జనవరి - 1
|
¤ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2013 నుంచి 2017 వరకు 49 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. » మీడియాలో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ దీనిపై ఆరు వారాల్లోగా వివరాలు సమర్పించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకి నోటీసులు జారీ చేసింది.¤ మొదటిసారి ఇల్లు కొనుక్కునే పట్టణ వాసులకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని (సీఎల్‌ఎస్‌ఎస్) కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి వరకూ పొడిగించింది. లబ్ధిదారుల వార్షికాదాయం రూ.6 - 18 లక్షల మధ్య ఉండే వారికి ఇది వర్తిస్తుంది. » ఈ పథకం ద్వారా ఇల్లు కొనుక్కోడానికి, నిర్మించుకోవడానికి లేదా పాత ప్లాట్‌ను కొనేందుకు రూ.2.5 లక్షల వరకూ ఆర్థిక సాయం అందుకోవచ్చు. » ఇప్పటివరకూ 93 వేల మంది మధ్యతరగతివారు సీఎల్‌ఎస్‌ఎస్ ద్వారా రూ.1960 కోట్ల మేర గృహ రుణాలపై వడ్డీ రాయితీ పొందినట్లు కేంద్రం వెల్లడించింది.
|
జనవరి - 2
|
¤ మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి మార్గం సుగమమైంది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తులపరంగా దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకు అవతరించనుంది. » ఏప్రిల్ 1 నుంచి విలీన బ్యాంకు కార్యకలాపాలు సాగించనుంది. భారత్‌లో ప్రభుత్వ రంగంలోని ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్ కాగా, తర్వాత స్థానంలో ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు ఉంది. » విలీన పథకం ప్రకారం విజయ బ్యాంక్ వాటాదార్లకు తమ వద్ద ఉన్న ప్రతి 1000 షేర్లకు 402 బీఓబీ షేర్లు, దేనా బ్యాంక్ వాటాదార్లకు తమ వద్ద ఉన్న ప్రతి 1000 షేర్లకు 110 బీఓబీ షేర్లు లభిస్తాయి. » భారత బ్యాంకుల్లో మూడు బ్యాంకులను త్రిమార్గ స్థిరీకరణ పద్ధతిలో విలీనం చేయడం ఇదే తొలిసారి. » మూడు బ్యాంకుల విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారం ఉంటుంది. దేశవ్యాప్తంగా మూడో అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంకు ఇదే. » ఈ విలీనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19కి పరిమితం అవుతుంది.¤ కార్మిక సంఘాల చట్టం - 1926లో సవరణలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటివరకూ ఉన్న ‘నమోదైన కార్మిక సంఘాలు' (రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్) స్థానంలో ‘గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు' అని చేర్చడానికి వీలుగా నిబంధనలను సవరించారు. » ఇకపై కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్మిక సంఘాలను గుర్తిస్తారు. త్రైపాక్షిక చర్యల వ్యవస్థల్లో గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం లభిస్తుంది. గుర్తింపు పొందిన సంఘాలకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. » ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్‌జేఏవై)ను మరింత సమర్థంగా నిర్వహించడానికి జాతీయ ఆరోగ్య సంస్థ (నేషనల్ హెల్త్ ఏజెన్సీ)ని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (నేషనల్ హెల్త్ అథారిటీ)గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెల్త్ ఏజెన్సీ రద్దవుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నేతృత్వంలోని పాలకమండలి నిర్ణయాలు తీసుకుంటుంది. » రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమాన్ని 2019 - 20 వరకు కొనసాగించాలని నిర్ణయించి, రూ.1,160 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం వల్ల 15 - 29 ఏళ్ల యువతకు ప్రయోజనం కలుగుతుంది. » వైద్య ఆరోగ్య పథకాలన్నీ 2019 - 20 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. దీనికోసం రూ.2,381.84 కోట్లు ఖర్చు చేస్తారు.¤ ప్రతి ఇంట్లోని వంటగదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్రం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద 6 కోట్ల వంటగ్యాస్ (ఎల్‌పీజీ) కనెక్షన్లను అందజేశారు. ¤ బ్యాంకు ఖాతాలను తెరుచుకునేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్‌లు పొందేందుకు ధ్రువీకరణ నిమిత్తం ఆధార్‌ను స్వచ్ఛందంగానే సమర్పించుకునేందుకు వీలు కల్పించే ‘ఆధార్ - ఇతర చట్టాల సవరణ బిల్లు - 2018'ను కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆధార్ లేదని బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల జారీకి ఆయా సంస్థలు నిరాకరించడం కుదరదు. » ఆధార్ చట్టాన్ని అతిక్రమించే సంస్థలపై రూ.కోటి వరకూ, అదే తప్పులను పునరావృతం చేస్తే రోజుకు రూ.10 లక్షల వరకూ జరిమానా పడుతుందని ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది.¤ దేశంలో తపాలా శాఖల్లో ఎవరూ క్లెయిం చేయని మొత్తాలు రూ.9,395 కోట్లు ఉన్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా లోక్‌సభలో వెల్లడించారు. » కిసాన్ వికాస్ పత్రాలు, నెలవారీ ఆదాయ పథకం ఖాతా, జాతీయ పొదుపు పత్రాలు, ప్రజా భవిష్య నిధి, రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతా, కాల పరిమితి ఖాతాల్లో ఈ మొత్తం ఉన్నట్లు తెలిపారు. » ఇలాంటి మొత్తాలు ఆంధ్రప్రదేశ్‌లో రూ.224.29 కోట్లు, తెలంగాణలో రూ.164.16 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా పశ్చిమ్ బంగలో రూ.1591.16 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
|
జనవరి - 3
|
¤ వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఆమోదం తెలిపింది. చిన్నపాటి సవరణలు మినహా బిల్లును యథాతథంగా లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపింది. » బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మనదేశ పౌరసత్వం లభించాలంటే భారత్‌లో వారు కనీసం 12 ఏళ్లు నివాసం ఉండాలన్నది నిబంధన. దానిని తాజా బిల్లు ఆరేళ్లకు కుదిస్తుంది. ¤ ‘జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి' (ఎన్‌సీటీఈ) సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. » మండలి అనుమతి లేకుండా ఉపాధ్యాయ కోర్సులను అందిస్తున్న కేంద్ర/రాష్ట్ర సంస్థలను వెనుకటి తేదీతో గుర్తించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. » లోక్‌సభ 2018 జులైలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది."
¤ ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వార్తాపత్రికలు, పునర్వినియోగ ప్లాస్టిక్‌ను జులై 1 నుంచి ఉపయోగించకూడదని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశించింది. » ఆహారం ప్యాకింగ్‌కు, నిల్వ చేయడానికి, తీసుకెళ్లడానికి కూడా పునర్వినియోగ ప్లాస్టిక్‌తో తయారయ్యే క్యారీ బ్యాగ్‌లను వినియోగించకూడదని పేర్కొంది. » వార్తాపత్రికల తయారీకి వినియోగించే ఇంక్‌లు, డైల వల్ల క్యాన్సర్ సంభవించే ప్రమాదం ఉన్నందున, వీటిలో ఆహార పదార్థాలను ప్యాక్ చేసి ఇవ్వకూడదని తెలిపింది. ¤ కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్ల ముద్రణను కనిష్ఠ స్థాయికి తగ్గించింది. » చెలామణిలో ఉన్న నగదుపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకులు ఏ మేరకు కొత్తనోట్లను ముద్రించాలనే దానిపై తగిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
|
జనవరి - 4
|
¤ ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్ చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు పౌరులు ఆధార్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.¤ రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లోని 13 జంతు ప్రదర్శనశాల (జూ)ల గుర్తింపు రద్దయింది. » నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ జంతు ప్రదర్శనశాలలు పనిచేయకపోవడంతో అక్కడి జంతువుల ఆరోగ్యం కోసం కేంద్ర జూ సంస్థ (సీజెడ్‌ఏ) వాటి గుర్తింపును రద్దు చేసిందని పర్యావరణశాఖ సహాయమంత్రి మహేశ్‌శర్మ లోక్‌సభలో ప్రకటించారు. » గుర్తింపు రద్దయినవాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న డీర్‌పార్క్, తెలంగాణలోని డీర్‌పార్క్, సంఘీ మినీ జూ మొదలైనవి ఉన్నాయి.
|
జనవరి - 5
|
¤ నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు యథేచ్ఛగా గనులు తవ్వుకుంటున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న మేఘాలయ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.100 కోట్ల జరిమానా విధించింది. » ‘కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి' వద్ద రెండు నెలల్లోగా రూ.100 కోట్లు జమచేయాలని ఎన్‌జీటీ ఛైర్మన్ ఏకే గోయల్ ఆదేశించారు. మేఘాలయలో అక్రమంగా గనులు తవ్వుతున్న అక్రమార్కులు, వారిని అడ్డుకోవడంలో విఫలమైన అధికారుల నుంచి ఈ రూ.వంద కోట్లను జరిమానాలుగా వసూలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.¤ 2020 నాటికి దేశంలో 5జీ మొబైల్ టెక్నాలజీని తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జలంధర్‌లో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో వెల్లడించారు. » సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55 అడుగుల ఎత్తున్న భారీ రోబో ప్రతిమను ఆవిష్కరించారు. ఈ రోబో పేరు మెటల్ మాగ్నా. 25 టన్నుల బరువున్న దీన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేశారు.
|
జనవరి - 8
|
¤ పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ బిల్లు-2018'ని లోక్‌సభ ఆమోదించింది. ఆ దేశాల నుంచి మన దేశానికి వచ్చి, ఎలాంటి పత్రాలు లేకుండా ఆరేళ్లుగా నివసిస్తున్న హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు దేశ పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లును ఉద్దేశించారు.¤ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తిరిగి నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సంస్థలో అంతర్గత కలహాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కిందట ఆయన్ను సెలవుపై పంపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 2018 డిసెంబరు 6న ఆలోక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ పదవీకాలం జనవరి 31తో ముగియనుంది.¤ ఇప్పటి వరకు రిజర్వేషన్ పరిధిలోకి రాని అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లు-2019కి లోక్‌సభ ఆమోదం తెలిపింది.¤ డీఎన్‌ఏ టెక్నాలజీ (యూజ్ అండ్ అప్లికేషన్) రెగ్యులేషన్ బిల్ - 2019ను లోక్‌సభ ఆమోదించింది. కేసుల విచారణలో బాధితులు, నేరస్థులు, అనుమానితులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం లాంటి సందర్భాల్లో డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.¤ ఇకపై జీవిత భాగస్వామికి కుష్ఠు ఉందనే కారణంగా విడాకులు తీసుకోవడం కుదరదు. ఈమేరకు పర్సనల్ చట్టాల సవరణ బిల్లు - 2018 ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. ఇది హిందూ వివాహచట్టంతోపాటు ముస్లిం, క్రైస్తవ, ప్రత్యేక వివాహ రద్దు చట్టాలు, హిందూ దత్తత-మనోవర్తి చట్టాలకు వర్తిస్తుంది. |
జనవరి - 9
|
¤ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124 వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ¤ సీబీఎస్‌ఈ విద్యార్థులపై భారం తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 2019-20 విద్యా సంవత్సరంలో సిలబస్‌లో 10-15% తగ్గించాలని ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయించింది.
|
జనవరి - 10
|
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను పదవి నుంచి తప్పించింది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె. సిక్రి సభ్యులు. తాజాగా ఆలోక్‌ను కేంద్ర హోం శాఖ పరిధిలోని అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ¤ కేంద్రం చిన్న వ్యాపారులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వస్తు, సేవల పన్నులో (జీఎస్‌టీ) మినహాయింపులు ప్రకటించింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు ఉన్నవారంతా జీఎస్‌టీ పరిధిలోకి వస్తుండగా దాన్ని రూ.40 లక్షలకు పెంచారు. సంవిధాన పథకం పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచారు. ¤ అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ జరిపే అయిదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ వైదొలిగారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ఒక కేసులో న్యాయవాదిగా ఉన్నందు వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29న కొత్త ధర్మాసనం ఏర్పాటవుతుంది.¤ అసోంలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకించినందుకు సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత హిరేన్ గొహెయిన్, ఆర్టీఐ కార్యకర్త అఖిల్ గొగొయ్, జర్నలిస్ట్ మంజిత్ మహంతలపై దేశద్రోహం కేసు నమోదైంది.¤ జమ్మూలోని సాంబా, కశ్మీర్‌లోని పుల్వామా, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లలో కొత్తగా మూడు ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ¤ 2024 కల్లా దేశవ్యాప్తంగా 102 పట్టణాల్లో 20-30% వాయుకాలుష్యాన్ని తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు రూ.300 కోట్లతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను (ఎన్‌సీఏపీ) ప్రారంభించింది. 2018లో ప్రపంచంలోని 15 అత్యంత కాలుష్య నగరాల్లో 14 భారతదేశంలోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు పేర్కొన్నాయి.
|
జనవరి - 11
|
¤ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 9న సీబీఐ డైరెక్టర్ ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టారు. కానీ కేంద్రం మరుసటి రోజే ఆయన్ను పదవి నుంచి తప్పించి, ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసింది. ఆ బాధ్యతలు చేపట్టకముందే ఆలోక్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ¤ 2020 నుంచి పదోతరగతి గణిత పరీక్షను రెండు రకాలుగా నిర్వహించనునట్లు కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. ఇకపై ప్రస్తుతం ఉన్న కఠినత్వంతో ప్రామాణిక (స్టాండర్డ్) పరీక్ష, సులువుగా ఉండేలా ప్రాథమిక (బేసిక్) పరీక్ష నిర్వహిస్తారు.
|
జనవరి - 12
|
¤ రాజస్థాన్‌లోని బికనేర్‌లో అంతర్జాతీయ ఒంటెల ఉత్సవం ప్రారంభమైంది.¤ ముమ్మారు తలాక్‌ను నిషేధిస్తూ మరోసారి అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్) జారీ అయ్యింది. దీనికి సంబంధించిన బిల్లు ఇంకా పార్లమెంట్ ఆమోదం పొందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.¤ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. దీంతో ఈ అంశం 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపుదిద్దుకుంది.¤ తమిళనాడు - కేరళ సరిహద్దుల్లోని చెంగల్ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న లింగానికి ప్రపంచంలోనే ఎత్తయిన లింగంగా గుర్తింపు లభించింది. 111.2 అడుగుల ఎత్తుతో 8 అంతస్తులుగా ఈ శివలింగాన్ని నిర్మిస్తున్నారు.
|
జనవరి - 13
|
¤ గురు గోబింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రూ.350 వెండి నాణేన్ని విడుదల చేశారు.¤ లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. 25 వేల ఎకరాల్లో 5వేల మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తారు. జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరో సౌరవిద్యుత్ కర్మాగారాన్ని కూడా నిర్మించనున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) వీటిని ఏర్పాటు చేయనుంది. రూ.45 వేల కోట్ల అంచనా వ్యయంతో 2023 కల్లా వీటిని నిర్మిస్తామని సంస్థ పేర్కొంది.¤ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పనిచేస్తున్న మొత్తం 670 మంది న్యాయమూర్తుల్లో మహిళా జడ్జిల సంఖ్య 73 మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. గత ఏడాది మార్చి 23 నాటికి దేశంలోని 24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు 670 మంది ఉన్నారని కూడా తెలిపింది.
|
జనవరి - 14
|
¤ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో జనరల్ కేటగిరీలో 10% కోటా రిజర్వేషన్ 2019 జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రిజర్వేషన్‌ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.¤ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యపై దిల్లీ పోలీసులు రాజద్రోహం కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి తీసిన సందర్భంగా ఏర్పాటైన సభలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలపై 2016 ఫిబ్రవరి 9న వీరిపై రాజద్రోహం కేసు నమోదైంది.
|
జనవరి - 15
|
¤ ఒడిశాలోని బాలంగిర్‌లో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వెయ్యి కోట్ల రూపాయలతో విద్యుదీకరించిన ఝర్సుగూడ-విజయనగరం, సంబాల్‌పూర్-అనగుల్ రైల్వేమార్గాలను జాతికి అంకితం చేశారు. ¤ గ్లోబల్ ఏవియేషన్ సమిట్-2019ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి సురేష్ ప్రభు ముంబయిలో ప్రారంభించారు. రెండురోజులపాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయానశాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)తోపాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.¤ ప్రపంచంలోనే భారీ ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (గతంలో అలహాబాద్) ప్రారంభమైంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో ఆచరించే పుణ్య స్నానాలతో ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక కుంభమేళా మార్చి 4 వరకు జరగనుంది. దాదాపు 12 కోట్లమంది భక్తులు ఇందులో పాల్గొంటారని అంచనా. ఈ వేడుకల నిర్వహణకు యూపీ ప్రభుత్వం రూ.4,200 కోట్లు కేటాయించింది.¤ పుదుచ్చేరి ప్రభుత్వం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇది మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత పుదుచ్చేరిని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి ప్రకటించారు.
|
జనవరి - 16
|
¤ కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3600 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.¤ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎమర్జింగ్ ఎకానమీస్ (టీహెచ్‌ఈ) రూపొందించిన జాబితాలో ఈసారి 49 భారత వర్సిటీలకు చోటు లభించింది. జాబితాలో 14 వ ర్యాంకు పొందిన ఐఐఎస్సీ భారత వర్సిటీల్లో తొలిస్థానంలో ఉంది. 27వ ర్యాంకు పొందిన ఐఐటీ బాంబే రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్ 139వ ర్యాంకు పొందింది. ¤ ఆదాయపన్ను ఫైలింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఈ ప్రాజెక్టును అప్పగించారు. 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. ప్రాజెక్టు కోసం రూ.4,242 కోట్లు కేటాయించారు.¤ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని లెక్కించడానికి ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే సర్వేలో భాగంగా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (రూరల్) - 2018 ని విడుదల చేసింది. రెండోతరగతి పుస్తకాలు చదవగలిగే అయిదోతరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 2008లో 53.1 శాతం ఉండగా 2018 నాటికి ఆ సంఖ్య 44.2 శాతానికి పడిపోయింది. ప్రయివేట్ పాఠశాలల్లో ఇది 67.9 శాతం నుంచి 65.1 శాతానికి పడిపోయింది.
|
జనవరి - 17
|
¤ మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లో వైబ్రెంట్ గుజరాత్‌లో భాగంగా మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్‌లో ఏర్పాటైన ట్రేడ్ షోను ప్రారంభించారు. ఇది 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ఖాదీ, ఇస్రో, డీఆర్‌డీఓ లాంటి సంస్థలు ‘భారత్‌లో తయారీ'లో (మేకిన్ ఇండియా) భాగంగా తాము రూపొందించిన ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించాయి. గుజరాత్‌లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 2003లో తాను సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ వైబ్రెంట్ గుజరాత్‌ను ప్రారంభించారు. ¤ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రిసెర్చ్ ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. హెలిపాడ్, ఎయిర్ అంబులెన్స్ ఉన్న ఈ ఏకైక 1500 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను 2012లో మొదలుపెట్టారు.. అధునాతన సదుపాయాలు ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ ప్రజావైద్యశాలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించింది. పేపర్ వినియోగం లేకుండా సేవలు అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత.¤ కొన్ని షరతులతో డ్యాన్స్ బార్ల నిర్వహణకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2016లో డ్యాన్స్ బార్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టి వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ రూముల్లో అసభ్య నృత్యాల నిషేధం; మహిళల గౌరవ రక్షణ చట్టం' పేరుతో 2016లో ఒక చట్టం రూపొందించింది. హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు డ్యాన్స్ బార్ల నిర్వహణకు అనుకూలంగా (కొన్ని షరతులతో) తీర్పు ఇచ్చింది. ¤ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక సంచాలకుడు రాకేశ్ అస్థానాను కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన భద్రతా సంస్థ ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ'కి బదిలీ చేసింది. అలాగే సంయుక్త సంచాలకుడు అరుణ్‌కుమార్ శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మనీష్‌కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ జె నాయక్ నవరేల పదవీ కాలాన్ని ముగిస్తూ సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో కేంద్రం కలగజేసుకుని 2018 అక్టోబరులో వారిద్దరినీ సెలవుపై పంపింది. దీనిపై ఆలోక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఆలోక్‌ను తిరిగి పదవిలో నియమించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి సంఘం మరుసటి రోజే ఆలోక్‌ను అగ్నిమాపక, పౌర రక్షణ, హోంగార్డు సర్వీసులకు డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. దీనికి అంగీకరించని ఆలోక్ తన పదవికి రాజీనామా చేశారు.
|
జనవరి - 18
|
¤ ప్రధాని నరేంద్ర మోదీ వైబ్రెంట్ గుజరాత్ 9వ సదస్సును గాంధీనగర్‌లో ప్రారంభించారు. సులభతర వాణిజ్యంలో మన దేశం ప్రస్తుతం 77వ స్థానంలో ఉందని, వచ్చే ఏడాది 50 వ స్థానానికి చేరాలన్నది తమ లక్ష్యమని మోదీ ప్రకటించారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వ్యాపార ప్రముఖులు, డెన్మార్క్ ప్రధాని లార్స్ లొక్కే రాస్‌ముసెన్, చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రేజ్ బాబిస్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవివ్, మాల్టా దేశ ప్రధాని జోసెఫ్ మస్కట్ పాల్గొన్నారు. వీరందరితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉజ్జెకిస్థాన్ నుంచి యురేనియం దిగుమతిపై ఒప్పందం కుదిరింది.
|
జనవరి - 19
|
¤ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలిలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. ¤ దేశంలోనే తొలి ప్రైవేటు రంగ శతఘ్ని తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో ప్రారంభించారు. సూరత్‌కు 30 కి.మీ. దూరంలో ఉన్న హజిరాలో ఎల్ అండ్ టీ కంపెనీ ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. ఇందులో మేకిన్ ఇండియాలో భాగంగా కే9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ శతఘ్నులను తయారు చేయనున్నారు. 2017 లో ఈ మేరకు రూ.4,500 కోట్ల విలువైన కాంట్రాక్టును ఈ సంస్థకు అప్పగించారు. కే9 వజ్ర ఒప్పందంలో భాగంగా ఎల్ అండ్ టీ కంపెనీ 42 నెలల్లో 100 శతఘ్నులను సరఫరా చేయాలి.¤ ముంబయిలో ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా'ను ప్రధాని మోదీ ప్రారంభించారు.¤ కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘యునైటెడ్ ఇండియా' పేరు ప్రతిపక్ష నాయకులు నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ (జేడీఎస్), ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు (తెదేపా), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), కుమారస్వామి (జేడీఎస్), మాజీ ముఖ్యమంత్రులు శరద్‌పవార్ (ఎన్సీపీ), ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), హేమంత్ సోరెన్; ఇతర నేతలు స్టాలిన్ (డీఎంకే), శరద్ యాదవ్, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.
|
జనవరి - 20
|
¤ కేంద్ర హోం శాఖ ఆధార్ కార్డుకు మరో ప్రయోజనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు బాలలు, 65 ఏళ్లకు పైబడిన భారతీయులు నేపాల్, భూటాన్ దేశాలకు వెళ్లడానికి ఆధార్‌ను గుర్తింపు కార్డుల మాదిరి ఉపయోగించవచ్చు. మిగిలిన వారు ఆధార్‌ను ఇలా ఉపయోగించడం కుదరదు. ఈ రెండు పొరుగు దేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్‌పోర్ట్, ఓటర్ కార్డ్/ పాన్‌కార్డ్ లాంటి ఫొటో గుర్తింపు కార్డులు ఉంటే సరిపోతుంది. తాజాగా ఈ జాబితాలో ఆధార్ కార్డు కూడా చేరింది. ఇకపై భారత పౌరులకు కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయం ఇచ్చే రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ఆధారంగా రెండు దేశాల మధ్య ప్రయాణించే వీలు ఉండదు.
¤ తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడ గిన్నిస్ రికార్డు సృష్టించింది. పుదుకోట జిల్లా విరామలిలో నిర్వహించిన జల్లికట్టులో 2 వేల పోట్లగిత్తలతో 500 మంది యువకులు తలపడ్డారు. 30 వేల మంది విదేశీయులతోపాటు లక్షమంది స్థానికులు ఈ క్రీడను వీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 గంటల వ్యవధిలో 647 పోట్లగిత్తలు పరుగు తీయడం రికార్డు. తాజాగా విరాలిమలైలో 5 గంటల్లో 2 వేల గిత్తలతో నిర్వహించిన జల్లికట్టు ఆ రికార్డును బ్రేక్ చేసింది.
|
జనవరి - 22
|
¤ వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 26 మంది చిన్నారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలు పురస్కారాలను అందుకున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కింద బాల్‌శక్తి పురస్కార్, బాల్ కల్యాణ్ పురస్కార్ అనే రెండు విభాగాల్లో కేంద్రం అవార్డులు ప్రకటించింది. సృజన, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, సంస్కృతి, కళలు, సాహస రంగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలకు బాల్‌శక్తి పురస్కారాలను ఇస్తారు. బాలల సంక్షేమం కోసం పాటుపడిన సంస్థలు, వ్యక్తులకు బాల్ కల్యాణ్ అవార్డు ఇస్తారు. అవార్డు కింద వ్యక్తులకు రూ.లక్ష నగదు బహుమతి (సంస్థలకు రూ.5 లక్షలు), మెడల్, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందిస్తారు. బాల్‌శక్తి పురస్కార్ విజేతలు: మహమ్మద్ సుహైల్ చిన్యా సలీంపాషా, అరుణిమా సేన్, అశ్వత్ సూర్యనారాయణన్ సేన్, నైసర్గిక్ లెంక, ఏయూ నచికేత్ కుమార్, మాధవ్ లవకరే (సృజన), ఆర్యమాన్ లఖోటియా, బీఆర్ ప్రత్యక్ష, ఈహా దీక్షిత్ (సామాజిక సేవ), ఆయుష్మాన్ త్రిపాఠి, మేఘా బోస్, నిశాంత్ దంఖర్ (పాండిత్యం), ఎం రామ్, దేవ్ దుష్యంత్ కుమార జోషి, ఎం. వినాయక, ఆర్యమాన్ అగర్వాల్, తృప్త్‌రాజ్ అతుల్ పాండ్యా (కళలు, సంస్కృతి), శివంగి పాఠక్, ఎస్కౌ, ప్రియమ్ తాటెడ్ (విశాఖపట్నం), అనిష్, విజయ్ డియోకుల్ (క్రీడలు), కార్తీక్ కుమార్ గోయల్, అద్రికా గోయల్, నిఖిల్ దయానంద్ జిటూరి (సాహసం).బాల్ కల్యాణ్ పురస్కార గ్రహీతలు: శ్రీధర్‌రెడ్డి అరుమల్ల (ఈయన స్వస్థలం విజయవాడ), తషి నంగ్యాల్, సముంగం ట్రస్ట్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా, రంగాకహేల్.¤ ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన 1900 కానుకలను వేలం వేసి, ఆ నగదును గంగా నది ప్రక్షాళనకు ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. దిల్లీలోని జాతీయ ఆధునిక కళల గ్యాలరీలో ఈనెల 27, 28 తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. ¤ ఒడిశాలోని భువనేశ్వర్‌లో నౌకాదళం ఆధ్వర్యంలో తొలిసారిగా ‘సీ విజిల్' పేరిట జాతీయస్థాయి తీర రక్షణ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. 7516.6 కిలోమీటర్ల తీరం పొడవునా జరిగే ఈ విన్యాసాల్లో 13 తీర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు రక్షణ, హోం, ఇతర శాఖలు పాల్గొంటాయి.
|
జనవరి - 23
|
¤ ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తరపున రాయ్‌బరేలి, అమేథీలో ఎన్నికల ప్రచారం బాధ్యతలు నిర్వర్తించేవారు. ¤ ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియాన్ని ప్రారంభించారు. జలియన్‌వాలాబాగ్, మొదటి ప్రపంచ యుద్ధ వీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన యాద్ ఎ జలియాన్ మ్యూజియం, భారతీయ చిత్రాలపై ఏర్పాటైన దృశ్యకాల్ మ్యూజియంను కూడా ఆయన ప్రారంభించారు. ఈ మూడింటికి క్రాంతి మందిర్ అని పేరు పెట్టారు. ¤ జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు ఒక జాతీయ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రస్థాయిలో వివాదాలపై రెండో అప్పీలు చేసుకునే వీలుంటుంది. ఈ బెంచ్‌ను దేశ రాజధానిలో ఏర్పాటు చేస్తారు. ఒక అధ్యక్షుడితోపాటు కేంద్రం, రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడి చొప్పున ఉంటారు. ఈ బెంచ్ ఏర్పాటు వల్ల ఏటా రూ.6.86 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.¤ వారణాసిలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ముగిసింది. ముగింపు ఉపన్యాసం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు. ¤ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా పుణె - సికింద్రాబాద్ మధ్య నడిచే శతాబ్ది రైలు నిలిచింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్వహించిన సర్వేలో దేశంలో నడుస్తున్న మొత్తం 26 ప్రీమియం రైళ్లలో పుణె - సికింద్రాబాద్ శతాబ్ది రైలుకు 1000 పాయింట్లకు 916 పాయింట్లు దక్కాయి. స్వచ్ఛ్ రైల్ స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రత విషయంలో రైళ్ల మధ్య పోటీ పెంచడానికి ఐఆర్‌సీటీసీ టోటల్ క్లీన్‌లైన్స్ పేరిట ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 209 రైళ్లలో ప్రయాణికుల వద్ద అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో జైపూర్ కేంద్రంగా నడిచే వాయవ్య రైల్వే (860 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ మధ్య రైల్వే 658 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది.
|
జనవరి - 24
|
¤ చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) స్వర్ణోత్సవాల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ¤ జైద్ పంటలకు సంబంధించి వివిధ అంశాలపై దిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తమ్ రూపాలా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రబీ, ఖరీఫ్ పంట కాలాల మధ్య ఉండేదే జైద్. వ్యవసాయ భూమిని గరిష్ఠంగా సద్వినియోగం చేస్తూ విస్తృత ప్రయోజనాలు పొందడంపై ఈ సదస్సులో చర్చించారు.
|
జనవరి - 25
|
¤ చిన్న నగరాలకు అందుబాటు ధరల్లో విమానాలు నడిపేందుకు ఉద్దేశించిన ప్రాంతీయ విమానయాన పథకం (ఉడాన్) కింద కొత్తగా 235 మార్గాలకు కేంద్రం కేటాయించింది. వీటిలో 46 పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. మరో 18 మార్గాల్లో సీప్లేన్‌లు నడుస్తాయి. మూడో విడతలో కేటాయించిన 235 మార్గాల ద్వారా ఏడాదికి 69.30 లక్షల సీట్లు చేరతాయని పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు.
¤ భారత్ - దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సు దిల్లీలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సమక్షంలో ఇరు దేశాలు మూడేళ్ల వ్యూహాత్మక కార్యక్రమానికి ఆమోద ముద్ర వేశాయి.
|
జనవరి - 26
|
¤ దేశవ్యాప్తంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఆయన జీవితం, సిద్ధాంతాలే ఇతివృత్తంగా వివిధ శాఖలు, రాష్ట్రాల శకటాలు రూపుదిద్దుకున్నాయి. ఈ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరయ్యారు. నెల్సన్ మండేలా తర్వాత 24 ఏళ్ల అనంతరం ఈ వేడుకలకు హాజరైన ఆ దేశ రెండో అధ్యక్షుడు ఈయనే. ఇండియా గేట్ వద్ద అమర వీరులకు ప్రధాని మోదీ, త్రివిధ దళాల అధిపతులు అంజలి ఘటించారు. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు విడిచిన లాన్స్ నాయక్ అహ్మద్ వనీ భార్యకు అశోక్‌చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి అందించారు. » స్వాతంత్య్ర పోరాట సమయంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ నెలకొల్పిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో (ఐఎన్‌ఏ) పని చేసిన సైనికులు భాగ్మల్, పరమానంద్, లాల్టీరామ్, హీరాసింగ్ ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. » తెలంగాణకు చెందిన మహిళా అధికారి లెఫ్టినెంట్ భావనా కస్తూరి 144 మందితో కూడిన భారత ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బృందానికి సారథ్యం వహించారు. పురుషుల బృందానికి నేతృత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. » 183 ఏళ్ల చరిత్ర ఉన్న అసోం రైఫిల్స్ రెజిమెంట్ చరిత్ర సృష్టించింది. పూర్తిగా మహిళా సభ్యులే ఉన్న దళం తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాల్గొంది. మేజర్ ఖుష్బూ కన్వర్ దీనికి నాయకత్వం వహించారు. » కెప్టెన్ శిఖా సురభి అనే మహిళా అధికారి ప్రదర్శించిన బైకు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. » భారత వైమానిక దళ విమానాలు తొలిసారిగా సంప్రదాయ, జీవ ఇంధనాలతో కూడిన మిశ్రమ సాయంతో కవాతులో పాల్గొన్నాయి. ¤ 2018 సంవత్సరానికి సంబంధించి హిందీ పదంగా ‘నారీశక్తి' నిలిచిందని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సంస్థ పేర్కొంది. జైపూర్‌లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో (జేఎల్‌ఎఫ్) ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది. గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం నారీశక్తి పురస్కారాలను ప్రకటించిన నేపథ్యంలో ఆ పదాన్ని భారీగా ఉపయోగించారని ఆక్స్‌ఫర్డ్ వివరించింది. ¤ ఒడిశా రచయిత్రి గీతా మెహతా ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీని తిరస్కరించారు. బిజుబాబు కుమార్తె, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి అయిన గీత ఎన్నో పుస్తకాలు రచించారు. సాహితీవేత్తగా పేరుగడించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న ఆమె ఎన్నికలు సమీపించిన తరుణంలో ఈ అవార్డును స్వీకరిస్తే అపోహలకు దారి తీస్తుంది కాబట్టి తిరస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
|
జనవరి - 27
|
¤ తమిళనాడులోని మదురై సమీపంలో రూ.1264 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థకు (ఎయిమ్స్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ¤ దేశవ్యాప్తంగా ఉన్న 330కి పైగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) ఫిబ్రవరి 1 నుంచి విడుదలయ్యే అన్ని ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు చట్ట ప్రకారం 10% ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించనుంది. ¤ దేశంలో తొలి ఇంజిన్‌రహిత రైలుగా గుర్తింపు పొందిన ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూ.97 కోట్ల వ్యయంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు. ఈ రైలులో 16 బోగీలు ఉంటాయి. దిల్లీ - వారణాసి మధ్య నడిచే ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల ప్రయాణాన్ని దాదాపు 8 గంటల్లో పూర్తి చేస్తుంది. ¤ అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 29వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో వాదనలు వినాల్సి ఉంది. అయితే న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే అందుబాటులో లేనందు వల్ల విచారణ వాయిదా పడింది.
|
జనవరి - 28
|
¤ ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్‌లో (పీసా) భారత్ చేరిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. ఇది మన విద్యార్థుల ప్రమాణాలు అంతర్జాతీయంగా ఏ స్థాయిలో ఉన్నాయో మదింపు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర మంత్రి నేతృత్వంలో మానవ వనరుల శాఖ అధికారులు, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రతినిధులు సంతకాలు చేశారు. 2021 నుంచి 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పీసా ద్వారా ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల విద్యార్థుల ప్రమాణాలను లెక్కిస్తున్నారు. ¤ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో త్రిపుర శకటం ప్రథమ బహుమతి గెలుచుకుంది. ‘గాంధేయ మార్గంలో గ్రామీణ ఆర్థిక సాధికారత' ఇతివృత్తంగా దీన్ని మలిచారు. ‘జాతీయ ఆస్తుల రక్షణలో 50 ఏళ్లు' థీమ్‌తో రూపొందించిన సీఐఎస్‌ఎఫ్ శకటం, కిసాన్ గాంధీ పేరుతో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ రూపొందించిన శకటాలు ప్రభుత్వ విభాగాల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డులు అందించారు.
|
జనవరి - 29
|
¤ అయోధ్యలో వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67.39 ఎకరాల వివాదరహిత భూములను వాటి అసలు యజమానులకు అప్పగించడానికి అనుమతించాలని, మునుపటి తీర్పును దీనికి తగ్గట్టుగా సవరించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. 1992 డిసెంబరు 6న కరసేవకుల చేతిలో కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదుతోపాటు చుట్టూ ఉన్న స్థలాన్ని 1993లో ప్రభుత్వం చట్టం ద్వారా సేకరించింది. ఇందులో 42 ఎకరాలు ‘రామజన్మభూమి న్యాస్' పేరిç ఉన్నాయి. కూల్చివేతకు ముందు 2.77 ఎకరాల ప్రాంగణంలో వివాదాస్పద కట్టడం ఉన్న విస్తీర్ణం కేవలం 0.313 ఎకరాలు మాత్రమేనని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. దాన్ని మినహాయించి, మిగిలిన భూములను అప్పగించడానికి అనుమతి కోరింది. ¤ మన దేశంలో 2017తో పోలిస్తే గత ఏడాది అవినీతి కొంతమేర తగ్గిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అవినీతి అంచనాల సూచీ - 2018లో భారత్ 41 స్కోరుతో 78వ స్థానంలో నిలిచింది. 2017లో మన దేశం స్కోరు 40. అప్పుడు 81వ స్థానంలో ఉంది. ¤ ఆచార్య కొలకలూరి ఇనాక్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార చేతులమీదుగా దిల్లీలో అందుకున్నారు. ఇనాక్ రచించిన ‘విమర్శిని' గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ¤ దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ‘పరీక్ష - పే - చర్చ 2.0' పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన కార్యక్రమంలో 2 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ¤ దిల్లీలోని రైసినా హిల్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంగా పేర్కొనే బీటింగ్ రిట్రీట్‌ను ఘనంగా నిర్వహించారు. వెయ్యిమంది కళాకారులతో ఏర్పాటైన మిలటరీ బ్యాండ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
జనవరి - 30
|
¤ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దిల్లీలోని ఆయన సమాధి రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులు ఆయనకు అంజలి ఘటించారు.
¤ గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలోని దండిలో ఏర్పాటుచేసిన స్మారక చిహ్నం, ప్రదర్శనశాలను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని దండి ఉప్పు సత్యాగ్రహానికి గుర్తుగా నిర్మించారు. 1930లో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహాత్మాగాంధీ, మరో 80 మంది సత్యాగ్రహుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ¤ గుజరాత్‌లోని సూరత్‌లో విమానాశ్రయ టెర్మినల్ భవన విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సూరత్‌లోనే జరిగిన యువ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ¤ లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు. ¤ జాతీయ గణాంకాల సంఘం (నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్) తాత్కాలిక ఛైర్‌పర్సన్ పీసీ మోహనన్, స్వతంత్ర సభ్యురాలు జేవీ మీనాక్షి రాజీనామా చేశారు. ఇటీవల గణాంకాల కమిషన్ విడుదల చేసిన ఉద్యోగాల డేటాపై ప్రభుత్వం, కమిషన్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో వీరు రాజీనామా చేశారు. మోహనన్, మీనాక్షి 2017 జూన్‌లో కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరి పదవీకాలం 2020 జూన్ వరకు ఉంది. గణాంకాల కమిషన్‌లో ఏడుగురు సభ్యులు ఉండాలి. అయితే ఇప్పటికే ఇందులో 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత రాజీనామాలతో సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయింది. ప్రధాన గణాంకాల అధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఆ ఇద్దరు సభ్యులు.
|
జనవరి - 31
|
¤ దిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో (ఎన్‌డీఎంసీ) ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ మృణ్మయ కుడ్య చిత్రాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది గ్రామీణ కుమ్మరులు తయారు చేసిన 3,870 మట్టిపాత్రలతో 150 చదరపు మీటర్ల మహాత్ముడి కుడ్య చిత్రాన్ని రూపొందించారు. నా జీవితమే నా సందేశం అన్న గాంధీ మాటలను అందులో లిఖించారు.¤ 16వ లోక్‌సభ చివరి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ¤ దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఫేమ్ ఇండియా మ్యాగజీన్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఉన్నారు.¤ 1952భూగర్భ గనుల్లో మహిళలు పనిచేయడానికి అడ్డుగా నిలిచిన గనుల చట్టం - లోని నిబంధనలను సవరిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఇకపై బొగ్గు గనులు, చమురు క్షేత్రాలు, మైకా, బంగారం, ఇనుప ఖనిజం లభించే గనుల్లో మహిళలు ఉద్యోగాలు చేయొచ్చు.
|
|
|