| 
| 
| 
ఏప్రిల్ - 1 |  | 
¤ సరకుల అంతర్రాష్ట్ర రవాణా కోసం ఇ-వే బిల్లుల జారీ ప్రక్రియ దేశవ్యాప్తంగా మొదలైంది.        » ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రూ.50 వేలకు మించిన సరకుల తరలింపుపై రవాణాదారులు, వ్యాపారులు ఇ-వే బిల్లులను పొందడం తప్పనిసరి.        » గతేడాది సెప్టెంబరు నుంచే తమ రాష్ట్రం లోపలా సరకుల తరలింపునకు కర్ణాటక ఇ-వే బిల్లుల జారీ మొదలు పెట్టింది. ఒక్క ఈ రాష్ట్రంలోనే ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి.        » జీఎస్‌టీలో భాగంగా చేపట్టిన ఇ-వే బిల్లుల జారీ ప్రక్రియను ఫిబ్రవరి 1న తొలుత అందుబాటులోకి తెచ్చినప్పటికీ సాంకేతిక అవరోధాలు తలెత్తడంతో అప్పుడు అమలును వాయిదా వేశారు.¤ రాష్ట్ర రహదారులపై తిరిగే ప్రైవేట్ వాహనాలకు రాజస్థాన్ ప్రభుత్వం టోల్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.        » రాష్ట్రంలోని జిల్లా రోడ్లతో పాటు 15,534 కిలోమీటర్ల పొడవైన 56 రాష్ట్ర రహదారులపై నిత్యం 1.25 లక్షల ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, వీటిలో 143 పాయింట్లలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపి వేస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి యూనస్ ఖాన్ ప్రకటించారు. |  
| 
ఏప్రిల్ - 2 |  | 
 ¤ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీంకోర్టు మార్చడంపై దళిత సంఘాల పిలుపు మేరకు జరిగిన 'భారత్ బంద్' హింసాత్మకంగా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మధ్యప్రదేశ్‌లోనే ఆరుగురు మృతి చెందగా యూపీలో ఇద్దరు, రాజస్థాన్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.        » ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం (1989) వాస్తవంలో తరచూ దుర్వినియోగానికి గురవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ చట్టంలో పొందుపరచిన కొన్ని కఠిన నిబంధనలను సవరిస్తూ మార్చి 20న ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల వల్ల మొత్తం చట్టమే నీరు గారిపోయే ప్రమాదం ఉందని, ఇది చట్ట స్ఫూర్తికే విఘాతమని తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ పలు దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నాయి.        » దళిత సంఘాల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రం సమగ్ర సమీక్ష పిటిషన్‌ను దాఖలు చేసింది. చట్టం నిబంధనల్లో మార్పులు తెస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై పునరాలోచించాలని విన్నవించింది. సుప్రీం తీర్పు రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించేలా ఉందని ఆక్షేపించింది. సంబంధిత చట్టంలోని పాత నిబంధనలను యథాతథంగా కొనసాగనివ్వాలని కోరింది.¤ ఇరాక్‌లోని మోసుల్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో హతమైన భారతీయుల భౌతికకాయాలు ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరాయి.        » విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ బాగ్దాద్ నుంచి వాటిని స్వయంగా తీసుకువచ్చారు. అమృత్‌సర్ విమానాశ్రయంలో బాధిత కుటుంబాలకు, కోల్‌కతా, పట్నా విమానాశ్రయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిని అప్పగించారు.        » ఉపాధి నిమిత్తం 2014లో ఓ ఏజెంట్ ద్వారా అక్రమ మార్గంలో ఇరాక్ వెళ్లిన 40 మంది భారతీయులను ఐసిస్ ఉగ్రవాదులు చెరపట్టారు. వీరిలో 39 మందిని మోసుల్‌లో హత్య చేయగా, ఒక వ్యక్తి మాత్రం తాను బంగ్లాదేశ్ ముస్లింనని చెప్పి తప్పించుకున్నాడు.¤ కడక్‌నాథ్ కోళ్లపై ప్రాదేశిక గుర్తింపు (జీఐ) హక్కులను మధ్యప్రదేశ్ దక్కించుకుంది.        » అనాదిగా గిరిజనులు పెంచి పోషిస్తున్న కడక్‌నాథ్ కోళ్ల జాతిపై ప్రాదేశిక గుర్తింపు హక్కుల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య 2017 నుంచి వాద ప్రతివాదాలు జరుగుతూ వచ్చాయి.        » చెన్నైలోని జీఐ రిజిస్ట్రర్ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ హక్కు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదానికి తెరపడింది.        » ఝబువ, అలిరాజ్‌ఫుర్ జిల్లాలకు చెందిన గిరిజనులు కడక్‌నాథ్ కోళ్లను అనాదిగా పరిరక్షిస్తున్నారు. ఝబువలో 1978లో తొలి కడక్‌నాథ్ కోడి పిల్లల హేచరీ ఏర్పాటైంది. |  
| 
ఏప్రిల్ - 3 |  | 
¤ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని కఠిన నిబంధనలను సడలిస్తూ మార్చి 20న వెలువరించిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేయడానికి (స్టే విధించడానికి) సుప్రీంకోర్టు నిరాకరించింది. బాధితులకు పరిహారం చెల్లించడానికి, వారికి ఆశ్రయం కల్పించడానికి, ఎఫ్ఐఆర్ నమోదుకు, దోషులకు శిక్షలు అమలు చేయడానికి తమ ఆదేశాలు ఆటంకం కాదని విస్పష్టం చేసింది. చట్టంలోని ఏ నిబంధననూ తాము నీరు గార్చలేదని తేల్చి చెప్పింది. » తీర్పుపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను 10 రోజుల తర్వాత సమగ్రంగా పరిశీలిస్తామని వెల్లడించింది.        » ఎస్సీ, ఎస్టీ చట్టంలో సడలింపులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్రం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మార్చి 20 నాటి తీర్పును తాత్కాలికంగా నిలిపేయాలంటూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, మహారాష్ట్ర తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది.¤ నకిలీ వార్తల కట్టడి కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2న జారీ చేసిన కఠిన మార్గదర్శకాలపై సర్వత్రా విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.        » పత్రికా స్వేచ్ఛపై ఉక్కు పాదం మోపుతున్నారని పాత్రికేయ సంఘాలు, పార్టీల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీ స్వయంగా ఆ మార్గదర్శకాలను ఉపసంహరించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించారు.¤ ఇరాక్‌లోని మోసుల్‌లో ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చిన 39 మంది భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.  ¤ ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆరోపణలకు పరిష్కారంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఏడీఏఐ) ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.        » వర్చువల్ ఐడీ (వీఐడీ) బీటా వర్షన్‌ను విడుదల చేసింది. ఆధార్ సంఖ్యకు బదులు వినియోగదారులు ఈ వర్చువల్ ఐడీని ఉపయోగించుకోవచ్చు.        » బీటా వర్షన్‌లో ప్రస్తుతానికి వీఐడీని సృష్టించుకుని ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాను మార్చుకోవచ్చు.        » భవిష్యత్తులో ఆధార్ సంఖ్యకు బదులు వీఐడీనే ఇవ్వవచ్చని యూఏడీఏఐ తెలిపింది.        » వీఐడీ అనేది 16 అంకెల ర్యాండమ్ సంఖ్య. ఆధార్ సంఖ్యకు ఇది అనుసంధానమై ఉంటుంది.        » గుర్తింపు వివరాలు కోరే మొబైల్ కంపెనీ వంటి వాటికి వీఐడీని ఇస్తే పేరు, చిరునామా, ఫొటో వంటి పరిమిత వివరాలే వెల్లడవుతాయి. వ్యక్తుల తనిఖీకి ఈ వివరాలే సాధారణంగా సరిపోతాయి.        » ఆయా సంస్థలు జూన్ 1 నుంచి వినియోగదారుల వీఐడీ ఆమోదించడం తప్పనిసరి. |  
| 
ఏప్రిల్ - 4 |  | 
¤ ప్రభుత్వ వ్యవహారాల్లో షెడ్యూల్డు కులాల గురించి ప్రస్తావించాల్సి వచ్చినపుడు వారిని 'దళిత్' అనే నామావాళితో పేర్కొనవద్దని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మార్చి 15న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.        » ఈ లేఖతోపాటు 2018, జనవరి 15న మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వులను జత చేసింది. ఆ ధర్మాసనం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆదేశాలిస్తూ 'ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు 'దళిత్' అనే పదాన్ని వినియోగించరాదు. ఈ రెండు వర్గీకరణల్లో వివిధ కులాల వారిని దళితులు అనే నామావళితో రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు' అని పేర్కొంది.        » దీంతోపాటు 'షెడ్యూల్డు కులాల వారికిచ్చే ధ్రువీకరణ పత్రాల్లో అధికారులు 'హరిజన్' అని రాయటం తగదు. బదులుగా ఎస్సీ జాబితాలోని వారి కులాన్ని రాయవచ్చు' అంటూ 1982, ఫిబ్రవరి 10న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖను జత చేసింది. ¤ మధ్యప్రదేశ్‌లో ఐదుగురు బాబాల (సాధువులు)కు భాజపా ప్రభుత్వం రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పించింది.        » నర్మదా నది సంరక్షణకు ఏర్పాటైన 'జన్ జాగృక్త అభియాన్ సమితి'లో మార్చి 31న వీరంతా నియమితులయ్యారు. సమితి సభ్యులుగా వారంతా తమ పనులను మరింత సులువుగా చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.¤ ప్రపంచ ప్రమాణాలకు దీటుగా జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.        » కమిషన్ల తీర్పుల అమలు, స్వయం ప్రతిపత్తి, మానవ హక్కుల పరిరక్షణలో మరింత మెరుగైన పనితీరును అందిపుచ్చుకోవడం లాంటి లక్ష్యాలతో సవరణ బిల్లు - 2018 ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత బిల్లు జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. |  
| 
ఏప్రిల్ - 5 |  | 
¤ బాబూ జగ్జీవన్‌రామ్ 111వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.        » రాజ్‌ఘాట్ సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్ స్మారక ప్రాంతమైన 'సమతాస్థల్' వద్ద కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతల శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాత్, సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే, లోక్‌సభ మాజీ స్పీకర్, జగ్జీవన్‌రామ్ కుమార్తె మీరా కుమార్ తదితరులు నివాళులర్పించారు. |  
| 
ఏప్రిల్ - 6 |  | 
 ¤ భారత వైమానిక దళం దాదాపు 110 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సమాచార విజ్ఞప్తిని (రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ - ఆర్ఎఫ్ఐ) జారీ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన అతిపెద్ద సేకరణల్లో ఇది కూడ ఒక భాగం. దీని సేకరణ విలువ దాదాపు రూ.97,357 కోట్లు. సేకరణ ప్రక్రియ భారత్‌లో తయారీ విధానానికి అనుగుణంగా ఉంటుంది. విదేశీ సంస్థ, భారత కంపెనీ సంయుక్తంగా యుద్ధ విమానాలను తయారు చేస్తాయని అధికారులు వెల్లడించారు. భారత్‌కు ఉన్నత స్థాయి రక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఇటీవలే ప్రారంభించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద ఈ ఒప్పంధం ఉంటుంది.        » ఐదేళ్ల క్రితం వైమానిక దళం కోసం 126 మీడియం మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎంఎంఆర్‌సీఏ)లను కొనుగోలు చేయాలని తలపెట్టి ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసింది.¤ పార్లమెంటు మలిదశ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.        » ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అనేకసార్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు చర్చకు రాకుండానే ఎలాంటి చర్చ, ప్రకటన లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.        » మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్ కుంభకోణాలు, కావేరి బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి. |  
| 
ఏప్రిల్ - 7 |  | 
 ¤ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ), ఉపాధ్యాయ విద్య (టీఈ) అనే మూడు పథకాలను విలీనం చేసిన కేంద్రం కొత్త పథకానికి 'సమగ్ర శిక్షా అభియాన్'  అని పేరు పెట్టింది. ముఖ్యంగా ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఒకటే కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర నుంచి ఒకటే పథకంగా తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ఇటీవలే ఈ మూడు పథకాల విలీనానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తాజాగా 'సమగ్ర శిక్షా అభియాన్'గా పేరును కేంద్ర మానవ వనరుల శాఖ ఖరారు చేసింది. ¤ చిమ్మచీకట్లోనూ లక్ష్యాలను గురిపెట్టి కాల్చేయగలిగే ఏకే-103 అసాల్ట్ రైఫిళ్లు త్వరలో దేశీయంగానే తయారు కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సాంకేతికంగా కలష్నికోవ్ ఏకే-103గా వ్యవహరించే ఈ రష్యా రైఫిళ్లను డ్రగునోవ్ ఎస్‌వీడీల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
 » సైనికపరమైన తక్షణావసరాల నిమిత్తం ప్రస్తుతం 6500 ఏకే-103 రైఫిళ్లను సమకూర్చుకోనున్నారు. పెద్ద మొత్తంలో వీటి తయారీ కోసం మన దేశంలోనే కర్మాగారాన్ని స్థాపించాలని భావిస్తున్నారు.
 |  
| 
ఏప్రిల్ - 9 |  | 
¤ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తమకు గత ఏడాది రైల్వేలు, ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగుల పైనే పెద్ద సంఖ్యలో అవినీతి ఫిర్యాదులు అందాయని పార్లమెంటుకు అందించిన ఒక నివేదికలో పేర్కొంది.        » మొత్తం మీద 2016తో పోలిస్తే 2017లో తమకు అందిన ఫిర్యాదుల సంఖ్య 52 శాతం మేర తగ్గిందని తెలిపింది.        » 2016లో 49,847 ఆరోపణలు రాగా, 2017లో ఆ సంఖ్య 23,609కు తగ్గింది. 2011 తర్వాత ఇదే అత్యంత తక్కువ సంఖ్య.        » 2017లో అధికంగా రైల్వే ఉద్యోగులపై 12,089 ఫిర్యాదులు అందాయి. |  
| 
ఏప్రిల్ - 10 |  | 
 ¤ చంపారణ్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా బిహార్‌లోని మోతిహరీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు.        » బిహార్ పర్యటన సందర్భంగా మోదీ రైల్వేలు, రహదారులు, చమురు రంగాలకు సంబంధించి, చంపారణ్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పలు పథకాలను ప్రారంభించారు.        » దేశంలోనే అత్యధిక అశ్విక శక్తితో నడిచే విద్యుత్తు రైలింజన్‌ను మోదీ ప్రారంభించారు. సరకు రవాణా కోసం ఉద్దేశించిన ఈ రైలింజిన్ 12 వేల అశ్విక శక్తితో నడుస్తుంది. దీన్ని మాధేపుర కర్మాగారంలో తయారు చేశారు. ప్రాజెక్టు ఆమోదం పొందిన పదేళ్ల తర్వాత ఈ ఇంజిన్ బయటకు వచ్చింది.        » బిహార్‌లో 33 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే చంపారణ్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ రైలు బిహార్, దిల్లీల మధ్య రాకపోకలు సాగిస్తుంది.        » చంపారణ్ అనేది బిహార్‌లో చారిత్రక ప్రదేశం. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ఇక్కడి నుంచే చంపారణ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. |  
| 
ఏప్రిల్ - 11 |  | 
¤ సాధారణ, సైబర్ భద్రతకు పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఏకకాలికత (సింక్రనైజ్డ్) ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం భారత ప్రామాణిక సమయానికి (ఐఎస్‌టీ) చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది.        » ఇప్పటి నుంచి దేశవ్యాప్తంగా సర్వీస్ ప్రొవైడర్లందరూ అధికారిక సహాయ సంస్థ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్) నుంచి సమయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో పనిచేస్తున్న విదేశీ సంస్థలు కూడా ఈ సమయాన్నే అనుసరించాల్సి ఉంటుంది.¤ కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) విశేషాధికారాన్ని సుప్రీంకోర్టు మరోసారి నొక్కి చెప్పింది.        » భారత ప్రధాన న్యాయమూర్తే స్వయంగా ఒక సంస్థ అని, ఆయన విశిష్ట స్థానంలో ఉంటారని, కేసుల కేటాయింపుపై, వాటిని విచారించే ధర్మాసనాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే ప్రత్యేక విశేషాధికారం ఆయనకు ఉంటుందని స్పష్టం చేసింది.        » కేసులను హేతుబద్ధంగా, పారదర్శకంగా కేటాయించేందుకు, ధర్మాసనాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని న్యాయవాది అశోక్‌పాండే దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ధర్మాసనం తరఫున జస్టిస్ చంద్రచూడ్ తీర్పురాశారు. 'భారత ప్రధాన న్యాయమూర్తి సంస్థ అధిపతి అని చెబుతూ రాజ్యాంగంలోని 146వ అధికరణం ఆయన స్థానాన్ని నొక్కి వక్కాణిస్తోంది' అని ఆయన పేర్కొన్నారు.¤ సంఘసంస్కర్త జ్యోతిబాఫూలే 192వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 'సమతా దివస్' పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.¤ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌ల జీతభత్యాలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రూ.80 వేలుగా ఉన్న వారి నెలసరి వేతనాలను రూ. 2,25,000గా నిర్ణయించింది. ఇది జనవరి 1, 2016 నుంచి వర్తిస్తుందని మంత్రివర్గం పేర్కొంది. కరవు భత్యం, ఇతరత్రా అలవెన్సులు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో సమానంగా ఉంటాయని పేర్కొంది. అయితే ఇవి రాష్ట్ర గవర్నర్‌ల జీతభత్యాలకు మించి ఉండకూడదని మంత్రివర్గం నిర్ణయించింది.        » బ్రిటన్, ఐర్లాండ్‌లకు అక్రమంగా వలసవెళ్లిన భారతీయులను సురక్షితంగా దేశానికి పంపేలా ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.        » అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ప్రధాన కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం కార్యోత్తర ఆమోదం తెలిపింది. కార్యాలయ ఏర్పాటు విషయమై మార్చి 26న ఐఎస్ఏ - భారత్‌ల మధ్య లాంఛన ప్రాయంగా సంతకాలయ్యాయి. సభ్యదేశాల్లో సౌరవిద్యుత్ సాంకేతికత అభివృద్ధి - వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పాటైంది. |  
| 
ఏప్రిల్ - 12 |  | 
¤ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడంలో తెలంగాణ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది.        » కేటాయించిన ఇళ్లలో 43% ప్రగతి సాధించి ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.        » ఇళ్ల నిర్మాణంలో సాధించిన పురోగతిని బట్టి గ్రామీణాభివృద్ధి శాఖ నాలుగు వర్గాలుగా విభజించింది. అందులో 86% పురోగతితో చత్తీస్‌గఢ్ తొలిస్థానంలో నిలిచింది.        » ఇళ్ల నిర్మాణంతో ముడిపడిన తొమ్మిది అంశాలను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారు.        » రాష్ట్రాలకు కేటాయించిన 94 లక్షల ఇళ్లలో ఇప్పటివరకూ 44.50 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.        » 2016 నవంబరు 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 మార్చికి కోటి ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.¤ భారత్‌లో 2016తో పోలిస్తే 2017లో మరణశిక్షలు అయిదో వంతు తగ్గినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' వెల్లడించింది.        » భారత్ 2016లో 136 మందికి, 2017లో 109 మందికి ఉరిశిక్ష విధించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది.        » మొత్తానికి ఉరిశిక్షలు 19.8 శాతం తగ్గినప్పటికీ, కొత్త చట్టాలు చేయడం ద్వారా మరణశిక్ష విధించే కొత్త నిబంధనలు రాజ్యాంగంలో చేర్చడంపై ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. |  
| 
ఏప్రిల్ - 13 |  | 
¤ దిల్లీలోని '26, అలీపూర్ రోడ్డు'లో అంబేద్కర్ జాతీయ స్మారకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.        » ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం నీరుగారనివ్వబోదని మోదీ స్పష్టం చేశారు.¤ జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 2018 జనవరిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా బయట పడింది.        » ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.¤ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి (17 సంవత్సరాలు)పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. |  
| 
ఏప్రిల్ - 14 |  | 
 ¤ చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అయిదేళ్లలో అందరికీ ఆరోగ్యాన్ని చేరువ చేస్తామని ఆయన పేర్కొన్నారు.        » దేశ వ్యాప్తంగా 1.5 లక్షల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలను వెల్‌నెస్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, వృద్ధాప్య సమస్యలు తదితర విభిన్న ఆరోగ్య సమస్యలకు అక్కడ వైద్యం అందుతుందని హామీ ఇచ్చారు.        » 'దేశవ్యాప్తంగా 115 వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్షించింద'ని మోదీ వెల్లడించారు.        » గిరిజన ప్రాంతమైన బీజాపూర్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ.        » 2018-19 కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న 'వన్‌ధన్' పథకాన్ని ప్రధాని ఆరంభించారు. దీని కింద అటవీ ఉత్పత్తులను మెరుగుపరచి, వాటికి మార్కెట్ సదుపాయం కల్పిస్తారు. ఇందుకు 'వన వికాస కేంద్రాల'ను ఏర్పాటు చేస్తారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న బస్తర్ జిల్లాలో కొత్త రైల్వే మార్గం, రహదారులు, వంతెనల పనులకూ మోదీ శంకుస్థాపన చేశారు.¤ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు జాతి ఘనంగా నివాళులర్పించింది. ఆయన 127వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీలు అంబేడ్కర్ సేవలను కొనియాడారు.  » అంబేడ్కర్ జన్మించిన ఇండోర్‌లోని 'మావ్' (అంబేడ్కర్ నగర్‌గా 2003లో నామకరణం)లో జరిగిన జయంతి వేడుకల్లో రాష్ట్రపతి మాట్లాడారు. మావ్ కంటోన్మెంట్‌లో అంబేడ్కర్ పుట్టిన ప్రాంతాన్ని ఓ భారత రాష్ట్రపతి సందర్శించడం ఇదే తొలిసారి. 'డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్: వ్యక్తి నహీ సంకల్ప్' అనే పుస్తకం తొలిప్రతిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులమీదుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ స్వీకరించారు.¤ గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రధానంగా దళితులు, గిరిజనులకు చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం, భాజపాలు వివిధ సంక్షేమ పథకాలతో కూడిన 'గ్రామస్వరాజ్ అభియాన్'ను ప్రారంభించాయి.        » ఈ కార్యక్రమం మే 5 వరకు కొనసాగుతుంది. |  
| 
ఏప్రిల్ - 15 |  | 
¤ దేశంలో మావోయిస్టుల ప్రభావం క్రమేణా తగ్గిపోతోందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 44 జిల్లాల్లో వీరి బెడద పూర్తిగా లేకపోవడం/ విస్మరించదగ్గ స్థాయికి పరిమితం కావడం వల్ల వాటిని సంబంధిత జాబితా నుంచి తొలగించారు. 8 జిల్లాలను కొత్తగా చేర్చారు. ఇప్పుడు కేవలం 30 జిల్లాల్లోనే మావోయిస్టులు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గంబా తెలిపారు. |  
| 
ఏప్రిల్ - 16 |  | 
¤ పేదలకు పోషకాహార భద్రతను కల్పించే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ చౌకధరల దుకాణాల ద్వారా జొన్నలు, సజ్జలు తదితర చిరు ధాన్యాలను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.        » అధిక పోషకాలుండే జొన్నలు, గంట్లు, రాగులు, కొర్రలు, అరికెలు, వరిగులు తదితరాలను 'న్యూట్రిసెరెల్స్'గా పేర్కొంది. ఆహార భద్రత కల్పనకూ, పోషకాహార లోపాలను అధిగమించడానికి ఇవెంతో దోహదపడతాయని వివరించింది.¤ కథువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలైన చిన్నారి కుటుంబానికి, ఆ కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి, వారికి సహకరిస్తున్న మరో వ్యక్తికి రక్షణ కల్పించాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ కథువా నుంచి చండీగఢ్‌కు మార్చాలని బాధితురాలి తండ్రి చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరింది.¤ మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల్లో సమాచార వ్యవస్థను మెరుగుపరచడానికి 4072 చరవాణి టవర్లను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది.        » రెండో దశ విస్తరణ పథకంలో భాగంగా చేసిన ఈ ప్రతిపాదనకు టెలికాం కమిషన్ ఆమోదం తెలిపింది.        » రెండేళ్ల క్రితమే పూర్తయిన తొలిదశ పనుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో రూ.3167 కోట్ల వ్యయంతో 2339 టవర్లను నెలకొల్పారు.        » తాజాగా రెండో దశలో రానున్న వాటిలో ఏపీలో 429, తెలంగాణలో 118 టవర్లు ఉన్నాయి. |  
| 
ఏప్రిల్ - 17 |  | 
¤ దేశాన్ని వణికిస్తున్న డెంగీ జ్వరాన్ని నయంచేసే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలోనే తొలి ఆవిష్కరణగా భావిస్తున్న ఈ మందును వచ్చే ఏడాది మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నారు. » కర్ణాటకలోని బెల్గామ్‌లో ఉన్న కేంద్ర ఆయుర్వేదిక్ శాస్త్ర పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్)కి చెందిన ప్రాంతీయ కేంద్రం ఇప్పటికే ఈ మందుపై ప్రయోగాత్మక అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.        » దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో డెంగీ జ్వరమే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది ఏటా దాదాపు 40 కోట్ల మందికి సోకుతుందని అంచనా.        » భారత్‌లో 2017 డిసెంబరు 24 నాటికి నమోదైన 1,57,220 డెంగీ కేసుల్లో 250 మంది, 2016లో నమోదైన 1,29,166 కేసుల్లో 245 మంది మరణించారు.¤ దేశ రాజకీయ - ఆర్థిక రాజధానులైన దిల్లీ - ముంబయి మధ్య రూ.లక్ష కోట్లతో కొత్త హరిత ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని నిర్మించడానికి కేంద్రం నడుం బిగించింది.        » ఈ మార్గం వల్ల రెండు నగరాల మధ్య 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.        » రెండు నగరాల మధ్య ప్రస్తుత రహదారిని విస్తరించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొత్త మార్గంలో రహదారి నిర్మాణానికి ఉపక్రమిస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. |  
| 
ఏప్రిల్ - 18 |  | 
¤ అసోం ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం 'అటల్ అమృత్ అభియాన్'ను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గువాహటిలో ప్రారంభించారు.¤ 50 లక్షల మందికి పైగా ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.        » సంచార్ క్రాంతి యోజన (ఎస్‌కేవై) కింద చేపట్టే ఈ కార్యక్రమంలో కుటుంబ పెద్దలైన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. |  
| 
ఏప్రిల్ - 19 |  | 
 ¤ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బి.హెచ్. లోయాది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఆయన మృతి చెందిన పరిస్థితులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. న్యాయ ప్రక్రియకు కళంకం తెచ్చేందుకు జరిగిన తీవ్ర ప్రయత్నంగా వీటిని వర్ణించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది.        » 2014 డిసెంబరు 1న వివాహ వేడుకలో పాల్గొనేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లిన లోయా గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఆయన సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసుకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.        » లోయా మరణించిన పరిస్థితులపై ఆయన సోదరి అనుమానాలు వ్యక్తం చేసినట్లు 2017 నవంబరులో వార్తా కథనాలు వచ్చాయి. దీంతో లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్ నాయకుడు తెహ్సీన్ పునావాలా సహా మరికొందరు సుప్రీంకోర్టులోపిటిషన్లు వేశారు.¤ టాక్సీలు, ఆటోలు, తేలికపాటి వాహనాలు (ఎల్ఎంవీ)లు నడిపేందుకు విడిగా వాణిజ్య లైసెన్సులు తీసుకోవాల్సిన  అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 జులైలో సుప్రీంకోర్టు ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందిగా కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది.        » ఇప్పటివరకు వ్యక్తిగతంగా 'వాహన చోదక అనుమతి పత్రం' (డ్రైవింగ్ లైసెన్సు) పొందిన తర్వాత వాణిజ్య లైసెన్సును తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఆటో, టాక్సీ డ్రైవర్లలతో పాటు వాణిజ్య అవసరాల కోసం ఇ-రిక్షా నడిపేవారు, ద్విచక్ర వాహనంపై వెళ్లి ఆహారాన్ని అందించేవారు ప్రత్యేకంగా వాణిజ్య లైసెన్సులు పొందాల్సిన అవసరం లేదు. ఏడున్నర టన్నులలోపు బరువైన వాహనాలను నడిపేవారికి ఇది వర్తిస్తుంది.        » ట్రక్కులు, బస్సులు, ఇతర మధ్య తరహా/ భారీస్థాయి ప్రయాణికుల వాహనాలు నడిపేవారు మాత్రం ఎప్పటి లాగే వాణిజ్య అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. |  
| 
ఏప్రిల్ - 20 |  | 
 ¤ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అత్యున్నత పదవిలో ఉంటూ సీజేఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడికి అందజేశారు.        » భారత్‌లో సీజేఐ అభిశంసనకు గురికావడం ఇదే మొదటిసారి.        » సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బి.హెచ్.లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది.        » అభిశంసన నోటీసుపై కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ముస్లిం లీగ్ సభ్యులు సంతకాలు చేశారు. |  
| 
ఏప్రిల్ - 21 |  | 
 ¤ దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న లైంగిక అఘాయిత్యాలు, ఆర్థిక నేరగాళ్లకు కళ్లెం వేసే రీతిలో రెండు కీలకమైన అత్యవసరాదేశాలకు (ఆర్డినెన్సులు) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వీటితోపాటు స్థానిక సంస్థలకు జవసత్వాలు కల్పించే మరో ప్రతిపాదన పైనా కీలక నిర్ణయం తీసుకుంది.        » 12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఉరిశిక్ష విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మిగతా అన్నిరకాల అత్యాచార ఘటనల్లో గరిష్ఠ శిక్షను పెంచింది. ఈ మేరకు ఐపీసీ, సీఆర్‌పీసీ, పోక్సో చట్టాలను సవరించనుంది. దోషులు చనిపోయేంతవరకూ జైల్లోనే గడిపేలా చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. అలాగే అన్నిరకాల అత్యాచార ఘటనలపై పోలీసు దర్యాప్తు, కోర్టుల విచారణకు 2 నెలల కాలపరిమితిని విధించింది. అప్పీళ్లపై నిర్ణయం వెలువరించేందుకు ఉన్నత న్యాయస్థానాలకు ఆరు నెలల సమయం మాత్రమే ఇచ్చింది. » అత్యాచార కేసుల్లో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వీలుగా కోర్టులు, ప్రాసిక్యూషన్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులతో చర్చించి కొత్తగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాయి. అత్యాచార సంఘటనలను త్వరగా నిర్ధారించడం కోసం అన్ని పోలీస్‌స్టేషన్లు, ఆసుపత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లు అందజేస్తారు.        » లైంగిక నేరాలకు సంబంధించి ఇకమీదట నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రత్యేకంగా నేషనల్ డేటాబేస్‌ను నిర్వహిస్తుంది. అంతేకాకుండా లైంగిక నేరాలకు సంబంధించిన ప్రొఫైల్‌ను నిక్షిప్తం చేస్తుంది. తద్వారా నేరగాళ్ల ముందస్తు కదలికలు కనిపెట్టడానికి పోలీసులకు సులభం అవుతుంది. బాధితులకు సాయం చేయడానికి ఏర్పాటుచేసిన 'వన్‌స్టాప్ సెంటర్స్'ని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.ఆర్థిక నేరగాళ్లను అరికట్టే చర్యలు:
  దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాంటి వారిని అరికట్టడానికి కేంద్రం సిద్ధమైంది. అలాంటివారి ఆస్తులను జప్తుచేసే అధికారాన్ని భారతీయ అధికారులకు ఇవ్వడానికి ఉద్దేశించిన 'పలాయనంలోని ఆర్థిక నేరగాళ్ల అత్యవసరాదేశం - 2018' జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనివల్ల భారతీయ చట్టాలకున్న శక్తి ప్రబలమవుతుంది. విదేశాల్లో తలదాచుకున్న నేరగాళ్లు తప్పనిసరిగా దేశానికి తిరిగివచ్చి ఇక్కడి కోర్టుల్లో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బకాయిల వసూళ్లను పెంచుకోవచ్చు. ఫలితంగా ఆర్థిక సంస్థల ఆరోగ్యం మెరుగవుతుంది.  రూ.100 కోట్లకు పైబడి విలువైన నేరాలనే ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి తీసుకొచ్చారు.రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్‌లో మార్పులు  'రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్'లో పునర్వ్యవస్థీకరించడానికి కేబినెట్ ఆమోదించింది. మౌలిక సదుపాయాల మెరుగు, ఇ-పాలనకు బలాన్ని చేకూర్చే ఈ పథకాన్ని ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కలిసి రూ.7225 కోట్లు ఖర్చు చేస్తాయి.తాజా ఆర్డినెన్సు ప్రకారం...:  మహిళలపై జరిగే అత్యాచారాలకు కనిష్ఠ శిక్షను 7 నుంచి పదేళ్లకు పెంచారు. జీవిత ఖైదుగానూ మార్చవచ్చు.  16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కనీస శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. దాన్ని జీవితకాలానికి పొడిగించవచ్చు. అంటే అతడు సహజంగా చనిపోయేంతవరకూ జైల్లోనే ఉండాలి.  16 ఏళ్లలోపు బాలికలపై మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడేవారికి జీవితకాల శిక్ష విధిస్తారు.  12 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారికి జీవితకాల శిక్ష లేదా మరణశిక్ష విధిస్తారు.  16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లోని నిందితులకు ఎలాంటి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదు.¤ దేశంలోని అతిపెద్ద అధికారిక డిజిటల్ వేదిక అయిన 'మైగవ్' పోర్టల్‌ను అధునాతన హంగుల (అప్‌కమింగ్ వెర్షన్)తో తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.        » 'మైగవ్ 2.0' పేరిట తీసుకురానున్న ఈ పోర్టల్‌తో 2019 నాటికి 50 కోట్ల మంది భారతీయులను అనుసంధానం చేయాలన్నది లక్ష్యం. 'కేంబ్రిడ్జ్ అనలిటికా' లాంటి వివాదాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. |  
| 
ఏప్రిల్ - 22 |  | 
 ¤ పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించే అత్యవసర ఆదేశానికి (ఆర్డినెన్స్‌కు) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతోపాటు రూ.200 కోట్లు పైబడిన ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోతున్న వారి ఆస్తుల స్వాధీనానికి ఉద్దేశించిన మరో ఆర్డినెన్స్‌కు ఆయన ఆమోదం తెలిపారు.        » పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం లేకపోవడం, తక్షణం ఈ శాసనాలు అమల్లోకి రావాల్సి ఉందని రాష్ట్రపతి సంతృప్తి చెందడంతో ఈ ఆర్డినెన్స్‌లు ఆమోదం పొందినట్లు గెజిట్ ప్రకటన వెలువడింది.        » 12 ఏళ్ల లోపు బాలికలపై అఘాయిత్యాలు చేసేవారికి మరణశిక్ష విధించడంతో పాటు ఇతర వయస్కులపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కూడా శిక్షల్ని కఠినతరం చేశారు. కొన్ని కేసుల్లో కనీస శిక్షల్ని 20 ఏళ్లకు పెంచారు. దీంతో పాటు ఈ కేసుల విచారణకు కాలపరిమితి, నిందితులకు బెయిల్ నిరాకరించే నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. |  
| 
ఏప్రిల్ - 23 |  | 
¤ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలో ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించారు. ఆ నోటీసులోని ఆరోపణలు సమర్థనీయమైనవి కావని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. ఎంపీలు లేవనెత్తిన ఐదు అభియోగాల్లో ఒక్కదానికీ సరైన సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఈ మేరకు 10 పేజీల ఉత్తర్వులను వెలువరించారు. |  
| 
ఏప్రిల్ - 24 |  | 
¤ 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ రుణాలు రూ.10 లక్షల కోట్లు దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ రుణాల్లో రూ.6.8 లక్షల కోట్లు స్వల్పకాలిక పంటలకే వెళ్లాయనీ, దానిలో సగం చిన్న, సన్నకారు రైతులకు అందాయనీ వెల్లడించింది.        » 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో రుణ వితరణ లక్ష్యం రూ.11 లక్షల కోట్లకు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. |  
| 
ఏప్రిల్ - 25 |  | 
¤ కేంద్ర టెలికాం శాఖ ఇకపై భారతీయ ప్రామాణిక కాలమానాన్ని అనుసరించనుంది. ఈ విషయమై శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి - జాతీయ భౌతిక ప్రయోగశాల (సీఎస్ఐఆర్ - ఎన్ఎల్‌పీ), టెలికాం శాఖలు దిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.» 3జీ, 4జీ, 5జీ సాంకేతికత రాకతో దేశవ్యాప్తంగా సైబర్ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్నాయనీ, వీటిపై పర్యవేక్షణ అవసరాలరీత్యా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
  ¤ పునర్‌వ్యవస్థీకరించిన జాతీయ వెదురు కార్యక్రమానికి (ఎన్‌బీఎం) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 14వ ఆర్థిక సంఘం రానున్న కాలం (2018 - 19, 2019 - 20)లో సుస్థిర వ్యవసాయ కార్యక్రమం కింద ఎన్‌బీఎంను అమలు చేసేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఏ) నిర్ణయించింది. దీనికోసం రూ.1290 కోట్లు ఖర్చు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.950 కోట్లు. » సామాజికంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా ప్రయోజనాలున్న కొన్ని రాష్ట్రాల్లో వెదురు అభివృద్ధిపై ఎన్‌బీఎం దృష్టి పెడుతుంది.
 » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఎన్‌బీఎం పరిధిలోకి వస్తాయి.
 » లక్ష హెక్టార్లలో వెదురు సాగుచేయాలన్నది ఎన్‌బీఎం లక్ష్యం. అటవీయేతర, ప్రైవేటు భూముల్లో వెదురు అభివృద్ధి చేయడం వల్ల లక్షమంది రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది.
 » ముడి జనుము కనీస మద్దతు ధరను ప్రభుత్వం క్వింటాకు రూ.200 పెంచింది. ఈ పెంపుతో 2018 - 19 పంట కాలానికి ముడి జనుము కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3700 అవుతుంది.
 » రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలను రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ షెడ్యూల్‌లోని నిబంధనల కింద రక్షణ కల్పిస్తారు.
 » జపాన్, దక్షిణ కొరియాలకు ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీ ద్వారా ఇనుప ఖనిజం ఎగుమతికి ఉద్దేశించిన దీర్ఘకాలిక ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 » భారత్, దక్షిణాఫ్రికా ద్వీపకల్ప దేశమైన సావోటోమ్ మధ్య ఔషధ మొక్కల సరఫరాకు కుదిరిన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 |  
| 
ఏప్రిల్ - 28 |  | 
 ¤ చారిత్రక ఎర్రకోటను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుపరం చేసింది. వచ్చే అయిదేళ్లపాటు నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టడానికి దాల్మియా భారత్ గ్రూప్‌నకు అప్పగించింది. ఇందుకు కంపెనీ ఏటా రూ. ఐదు కోట్ల వ్యయం చేయనుంది. ప్రతిగా ఎర్రకోటలో అన్ని రకాలుగా ప్రచారం చేసుకోవడానికి అనుమతిస్తూ కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్, జీఎంఆర్ గ్రూప్‌తో పోటీపడి దాల్మియా భారత్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది.        » జాతీయ స్థాయి స్మారక చిహ్నాన్ని ప్రైవేటు కంపెనీకి అప్పగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.        » ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని 2017 సెప్టెంబరు 17న 'స్మారక చిహ్నాల దత్తత' పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. వాటి అభివృద్ధి, నిర్వహణ చేపట్టే కంపెనీలు వాటి ఆవరణలో తమ గురించి ప్రచారం చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. టికెట్లు, అద్దెల రూపంలో వచ్చిన నగదు మొత్తాన్ని పూర్తిగా ఆ స్మారక చిహ్నాల అభివృద్ధికే వ్యయం చేయాలని, లాభాపేక్ష కూడదని షరతులు విధించింది. |  
| 
ఏప్రిల్ - 29 |  | 
 ¤ ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం అయిన 'మన్ కీ బాత్'లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.        » కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. వేసవి సెలవుల్లో మంత్రిత్వశాఖలు ప్రత్యేకంగా చేపట్టిన 'ఇంటర్న్‌షిప్' కార్యక్రమంలో పాల్గొని, దానివల్ల కలిగే ప్రయోజనాలను పొందాలని సూచించారు.¤ దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు సరఫరా అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమైందని, విద్యుత్తు సరఫరా లేని మధ్య మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో ఉన్న లాయ్‌సాంగ్ గ్రామానికి సైతం ఏప్రిల్ 28న విద్యుత్తు కనెక్షన్ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.        » 1000 రోజుల్లో దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు అందిస్తామని 2015 స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ ప్రసంగంలో తెలిపారు. మన దేశ అభివృద్ధి ప్రయాణంలో ఏప్రిల్ 28, 2018 చిరస్థాయిగా మిగిలిపోతుందని ప్రధాని ట్వీట్ చేశారు.        » ప్రతి గ్రామానికి విద్యుత్తును అందించాలనే ధ్యేయంతో భాజపా 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన' పథకాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.        » ఒక గ్రామానికి విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ గ్రామంలోని పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలలో కనీసం పదిశాతం ప్రాథమిక విద్యుత్తు సౌకర్యాలు కల్పించాలని మోదీ తెలిపారు.  ¤ దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. అత్యంత సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన నేతగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ చరిత్ర సృష్టించారు.        » ఇప్పటివరకూ కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు పేరు మీదున్న రికార్డును చెరిపేసి పవన్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు.        » చామ్లింగ్ అధికారం చేపట్టి ఏప్రిల్ 29 నాటికి 23 ఏళ్ల నాలుగు నెలల 17 రోజులవుతుంది. ఇది జ్యోతిబసు పదవీకాలం కంటే ఒక రోజు ఎక్కువ.        » జ్యోతిబసు పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రిగా 1977 జూన్ 21 నుంచి 2000 నవంబరు 6 వరకు ఉన్నారు.        » పవన్ కుమార్ చామ్లింగ్ 1993లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట ప్రత్యేక పార్టీని స్థాపించి ఏడాదిలోపే అంటే 1994, డిసెంబరు 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1973లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1985లో తొలిసారి శాసన సభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒకేసారి వరుసగా కానీ, విడతలవారీగా కానీ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తుల జాబితాలో చామ్లింగ్ తరువాతి వరుసలో జ్యోతిబసు (23 ఏళ్ల 137 రోజులు), మానిక్ సర్కార్ (20 ఏళ్ల మూడు నెలలు), గెగాంగ్ అపాంగ్ (22 ఏళ్ల 256 రోజులు), ఎం.కరుణానిధి (18 ఏళ్ల 293 రోజులు) నిలిచారు.        » పవన్ చామ్లింగ్ స్వతహాగా కవి. 'కిరణ్' అన్న కలం పేరుతో ఈయన రాసిన రచనలకు 2010లో భాను పురస్కారం లభించింది. |  
| 
ఏప్రిల్ - 30 |  | 
 ¤ గౌతమ బుద్ధుడి 2562వ జయంతి సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గౌతమ బుద్ధుడి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో బుద్ధుడి సర్క్యూట్ కోసం రూ.360 కోట్లు సమకూర్చినట్లు మోదీ వెల్లడించారు. |  |  |