Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 నివేదికలు-సర్వేలు

ఏప్రిల్ - 2
¤ దేశవ్యాప్తంగా ఇళ్లలో కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతోందని, ఈ విషయంలో పరిశ్రమల తర్వాతి స్థానం గృహ వినియోగానిదేనని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడించింది.
         »
 దేశవ్యాప్తంగా బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్తు లాంటి ఇంధన వనరుల లభ్యత వినియోగంపై 2007-17 మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలను ఇందులో వివరించింది.         » విద్యుత్ వినియోగం వృద్ధి రేటును పరిశీలిస్తే గృహ వినియోగాలకు గత పదేళ్ల (2007-17)లో 7.93 శాతం, పరిశ్రమలకు 8.46 శాతం వృద్ధిరేటు నమోదైంది.                  » దేశంలో 10.01 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధనం (విద్యుత్) ఉత్పత్తి చేయడానికి సరిపడా వనరులున్నాయి. ఇందులో సౌర విద్యుత్ 6.49 లక్షల మెగావాట్లు, పవన విద్యుత్ 3.02 లక్షల మెగావాట్లు.         » సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధిక వనరుల లభ్యత రాజస్థాన్ (14 శాతం), గుజరాత్ (13 శాతం) రాష్ట్రాల్లో ఉండగా, ఏపీలో 4.95, తెలంగాణలో 2.48 శాతం ఉన్నాయి.         » తెలంగాణలో గరిష్ఠంగా 20,410, ఏపీలో 49,590 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనుకూల వనరులున్నాయి.         » దేశ వ్యాప్తంగా 315.14 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. అత్యధికంగా ఝార్ఖండ్‌లో 82.44 బిలియన్ టన్నులు ఉండగా, తెలంగాణ 21.46 బిలియన్ టన్నులతో 5వ స్థానంలో ఉంది. ఏపీ వాటా 1.58 బిలియన్ టన్నులు.         » సహజ వాయు నిక్షేపాలు 1289 క్యూబిక్ మీటర్లు ఉండగా, దీనిలో ఏపీ వాటా 48.31 క్యూబిక్ మీటర్లు.         » ప్రపంచంలో అత్యధికంగా ముడిచమురు వాడుతున్న దేశాల్లో 19.54 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా (13.10%), భారత్ (4.81%) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సహజ వాయువు ఉత్పత్తి (21.50%), వినియోగం (22.36%)లో కూడా అమెరికానే అగ్రస్థానంలో ఉంది.¤ అసోచామ్- యెస్ ఇన్‌స్టిట్యూట్‌ల సంయుక్త అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 200 అగ్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన రెండు విద్యాసంస్థలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.         » ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ విశ్వవిద్యాలయా (డీయూ)లకు మాత్రమే ఈ జాబితాలో స్థానం లభించింది.         » 49 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్ - 30, జర్మనీ - 11, చైనా, ఆస్ట్రేలియాలు 8 చొప్పున విశ్వవిద్యాలయాలను కలిగి ఉన్నట్లు నివేదిక పేర్కొంది.¤ వాతావరణ మార్పుల కారణంగా భారత్ సహా పలు దేశాలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.         » ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఒమన్, భారత్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, బ్రెజిల్‌లు తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏప్రిల్ - 3
¤ 2018కి సంబంధించి దేశంలోని మొత్తం 4 వేల విద్యాసంస్థలకు జాతీయ విద్యాలయాల శ్రేణి సంస్థ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులిచ్చింది. వీటిని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దిల్లీలో వెల్లడించారు.         » ఈ ఏడాది కొత్తగా వైద్య, దంతవైద్య, న్యాయ, శిల్పకళా కళాశాలలకూ శ్రేణులను ప్రకటించారు. నిరుడు ర్యాంకింగ్ కోసం 3 వేల విద్యాసంస్థలు పోటీపడగా ఈసారి ఆ సంఖ్య 4 వేలకు చేరింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల నాణ్యత పెంపునకు ఈ పోటీ దోహదపడుతోంది.         » ర్యాంకుల ఆధారంగా 20 విద్యాసంస్థలకు 'శ్రేష్ఠతర విద్యాసంస్థల పథకం' (ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్స్)తో అనుసంధానం చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా వాటికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుంది.         » దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నిలిచింది.         » ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా ఐఐటీ-మద్రాస్, ఉత్తమ నిర్వహణ విద్యాసంస్థగా ఐఐఎం - అహ్మదాబాద్‌లు తమ స్థానాలను నిలుపుకున్నాయి.         » ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరండా హౌస్ అత్యుత్తమ కాలేజీగా, ఎయిమ్స్ ఉత్తమ మెడికల్ కాలేజీగా, బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయూ దేశంలోనే ఉత్తమ న్యాయ విద్యాసంస్థగా నిలిచాయి.         » యూనివర్సిటీల కేటగిరీలో ఐఐఎస్‌సీ (బెంగళూరు), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (ఢిల్లీ), బనారస్ హిందూ యూనివర్సిటీలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఏప్రిల్ - 9
¤ ప్రవక్త మహ్మద్‌కు బ్రిటన్ రాణి ఎలిజబెత్ 43వ తరం సంతానమని అధ్యయనమొకటి ఉద్ఘాటించింది. ప్రవక్త కుమార్తె ఫాతీమా ద్వారా కలిగిన సంతానమనీ, స్పెయిన్‌ను పాలించిన అరబ్ రాజులు ఎలిజబెత్ పూర్వీకులేనని తేల్చింది.         » ఈ విషయాన్ని తొలిసారిగా 1986లో ఓ ప్రచురణ సంస్థ అధినేత హరాల్డ్ బ్రూక్స్ బేకర్ కూడా నిర్ధారించారు.         » చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ అల్ అవానీ అధ్యయనం జరిపి రాసిన ప్రత్యేక కథనాన్ని మొరాకో పత్రిక అల్- ఒస్బుయ్ ప్రచురించింది. మొరాకో, అండెలాసియా, ఐరోపాలో పలు సామ్రాజ్యాలను పాలించిన ప్రభువులు ప్రవక్త రక్త సంబంధీకులేనని ఆయన ప్రతిపాదించారు.
ఏప్రిల్ - 11
¤ ప్రస్తుత (2018-19) ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.3 శాతం ఉంటుందని, వచ్చే (2019 - 20) ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి చేరుతుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది.         » వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలు తక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన భారత్, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పునరుత్తేజితం అవ్వనుందని తెలిపింది.         » ఏడీబీ నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.6 శాతంగా నమోదైంది.
ఏప్రిల్ - 16
¤ ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటిగా పేరుగాంచిన సింధు నాగరికత 900 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ కరవు కారణంగా తుడిచిపెట్టుకుపోయిందని ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు తెలిపారు. 4350 ఏళ్ల క్రితం ఈ నాగరికత అంతమైందని నిర్ధారించారు.         » ఐదు వేల ఏళ్లుగా వర్షపాతంలో చోటు చేసుకుంటున్న హెచ్చుతగ్గులపై ఐఐటీ - ఖరగ్‌పూర్‌కు చెందిన భూ విజ్ఞాన శాస్త్రం, భూభౌతిక శాస్త్రం విభాగాల పరిశోధకులు ఇటీవల విస్తృత అధ్యయనం చేపట్టారు.         » లద్దాఖ్‌లోని 'త్సో మొరిరి' సరస్సు ప్రాంతంలో వర్షపాతాన్ని విశ్లేషించారు. ఈ సరస్సుకు హిమాలయాల నుంచి వచ్చే నీరే ఆధారం.         » క్రీస్తు పూర్వం 2350 నుంచి క్రీస్తు పూర్వం 1450 మధ్య (900 ఏళ్ల పాటు) వాయవ్య హిమాలయాల్లో తీవ్ర అనావృష్టి ఏర్పడిందని అధ్యయనాల్లో గుర్తించారు. అప్పటివరకు సింధూ నాగరికతకు ఆధారంగా నిలిచిన నదులకు నీటివనరు లేకుండా పోయి తీవ్ర కరవు ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు వలస వెళ్లారని పరిశోధకులు వెల్లడించారు.
ఏప్రిల్ - 17
¤ ఈ ఏడాది భారత వృద్ధిరేటు 7.4 శాతం, 2019లో 7.8 శాతం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఇదే సమయంలో చైనా వృద్ధి 6.6, 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2017లో భారత వృద్ధిరేటు 6.7 శాతానికి పరిమితమవగా, చైనా వృద్ధిరేటు 6.9 శాతం నమోదైందని తెలిపింది. 2016లో భారత వృద్ధిరేటు 7.1 శాతం కాగా చైనాది 6.7 శాతం.
ఏప్రిల్ - 18
¤ ప్రపంచ జనాభాలో 95 శాతానికి పైగా కలుషిత గాలినే (ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే) పీల్చుకుంటున్నారని అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్ఈఐ) రూపొందించిన నివేదిక వెల్లడించింది.         » అధిక రక్తపోటు, ప్రతికూల ఆహారం, ధూమపానం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాలకు వాయు కాలుష్యమే కారణమని పేర్కొంది.         » ఈ నివేదిక ప్రకారం వాయు కాలుష్య ప్రభావంతో గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీరిలో 51 శాతం మంది భారత్, చైనా వాసులే.         » వాయు కాలుష్యం ప్రధానంగా పక్షవాతం, గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.         » 2016లో దాదాపు 260 కోట్ల మంది తమ ఇళ్లలోనే గాలి కాలుష్యం బారిన పడ్డారు. వంట, ఇతర అవసరాల కోసం బొగ్గును మండించడమే దీనికి ప్రధాన కారణం. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి ఈవిధంగానే చోటు చేసుకుంటుంది.
ఏప్రిల్ - 19
¤ మన దేశంలో ప్రతి 15 నిమిషాలకూ ఒక చిన్నారి లైంగిక వేధింపులకు గురవుతోందని స్వచ్ఛంద సంస్థ క్రై ఓ నివేదిక విడుదల చేసింది. గత పదేళ్లలో వేధింపుల కేసులు 500 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది.         » 50 శాతానికి పైగా బాలలపై నేరాలు కేవలం ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దిల్లీ, పశ్చిమ్‌బంగా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు పేర్కొంది.         » గత పదేళ్లలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,06,958గా వెల్లడించింది. 2016 ఒక్క ఏడాదిలోనే 18,967 కేసులు నమోదైనట్లు పేర్కొంది.         » నివేదిక ప్రకారం 15% నేరాలతో యూపీ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా 14, 13 స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ - 29
¤ 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం నమోదు కావచ్చని డాయిష్ బ్యాంక్ తన పరిశోధన నివేదికలో అంచనా వేసింది.         » గత ఆర్థిక సంవత్సరం (2017 - 18) లో నమోదైన 6.7 శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ప్రస్తుతం అంచనా వేస్తున్న 7.5 శాతం (ఆర్‌బీఐ అంచనా వేస్తున్న వృద్ధి రేటు 7.4 శాతం) మెరుగైన పరిణామం అని డాయిష్ బ్యాంక్ వివరించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.