Type Here to Get Search Results !

మార్చి-2018 క్రీడలు

మార్చి - 1
¤ కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాత్ రజతం నెగ్గింది.
మార్చి - 2
¤ ఐబీఎస్ఎఫ్ టీమ్ స్నూకర్ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 3 - 2తో పాకిస్థాన్‌పై నెగ్గింది. భారత జట్టులో పంకజ్ అడ్వాణీ, మానన్ చంద్ర ఉన్నారు. టీమ్ స్నూకర్ ప్రపంచకప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. దోహాలో ఈ పోటీలను నిర్వహించారు.
¤ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారణి నవజోత్ కౌర్ స్వర్ణం నెగ్గింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సాధించింది. 65 కిలోల విభాగంలో ఫైనల్లో 9 - 1తో మియా ఇమాయ్ (జపాన్)పై నెగ్గింది
.
        » మరో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్ 62 కిలోల విభాగంలో కాంస్యం నెగ్గింది
.
¤ భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
మార్చి - 4
¤ మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో ప్రారంభమైన సీనియర్ షూటింగ్ ప్రపంచకప్ తొలిరోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి.        » పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మీరట్‌కు చెందిన షాజర్ రిజ్వి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి మరీ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. రిజ్వి ఫైనల్లో మొత్తం 242.3 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.        » ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ రెయిట్జ్ (జర్మనీ 239.7 పాయింట్లు) ని వెనక్కి నెట్టి రిజ్వి స్వర్ణం గెలిచాడు.        » భారత స్టార్ షూటర్ జితు రాయ్ ఇదే విభాగంలో కాంస్యం గెలిచాడు. అతడు 219 పాయింట్లు సాధించాడు.        » మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులి ఘోష్ కాంస్యం సాధించింది. సీనియర్ విభాగంలో తొలిసారి పోటీపడిన ఈ జూనియర్ షూటర్ పతకాన్ని సొంతం చేసుకుంది.¤ భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తాల్ మెమోరియల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.        » 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆనంద్ విజేతగా టైటిల్ సొంతం చేసుకున్నాడు.¤ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పాల్గొనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.        » గత సీజన్ వరకు నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న గంభీర్ ఈసారి దిల్లీకి మారాడు.
మార్చి - 5
¤ మెక్సికోలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో యువ షూటర్ మను బాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించింది.        » సీనియర్ విభాగంలో తొలి ప్రపంచకప్ ఆడుతున్న మను ఫైనల్లో రెండు సార్లు ప్రపంచకప్ స్వర్ణ విజేత అలెగ్జాండ్రా జవాలా (మెక్సికో)పై నెగ్గింది. మను 237.5 పాయింట్లు సాధించగా అలెగ్జాండ్రా 237.1 పాయింట్లతో రజతం గెలిచింది.        » ఈ విజయంతో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు కూడా మను అర్హత సాధించింది.
మార్చి - 6
¤ భారత యువ షూటర్ మను బాకర్ ఒక్క రోజు వ్యవధిలో ప్రపంచకప్ షూటింగ్‌లో రెండు స్వర్ణాలతో సంచలనం సృష్టించింది.        » 16 ఏళ్ల మను 2018 మార్చి 5న 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గింది. మార్చి 6న టీమ్ విభాగంలో పసిడి సాధించింది.        » మను, ఓం ప్రకాష్ మితర్వాల్ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో 476.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.        » జర్మనీ భార్యభర్తల జోడీ క్రిస్టియన్ రీట్జ్ - సాండ్రా రీట్జ్ 475.2 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది.
మార్చి - 8
¤ దేవధర్ ట్రోఫీ 2018 విజేతగా భారత్‌బి నిలిచింది.        » హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో విజయ్ హజారే ట్రోఫీ2018 విజేత కర్ణాటకను ఓడించింది.        » భారత్‌-బి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించాడు.
మార్చి - 9
¤ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణ కొరియాలో శీతకాల పారా ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌లో ఆ దేశ అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.
మార్చి - 11
¤ మెక్సికోలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో అఖిల్ షెరోన్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో 455.6 పాయింట్లు సాధించిన షెరోన్ ఆస్ట్రియా క్రీడాకారుడు బెర్న్‌హార్డ్ (452 పాయింట్లు)ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
మార్చి - 15
¤ నేపాల్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత సాధించింది. ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అసాధారణ ప్రదర్శన చేసిన నేపాల్ జట్టు పపువా న్యూ గునియాను వెనక్కి నెట్టి వన్డే హోదా దక్కించుకుంది.        » టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాలకు ఐసీసీ శాశ్వత వన్డే హోదా లభిస్తుంది. మరో నాలుగు జట్లకు ఐసీసీ తాత్కాలిక హోదా కల్పించింది. నాలుగేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఇప్పుడు నేపాల్ సొంతం చేసుకుంది. ఈ హోదాను 2022 వరకు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టుకు అవకాశం లభించింది.
మార్చి - 16
¤ భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించి తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.        » బర్మింగ్‌హామ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 20-22, 21-18, 21-18తో నొజామి ఒకుహర (జపాన్)పై విజయం సాధించింది.        » భారత ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకుంది. ఫిఫా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 99వ స్థానంలో నిలిచింది.        » జర్మనీ అగ్రస్థానంలో ఉండగా బ్రెజిల్, పోర్చుగల్, అర్జెంటీనా, బెల్జియం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.        » పుట్‌బాల్ చరిత్రలో 94వ స్థానంలో (1996) నిలవడమే భారత్‌కు అత్యుత్తమం.
మార్చి - 17
¤ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ మహిళల సెమీఫైనల్లో పీవీ సింధు 21-19, 19-21, 18-21తో అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది.¤ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సీజన్ - 4 విజేతగా చెన్నయిన్ ఎఫ్‌సీ నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3 - 2తో బెంగళూరును ఓడించింది.        » మొత్తం నాలుగు సీజన్‌లలో రెండు సార్లు అథ్లెటికో డి కోల్‌కతా విజేతగా నిలవగా చెన్నయిన్ రెండుసార్లు విజేతగా నిలిచింది. 2015లోనూ చెన్నయిన్ విజేతగా నిలిచింది.
మార్చి - 18
¤ రంజీ ఛాంపియన్ విదర్భ ఇరానీ కప్ కూడా చేజిక్కించుకుంది.        » నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 'రెస్టాఫ్ ఇండియా' జట్టుపై విజయం సాధించింది.        » ప్రతి ఏడాది రంజీట్రోఫీ విజేత, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే ఇరానీకప్‌ను రంజీ ఛాంపియన్ గెల్చుకోవడం ఇది 27వ సారి.¤ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో షి యుకి (చైనా), మహిళల విభాగంలో తైజుయింగ్ (కొరియా) టైటిళ్లు కైవసం చేసుకున్నారు.        » పురుషుల సింగిల్స్ ఫైనల్లో షి యుకి 21-19, 16-21, 21-9తో లిన్‌డాన్ (చైనా)ను ఓడించాడు.        » మహిళల తుది సమరంలో తైజు 22-20, 21-13తో అకానె యమగూచి (జపాన్)పై నెగ్గింది.¤ శ్రీలంకలో జరిగిన నిదహాస్ ముక్కోణపు టీ20 సిరీస్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది.        » కొలంబోలో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.        » ఫైనల్లో కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు సాధించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన దినేష్ కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం లభించింది.
మార్చి - 19
¤ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ విజేతగా అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్‌పొట్రో నిలిచాడు.        » అమెరికాలోని ఇండియన్ వెల్స్ లో జరిగిన ఫైనల్లో 6-4, 6-7 (7-8), 7-6 (7-2)తో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) పై విజయం సాధించాడు.        » డెల్‌పొట్రో ఈ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. ఫెదరర్ గతంలో ఐదుసార్లు ఈ టైటిల్ నెగ్గాడు.        » తాజాగా ఈ టోర్నీ మహిళల టైటిల్‌ను నయోమి ఒసాకా (జపాన్) నెగ్గింది. ఫైనల్లో 6-3, 6-2 తో డారియా కసట్కినా (రష్యా) పై నెగ్గింది.
మార్చి - 21
¤ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నగదు బహుమతి మొత్తాన్ని దాదాపు 8 శాతం పెంచారు. సింగిల్స్ విజేతకు ఇచ్చే మొత్తం లక్ష యూరోలు పెరిగి 2.2 మిలియన్ యూరోలకు చేరుకుంది. టోర్నీ మొత్తం నగదు బహుమతి మూడు మిలియన్ యూరోలు పెరిగి 39.197 మిలియన్ యూరోలకు చేరింది.
మార్చి - 24
¤ ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి స్టార్ షట్లర్ పి.వి.సింధు సారథ్యం వహించనుంది. త్రివర్ణ పతాకంతో ముందు నడవనుంది.        » ఒక షట్లర్ భారత పతాకధారిగా నిలవడం గత మూడు క్రీడల తర్వాత ఇదే తొలిసారి.        » 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో షూటర్ విజయ్ కుమార్ ఈ గౌరవాన్ని పొందాడు.¤ భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణీ ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్‌ను నిలబెట్టుకున్నాడు.        » ఫైనల్లో పంకజ్ 6-1 తేడాతో సహచరుడు భాస్కర్‌పై విజయం సాధించాడు.        » ఆసియా పోటీల్లో పంకజ్‌కు ఇది 11వ స్వర్ణపతకం.        » మహిళల విభాగంలో భారత్‌కు చెందిన అమీ కమానీ స్వర్ణం నెగ్గింది. ఫైనల్లో 3-0 తేడాతో సిరిపాపార్న్ (థాయిలాండ్)పై గెలిచింది.¤ పదహారేళ్ల భారత షూటర్ మనుబాకర్ జూనియర్ ప్రపంచకప్‌లో రెండు పసిడి పతకాలు నెగ్గింది.        » మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన మను టీమ్ విభాగంలో దేవాన్షి, మహిమా అగర్వాల్‌తో కలిసి పసిడి దక్కించుకుంది.
మార్చి - 25
¤ ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో అఫ్గనిస్థాన్ విజేతగా నిలిచింది.        » హరారేలో జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.        » 2018 వన్డే ప్రపంచకప్‌కు అఫ్గాన్‌తో పాటు వెస్టిండీస్ కూడా అర్హత సాధించింది.
మార్చి - 26
¤ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్‌లో 25 మీటర్ల ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల అనీష్ బన్వాలా బంగారు పతకం సాధించాడు.        » ఫైనల్లో భారత్‌కే చెందిన రాజ్ కన్వర్, అనద్ జాందాల నుంచి గట్టి పోటీ ఎదురైనా అనీష్ స్వర్ణాన్ని సాధించాడు.¤ కామన్వెల్త్ క్రీడల కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు క్రీడా మంత్రిత్వశాఖ 325 మంది సభ్యుల భారత బృందానికి అనుమతి ఇచ్చింది.
మార్చి - 27
¤ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు స్వర్ణాలు గెలుచుకున్న మను బాకర్ మరో స్వర్ణం నెగ్గింది.        » 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో అన్మోల్‌తో కలిసి పసిడి నెగ్గింది.        » 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో శ్రేయా అగర్వాల్ - అర్జున్ జంట కాంస్యం నెగ్గింది.        » స్కీట్ విభాగంలో జెనెమత్ రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది.
మార్చి - 28
¤ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో మహిళల 25 మీపిస్టల్ విభాగంలో ముస్కాన్ పసిడినెగ్గింది.
మార్చి - 29
¤ బాల్ టాంపరింగ్ కుంభకోణంలో దొరికిపోయిన తమ ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిషేధం విధించింది.        » ఏడాది పాటు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడకుండా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్‌లో పాత్రధారి అయిన బ్రాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.