¤ అర నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఛార్జ్ అయ్యే కొత్త తరహా బ్యాటరీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మండే గుణమున్న రసాయనిక ద్రావణాలకు బదులుగా ద్రవరూప ఎలక్ట్రోలైట్లను ఉపయోగించి దీన్ని దక్షిణ కొరియాలోని కైస్ట్ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం తయారుచేసింది. ఈ బ్యాటరీ వల్ల పర్యావరణానికి హాని ఉండదు.
మార్చి - 2
¤మధుమేహానికి సంబంధించి సవరించిన వర్గీకరణను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇందులో మొత్తం 5 విభిన్న రకాల వ్యాధులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మధుమేహాన్ని టైప్ - 1, టైప్ - 2గా మాత్రమే గుర్తించారు. టైప్ - 1 బాధితుల్లో ఇన్సులిన్ (రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్దీకరించే హార్మోన్) ఉత్పత్తి కాదు. చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మధుమేహ కేసుల్లో టైప్ - 1 కేసులు దాదాపు 10% ఉంటాయి. టైప్ - 2 బాధితుల్లో ఇన్సులిన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి కాదు. » ఈ సమాచారాన్ని స్వీడన్‌లోని లండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కూడిన బృందం తాజాగా ఈ పరిశోధనలు నిర్వహించింది. ఇన్సులిన్‌ను ప్రభావవంతంగా ఉపయోగించుకోలేని స్థితి (ఇన్సులిన్ నిరోధకత)లో ఉన్న వ్యక్తులను శాస్త్రవేత్తలు మొదటి రకం మధుమేహుల బృందంలో చేర్చారు. వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తులు మూత్రపిండ సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్సులిన్ లోటుతో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా మధుమేహ తీవ్రత ఎక్కువగానే ఉందని వెల్లడించారు. వారిని రెండో బృందంగా వర్గీకరించారు. మూడో బృందంలో స్వీయ రోగనిరోధకత నాశక మధుమేహంతో బాధపడుతున్నవారిని చేర్చారు. నాలుగు, అయిదోరకం బృందాల్లో వయసు మీద పడేకొద్దీ మధుమేహం బారినపడే వ్యక్తులు సహా ఇతరులను చేర్చారు. వారిలో తీవ్ర ప్రతికూల ప్రభావాలేవీ కనిపించలేదని తెలిపారు.
మార్చి - 22
¤ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. » దేశీయంగా రూపొందించిన 'సీకర్' తో దీన్ని తొలిసారిగా పరీక్షించడం విశేషం. లక్ష్యం చేరేవరకూ క్షిపణికి అత్యంత కచ్చితత్వంతో మార్గనిర్దేశం చేయడంలో ఈ సీకర్ కీలకపాత్ర పోషిస్తుంది. » రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్ద ఈ ప్రయోగం జరిగింది.
మార్చి - 24
¤ కణాలతో సంబంధం లేకుండా కృత్రిమంగా ప్రోటీన్లను ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. » అమెరికాలోని నార్త్ వెస్టర్న్ మేల్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు.
మార్చి - 26
¤ ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30% వరి పంటను నాశనం చేస్తున్న 'రైస్ బ్లాస్ట్' తెగులు వ్యాప్తిని అరికట్టే మార్గాన్ని పరిశోధకులు ఆవిష్కరించారు. » ఈ శిలీంధ్రంలో ఏక ప్రొటీన్ రసాయన జన్యు నిరోధం ద్వారా వరి ఆకు లోపల దీని వ్యాప్తిని నివారించవచ్చని యూకేలోని ఎక్స్‌టర్ యూనివర్సిటీ నేతృత్వంలో పని చేస్తున్న అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. » అయితే ఇది ప్రాథమిక ఆవిష్కరణ మాత్రమే అని ఇప్పటికిప్పుడే పొలాల్లో దీనిని ప్రయోగించలేమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మార్చి - 28
¤ మానవ కృత్రిమ కణజాల ముద్రణలో కీలకమైన 'త్రీడీ బయోప్రింటర్' ఇకపై అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. » ప్రామాణిక డెస్క్‌టాప్ త్రీడీ ప్రింటర్‌కు 'లార్జ్ వాల్యూమ్ ఎక్స్‌ట్రూడర్ (ఎల్‌వీఈ)' లాంటి సాంకేతికతలను జోడించడం ద్వారా చౌకైన త్రీడీ బయో ప్రింటర్‌ను అమెరికాలోని కార్నెగీ మెలాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. ఎవరైనా సరే ఈ అద్భుత పరికరాన్ని తయారు చేసుకునేందుకు వీలుగా సంబంధిత పరిజ్ఞానాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచారు.¤ శాస్త్రవేత్తలు తాజాగా దాదాపు భూమి పరిమాణంలో ఉన్న ఓ లోహపు గ్రహాన్ని గుర్తించారు. భూగ్రహానికి 26 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ అది పరిభ్రమిస్తున్నట్లు తేల్చారు. » 'కే2-229బీ'గా పిలుస్తున్న ఈ నూతన గ్రహాన్ని ఫ్రాన్స్‌లోని ఎయిక్స్ - మార్సెల్లె విశ్వవిద్యాలయం, బ్రిటన్‌కు చెందిన వార్విక్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 'కే2' టెలిస్కోప్ సాయంతో డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతను ఉపయోగించి విర్గో నక్షత్ర మండలంలో గుర్తించారు. » ఈ గ్రహం పరిమాణం భూమితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. ద్రవ్యరాశి భూమి కంటే రెండున్నర రెట్లు అధికం. అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు (పగటిపూట రెండు వేల డిగ్రీల సెల్సియస్ వరకు) నమోదవుతుంటాయి.
మార్చి - 29
¤ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్‌వీ - ఎఫ్08 వాహక నౌకను విజయవంతంగా ప్రయోగించింది. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం జరిగింది. » ఈ రాకెట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 6ఏను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. » ప్రయోగం జరిగిన తర్వాత రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి జీశాట్6 - ఏ ఉపగ్రహాన్ని చేర్చడానికి 17.46.50 నిమిషాల సమయం పట్టింది. భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో దీన్ని శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అంటే కక్ష్యలో భూమికి సమీప బిందువు (పెరిజీ) 170 కిలోమీటర్లు, దూరంగా ఉండే బిందువు (అపోజీ) 35,975 కిలోమీటర్లు ఉంటుంది. 20.63 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రోజుల వ్యవధిలో అందులోని ఇంధనాన్ని మండించి కక్ష్య మారుస్తూ భూమికి 36 వేల కి.మీ. ఎత్తులో ఉండే భూస్థిర కక్ష్యలోకి పంపనున్నారు. » జీఎస్ఎల్‌వీ సిరీస్‌లో ఇది 12వది. దీని బరువు 415.6 టన్నులు, పొడవు 49.1 మీటర్లు. దశలు మూడు. మొదటి దశ ఇంజిన్‌లో ద్రవ ఇంధనంతో నడిచే నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు, మిశ్రమ ఘన ఇంధనంతో పనిచేసే ప్రధాన ఇంజిన్ ఉంది. రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మూడో దశలో క్రయోజనిక్ ఇంజిన్ ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఆరో క్రయోజనిక్ ఇంజిన్ ఇది. » జీఎస్ఎల్‌వీ - ఎఫ్08లో వికాస్ ఇంజిన్‌ను తొలిసారి వినియోగించారు. ఇది రెండో దశలో అధిక పీడనాన్ని ఇస్తుంది. మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) దీన్ని రూపొందించింది. వికాస్ ఇంజిన్ వల్ల పెలోడ్ సామర్థ్యం పెంచుకునే వీలుంది. » ఇస్రో జీశాట్ - 6 ఉపగ్రహాన్ని 2015 ఆగస్టు కక్ష్యలో ప్రవేశపెట్టింది. మళ్లీ ఇపుడు జీఎస్ఎల్‌వీ - ఎఫ్08 ద్వారా జీశాట్ - 6ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీని బరువు 2140 కిలోలు. దీని జీవిత కాలం పదేళ్లు. దీనికి రూ. 270 కోట్లు ఖర్చు చేశారు. » ఉపగ్రహంలోని మల్టీ బీమ్ కవరేజీ సౌకర్యం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో మొబైల్ కమ్యూనికేషన్ అందనుంది. ఇది ఐదు స్పాట్ బీమ్‌లలో ఎస్ - బ్యాండ్‌ను, ఒక బీమ్‌లో సి - బ్యాండ్‌ను కలిగి ఉంది. రక్షణ దళాలకు జీశాట్ - 6ఏ ఉపగ్రహ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.¤ కాగితంలా అతిసన్నగా ఉండి, వంగే గుణం కలిగిన ఎల్‌సీడీ తెరలను చైనాలోని డాంజువా వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. » సంప్రదాయ ఎల్‌సీడీల తరహాలోనే రెండు ఫలకల మధ్య ద్రవ స్ఫటిక పదార్థాన్ని ఉంచి దీనికి పరిశోధకులు రూపకల్పన చేశారు. అయితే సంప్రదాయ ఎల్‌సీడీలో ఒక్కో పిక్సెల్ రంగు మారేందుకు విద్యుత్ అనుసంధానాలు ఉంటాయి. ఈ నూతన ఎల్‌సీడీల కోసం ఫలకాలకు ప్రత్యేకమైన అణువులను పూతగా పూశారు. ఇవి ధ్రువిత కాంతిలో పిక్సెల్స్ రంగును మార్చుతాయి.¤ కృష్ణ పదార్థమనేది లేకుండా ఉన్న ఒక నక్షత్ర మండలం తొలిసారిగా శాస్త్రవేత్తల కంటపడింది. » ఎన్‌జీసీ 1052 - డీఎఫ్2 అనే ఈ నక్షత్ర మండలాన్ని 'అల్ట్రా - డిఫ్యూజ్ గెలాక్సీ'గా వర్గీకరించారు. ఇదో కొత్త రకం తారామండలం.
మార్చి - 31
¤ భారతీయుల మెదడు నమూనాను అభివృద్ధి చేసేందుకు హరియాణాలోని జాతీయ మెదడు పరిశోధన కేంద్ర (ఎన్‌బీఆర్‌సీ) ప్రయత్నాలు ప్రారంభించింది. » జాతులు, ప్రాంతాలకు అనుగుణంగా మెదడులో భేదాలుంటాయనేది ఎప్పటి నుంచో ఉన్న వాదన. ఈ విషయంలో చైనా, దక్షిణ కొరియా, కెనడా ఇప్పటికే పురోగతి సాధించాయి. తమ జాతి/ ప్రాంత మెదడు నమూనాలను అభివృద్ధి చేశాయి. న్యూరాన్ల సంఖ్య, కీలక భాగాల్లో స్వల్ప తేడాలు వీటిలో కనిపిస్తున్నాయి. » ఇదివరకు మన దేశానికి చెందిన మానసిక ఆరోగ్యం, నాడీ విజ్ఞాన జాతీయ సంస్థ (నిమ్‌హాన్స్) సైతం భారతీయ మెదడు నమూనాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. అయితే సఫలం కాలేకపోయింది.