రాంక్లెన్ టెంపుల్‌టన్ ఇన్వెస్టిమెంట్స్, ఇన్నోవా సొల్యూషన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపస్‌కు శిలాఫలకాన్ని సీతమ్మధారలో ఆవిష్కరించారు.¤ నివాస, నివాసేతర భవనాల వినియోగంపై అద్దె నియంత్రణ చట్టం 57 ఏళ్ల తరువాత రాష్ట్రంలో మళ్లీ అమల్లోకి వచ్చింది. » జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం (జేఎన్ఎన్‌యూఆర్ఎం)లో తప్పనిసరిగా అమలు చేయాల్సిన సంస్కరణల్లో అద్దె నియంత్రణ చట్టం ఒకటి. 1960 నాటి పాత చట్టానికి సవరణలు చేస్తూ 2016లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ముసాయిదా బిల్లుకు 2017 మార్చిలో అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా గవర్నర్ అనుమతి లభించడంతో అద్దె నియంత్రణ చట్టం - 2017ను తీసుకొచ్చారు. మార్చి 29 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.¤ విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ద్వితీయ స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.¤ విశాఖ ఫిషింగ్ హార్బర్‌లోని డ్రైడాక్ జెట్టీలో 'వైజాగ్ యాటింగ్ ఫెస్టివల్'ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. » దేశంలోనే తొలిసారిగా విశాఖలో నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న యాటింగ్ ఫెస్టివల్ (పడవల పండుగ)ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.
|
మార్చి - 30
|
రాష్ట్రీయం-టీఎస్¤ హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. » ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.¤ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సందర్శించారు. » రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి ఆయన జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు.
|
మార్చి - 31
|
రాష్ట్రీయం-టీఎస్¤ తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో రానున్న రాజకీయ పార్టీ పేరు ఖరారు అయ్యింది. తెలంగాణ జన సమితి పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.రాష్ట్రీయం-ఏపీ¤ ప్రముఖ పర్యావరణవేత్తగా, విద్యావేత్తగా పేరొందిన ఆచార్య టి.శివాజీరావు (86) విశాఖపట్నంలో అనారోగ్యంతో మరణించారు. » టెక్సాస్‌లోని రైస్ విశ్వవిద్యాలయంలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో ఎం.ఎస్. చదివారు. నాగార్జున సాగర్ నీటి సరఫరా విభాగంలో రెండేళ్ల పాటు పనిచేసిన శివాజీరావు 1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బోధకుడిగా చేరారు. పర్యావరణ సంరక్షణ, కాలుష్య నివారణకు నివేదికలు తయారు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టులకు సమర్పించారు. » తాజ్‌మహల్ పరిరక్షణకు 1975లో శివాజీ రావు తలపెట్టిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
|
|
|