Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 అంతర్జాతీయం

ఏప్రిల్ - 2
¤ అమెరికా నుంచి దిగుమతయ్యే 128 ఉత్పత్తులపై చైనా కొత్త సుంకాలను విధించింది. వీటి విలువ 3 బిలియన్ డాలర్లు.
        »
 చైనా ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై గతవారంలో అమల్లోకి వచ్చిన కొత్త అమెరికా సుంకాలకు ప్రతిగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది.        » అమెరికా నుంచి దిగుమతయ్యే పళ్లు సహా 120 ఉత్పత్తులపై 15%, పంది మాంసం సహా ఎనిమిది వస్తువులపై 25% చొప్పున ద కస్టమ్స్ టారిఫ్ కమిషన్ సుంకాన్ని విధించింది.
ఏప్రిల్ - 3
¤ ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ రాజకీయ యత్నాలపై అమెరికా ఉక్కుపాదం మోపింది.        » అతనికి చెందిన పాకిస్థాన్‌లోని రాజకీయ ఫ్రంట్ మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. ఎంఎంఎల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సహా ఏడుగురు కీలక సభ్యులను విదేశీ ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ప్రకటన చేసింది.
ఏప్రిల్ - 4
¤ భద్రత మండలి సవరించిన ఉగ్రముద్ర పడిన వ్యక్తులు, సంస్థల జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, ముష్కర సంస్థలకే 139 స్థానాలు ఖరారయ్యాయి.        » పాకిస్థాన్‌లో జీవించిన, ఆ దేశం నుంచి కార్యకలాపాలు కొనసాగించిన, పాక్ ముష్కర సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఏప్రిల్ - 6
¤ అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గుయన్ హైకు న్యాయస్థానం 24 ఏళ్ల జైలుశిక్ష, 16.9 మిలియన్ అమెరికా డాలర్ల జరిమానా విధించింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కిన గుయన్ అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం లాంటి పలు కేసుల విచారణలో పార్క్ దోషిగా తేలారు.        » 66 ఏళ్ల అవివాహితురాలైన పార్క్ తన బాల్య స్నేహితురాలు, ప్రముఖ వ్యాపారవేత్త చోయ్ సూన్ - గిల్‌తో కలిసి 21.7 మిలియన్ డాలర్లకు పైగా ముడుపులు తీసుకున్నారని న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు.        » దక్షిణ కొరియా నియంత పార్క్ చుంగ్ హై కుమార్తె అయిన గుయెన్ 2013లో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోపే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆందోళనల మధ్య ఆమె గద్దె దిగారు.
ఏప్రిల్ - 7
¤ అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న వెంటనే విడుదల చేసే 'క్యాచ్ అండ్ రిలీజ్' విధానానికి స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న తర్వాత నిర్బంధించి ఉంచడానికి తగినన్ని వనరులు లేకపోవడంతో వలసల న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సిన తేదీని వారికి చెప్పి భద్రతా సంస్థలు వదిలేస్తుంటాయి. ఈ విచారణకు హాజరైతే తమను దేశం నుంచి బయటికి వెళ్లగొడతారనే భయంతో అక్రమ వలసదారులు కోర్టులో హాజరుకారు.
ఏప్రిల్ - 8
¤ 2018 జులై 31న సూర్యుడికి చేరువగా 'పార్కర్ సోలార్ ప్రోచ్' వ్యోమనౌకను పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది.        » ఈ వ్యోమనౌకను ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి డెల్టా-4 హెవీ వాహకనౌక ద్వారా ప్రయోగించనున్నారు.        » ప్రయోగం తర్వాత ఈ వ్యోమనౌక సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణం (కరోనా)లోకి నేరుగా వెళుతుంది. మానవ నిర్మితమైన వస్తువు ఒకటి భానుడి వద్దకు చేరువగా వెళ్లడం ఇదే మొదటిసారి. తీవ్రస్థాయి ఉష్ణం, రేడియో ధార్మికతను తట్టుకుంటూ ఇది పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే వాయువులు, రేణువుల ప్రవాహం గురించి అనేక విషయాలను ఇది తెలుపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిణామాలు భూమికి చేరువలోని అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. నక్షత్రాలకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న అనేక ప్రశ్నలకు ఈ వ్యోమనౌక సమాధానమిస్తుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ - 13
¤ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.        » ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్‌తో పాటుగా పాకిస్థాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది.        » పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం ఓ చట్ట సభ్యుడిపై ఎంత కాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.        » పాక్ రాజ్యాంగం ప్రకారం ఉన్నత న్యాయస్థానం ద్వారా ఒకసారి అనర్హత వేటు పడితే ప్రజా ప్రతినిధిగా పోటీ చేయలేరని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 62 ప్రకారం ఎంపీ నిజాయతీగా, నీతిమంతుడిగా ఉండాలి. అయితే పనామా పేపర్స్ కేసులో ఈ చట్టం ప్రకారమే షరీఫ్‌ను పాక్ సుప్రీంకోర్టు ఎంపీకి అనర్హుడిగా (జులై 28, 2018న) ప్రకటించింది. దీంతో షరీఫ్ రాజీనామా చేశారు.
ఏప్రిల్ - 14
¤ అంతర్యుద్ధంతో ఇప్పటికే అతలాకుతలమైన సిరియాపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. అమెరికాకు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా తోడయ్యాయి. సిరియా ప్రభుత్వం రసాయన దాడులకు పాల్పడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యకు ఆదేశించారు.        » డౌమా పట్టణంలో కొద్దిరోజుల కిందట విషతుల్య వాయువుతో దాడి జరిగిందని, పదుల సంఖ్యలో ప్రజలు దుర్మరణం పాలైనట్లు వార్తలు వచ్చాయి. వీటిని సిరియా ప్రభుత్వం ఖండించింది.        » వైమానిక దాడులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఇది దురాక్రమణ చర్య అని దుయ్యబట్టారు.¤ సంచలనాత్మక కథువా అత్యాచారం కేసుపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా స్పందించారు. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని పట్టి బంధించి, మత్తుమందు ఇచ్చి అత్యంత దారుణంగా ఆ బాలికపై అత్యాచారంచేసి చంపేయడాన్ని ఆయన ఖండించారు. కథువా బాలిక అత్యాచారాన్ని అత్యంత భయానక ఘటనగా అభివర్ణించారు.
        »
 బక్రవాల్ సంచార తెగకు చెందిన బాలిక జనవరి 10న అదృశ్యమై వారం రోజుల తర్వాత అదే ప్రాంతంలో శవమై కనిపించింది. కథువాలోని ఓ ఆలయంలో ఆమెను బంధించి, మత్తు మందిచ్చి ఆరుగురు వ్యక్తులు పదేపదే అత్యాచారం చేశారన్న ఆరోపణలున్నాయి. తర్వాత బాలికను అత్యంత భయానకంగా హత్య చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
ఏప్రిల్ - 19
¤ క్యూబాలో క్యాస్ట్రో శకం ముగిసింది. దేశ కొత్త అధ్యక్షుడిగా మిగెల్ డియాజ్ కానెల్ లాంఛనంగా ఎన్నికయ్యారు. ఆరు దశాబ్దాల కాలంలో క్యాస్ట్రో కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. 1959 విప్లవం తర్వాత జన్మించిన వ్యక్తి ఈ పీఠాన్ని చేపట్టడం కూడా ఇదే మొదటిసారి.        » విప్లవంతో అధికారాన్ని దక్కించుకున్న ఫిడెల్ క్యాస్ట్రో అనారోగ్యానికి గురికావడంతో ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో 2006లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 86 ఏళ్ల రౌల్ తన వారసుడిగా కానెల్‌ను ఎంపిక చేశారు. జాతీయ అసెంబ్లీలో దీనిపై లాంఛనప్రాయంగా ఓటింగ్ కూడా నిర్వహించగా కానెల్ 99.83 శాతం ఓట్లతో విజయం సాధించారు.        » రౌల్ క్యాస్ట్రో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగినప్పటికీ, శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పగ్గాలు మాత్రం విడిచిపెట్టలేదు.
ఏప్రిల్ - 21
¤ వరుస అణు పరీక్షలతో కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉత్తర కొరియా ఇకపై అణు పరీక్షలతో పాటు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు కూడా జరుపబోమని ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రకటన చేశారు.
ఏప్రిల్ - 26
¤ ఎన్నికల నామినేషన్‌లో యూఏఈ పని అనుమతి (వర్క్ పర్మిట్) గురించి వెల్లడించకపోవడంతో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆసిఫ్ (68) పార్లమెంటు సభ్యత్వాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు జీవితాంతం రద్దు చేసింది.        » తాజా తీర్పుతో అధికార పీఎంఎల్-ఎన్ పార్టీలోనూ ఆయన ఎలాంటి పదవులు చేపట్టలేదు.
ఏప్రిల్ - 27
¤ ఉత్తర, దక్షిణ కొరియా దేశాల అధినేతల మధ్య చరిత్రాత్మక భేటీ దక్షిణ కొరియాలోని పన్ముంజోమ్ గ్రామంలో జరిగింది. అనంతరం ఇరువురు నేతలు 'పన్ముంజోమ్ ప్రకటన'ను విడుదల చేశారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధరహితంగా మార్చడమే ఇరుదేశాల ఉమ్మడి లక్ష్యమని అందులో పేర్కొన్నారు. కొరియా యుద్ధానికి ఈ ఏడాది శాశ్వత ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. శాంతి ఒప్పందం ద్వారా కాకుండా బలగాల ఉపసంహరణ విధానంలో 65 ఏళ్ల క్రితం కొరియా యుద్ధం ముగిసిన సంగతి గమనార్హం.        » ఇరుదేశాల మధ్య ఇకపై తరచుగా సమావేశాలు నిర్వహించాలని, నేరుగా ఫోన్‌లో మాట్లాడుకోవాలని ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ నిశ్చయించుకున్నారు.        » 2000, 2007ల్లో ఉభయ కొరియాల మధ్య జరిగిన సదస్సుల్లో కుదిరిన ఒప్పందాలు దురదృష్టవశాత్తు సరిగ్గా అమలు కాలేదని, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తామని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.        » స్నేహానికి గుర్తుగా సరిహద్దుల్లో ఇరువురు నేతలు మొక్కలు నాటారు.        » కొరియా యుద్ధం ముగిసిన అనంతరం దక్షిణ కొరియాలోకి ఉత్తర కొరియా అధినేత ప్రవేశించడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ - 29
¤ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశంలోని అణ్వాయుధ పరీక్ష కేంద్రాన్ని 2018 జూన్‌లో మూసివేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో తాము పారదర్శకంగా ఉన్నట్లు అంతర్జాతీయ సమాజానికి తెలిసేలా అమెరికా ఆయుధ నిపుణులు, పాత్రికేయులు తమ దేశంలో పర్యటించేందుకు రావాలని కోరారు.¤ ముంబయి తీవ్రవాద దాడి కేసుకు చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న చౌద్రీ అజహర్‌ను పాకిస్థాన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. పాక్ ప్రభుత్వం అనుకున్న రీతిలో వ్యవహరించడంలేదన్న ఆరోపణల కారణంగా చౌద్రీని పదవి నుంచి తొలగించారు.
ఏప్రిల్ - 30
¤ పాకిస్థాన్ మూలాలున్న బ్రిటన్ ఎంపీ సాజిద్ జావిద్ (48) బ్రిటన్ కొత్త హోంమంత్రిగా నియమితులయ్యారు.
        » కన్సర్వేటివ్ పార్టీ తరఫున జావిద్ 2010 నుంచి బ్రామ్స్‌గ్రోవ్ ఎంపీగా ఉన్నారు
.
        » హోంమంత్రిగా ఉన్న థెరెసా మే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోంమంత్రిగా యాంబర్‌రడ్ పని చేశారు. ఆమె రాజీనామా చేయడంతో కమ్యూనిటీలు, స్థానిక ప్రభుత్వం, గృహ నిర్మాణ మంత్రిగా ఉన్న సాజిద్‌కు పదోన్నతి లభించింది
.
        » సాజిద్ కుటుంబం 1960ల్లో బ్రిటన్‌కు వలస వచ్చింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.