జనవరి - 2
|
¤ 2019లో నూతన సంవత్సరం రోజున ప్రపంచవ్యాప్తంగా 3,95,000 మంది చిన్నారులు జన్మించగా, భారత్‌లోనే దాదాపు 70 వేల దాకా ఉన్నట్లు యునిసెఫ్ పేర్కొంది.
|
జనవరి - 3
|
¤ అమెరికాలో కొత్త కాంగ్రెస్ కొలువుదీరింది. రిపబ్లికన్ పార్టీ నేత అధ్యక్షుడిగా ఉండగా, ప్రతినిధుల సభలో విపక్ష డెమోక్రాట్లు ఆధిక్యంలో ఉన్నారు. » 2018 నవంబరులో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో అధికార రిపబ్లికన్ పార్టీ కంటే ఎక్కువ సీట్లను డెమోక్రాట్లు గెలుచుకున్నారు. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 235 మంది డెమోక్రాట్లు, 199 మంది రిపబ్లికన్లు సభ్యులుగా ఉన్నారు. » సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 100 సభ్యులకు గాను 53 మంది రిపబ్లికన్లు, 45 మంది డెమోక్రాట్లు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు డెమోక్రాట్లకు మద్దతిస్తున్నారు.
|
జనవరి - 4
|
¤ సీనియర్ డెమొక్రాట్, భారత్ అనుకూల నేతగా పేరున్న నాన్సీ పెలోసి (78) అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్పీకర్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. » ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పెలోసీ నేతృత్వంలో సమావేశమైన సభ ‘షట్‌డౌన్'కు ముగింపు పలుకుతూ మెక్సికో సరిహద్దుగోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు లేకుండానే బిల్లును ఆమోదించింది. ¤ ‘మదర్ ఆఫ్ ఆల్ చాంబ్స్ (ఎంవోఏబీ)' పేరుతో అమెరికా రూపొందించిన శక్తిమంతమైన అణ్వస్త్రేతర ఆయుధానికి పోటీగా చైనా కూడా ఒక భారీ బాంబును రూపొందించింది. » విమానం నుంచి ప్రయోగించే ఈ ఆయుధాన్ని ఆ దేశ రక్షణ సంస్థ ‘నారిన్‌కో' తాజాగా ప్రదర్శించింది. » విధ్వంసక శక్తి విషయంలో అణ్యస్త్రాల తర్వాతి స్థానం ఈ ఎంవోఏబీలదే. దీని అసలుపేరు ‘మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్' (ఎంవోఏబీ) మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా ఇది ప్రాచుర్యం పొందింది. » 2017లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌పై ఈ బాంబును ప్రయోగించింది.
|
జనవరి - 5
|
¤ అమెరికా 116వ కాంగ్రెస్‌లో సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో ఈసారి రికార్డుస్థాయిలో 102 మంది మహిళలు ఎన్నికయ్యారు. » అమెరికాలో మహిళలకు ఓటుహక్కు కల్పించి వందేళ్లు అవుతుంది. 1919, జూన్ 4న మహిళలకు ఓటుహక్కు కల్పిస్తూ కాంగ్రెస్‌లో బిల్లును ఆమోదించారు.
|
జనవరి - 7
|
¤ అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా 2019 జనవరి 7న బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ¤ ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జిమ్ యోంగ్ కిమ్ ప్రకటించారు. 2012 నుంచి పదవిలో కొనసాగుతున్న ఆయన ఫిబ్రవరి 1 నుంచి తప్పుకోనున్నారు. ప్రపంచ బ్యాంక్ సీఈఓ క్రిస్టలీనా జార్జియోవా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు.
|
జనవరి - 10
|
¤ వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో మరోసారి బాధ్యతలు స్వీకరించారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, పతనమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా నికోలస్ మాత్రం మళ్లీ పదవిని చేపట్టారు. వెనెజులా రాజధాని- కారకస్.
|
జనవరి - 12
|
¤ 2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు డెమోక్రటిక్ నేత, కాంగ్రెస్‌లోని హిందూ సభ్యురాలు తులసి గ్యాబర్డ్ ప్రకటించారు. తులసి హవాయి నుంచి 4సార్లు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
|
జనవరి - 13
|
¤ అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించే విషయంలో తలెత్తిన ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఈ గోడ నిర్మాణం తప్పనిసరని, దానికి నిధులు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ దానికి నిరాకరించింది. గోడకు నిధులు ఇవ్వని బడ్జెట్‌ను తాను ఆమోదించనని ట్రంప్ తేల్చి చెప్పడంతో అమెరికాలో ప్రభుత్వం మూతపడింది. దీంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.
|
జనవరి - 16
|
¤ బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ) ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. దీనిపై నిర్వహించిన ఓటింగ్‌లో 202 మంది అనుకూలంగా, 432 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాని థెరెసా మే ప్రభుత్వంపై ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో థెరెసా 325-306 తేడాతో గెలిచారు. దీంతో ప్రస్తుతానికి ఆమె పదవిలో కొనసాగనున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ 2019 మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. 21 నెలల పాటు కొనసాగుతుంది. ఈలోగా బ్రెగ్జిట్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం పొందకపోతే యూరోపియన్ దేశాలతో వాణిజ్యంపై బ్రిటన్‌కు ఆంక్షలు ఎదురుకావొచ్చు.
|
జనవరి - 20
|
¤ ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రతిపాదన చేశారు. మెక్సికో గోడ నిర్మాణానికి తాను డిమాండ్ చేసిన నిధులను కేటాయిస్తే, సరైన పత్రాల్లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన డ్రీమర్లు, మరికొందరు వలసదారులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటానని ప్రతిపాదించారు. దీనికి డెమోక్రాట్లు అంగీకరించలేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారిని డ్రీమర్లుగా పేర్కొంటారు. సరిహద్దు గోడ నిర్మాణానికి కాంగ్రెస్ 570 కోట్ల డాలర్లను కేటాయిస్తే అమెరికాలో తాత్కాలిక రక్షణ హోదా (టీపీఎస్) పొందినవారితోపాటు డ్రీమర్లను దేశం నుంచి తరిమివేయకుండా మూడేళ్లపాటు ఉపశమనం కల్పిస్తామని, దీనివల్ల 7 లక్షల మంది డ్రీమర్లు, 3 లక్షల మంది టీపీఎస్‌దారులకు లాభం కలుగుతుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఆదివారంతో 30 వ రోజుకు చేరుకుంది.
|
జనవరి - 21
|
¤ చైనాలో యువత సంఖ్య తగ్గిపోతోంది. శిశు జనన రేట్లలో తగ్గుదల, మందగించిన ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని కలవరపరుస్తున్నాయి. 2018లో చైనాలో 1.5 కోట్లకు పైగా చిన్నారులు జన్మించారు. అయితే ఇది 2017తో పోలిస్తే 20 లక్షలు తక్కువ. 2017లో ప్రతి లక్ష మందికి జననాల రేటు 1,243 కాగా 2018లో అది 1094కు తగ్గింది. ప్రస్తుతం 139 కోట్లు దాటిన చైనా జనాభాలో 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 24.9 కోట్లు దాటింది. ఇది దేశ జనాభాలో 17.9 శాతం. 16 నుంచి 59 ఏళ్ల మధ్య శ్రమించే సామర్థ్యం ఉన్నవారి సంఖ్య 89.7 కోట్లు. అంటే మొత్తం జనాభాలో 64.3 శాతం. ఈ గణాంకాలను నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) విడుదల చేసింది. దశాబ్దాలపాటు అమలు చేసిన ఏక సంతానం విధానాన్ని చైనా 2016లో రద్దు చేసింది. అయినా సంతాన వృద్ధిలో పెరుగుదల నమోదు కావడం లేదు.¤ అఫ్గనిస్థాన్‌లో సైనిక వాహనాన్ని అపహరించిన తాలిబన్లు అందులో పేలుడు పదార్థాలను నింపి, సైనిక స్థావరంలోకి దూసుకువెళ్లారు. ఈ ఘటనలో 8మంది ప్రత్యేక కమాండోలతో సహా 126 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబూల్‌కు పశ్చిమంగా ఉన్న మైదాన్ వార్దక్ ప్రావిన్స్‌లో జాతీయ భద్రత డైరెక్టరేట్‌లో ఉన్న శిక్షణ కేంద్రం వద్ద ఈ దాడి జరిగింది. అది కూడా అఫ్గన్‌లో శాంతి కోసం అమెరికా ప్రత్యేక దూత జల్మాయ్ ఖాలిజాద్‌ను తాలిబన్ల ప్రతినిధులు ఖతార్‌లో కలిసిన రోజే ఈ ఘోరం చోటుచేసుకుంది.
|
జనవరి - 22
|
¤ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రారంభమైంది. అయిదు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో వివిధ దేశాల నాయకులు, ప్రతినిధులు పాల్గొంటున్నారు. లాభాపేక్ష లేకుండా పని చేసే అంతర్జాతీయ సంస్థ డబ్ల్యూఈఎఫ్. ఇది 1971లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
|
జనవరి - 24
|
¤ వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష నేత జువాన్ గుయాడో (35) తనని తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అమెరికా, పొరుగు దేశాలైన బ్రెజిల్, కొలంబియా, పెరు, అర్జెంటీనా ఆయన్ను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. రష్యా, క్యూబా, టర్కీ లాంటి దేశాలు జువాన్ చర్యను ఖండించాయి. అధ్యక్షుడు నికోలస్ మదురోకి మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి ఇరువర్గాల మధ్య చర్చలు జరగాలని ప్రతిపాదించింది. యూరోపియన్ యూనియన్ ఎన్నికల నిర్వహించడం మేలని అభిప్రాయపడింది. చమురు నిల్వలు అధికంగా ఉన్న వెనెజువెలా దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం. ¤ మలేసియా రాజకుటుంబ సభ్యులు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షాను కొత్త రాజుగా ఎన్నుకున్నారు. 59 ఏళ్ల అహ్మద్ షా జనవరి 31న సింహాసనాన్ని అధిష్టించనున్నారు. అనారోగ్య కారణాలను పేర్కొంటూ సుల్తాన్ మహ్మద్-5 రాజుగా తప్పుకోవడంతో కొత్త రాజును ఎన్నుకోవాల్సి వచ్చింది.
|
జనవరి - 26
|
¤ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వానికి అవసరమైన నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేయడంతో అమెరికాలో 35 రోజులుగా సాగుతున్న షట్‌డౌన్‌కు తాత్కాలికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, వలస విధానంపై ఇరు పార్టీలు 3 వారాల్లోగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంటుంది. ¤ బ్రెజిల్‌లో ఉపయోగంలో లేని ఒక ఆనకట్ట కూలిపోవడంతో 11 మంది మరణించగా, 300 మందికి పైగా గల్లంతయ్యారు. ఆగ్నేయ బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రం, బెటో హొరిజొంటె పట్టణం సమీపంలోని ఇనుప ఖనిజ గని పక్కన ఈ ప్రమాదం జరిగింది.
|
జనవరి - 29
|
¤ తొలిసారి ఒక హిందూ మహిళ పాకిస్థాన్‌లో సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. ఖాంబర్-షాదాద్‌కోటకు చెందిన సుమన్ కుమారి తన సొంత జిల్లాలోనే ఈ పదవిని చేపట్టనున్నారు. ¤ వెనెజువెలా దేశ ప్రభుత్వ రంగ చమురు సంస్థ పెట్రోలియోస్ డి వెనెజువెలా, ఎస్‌ఏతో (పీడీవీఎస్‌ఏ) తమ దేశ సంస్థలు లావాదేవీలు జరపకుండా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో వచ్చే ఏడాది కాలంలో వెనెజువెలా తన ఆదాయంలో సుమారు రూ.77 వేల కోట్లు కోల్పోతుందని అంచనా.
|
జనవరి - 30
|
¤ పోలార్ వర్టెక్స్ ప్రభావం కారణంగా ఆర్కిటిక్ నుంచి వీస్తున్న గాలులతో అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 53 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 2300 విమానాలను రద్దు చేశారు. ఇల్లినాయిస్, మిషిగాన్, విస్కాన్సిన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
|
|
|