¤ కశ్మీర్‌లోని మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు జవాన్లు, నలుగురు పౌరులు కూడా ఈ ఘటనల్లో మరణించారు. » అనంతనాగ్‌లోని దియాల్గమ్, షోపియాన్‌లోని కచ్చేదూర్, ద్రగడ్ ప్రాంతాల్లో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.¤ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేశంలోని అయిదు రైల్వే స్టేషన్ల నిర్వహణను పొరుగుసేవల (అవుట్ సోర్సింగ్)కు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. » సికింద్రాబాద్, బెంగళూరు, దిల్లీలోని ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీ, పుణె, చండీగఢ్ స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. » పదిహేనేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు వీటిని అప్పగించనున్నారు. మొదట భారతీయ రైల్వేస్టేషన్ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌సీడీసీ)కు వీటిని అప్పగిస్తారు. ఐఆర్‌సీడీసీ ప్రైవేట్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తుంది. » స్టేషన్‌లోని స్టాళ్లు, సమాచార ప్రదర్శన వ్యవస్థ, ప్రకటన బోర్డులు, ప్లాట్‌ఫామ్ టికెట్ల విక్రయం, వాహనాల పార్కింగ్ వంటి వాటి బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుంది. సిగ్నలింగ్, రైళ్ల రాకపోకల నిర్వహణ తదితర ముఖ్యమైన బాధ్యతలు మాత్రం రైల్వే అధీనంలోనే ఉంటాయి.
ఏప్రిల్ - 4
¤ దిల్లీలోని 'వెస్టర్న్ కోర్ట్'లో కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.¤ ఒడిశాలోని విఖ్యాత పూరీ క్షేత్రంలో ఉన్న రత్న భాండాగారం తలుపులు తెరిచి, 15 మందితో కూడిన అధ్యయన బృంద సభ్యులు లోపలికి ప్రవేశించారు. » మొదటి రెండు గదుల పరిస్థితిని సెర్చిలైట్‌లతో పరిశీలించారు. స్వామి సంపద ఉన్న లోపలి గదిని మాత్రం పరిశీలించలేకపోయారు. » రత్న భాండాగారం అధ్యయన నివేదికను రాష్ట్ర హైకోర్టుకు సమర్పిస్తారు.
ఏప్రిల్ - 7
¤ జర్మనీలోని పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన మున్‌స్టర్ నగరంలో పాదాచారులపైకి ఒక వ్యాను దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. ఆ ఘటన అనంతరం డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ¤ కెనడాలో ఒక జూనియర్ ఐస్ హాకీ జట్టు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 14 మంది ఐస్ హాకీ ఆటగాళ్లు మరణించారు. టిస్డేల్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులంతా హంబోల్డ్ బ్రాంకోస్ అనే జట్టులో సభ్యులు.
ఏప్రిల్ - 8
¤ మంచు ఖండం అంటార్కిటికాలోని ఓ ప్రయోగశాలలో తొలిసారిగా దోసకాయలు, ముల్లంగిలతోపాటు ఆకుకూరలను పరిశోధకులు పండించారు. » అంతరిక్షంలోనూ ఆహార మొక్కల సేద్యం లక్ష్యానికి ఈ పరిశోధన ఊపిరిలూదింది. » చంద్రుడు, అంగారకుడు లాంటి సుదూర అంతరిక్ష యాత్రలకు వెళ్లేవారికి తాజా ఆహారం పంపడం సాధ్యంకాదు. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఆహార మొక్కలను పండించాలని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే జర్మనీ అంతరిక్ష కేంద్రం (డీఎల్ఆర్) నిపుణులు తాజా పరిశోధన చేపట్టారు. అంటార్కిటికాలోని జర్మనీ పరిశోధన కేంద్రం న్యూమేయెర్ స్టేషన్-3 (neumayer station - 3) పరిసరాల్లో 'ఈడెన్ ఐఎస్ఎస్ పేరిట ప్రత్యేక హరిత గృహాన్ని వారు నిర్మించారు. వ్యోమగాముల కోసం ఆహార మొక్కలను పండించే అత్యుత్తమ విధానాలను పరీక్షించే సదుపాయాలను దీనిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మట్టిలేదు. సహజ సూర్యకాంతి లేదు. పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధంలేని విధంగా ఈ హరిత గృహాన్ని తీర్చిదిద్దారు. దీనిలో నీరు, కాంతి, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలను అధునాతన పరిజ్ఞానం సాయంతో నియంత్రించారు.¤ ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ)ని తొలి ప్రదర్శనశాల- రైల్వేస్టేషన్‌గా మార్చాలన్న రైల్వే మంత్రి పియుష్ గోయల్ యోచనకు ప్రధాని మోదీ అంగీకరించలేదు. » ఈ టెర్మినస్ నిర్మాణాన్ని 1878లో ప్రారంభించి పదేళ్లపాటు నిర్మించారు. 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ రైల్వేస్టేషన్‌కు గుర్తింపు వచ్చింది.
ఏప్రిల్ - 9
¤ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల జిల్లా గుర్చల్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించారు. మృతుల్లో 27 మంది పదేళ్లలోపు చిన్నారులే. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కాగా, ఒకరు బస్సు డ్రైవర్. » పఠాన్‌కోట్-నూర్‌పుర్ రహదారిలో ఉన్న రామ్‌సింగ్ పఠానియా స్మారక పాఠశాలకు చెందిన విద్యార్థులు తరగతులు ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న 150 అడుగుల లోతైన లోయలో పడటంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఏప్రిల్ - 10
¤ హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం వద్ద 200 ఎకరాల్లో రూ.157.84 కోట్లతో నిర్మించిన జాతీయ భద్రత దళానికి (ఎన్ఎస్‌జీ) చెందిన 28వ స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ శిక్షణ, వసతి సముదాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. » ముంబయి దాడుల తర్వాత కోల్‌కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లలో తాత్కాలిక ప్రాతిపదికన ఎన్ఎస్‌జీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటికి శాశ్వత సముదాయాలు నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కేంద్రాన్ని ప్రారంభించారు. » ఎన్ఎస్‌జీ డైరెక్టర్ జనరల్ సుదీప్ లఖ్టాకియా.
ఏప్రిల్ - 11
¤ అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని అల్జీర్స్‌కు సమీపంలో సైనిక విమానం కూలిపోవడంతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏప్రిల్ - 12
¤ చెన్నై సమీపంలోని తిరువిడందైలో ఏర్పాటు చేసిన ద్వైవార్షిక రక్షణ రంగ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించి, ప్రసంగించారు. » ఈ ప్రదర్శనలో 47 దేశాల ప్రతినిధులు, 500కు పైగా దేశీయ, 154 విదేశీ రక్షణ రంగ సంస్థలు పాల్గొంటున్నాయి. » భారత వైమానిక దళానికి 110 యుద్ధ విమానాలను సరఫరా చేసే భారీ కాంట్రాక్టుకు సంబంధించి బోయింగ్ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో ఎఫ్/ఏ18 సూపర్ హార్నెట్ విమానాలను సంయుక్తంగా తయారు చేయడమే వీటి ఉద్దేశం.
ఏప్రిల్ - 17
¤ ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో పరిశోధకులు తాజాగా ఓ గుహను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇసుకరాతి నేలల్లో ఇప్పటివరకు బయటపడ్డ అత్యంత పొడవైన గుహ ఇదేకావడం గమనార్హం. » 24.5 కి.మీ. పొడవున్న ఈ బిలం పేరు 'ఖ్రేమ్‌పురి'. అంటే స్థానిక ఖాసీ భాషలో 'మాయా గుహ'. » షార్క్‌ల దంతావశేషాలు, 6 కోట్ల ఏళ్లక్రితం నివసించి ఉన్నట్లుగా భావిస్తున్న సముద్ర డైనోసార్ల ఎముకలను ఈ గుహలో గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. » బయటి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా గుహలో ఎప్పుడూ 16 - 17 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుదని, ప్రాణ వాయువు సరఫరాకు కూడా కొరతలేదని పేర్కొన్నారు. » వెనెజులాలోని 'ఇమావరి యేటా' గుహ ఇప్పటివరకు ప్రపంచంలోకెల్లా పొడవైన ఇసుక రాతిగుహ. దాని పొడవు 18.7 కి.మీ.
ఏప్రిల్ - 19
¤ దక్షిణ జపాన్‌లోని ఓ అగ్ని పర్వతం 250 ఏళ్ల తర్వాత తొలిసారిగా విస్ఫోటనం చెందింది. కిరిషిమా కనుమల్లో ఉన్న ఈ అగ్నిపర్వతం చివరి సారిగా 1768లో విస్ఫోటనం చెందింది.
ఏప్రిల్ - 22
¤ కల్లోలిత అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. వారు రాజధాని కాబుల్‌లో విధ్వంసకర ఆత్మాహుతి దాడికి తెగబడటంతో 57 మంది మృత్యువాత పడ్డారు. నగరంలోని ఓటరు నమోదు కేంద్రం వెలుపల ఈ దాడి జరిగింది.
ఏప్రిల్ - 23
¤ రణ రంగంగా మారిన ఉత్తర యెమెన్‌లో అమానవీయ సంఘటన జరిగింది. బని ఖయాస్ జిల్లాలో నిర్వహిస్తున్న వివాహ వేడుకపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో పెళ్లి కుమార్తె సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. » మూడేళ్లుగా యెమెన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా పదివేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 30 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఏప్రిల్ - 25
¤ ఇండోనేషియాలోని బాండా అనే ప్రాంతంలో చమురు బావి పేలుడు ఘటనలో 18 మంది మరణించారు.
ఏప్రిల్ - 26
¤ ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు సమీపంలోని కుశీనగర్‌లో కాపలాదారుడు లేని రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల వ్యానును ధావే-కప్తాన్ గంజ్ ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటనలో 13 మంది విద్యార్థులు మరణించారు.