ఏప్రిల్ - 4
|
¤ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షాగు, వాణిజ్య మంత్రి డెనిస్ మాంట్యురోవ్‌లతో సమావేశమయ్యారు. » ద్వైపాక్షిక రక్షణ సహకారం, అపరిష్కృత ఒప్పందాలు, సైనిక ప్రదర్శనలు తదితర అంశాలపై వీరు విస్తృతంగా చర్చించారు. » భారత్ - రష్యా దౌత్య సంబంధాలు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్కోలో చేపట్టిన ఏడాది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో, అంతర్జాతీయ భద్రతపై జరిగిన సదస్సులోనూ నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. » వియత్నాం, సైబీరియా రక్షణ మంత్రులతోనూ ద్వైపాక్షిక రక్షణ సంబంధాలపై ఆమె చర్చలు జరిపారు.
|
ఏప్రిల్ - 6
|
| ¤ నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. |
ఏప్రిల్ - 7
|
¤ భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధి బృందాలస్థాయి చర్చలు జరిపారు. రక్షణ, భద్రత, అనుసంధానత, వాణిజ్యం, వ్యవసాయం లాంటి ముఖ్యమైన రంగాల్లో సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రైలు మార్గాల పనుల పురోగతిని వారు సమీక్షించారు. » ప్రజల మధ్య సంబంధాలకు, భారీగా సరకు రవాణాకు వీలుగా బిహార్‌లోని రక్సౌల్ నుంచి నేపాల్ రాజధాని కాఠ్‌మండూకు విద్యుదీకృత రైలు మార్గాన్ని నిర్మించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ వ్యూహాత్మక మార్గానికయ్యే వ్యయాన్ని భారత్ భరిస్తుంది. » టిబెట్ మీదుగా నేపాల్‌కు రైలు మార్గం నిర్మించాలనీ, భారత్‌పై ఆధారపడాల్సిన అవసరాన్ని నేపాల్‌కు తప్పించాలనీ రెండేళ్ల క్రితం చైనా అంగీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌తోనూ కేపీ శర్మ ఓలి సమావేశమయ్యారు. » భారత్ - నేపాల్ పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ను ఇరువురు ప్రధాన మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు.
|
ఏప్రిల్ - 9
|
¤ భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఢాకాలో బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ షాహిదుల్‌తో సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. » బంగ్లాదేశ్‌కు భారత్ నుంచి ఏటా పది లక్షల టన్నుల డీజిల్ ఎగుమతికి సుమారు 130 కిలో మీటర్ల చమురు గొట్టపు మార్గం ఏర్పాటు సహా ఆరు ఒప్పందాలపై ఉభయ దేశాలూ సంతకాలు చేశాయి. » ద్వైపాక్షిక సహకారం, తీస్తా జలాల పంపకం, రోహింగ్య శరణార్థులు సహా పలు అంశాలపై వారిద్దరూ సమీక్షించినట్లు భారత హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఒప్పందం కుదిరిన వాటిలో డీజిల్ ఎగుమతికి సిలిగురి పార్బతిపూర్‌ల మధ్య 129.5 కి.మీ. గొట్టపు మార్గ నిర్మాణం, ప్రసారభారతి - బంగ్లాదేశ్ బేతార్‌ల మధ్య సహకారం, ఢాకా విశ్వవిద్యాలయంలో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) ఉర్దూ పీఠం ఏర్పాటు ఉన్నాయి. వీటితోపాటు బంగ్లాదేశ్‌లోని 500 పాఠశాలల్లో భాషాశాలల ఏర్పాటుకు సహకారం, రంగ్‌పూర్ నగరంలో రహదారుల అభివృద్ధి కూడా ఉన్నాయి. » భారత్‌కు చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్ - బంగ్లాదేశ్‌కు చెందిన అణుశక్తి కమిషన్ల మధ్య ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. » విజయ్ గోఖలే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కూడా సమావేశమయ్యారు.
|
ఏప్రిల్ - 16
|
| ¤ ఏప్రిల్ 17 నుంచి స్వీడన్, జర్మనీ, యూకేల్లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ దిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. |
ఏప్రిల్ - 17
|
¤ స్వీడన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ స్టాక్‌హోంలో ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫ్‌వెన్‌తో సమావేశమై వివిధ అంశాలపై ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. » ద్వైపాక్షిక సహకారాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడానికి వీలుగా నవకల్పనల భాగస్వామ్యం, సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఇద్దరు నేతలూ పరస్పరం పత్రాలు మార్చుకున్నారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. » భారత ప్రధాని స్వీడన్‌కు వెళ్లడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి. » స్టాక్‌హోంలో జరిగిన భారత్ - నార్డిక్ దేశాల తొలి సదస్సులో అంతర్జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, వాతావరణ మార్పులపై చర్చించారు. భారత్ - నార్డిక్ దేశాల (స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే) మధ్య సహకారాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. » నార్డిక్ దేశాల ప్రధానులతో కలిసి మోదీ భారత్ - నార్డిక్ సదస్సు - పరస్పర శ్రేయస్సు, విలువల బదలాయింపు పేరిట నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
|
ఏప్రిల్ - 18
|
¤ నాలుగు రోజుల యూకే పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం జరిగిన చర్చల్లో ఇరువురు నేతలు ఉగ్రవాద బెడద, సిరియాపై గగనతల దాడులు సహా వివిధ అంశాలపై చర్చించారు. బ్రెగ్జిట్ అనంతరం ద్వైపాక్షిక బంధాల్లో సరికొత్త శక్తిని నింపాలని నిర్ణయించుకున్నారు. » థేమ్స్ నదీ తీరాన భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి నివాళులర్పించారు. యూకేలో భారత ప్రధాని ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే తొలిసారి. పార్లమెంటు సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ మంత్రిమండలి ఆమోదం లభించడం కూడా ఇదే మొదటిసారి. » శాస్త్ర సాంకేతిక రంగాల్లో 5000 ఏళ్లలో భారతదేశ పాత్రను తెలిపే రీతిలో ఏర్పాటు చేసిన ప్రదర్శన వద్ద బ్రిటన్ యువరాజు ఛార్లెస్ మోదీకి స్వాగతం పలికారు. » 'భారత్ కీ బాత్ సబ్‌కే సాథ్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు తెలిపారు. » బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో రాణి ఎలిజబెత్ - 2తో మోదీ భేటీ అయ్యారు.
|
ఏప్రిల్ - 19
|
¤ యూకే పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఛోగమ్ దేశాల ప్రభుత్వాధినేతలతో చర్చలు జరిపారు. » బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ అధ్యక్షుడు డేనీ ఫౌరే, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నౌత్‌తో ద్వైపాక్షిక అంశాలను చర్చించారు.
|
ఏప్రిల్ - 20
|
¤ బ్రిటన్ పర్యటన ముగించుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ చేరుకుని ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కిల్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
|
ఏప్రిల్ - 22
|
¤ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో సమావేశమయ్యారు. » సిక్కింలోని నాథులా మార్గం మీదుగా ఈ ఏడాది కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించడానికి రెండు దేశాలూ అంగీకరించుకున్నాయి. డోక్లామ్ ప్రతిష్టంభనతో 10 నెలలుగా ఈ మార్గంలో యాత్ర నిలిచిపోయింది.
|
ఏప్రిల్ - 23
|
¤ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బీజింగ్‌లో సమావేశమయ్యారు. » సుష్మా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరవుతున్న ఏడు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులతో కలిసి వెళ్లారు. » కిర్గిజ్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల మంత్రులతో సుష్మా సమావేశమై వాణిజ్యం, పెట్టుబడుల గురించి చర్చించారు.
|
ఏప్రిల్ - 27
|
¤ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల బంధాన్ని పరిపుష్టం చేసుకునే రీతిలో అనేక అంశాలపై చర్చించారు. ఇవి లాంఛనపూర్వక చర్చలు కాకపోవడంతో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. వివిధ అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించడమే ఈ భేటీ ముఖ్యోద్దేశం. » ప్రఖ్యాత చైనా చిత్రకారుడు బీహొంగ్ రూపొందించిన చిత్రాలను జిన్‌పింగ్‌కు కానుకగా మోదీ ఇచ్చారు.
|
ఏప్రిల్ - 28
|
¤ చైనాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వుహాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ రెండో రోజు కూడా జిన్‌పింగ్‌తో చర్చించారు. పరస్పర విశ్వాసం, అవగాహనలను పెంపొందించుకునే రీతిలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా తమ తమ సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. సరిహద్దుపై సహేతుకమైన పరస్పరం అంగీకారయోగ్యమైన పరిష్కారానికి వచ్చే బాధ్యతను ప్రత్యేక ప్రతినిధులకు అప్పగించాలని నిర్ణయించారు. » ప్రపంచ సంస్థల్లో వర్ధమాన దేశాల ప్రాతినిధ్యం, వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధి, ఆహార భద్రత వంటి అంశాలతో పాటు యాంగ్తే, గంగానదుల పరిరక్షణ గురించి నేతలిద్దరూ చర్చించారు. » స్వేచ్ఛగా, నేరుగా అభిప్రాయాలను పంచుకునే ఈ తరహా చర్చల్ని మున్ముందు మరిన్ని చేపట్టాలన్నారు. అఫ్గానిస్థాన్‌లో తమ రెండు దేశాలూ కలిసి ఆర్థిక ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు.
|
|
|