మార్చి - 1
|
¤ బ్యాంకు రుణాలను ఎగవేయడం, రుణాలను దారి మళ్లించడం లాంటి ఆర్థిక నేరాలకు పాల్పడి చట్టం నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పరారయ్యే నిందితులపై కఠిన చర్యలకు వీలు కల్పించే బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. » 'ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్' బిల్లు పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు కుంభకోణాలకు పాల్పడి, రుణాలు ఎగవేసి పరారైన నిందితుల అన్ని ఆస్తులను జప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. బకాయిలను త్వరగా రాబట్టుకునే లక్ష్యంతో జప్తు చేసుకున్న ఆస్తులను విక్రయించుకోవడానికి ప్రతిపాదిత చట్టం అధికారాన్ని కల్పిస్తుంది. రూ. 100 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం బకాయిపడి దేశం విడిచి పరారైన ఎగవేతదారులకు ఈ ప్రతిపాదిత చట్టం వర్తిస్తుంది. » ఈ ప్రతిపాదిత చట్టాన్ని 2017 - 18 బడ్జెట్‌లోనే ప్రకటించారు. » అవకతవకలకు పాల్పడే ఆడిటర్లపై చర్యలను గట్టి అధికారాలతో కూడిన నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) ఏర్పాటు చేయడానికి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ¤ హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, లఖ్‌నవూ నగరాలను మహిళలకు మరింత సురక్షితంగా మార్చేందుకు ఉద్దేశించిన రూ. 2,900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. » దిల్లీలో 2012 నాటి సామూహిక అత్యాచారం అనంతరం ఈ నిధిని ఏర్పాటు చేశారు. ¤ రేషన్ కార్డుల డిజిటలీకరణ, ఆధార్ అనుసంధానంతో దేశవ్యాప్తంగా 2.75 కోట్ల నకిలీ కార్డులను కేంద్రం రద్దు చేసింది. » బోగస్ కార్డులు అత్యధికంగా రద్దయిన రాష్ట్రాలో ఉత్తరప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడ 68,80,999 కార్డులను రద్దుచేశారు. » తర్వాతి స్థానాల్లో పశ్చిమ్ బంగ (66,13,961), కర్ణాటక (27,49,532), మహారాష్ట్ర (21,62,391), తెలంగాణ (20,97,564)లు నిలిచాయి. » బోగస్ కార్డుల ఏరివేతతో ఏటా రూ.17,500 కోట్ల విలువైన సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఏర్పడింది. » జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరకులను అందించేందుకు మొత్తం 23,19,42,646 కార్డులను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
|
మార్చి - 3
|
¤ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున శాసన సభ స్థానాలున్నా వివిధ కారణాల వల్ల ఒక్కో చోట 59 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. త్రిపుర » త్రిపురలో భాజపా తమ భాగస్వామి ఐపీఎఫ్‌టీతో కలిసి మూడింట రెండింతలకు పైగా ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో 43 భాజపా కూటమి (భాజపా 35, ఐపీటీఎఫ్ 8) దక్కించుకుంది. సీపీఎం 16 స్థానాల్లో నెగ్గింది. » త్రిపురలో ఒక్క అయిదేళ్లు (1988 - 93) మినహాయించి 1978 నుంచి వామపక్ష కూటమియే 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. నాగాలాండ్ » నాగాలాండ్‌లో భాజపా-ఎన్‌డీపీపీ కూటమి స్పష్టమైన అధికారాన్ని సంపాదించలేకపోయింది. అయితే హంగ్ అసెంబ్లీలో భాజపా భాగస్వామ్యం అనివార్యంగా మారింది. » ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో 58 స్థానాల ఫలితాలు వెల్లడించారు. ఎన్‌పీఎఫ్ 27, ఎన్‌డీపీపీ 16, భాజపా 11, ఎన్‌పీపీ 2, జేడీ (యూ) 1 నెగ్గాయి. » నాగాలాండ్‌లో గత 55 ఏళ్లలో చట్టసభకు ఎన్నికైన మహిళ కనీసం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఈ రాష్ట్రంలో అనుసరించే చట్టం ప్రకారం మహిళలకు భూమి, ఆస్తులు, వారసత్వంగా సంక్రమించే ఇతరత్రా సంపద విషయాల్లో ఎలాంటి హక్కు ఉండదు. ఈ సారి చట్టసభకు పోటీ చేయడానికి అయిదుగురు మహిళలకు టికెట్లు దక్కాయి. కానీ, పరాజయం పొందారు. మేఘాలయ » మేఘాలయాలో అధికార కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా, సాధారణ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 9 మంది శాసనసభ్యులు అవసరం. » ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో కాంగ్రెస్ 21, ఎన్‌డీపీ 19, యూడీపీ 6, పీడీఎఫ్ 4, భాజపా 2, స్వతంత్రులు 3, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
|
మార్చి - 4
|
¤ త్రిపుర ఎన్నికల్లో పరాజయంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రాజీనామా చేశారు. అగర్తలాలోని రాజ్ భవన్‌లో గవర్నర్ తథాగత రాయ్‌కు తన రాజీనామా సమర్పించారు.¤ మేఘాలయా ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించలేక పోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా రాజీనామా చేశారు.¤ చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీ 67వ వార్షిక స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. » సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, ప్రొఫెసర్ తేజిందర్ సింగ్‌కు వెంకయ్య గౌరవ పట్టాలు ప్రదానం చేశారు. ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్‌కు పంజాబ్ యూనివర్సిటీ ప్రకటించిన 'ఖేల్‌రతన్' అవార్డును బహుకరించారు.
|
మార్చి - 5
|
¤ యూరియా వినియోగం తగ్గించడంతో పాటు ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కిలోలు కాకుండా 45 కిలోల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
|
మార్చి - 6
|
¤ దేశంలో పోలీసు సిబ్బంది కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. » ప్రతి లక్ష జనాభాకు 222 మంది పోలీసులుండాలన్నది ఐరాస సిఫార్సు. అయితే దేశంలో ప్రస్తుతం 151 మంది మాత్రమే ఉన్నారని హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ తెలిపారు. ¤ మేఘాలయ ముఖ్యమంత్రిగా 'నేషనల్ పీపుల్స్ పార్టీ' (ఎన్‌పీపీ) అధినేత కాన్రాడ్ సంగ్మా (40) పదవీ బాధ్యతలు చేపట్టారు. » లోక్‌సభ మాజీ స్పీకర్, దివంగత పి.ఎ.సంగ్మా తనయుడైన కాన్రాడ్ సంగ్మాతో గవర్నర్ గంగాప్రసాద్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు కాన్రాడ్ తెరదించారు. ఆయన తుర నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. » ముఖ్యమంత్రితో పాటు ఆయన సోదరుడైన జేమ్స్ పి.కె.సంగ్మా సహా 11 మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణం చేశారు.
|
మార్చి - 8
|
¤ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని ఝుంఝునూలో జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని (ఎన్ఎన్ఎం) ప్రారంభించారు. » బాలల్లో పోషకాహార లోపం; సరైన బరువు, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు గత డిసెంబరులో కేంద్రం ఎన్ఎన్ఎం కు ఆమోదం తెలిపింది. దీనికి బడ్జెట్‌లో రూ.9,046 కోట్లను కేటాయించింది. దీని ద్వారా మూడేళ్లలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ది పొందుతారని అంచనా. తొలి దశలో 315 జిల్లాల్లో ఈ పథకం అమలుకానుంది. » ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న 'బేటి బచావో-బేటి పఢావో' ను 640 జిల్లాలకు విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. » దేశంలో బాలికల సంరక్షణ, విద్యకు విశేష కృషి చేసిన 10 మందికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాలను ప్రధాని మోదీ ప్రదానం చేశారు. వీరిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా కూడా ఉన్నారు.¤ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా 'నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)' నేత నెయిఫియు రియో చేత గవర్నర్ పి.బి. ఆచార్య ప్రమాణం చేయించారు. ఆయన 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. » భాజపా భాగస్వామ్యంతో ఏర్పాటైన 'ప్రజల ప్రజాతంత్ర కూటమి (పీడీపీ)' కి ఈయన నేతృత్వం వహిస్తున్నారు. » ఉపముఖ్యమంత్రిగా భాజపా నేత వై. పట్టన్, మంత్రులుగా మరో 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు.¤ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చవక ధరకే శానిటరీ నేప్కిన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) కేంద్రాల్లో మే 28 నుంచి వీటిని విక్రయించనున్నారు. » నాలుగు నేప్కిన్లను రూ. 10 కి విక్రయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ¤ కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన ప్రత్యేక మువ్వన్నెల (పసుపు, తెలుపు, ఎరుపు) జెండాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవిష్కరించారు. » తెలుపు రంగు మధ్యలో ప్రభుత్వ లాంఛనాన్ని ముద్రించారు. » ఇదివరకటి కన్నడ బావుటాలో ఎరుపు, పసుపు రంగులు మాత్రమే ఉండేవి. కొత్తగా తెలుపు చేర్చారు. » మొత్తం దేశంలోకెల్లా కర్ణాటకకు మాత్రమే ప్రత్యేక బావుటా ఉంది.
|
మార్చి - 9
|
¤ 'పరోక్ష కారుణ్య మరణాల' పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. జీవిత చరమాంకంలో ఉన్న రోగి లేదా దీర్ఘకాలంగా అచేతనావస్థలో ఉన్న వ్యక్తి వైద్య చికిత్సను నిరాకరిస్తూ ముందస్తు వైద్య నిర్దేశం లేదా 'సజీవ వీలునామా'ను రాయవచ్చని తేల్చి చెప్పింది. హుందాగా జీవించే హక్కులో మరణ ప్రక్రియను సాఫీగా సాగేలా చూడటం కూడా ఒక భాగమే అని స్పష్టం చేసింది. » ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరిస్తూ ముందస్తు నిర్దేశం లేదా సజీవ వీలునామాకు సంబంధించి కొన్ని సూత్రాలను రూపొందించింది. రోగి ముందస్తు సూచనలు ఉన్నా, లేని సందర్భాల్లో పరోక్ష మరణం అమలుపై వేర్వేరు మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటిపై నిర్ణయాధికారాన్ని వైద్యబోర్డుకు అప్పజెప్పింది. » ఒక రోగి మానసిక పరిస్థితి సక్రమంగా ఉన్న స్థితిలోనే సజీవ వీలునామాను రాస్తాడు. భవిష్యత్‌లో శాశ్వత కోమా స్థితిలోకి వెళ్లిపోయినప్పుడు తనకు కృత్రిమ ప్రాణాధార వ్యవస్థను కొనసాగించాలా వద్దా అనేది ముందుగానే స్పష్టం చేసేదే ఈ పత్రం. » అచేతనంగా ఉన్నవారు, చికిత్సలేని వ్యాధులతో బాధపడుతూ అవసాన దశకు చేరినవారికి నొప్పిలేకుండా మరణానికి గురి చేయడమే కారుణ్య మరణం. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష అనే రెండు రకాలు ఉంటాయి. క్రియాశీల కారుణ్య మరణంలో హానికర పదార్థాన్ని ప్రయోగించడం లేదా బలవంతంగా రోగిని వైద్యులు మరణానికి గురిచేస్తారు. పరోక్ష విధానంలో జీవనం కొనసాగించడానికి అవసరమైన ప్రాణాధార వైద్య తోడ్పాటు వ్యవస్థను ఉపసంహరిస్తారు. » 'కామన్ కాజ్' అనే స్వచ్ఛంద సంస్థ 2005లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేసిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నిజానికి పరోక్ష కారుణ్య మరణాన్ని అనుమతిస్తున్నట్లు 2011, మార్చి 11న ఇప్పటికే అరుణా షాన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.¤ తాము ప్రయాణించేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఎవరైనా తమ కన్ఫర్మ్‌డ్ రైలు టికెట్‌ను వేరేవారి పేరిట బదిలీ చేసుకునేలా రైల్వేశాఖ తాజాగా వెసులుబాటు కల్పించింది. రైలు ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే ఈ సౌకర్యాన్ని పొందేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.¤ ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు తెరదించుతూ భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. » ఆ రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్, ఉపముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్ వర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఏడుగురు మంత్రులతో కూడా గవర్నర్ తథాగతరాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అయిదుగురు భాజపాకు, మిగిలిన ఇద్దరు మిత్రపక్షం ఐపీఎఫ్‌టీకి చెందినవారు. అగర్తలలోని అసోం రైఫిల్స్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు హాజరయ్యారు. » త్రిపుర తొలి భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న 48 ఏళ్ల విప్లవ్ కుమార్ దేవ్‌కు ఆర్ఎస్ఎస్‌తో సుదీర్ఘ అనుభవం ఉంది.¤ 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన కీలక బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ ఇలాంటి బిల్లును ఆమోదించగా, రాజస్థాన్ రెండో రాష్ట్రంగా నిలిచింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష లేదా వరుసగా 14, 20 ఏళ్లకు తగ్గకుండా కఠిన జైలు శిక్ష విధించేలా బిల్లులో పొందుపరిచారు.¤ కేంద్ర మంత్రి పదవులకు తెదేపా నేతలు పి.అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి వీరిద్దరి రాజీనామాలకు ఆమోద ముద్ర వేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
|
మార్చి - 10
|
¤ పౌరవిమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు తన పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుకు అదనంగా అప్పగించింది. » ప్రధాని సూచనల మేరకు ఈ శాఖ బాధ్యతలను ప్రభుకు అప్పగిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.
|
మార్చి - 12
|
¤ మహారాష్ట్ర రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర' ముగిసింది. ఈ యాత్రను పలు డిమాండ్లతో మహారాష్ట్ర రైతులు మార్చి 6న నాసిక్‌లో ప్రారంభించారు. తాజాగా ముంబయిలోని ఆజాద్ మైదాన్ వద్ద వీరి యాత్ర ముగిసింది. » మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ రైతుల డిమాండ్లకు తమ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు నిరసనలను విరమించారు. » సంపూర్ణంగా పంట రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీ; వడగళ్లవాన, కీటకాల దాడుల్లో దెబ్బతిన్న పంటలకు పరిహారం, అటవీ భూములపై హక్కులు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు తదితర డిమాండ్లతో రైతులు ఈ మహాపాదయాత్ర చేపట్టారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో రైతులు నాసిక్ నుంచి ముంబయి వరకు 180 కి.మీ. మేర ఈ పాదయాత్ర నిర్వహించారు.¤ చిట్‌ఫండ్ రంగాన్ని క్రమబద్దీకరించి, బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 'చిట్‌ఫండ్స్ (సవరణ) బిల్లు-2018'ని ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. » నిర్వాహకుల (ఫోర్‌మెన్) కమిషన్‌ను ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 7 శాతానికి పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. » వివిధ వర్గాల ఆర్థికావసరాలు తీర్చడానికి దోహదపడుతున్న చిట్‌ఫండ్లపై 1982లో మొదటిసారిగా చట్టం చేశారు.¤ రుణాల ఎగవేతదారులు, పలాయనంలో ఉన్న నేరగాళ్ల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని బకాయిలు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించే 'పరారీలోని ఆర్థిక నేరగాళ్ల బిల్లు - 2018'ని ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. » పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12,700 కోట్ల మేర మోసగించి పరారైన నీరవ్‌మోదీ వంటివారి ఆస్తుల్ని విక్రయించడానికి నూతన చట్టం అమల్లోకి వచ్చాక వీలుంటుంది. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేతలకు పాల్పడి, దేశం విడిచి పారిపోయిన వారికి ఇది వర్తిస్తుంది. అలాంటివారిని 'పలాయనంలో ఉన్న నేరగాడు'గా ప్రకటిస్తారు.¤ జమ్ము కశ్మీర్‌లో పీడీపీ- భాజపా కూటమి రూపకర్తల్లో ఒకరైన ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హసీబ్ డ్రబు (57)ను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కేబినెట్ నుంచి తొలగించారు. » కశ్మీర్ అంశం రాజకీయమైంది కాదంటూ హసీబ్ డ్రబు ఓ ఇంటర్య్వూలో పేర్కొనటం ఆయన ఉద్వాసనకు కారణమయ్యింది.
|
మార్చి - 13
|
¤ బ్యాంకింగ్ సహా వివిధ రకాల సేవల్ని, సంక్షేమ పథకాలను పొందడానికి మార్చి 31వ తేదీలోగా ఆధార్‌ను అందరూ తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలన్న గుడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పెంచింది. » తుది తీర్పును తాము వెలువరించే వరకు ఈ గడువును పొడిగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.¤ లోపభూయిష్ట ఇంజిన్ల కారణంగా ఏ 320 నియో శ్రేణికి చెందిన 11 విమానాలను పౌర విమానయాన విభాగ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నిలిపివేసింది. ¤ క్షయను నిరోధించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2025 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించారు. » 'క్షయకు చరమగీతం' పేరిట దిల్లీలో నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), స్టాప్ టీబీ పార్ట్‌నర్‌షిప్‌లతో కలిసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 'క్షయ రహిత భారత్ 2025' కార్యక్రమాన్ని మోదీ ఆవిష్కరించారు. » క్షయ బాధితులకు పోషకాహారం అందేలా చేసేందుకు ఏటా 648.69 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాలని ఓ నిబంధనను తీసుకొచ్చినట్లు మోదీ పేర్కొన్నారు.
|
మార్చి - 14
|
¤ ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. » యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్‌పుర్‌లతో పాటు బిహార్‌లోని అరారియా లోక్‌సభ స్థానాల ఎన్నికల్లో అధికార భాజపా సభ్యులు ఓటమి పాలయ్యారు. యూపీలోని రెండు చోట్లా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు, బిహార్‌లో ఆర్‌జేడీ అభ్యర్థి విజయం సాధించారు. యూపీ సీఎం పదవిని చేపట్టడానికి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కేశవ్ ప్రసాద్ మౌర్యలు ఈ రెండు లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ¤ యూరియా ఎరువుపై ఇస్తున్న రాయితీని 2020 వరకూ కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) నిర్ణయించింది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రాయితీ మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. » ప్రస్తుతం రైతులకు టన్ను యూరియా రూ.5360 చొప్పున అందజేస్తున్నారు. ఎమ్మార్పీ ధరకు దీనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం ఉత్పత్తిదారులకు అందజేస్తుంది. ఇకపై దేశ వ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాలకే ఆ వ్యత్యాస మొత్తాన్ని జమచేయాలని నిర్ణయించింది. » రాయితీ కోసం 2017 - 18లో కేంద్రం రూ.42,748 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి రూ.45 వేల కోట్లు కేటాయించింది.¤ భారత్ - ఇరాన్‌ల మధ్య ద్వంద్వ పన్నుల నిరోధానికి సంబంధించిన ఒప్పందానికి ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. » భారత్ - శ్రీలంకల మధ్య సాంకేతికత, ఎలక్ట్రానిక్ రంగాల్లో సహకారానికి సంబంధించి కుదిరిన అవగాహన ఒప్పందానికీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
|
మార్చి - 15
|
¤ గ్రాట్యుటీ చెల్లింపు (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీని ద్వారా ఉద్యోగులకు పన్నురహిత గ్రాట్యుటీ ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెరుగుతుంది. దీనికి తోడు భవిష్యత్‌లో గ్రాట్యుటీని పెంచడానికి, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు కాలాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉండదు. » తాజా బిల్లుకు ఇంకా రాజ్యసభ ఆమోదం తెలపాల్సి ఉంది. ¤ భారత్‌లో చోటు చేసుకుంటున్న విద్వేషనేరాల వివరాలను నమోదు చేయడానికి మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. » 'హాల్ట్ ద హేట్ (విద్వేషాన్ని ఆపుదాం)' పేరుతో ప్రత్యేక విభాగాన్ని రూపొందించి దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులపై దాడులు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన కేసులను నమోదు చేస్తోంది. ప్రధానంగా హిందీ, ఇంగ్లిష్ మీడియాలో వచ్చిన ఘటనలను ఇందులో పేర్కొంటుంది. » ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రిలో గోమాంసం కలిగి ఉన్నాడన్న నెపంతో వ్యక్తిని హతమార్చిన ఘటన జరిగినప్పటి నుంచి (2015 సెప్టెంబరు) చోటుచేసుకున్న విద్వేషనేర కేసులను ఈ సంస్థ నమోదు చేస్తుంది. » 2017లో మొత్తం 141 విద్వేష నేరకేసులు నమోదయ్యాయని వీటిలోని 69 కేసుల్లో మొత్తం 146 మంది హత్యకు గురయ్యారని ఆమ్నెస్టీ ఇండియా పేర్కొంది. మహిళలు, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులు వేధింపులకు గురైన కేసులు 35 ఉన్నాయని తెలిపింది. ¤ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. » త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఈ మేరకు ఒక నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. » ప్రస్తుతం భారత ఆర్మీలో 7679 మంది అధికారులతో పాటు 20,185 మంది జూనియర్ కమిషన్డ్డ్ అధికారులు, నేవీలో 1434 మంది అధికారులతో పాటు 14,730 మంది సెయిలర్లు, వాయుసేనలో 146 మంది అధికారులు, 15,357 మంది ఎయిర్‌మెన్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
|
మార్చి - 16
|
¤ అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. » క్రిమినల్ లాస్ (అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు - 2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్‌వాయి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులను మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవ శిక్షగా కూడా మార్చవచ్చు.
|
మార్చి - 18
|
¤ భువనేశ్వర్ ఐఐటీ 6వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. » పూరీలో ఉన్న జాతీయ సంస్కృతి సంస్థాన్ (విద్యా సంస్థ) 100 సంవత్సరాల వేడుకల్లోనూ రాష్ట్రపతి పాల్గొన్నారు. పూరీని తూర్పు ప్రాంత కాశీగా ఆయన ప్రస్తుతించారు.¤ తమ దౌత్యవేత్తలపై వేధింపులకు నిరసనగా పాకిస్థాన్‌కు భారత్ మరో లేఖ పంపింది. గత మూడు నెలల్లో ఇలాంటి లేఖ (నోట్ వెర్బల్)ను పంపడం ఇది 13వ సారి. ¤ రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై తనిఖీ అవసరం లేదన్న సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. 21 సవరణలతో కూడిన 2018 ఆర్థిక బిల్లును విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ చర్చ లేకుండానే ఆమోదించింది. వాటిలో విదేశీ సంస్థల నుంచి పార్టీలు విరాళాలు స్వీకరించడాన్ని నిషేధిస్తూ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ కూడా ఒకటి. » 1976 నుంచి పార్టీలు విదేశాల నుంచి పొందిన నిధులపై ఎలాంటి సమీక్ష, తనిఖీ ఉండకూడదనేది ఈ సవరణ ఉద్దేశం. పార్టీలు విదేశీ విరాళాలు స్వీకరించడాన్ని సులభతరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం 2016 ఆర్థిక బిల్లు ద్వారా ఎఫ్‌సీఆర్ఏ చట్టానికి సవరణ చేసింది. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా 1976 నుంచి పొందిన విరాళాలకు తనిఖీ అవసరం లేదంటూ మరో సవరణ చేసింది.
|
మార్చి - 19
|
¤ 'లింగాయత'ను ప్రత్యేక మతం, ధర్మంగా గుర్తించవచ్చని జస్టిస్ నాగమోహన్ దాస్ ఇచ్చిన నివేదికను కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. » బసవతత్వాన్ని అనుసరించే లింగాయత - వీరశైవ లింగాయతలకు మైనార్టీ హోదాను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. » విధాన సౌధాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై లింగాయత అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ¤ వయో వృద్ధులపై జరుగుతున్న నేరాల్లో 40 శాతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనే నమోదవుతున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. » 2014-16 కాలానికి సంబంధించిన నేరాల సమాచారాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. » 2016లో దేశవ్యాప్తంగా వయో వృద్ధులపై 21,410 నేరాలు జరిగాయి. వీటిలో 40.03 శాతం (7,419 కేసులు) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనే వెలుగు చూశాయి. 2014లో ఈ రెండు రాష్ట్రాల్లో ఇవి 39.64 శాతం, 2015లో 39.04 శాతంగా ఉన్నాయి. » వృద్ధులను మోసం చేయడం, దోపిడి, వారిపై దాడులను చేయడం వీటిలో నేరాలుగా పేర్కొన్నారు. » ఈ రకమైన నేరాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. ¤ దిల్లీలోని ఉపరాష్ట్రపతి సచివాలయంలో నూతనంగా నిర్మించిన సమావేశపు గదిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. » దీనికి మనదేశ మొదటి హోంమంత్రి సర్దార్ పటేల్ పేరు పెట్టారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ముఖ్యమైన ప్రతినిధులను వెంకయ్య ఇక మీదట ఇందులోనే కలుస్తారు. ఇందులో 150 మంది కూర్చోవచ్చు.
|
మార్చి - 20
|
¤ షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అకృత్యాల నిరోధక చట్టం (ఎస్సీ, ఎస్టీ యాక్ట్) కింద నమోదయ్యే తప్పుడు కేసులతో ప్రభుత్వ సేవకులు వేధింపులకు గురి కాకుండా చూసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. » 'కేసు నమోదైన వెంటనే తప్పనిసరిగా అరెస్టు' అనే కఠిన నిబంధనను సడలించింది. 'చాలా సార్లు అమాయకపు ప్రజలు ఈ కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సేవకులూ విధి నిర్వహణలో బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వ్యక్తిగత పగలు తీర్చుకోవడానికి, వేధింపులకు గురి చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురాలేదు' అని జస్టిస్ ఆదర్శ్ గోయెల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. » ప్రభుత్వ సేవకులపై ఫిర్యాదులు నమోదైనప్పుడు తగిన హోదా కలిగిన అధికారులతో ప్రాథమిక విచారణ జరిపించాలని తెలిపింది. ఈ కేసుల్లో ముందస్తు జామీనుకు వీలు లేకుండా అమలులో ఉన్న నిబంధన కేవలం 'వాస్తవ కేసుల'కే పరిమితం కావాలని తేల్చి చెప్పింది.
|
మార్చి - 22
|
¤ ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం 2020 మార్చి వరకు పొడిగించింది. దీనికోసం రూ.3 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. » ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం - 2017 పేరుతో దీన్ని అమలు చేయనున్నారు.ప్రయోజనాలు కర్మాగారం, యంత్రాలపై 30% పెట్టుబడి ప్రోత్సాహకం. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే వర్కింగ్ కేపిటల్‌పై 3% వడ్డీ రాయితీ. భవనం, కర్మాగారం, యంత్రాలపై చెల్లించిన బీమా ప్రీమియాన్ని, కేంద్ర ప్రభుత్వ వాటా కిందికి వచ్చే సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీని, ఆదాయపు పన్నులో కేంద్ర వాటాను మొదటి అయిదేళ్లూ తిరిగి చెల్లిస్తారు. రవాణా రుసుములో 20%, అంతర్గత జలమార్గం ద్వారా చేసే రవాణాపై 20%, త్వరగా చెడిపోయే వస్తువులను సమీప విమానాశ్రయం నుంచి దేశంలోని ఏ విమానాశ్రయానికైనా రవాణా చేయడానికయ్యే ఖర్చులో 33% రాయితీ. ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్ మొత్తంలో యజమాని తరఫున 3.67% మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో యూనిట్‌కు అందించే ప్రోత్సాహకాల గరిష్ఠ పరిమితి రూ. 200 కోట్లు.¤ పోరాటంలో మరణించిన లేదా వైకల్యం పొందిన సైనికుల పిల్లలకు విద్యాసాయం కింద ఇచ్చే మొత్తంపై ఉన్న పరిమితిని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. » ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.10 వేలకు పరిమితం చేస్తూ గతేడాది జులైలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై త్రివిధ దళాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో పరిమితి లేకుండానే విద్యా రాయితీ కొనసాగుతుందని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. అయితే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, విద్యాసంస్థలు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, వాటి ఆర్థిక సాయంతో నడిచే స్వయం ప్రతిపత్తి సంస్థల్లోని విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరించింది. » 1972లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం అమరవీరులు లేదా యుద్ధంలో వైకల్యం పొందిన సైనికుల పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు, వృత్తివిద్య సంస్థల్లో బోధన రుసుములను పూర్తిగా రద్దు చేస్తారు.¤ సమాచారాన్ని (డేటా) ఇతరులెవరూ చౌర్యం చేయడానికి వీల్లేని రీతిలో తమిళనాడు విద్యార్థులు ఇస్రో కోసం సురక్షితమైన పెన్‌డ్రైవ్‌ను రూపొందించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. ఇది ఒకే ఒక్క కంప్యూటర్‌లో తప్ప మరెక్కడ వినియోగించినా పనిచేయదని సమాచారం మాత్రం భద్రంగా ఉంటుందని వివరించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రోత్సాహంతో 'స్మార్ట్ ఇండియా హాకథాన్' తుది పోటీలో నిలిచిన విద్యార్థులు దీన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు.¤ పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు పొందే గ్రాట్యుటీపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెండింతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. » ఈ మినహాయింపు వర్తించే మొత్తాన్ని రూ.20 లక్షల వరకూ పెంచేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది.
|
మార్చి - 23
|
¤ లింగాయతులు, బసవతత్వాన్ని నమ్మిన వీర శైవుల్ని మత అల్పసంఖ్యాకులుగా కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కర్ణాటక మత అల్పసంఖ్యాకుల, హజ్, వక్ఫ్‌శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.¤ లాభదాయక పదవుల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై మరోసారి విచారించి, నిర్ణయం తీసుకోవాలని కేసును తిరిగి ఎన్నికల సంఘానికి అప్పగించింది. » ఈ ఎమ్మెల్యేలు 2015 మార్చిలో దిల్లీ ప్రభుత్వంలోని మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఇది లాభదాయక పదవి అని ఆరోపణలు వచ్చాయి. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఈసీ ఈ ఏడాది జనవరి 19న రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. మరుసటి రోజే రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆ 20 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. » దీని పై ప్రజా ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.¤ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. వారి వర్ధంతిని పురస్కరించుకుని మోదీ అంజలి ఘటించారు. ¤ ఇజ్రాయెల్‌కు తొలిసారిగా ఎయిర్ ఇండియా (ఏఐ) విమాన సేవలను ప్రారంభించింది. » ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విమానాశ్రయానికి ఏఐ విమానం చేరుకుంది. సౌదీ అరేబియా విధించిన దశాబ్దాల గగనతల నిషేధానికి ముగింపు పలకడంతో ఇది సాధ్యమైంది. » మార్చి 22న దిల్లీలో బయల్దేరిన ఏఐ 139 విమానం ఒమన్, సౌదీ అరేబియా, జోర్డాన్ మీదుగా గమ్యస్థానానికి చేరింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈఐఏఐ విమానం కంటే దీని ప్రయాణ సమయం 2.10 గంటలు తక్కువ. » ఎయిర్ ఇండియా సీఎండీ ప్రదీప్ ఖరోలా.¤ రాజ్యసభ ఎన్నికలు జరిగిన 25 స్థానాల్లో 12 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. » ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలకు తొమ్మిదింటిని భాజపా గెలిచింది. » రాజ్యసభలో ఏప్రిల్‌లో 58 స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో 33 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 25 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. » పశ్చిమ్‌బంగాలోని 5 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో నాలుగు స్థానాలను తృణమూల్ కాంగ్రెస్, ఒక స్థానాన్ని టీఎంసీ మద్దతుతో కాంగ్రెస్ గెలుచుకుంది. » కర్ణాటక విధానసభ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముగ్గురు, భాజపా అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. » తెలంగాణలోని మూడు స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. » చత్తీస్‌గఢ్‌లోని ఒక స్థానాన్ని భాజపా సొంతం చేసుకుంది. ఝార్ఖండ్‌లోని రెండు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్ చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ (భాజపా), జీవీఎల్ నరసింహారావు (భాజపా), జయా బచ్చన్ (ఎస్పీ)లు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్) పశ్చిమ్ బంగా నుంచి తృణమూల్ కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందారు.
|
మార్చి - 24
|
¤ పెరుగుతున్న కాలుష్యం కారణంగా నానాటికీ ప్రభ కోల్పోతున్న తాజ్‌మహల్‌ను పరిరక్షించడానికి దాన్ని దత్తత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన 'వారసత్వ కట్టడాల దత్తత' పథకంలో తాజ్‌మహల్‌ను చేర్చింది. » ఈ పథకంలో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగానే ఇప్పుడు తాజ్‌మహల్‌ని దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్ నిర్వహణ, పర్యాటకుల సదుపాయాల కల్పన, భద్రత, తాగునీరు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత లాంటి చర్యలన్నీ తీసుకోవాలి. » మన వారసత్వ సంపదని పరిరక్షించుకోవడానికి ఎన్డీయే ప్రభుత్వం 2017 సెప్టెంబరులో 'వారసత్వ కట్టడాల దత్తత' పథకాన్ని ప్రారంభించింది. కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. » కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. సీఎస్ఆర్ బడ్జెట్‌ను చారిత్రక కట్టడాల పరిరక్షణకూ వినియోగించవచ్చని కేంద్రం స్పష్టతనిచ్చింది.¤ రాజ్యసభలో అధికార పార్టీ భాజపా బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకుని తన సంఖ్యను 69కి పెంచుకుంది. కాంగ్రెస్ నాలుగు సీట్లు చేజార్చుకుని 50కి పడిపోయింది. » మార్చి 23న 58 ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకముందు బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 54 సీట్లున్నాయి.
|
మార్చి - 25
|
¤ మధ్యప్రదేశ్‌లోని దాదాపు 2.5 లక్షల పాడి పశువులకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య (యూఐడీ)ను జారీ చేశారు. ఈ యూఐడీని తెలిపే ట్యాగ్‌లను పశువుల చెవులకు బిగించారు. » జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్‌డీడీబీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. » దేశ వ్యాప్తంగా ఉన్న ఆవులు, గేదెలకు ఈ తరహాలో యూఐడీలు కేటాయించి పశు ఉత్పత్తి, ఆరోగ్య సమాచార వ్యవస్థ (ఐఎన్ఏపీహెచ్) పేరుతో వివరాలను నమోదు చేయనున్నారు.¤ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు గ్రామస్వరాజ్ అభియాన్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దీని కింద గ్రామాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయంపై దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. » వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ రైతులు నూతన సాంకేతికతను, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలంటూ 1979లో చరణ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఏడాది బడ్జ్‌ట్‌లో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని మార్కెట్లను టోకు, ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. » ప్రధాని మోదీ తన ప్రసంగంలో పట్టుదలతో తమ కలలను సాకారం చేసుకుని, తద్వారా సమాజ అభ్యున్నతికి వారు పాటుపడిన సకల్ శాస్త్రి (వేసవిలో పక్షులు, జంతువుల కోసం నీటి సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు), యోగేశ్ భద్రేశ (మిగతా ఆసియా దేశాలతో భారత్‌లోని యువత ఆరోగ్యాన్ని పోల్చిచూస్తూ ఆందోళన వ్యక్తం చేశారు), కోమల్ టక్కర్ (సంస్కృతంలో ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణకు చేపడుతున్న చర్యలను వివరించారు), అహ్మద్ అలీ (అసోంకు చెందిన ఈ రిక్షా కార్మికుడు పేదల కోసం 9 పాఠశాలలు నిర్మించాడు), అజిత్ మెహన్ చేధురి (కాన్పూర్‌కు చెందిన ఈ వైద్యుడు పాదచారుల మార్గాల్లో ఉన్న పేదల వద్దకు వెళ్లి, వారికి ఉచితంగా ఔషధాలు ఇస్తున్నారు), సైదుల్ లస్కర్ (కోల్‌కతా క్యాబ్ డ్రైవర్ అయిన ఈయన విరాళాల ద్వారా నిధులు సేకరించి కోల్‌కతా సమీపంలోని పున్రీలో 30 పడకల ఆసుపత్రిని పేదల కోసం నిర్మించాడు)ను ప్రస్తావించారు.
|
మార్చి - 27
|
¤ ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురలో ఉన్న బృందావనంలోని ఆలయాల్లో భక్తులు దేవుళ్లకు సమర్పించే పుష్పాలను వితంతువుల శరణాలయాలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ పూలతో వారు సుగంధ ద్రవ్యాలు, రంగు పొడులు, అగరబత్తులు లాంటివి తయారుచేసి జీవనోపాధి పొందవచ్చని కోర్టు సూచించింది. » ఈ విధానాన్ని తిరుపతి, పూరి, కాశీ సహా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందనీ, దీనిపై ఆలోచించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖను కోరింది. » బృందావనంలో పుష్పాలను యమునా నదిలో వదిలేస్తుండటం వల్ల కాలుష్యం ఏర్పడుతోందనీ, అలా కాకుండా మహిళా శరణాలయాలకు పంపితే వారికి జీవనోపాధి లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
|
మార్చి - 28
|
¤ ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం రూ. 4500 కోట్ల నిధులను ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వాన దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల మండలి కింద చేపడుతున్న ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఇప్పటివరకు 90:10 నిష్పత్తిలో నిధులిస్తూ వచ్చిన కేంద్రం ఇకపై చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ 100% నిధులను చేకూర్చాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాల రహదారి అభివృద్ధి పథకానికి పూర్తిగా నిధులివ్వాలని నిర్ణయించింది. మండలి కింద చేపట్టే పనులకు 2020 వరకు రూ.4,500 కోట్లు వెచ్చించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు వ్యవస్థీకృత, అంతర్జాతీయ నేరాల నియంత్రణలో భాగంగా భారత్, యూకే, ఉత్తర ఐర్లాండ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆమోదం తెలిపింది. న్యాయ సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు జాంబియాతో ఒడంబడికకు అంగీకారం తెలిపింది. అసంఘటిత రంగం కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ కల్పనకు అవకాశం కల్పించేలా ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన విస్తృతికి ఆమోదం, కొత్త ఉద్యోగుల నిమిత్తం యాజమాన్యాలు చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాలను మూడేళ్లపాటు ప్రభుత్వం భరించడం ఈ పథకం ఉద్దేశం. ఆవ నూనె మినహా మిగిలిన అన్ని రకాల వంట నూనెల ఎగుమతులపై ఉన్న పరిమితుల ఎత్తివేతకు ఆమోదముద్ర వేసింది. పాలన సౌలభ్యం, సమర్థ అమలు, నిర్వహణకు వెసులుబాటు కల్పించేలా జాతీయ నైపుణ్యాభివృద్ధి నిధి; జాతీయ నైపుణ్యభివృద్ధి మండలి పునర్నిర్మాణానికి తీర్మానించింది. 669 కృషి విజ్ఞాన కేంద్రాలు, 11 వ్యవసాయ సాంకేతికత అనువర్తన పరిశోధన సంస్థలు, వాటి కార్యక్రమాలను 2019-20 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులకు రూ. 23,007 కోట్ల రాయితీ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
|
మార్చి - 29
|
¤ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లను 12వ తరగతి వరకు విస్తరిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. » ఇప్పటి వరకు 6 నుంచి 8వ తరగతి వరకు పరిమితమైన (ఏపీ, తెలంగాణల్లో పదో తరగతి వరకు నడుస్తున్నాయి) ఈ బడులను 12వ తరగతి వరకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. » దివ్యాంగ బాలికలకు ఇకపై నెలకు రూ.200 చొప్పున ఉపకార వేతనం అందించాలని కేంద్రం నిర్ణయించింది. » 'పఢే భారత్ - బడే భారత్' కింద ప్రతి బడిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు. పాఠశాల పరిమాణాన్ని బట్టి ఏటా రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు గ్రాంట్ ఇస్తారు.¤ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరులో 'రామ్‌జీ' పదాన్ని చేర్చాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. » అధికారిక రికార్డులు, వ్యవహారాలకు సంబంధించి ఇకపై అంబేద్కర్ పేరును 'భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్'గా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది.
|
మార్చి - 30
|
¤ 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'లో భాగంగా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులు, యువకులు సమావేశమయ్యారు. వీరిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. » నదుల అనుసంధానం ద్వారా దేశంలోని కరవు ప్రాంతాలకు జలాలను అందించడమేకాక వరదలను నియంత్రించవచ్చని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. » కెన్యాలోని నైరోబీలో జరిగిన 'కచ్ఛీ లెవా పటేల్ సమాజ్' 25వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.¤ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు.¤ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు పన్నురహిత గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచుతూ చేసిన చట్టం అమల్లోకి వచ్చింది. » గ్రాట్యుటీ చెల్లింపు (సవరణ) బిల్లు - 2018ను మార్చి 15న లోక్‌సభ, 22న రాజ్యసభ ఆమోదించాయి. » 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో చట్టం అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
|
మార్చి - 31
|
¤ బౌద్ధ గురువు దలైలామా భారత్‌కు వచ్చి 60 ఏళ్లు అవుతున్న సందర్భంగా టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏడాదికాల 'థాంక్యూ ఇండియా' ప్రచారాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రారంభించింది. » ఈ కార్యక్రమంలో దలైలామా, కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి మనీష్ శర్మతోపాటు భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీలు శాంతకుమార్, సత్యవ్రత్ చతుర్వేది పాల్గొన్నారు. » తనకు తలదాచుకోవడానికి ఆశ్రయమిచ్చిందంటూ దలైలామా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
|
|
|