Type Here to Get Search Results !

మే-2018 పర్యటనలు

మే - 7
¤ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా గ్వాటెమాలా సిటీలో ఆ దేశ అధ్యక్షుడు జిమ్మీమోరేల్స్‌తో సమావేశమయ్యారు.
            »
 ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడంపై ఉభయులు చర్చించారు.            » గ్వాటెమాలా విదేశాంగమంత్రి శాండ్రా జోవెల్‌తో కూడా వెంకయ్య సమావేశమయ్యారు.
మే - 8
¤ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనాలో అకస్మాత్తుగా పర్యటించారు. ఈశాన్య ప్రాంతతీర నగరం అయిన దాలియాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అనధికారికంగా సమావేశమయ్యారు. మే 7, 8 తేదీల్లో ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయని అధికార వార్తా సంస్థ జిన్హువా ధ్రువీకరించింది.            » మూడు నెలల్లో కిమ్ చైనాలో పర్యటించడం ఇది రెండోసారి.¤ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గ్వాటిమాలా పర్యటనలో భాగంగా గ్యాటిమాలా అధ్యక్షుడు జిమ్మీమోరెల్స్,ఉపాధ్యక్షుడు జాఫెత్ కాబ్రెరా, పార్లమెంట్ స్పీకర్ అల్వొరా అర్జు ఎస్కోబార్‌లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఉభయ దేశాలూ నిర్ణయించాయి.            » గ్వాటిమాలా విమానాశ్రయాలకు సౌరఫలకల సరఫరాకు, అక్కడి దౌత్య ప్రతినిధులు, ఆంగ్ల బోధకులకు శిక్షణ ఇవ్వడానికి భారత్ అంగీకరించింది.            » భద్రతా మండలిలో భారత్‌కు 2021 - 22కుగాను, గ్వాటిమాలాలో 2031 - 32కు సభ్యత్వాలకు ఇరు దేశాలూ పరస్పరం మద్దతు ఇవ్వనున్నాయి.
మే - 11
¤ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మయన్మార్ పర్యటనలో భాగంగా పలువురు మయన్మార్ అగ్రనాయకులతో నేపిటాలో చర్చలు జరిపారు. వేలాది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు గతేడాది పారిపోయిన నేపథ్యంలో రాఖైన్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె చర్చించారు.            » ఈ సందర్భంగా భారత్-మయన్మార్‌లు మొత్తం ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.¤ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పనామా దేశ పర్యటనలో భాగంగా రాజధాని పనామా సిటీలో విద్యార్థులు, 40 దేశాల దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.¤ ప్రధాని మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ చేరుకున్నారు.            » సీతాదేవి జన్మస్థానంగా విశ్వసిస్తున్న జనక్‌పూర్, దానిపొరుగు ప్రాంతాల అభివృద్ధికి రూ. 100 కోట్లు సాయం ప్రకటించారు. అంతకుముందు నేపాల్ ప్రధాని కేపీ ఓలితో కలిసి జనక్‌పూర్- అయోధ్య మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసును ప్రారంభించారు.            » ఇరువురు నేతలు తూర్పు నేపాల్‌లోని టమ్‌లింగ్‌టార్‌లో 900 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి రిమోట్‌సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు.            » 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నేపాల్‌లో పర్యటించడం ఇది మూడోసారి.
మే - 12
¤ దక్షిణ అమెరికా దేశం పెరూ నాయకులతో భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు.            » పెరూ ప్రధానమంత్రి సీసర్ ఎలాన్యూవా బార్డెల్స్ సహా నలుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు.¤ నేపాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ మాజీ ప్రధానులు ప్రచండ, షేర్ బహదూర్ దేవ్‌బా, ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు.            » నేపాల్ - చైనా సరిహద్దులోని హిందువులు, బౌద్దులకు పవిత్రమైన ముక్తినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఈ దేవాలయానికి వెళ్లిన తొలి విదేశీ నాయకుడు మోదీ.
మే - 14
¤ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు చేరుకున్న భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్‌సింఘేతో భేటీ అయి, సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.            » సైనిక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహేష్ సేనానాయకే, నౌకాదళ కమాండర్ వైస్ అడ్మిరల్ ఎస్.ఎస్.రణసింఘే, రక్షణ శాఖ కార్యదర్శి కపిల వైద్యరత్నేలనూ రావత్ కలుసుకున్నారు.            » భారత శాంతి పరిరక్షణ దళం (ఐపీకేఎఫ్) తరఫున శ్రీలంకలో పోరాడి ప్రాణత్యాగం చేసినవారికి ఐపీకేఎఫ్ స్థూపం వద్ద రావత్ నివాళులర్పించారు.            » రావత్ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
మే - 18
¤ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ కొలంబోలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలపై ఉభయుల మధ్య చర్చలు జరిగాయి.            » శ్రీలంక సైనికదళాల ప్రధానాధికారి ఆహ్వానం మేరకు రావత్ వారం రోజుల పర్యటనకు శ్రీలంక వెళ్లారు.
మే - 21
¤ రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ సోబీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.            » ప్రధాని మోదీ సిరియస్ విద్యా కేంద్రాన్ని సందర్శించి, 700 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
మే - 24
¤ భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రూట్టె ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలూ ఈ సందర్భంగా నిర్ణయించాయి. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాలని ఇరువురు నేతలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం (ఎన్ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మరింత మద్దతు ఇస్తుందని రూట్టె తెలిపారు.            » వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి.            » ఇండియా-డచ్ సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్టెలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.            » అంతర్జాతీయ సౌర కూటమిలో నెదర్లాండ్స్ తాజాగా సభ్యత్వం తీసుకుంది.            » భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని మోదీ వెల్లడించారు.
మే - 28
¤ నెదర్లాండ్స్ రాణి మాక్సిమా దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమై సంఘటిత ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.            » ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక న్యాయవాది (ప్రగతికి సంఘటిత ఆర్థికాభివృద్ధి అంశం) హోదాలో ఆమె భారత్‌లో పర్యటిస్తున్నారు.
మే - 29
¤ ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాకు చేరుకున్నారు. భారత ప్రధాని హోదాలో ఆయన ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
మే - 30
¤ భారత ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోలు జకార్తాలో సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలను గౌరవిస్తూ ఇతర అంశాల్లోనూ సహకరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు.
            » ఈ సందర్భంగా భారత్, ఇండోనేషియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర - సాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం సహా 15 ఒప్పందాలు జరిగాయి
.
            » 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.37 లక్షల కోట్లు) పెంచే దిశగా రెట్టింపు కృషితో పనిచేయాలని నిర్ణయించారు
.
            » భారత్‌లోని అండమాన్, ఇండోనేషియాలోని సబంగ్ మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా ఇరుప్రాంతాల్లో వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను వృద్ధి చేసేందుకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు
.
            » జకార్తాలో 1987లో ఏర్పాటు చేసిన అర్జునుడి రథం విగ్రహాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆ తర్వాత రామాయణ, మహాభారతాల థీమ్‌తో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు
.
            » జకార్తా కన్వెన్షన్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్‌లో పర్యటించేందుకు 30 రోజుల వరకు ఉచిత వీసా ఇస్తామని ప్రకటించారు.
మే - 31
¤ ఇండోనేషియా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో మలేసియాలో ఆగి ఇటీవల మలేసియా ప్రధానిగా ఎన్నికైన మహథిర్ బిన్ మహమ్మద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.            » మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా సింగపూర్ చేరుకున్న మోదీ 'బిజినెస్, ఇన్నోవేషన్, కమ్యూనిటీ ఈవెంట్' అనే కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది 'ఆసియాన్‌'కు సింగపూర్ నేతృత్వం వహిస్తున్నందున భారత్ - ఆసియాన్ సంబంధాలు కొత్త శిఖరాలను చేరుతాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.            » భారత్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల భీమ్, రూప్, ఎస్‌బీఐ యాప్‌లను ప్రధాని మోదీ సింగపూర్‌లో ఆవిష్కరించారు. దీనిలో భాగంగా రూపే యాప్‌ను సింగపూర్‌కు చెందిన నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ (నెట్స్)తో అనుసంధానించారు. ఫలితంగా రూపే వినియోగదారులు సింగపూర్ వ్యాప్తంగా నెట్స్ కేంద్రాల వద్ద చెల్లింపులు చేయొచ్చు. అలాగే సింగపూర్ నెట్స్ వినియోగదారులు భారత్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కొనుగోళ్లు చేయొచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.