Type Here to Get Search Results !

Jan-2019 సైన్స్ అండ్ టెక్నాలజీ

జనవరి - 1
¤ అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన న్యూ హొరైజన్స్‌ వ్యోమనౌక చరిత్ర సృష్టించింది. సౌరకుటుంబంలోని అత్యంత సుదూర, పురాతన ఖగోళ వస్తువు ‘అల్టిమా తూలీ'కి చేరువగా వచ్చి వెళ్లింది. హిమమయంగా ఉండే ఆ శిలను ఫొటో తీసింది        » ఈ వ్యోమనౌకను 2006లో ప్రయోగించారు. 2015లో ఇది ఫ్లూటోకు, దాని రెండు చందమామలకు దగ్గరగా వచ్చి వెళ్లింది.        » ఫ్లూటో సందర్శన తర్వాత ఈ వ్యోమనౌకను పంపడానికి 2014లో శాస్త్రవేత్తలు సౌరకుటుంబ చివరిభాగంలో అనేక గ్రహశకలాలతో కూడిన కైపర్‌ వలయంలోని సుదూర శిలను ఎంపిక చేశారు. దానికి 2014 ఎంయూ 69 అని పేరు పెట్టారు. ప్రజల ఓటింగ్‌ ఆధారంగా ‘అల్టిమా తూలీ' (లాటిన్‌ భాషలో మనకు తెలిసిన ప్రపంచానికి వెలుపల అని అర్థం) పేరును ఖరారు చేశారు.        » అల్టిమా తూలీ సూర్యుడికి దాదాపు 650 కోట్ల కి.మీ. దూరంలో ఉంది. తాజాగా న్యూ హొరైజన్స్‌ ఈ ఖగోళ శిలకు 3500 కి.మీ. దూరంలోకి వచ్చి వెళ్లింది. సూర్యుడికి ఇంతదూరంలో ఉన్న ఖగోళ వస్తువుకు ఇంత చేరువగా వచ్చి వెళ్లడం ఇదే మొదటిసారి.        » శాస్త్రీయ కోణంలో ఈ శిల చాలా విలువైంది. సూర్యుడికి చాలా దూరంలో దాదాపు మైనస్‌ 270 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతను కలిగి ఉండటం వల్ల సౌరకుటుంబం పుట్టుకకు సంబంధించిన అనేక అంశాలు అందులో పదిలంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
జనవరి - 3
¤ సంక్లిష్టమైన చంద్రయాన్‌-2 సహా ఈ ఏడాది 32 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలని నిర్ణయించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
¤ ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా చంద్రుడి అవతలి భాగంలో వ్యోమనౌకను దించింది. చాంగే-4 అనే ఈ రోబోటిక్‌ యంత్రం ఇప్పటివరకూ పెద్దగా శోధించని ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను చాలా దగ్గరి నుంచి అందించింది.
        » చంద్రుడి అవతలి భాగంలో ముందుగా నిర్దేశించిన విధంగా దక్షిణ ధృవ - అయిట్కెన్‌ బేసిన్‌లోని వాన్‌ కార్మాన్‌ బిలంలో చాంగే-4 సురక్షితంగా దిగింది. 186 కి.మీ. వెడల్పు, 12 కి.మీ. లోతు కలిగిన ఈ బిలం సౌరకుటుంబంలోని అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఖగోళ శిల ఢీ కొనడంవల్ల ఇది ఏర్పడింది.
        » చైనా జానపద కథల్లోని చందమామ దేవత పేరిట ఈ వ్యోమనౌకకు చాంగే-4 అనే పేరు పెట్టారు. దీన్ని లాంగ్‌ మార్చ్‌-3బి రాకెట్‌ ద్వారా 2018, డిసెంబరు 8న ప్రయోగించారు.
జనవరి - 8
¤ సౌర వ్యవస్థ అవతల మరో కొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇది భూమికి సుమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడిలా ప్రకాశవంతమైన ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు.తాజా గ్రహం పేరు - హెచ్‌డీ21749బి.
జనవరి - 9
¤ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌ శాస్త్రవేత్తలు మీథేన్‌ మూలకాలతో కొత్త ఇంధనాన్ని తయారు చేశారు. దీన్ని అంతరిక్ష ఇంధనంగా వ్యవహరిస్తున్నారు. ప్రయోగశాలలో ఈ ఇంధనం ఏర్పడటానికి అనువైన పరిస్థితులను సృష్టిండంతో ఇది సాధ్యమైంది. వాతావరణంలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ను భవిష్యత్‌ శక్తి వనరుగా మార్చేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.¤ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ సాయంతో నిట్టనిలువుగా పైకి, కిందికి ఎగరగల నెక్సస్‌ ఎయిర్‌ ట్యాక్సీని బెల్‌ సంస్థ తయారు చేసింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) - ఇంటర్నేషనల్‌లో దీని నమూనాను బెల్‌ ప్రదర్శించింది.¤ చిన్న పరిమాణంలో ఉండే అత్యాధునిక మారిటైమ్‌ రాడార్‌ను చైనా అభివృద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రాడార్‌ శత్రుదేశాల నౌకలు, విమానాలు, క్షిపణుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా గుర్తించగలదు.¤ చైనా షాంఘైలోని హుడాంగ్‌ ఝోంగువా నౌకాశ్రయంలో తయారు చేస్తున్న సీఎం-302 యుద్ధ నౌకలను త్వరలో పాకిస్థాన్‌కు అందజేయనుంది.
జనవరి - 10
¤ నక్షత్ర మండలానికి అవతలి నుంచి ఒకే కేంద్రం ద్వారా వెలువడుతున్న రిపీటింగ్‌ ఫాస్ట్‌ రేడియో బరస్ట్‌ (ఎఫ్‌ఆర్‌బీ) సంకేతాలను కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు రెండోసారి గుర్తించారు. బ్రిటిష్‌ కొలంబియాలో ఏర్పాటు చేసిన కెనడియన్‌ హైడ్రోజన్‌ ఇంటెన్సిటీ మ్యాపింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌ టెలిస్కోప్‌ ద్వారా వీటిని గుర్తించారు. కొన్ని బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరం నుంచి వెలువడే శక్తిమంతమైన పేలుళ్లకు సంబంధించిన రేడియో తరంగాలనే ఎఫ్‌ఆర్‌బీలుగా వ్యవహరిస్తారు.
¤ పచ్చి టమాటాలను ఎంత శుభ్రంగా కడిగినప్పటికీ సాల్మోనెల్లా టైఫిమ్యూరియం బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోక, గ్యాస్ట్రోఎంట్రైటిస్‌కు కారణం కావచ్చని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి సలాడ్ల రూపంలో కంటే టమాటాలను ఉడికించి తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని ఈ బృందం తెలిపింది.
జనవరి - 11
¤ 2021 డిసెంబరులో మానవసహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌ను చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్‌-2 ప్రయోగం నిర్వహిస్తామని తెలిపారు.
¤ చంద్రుడిపై అన్వేషణ కోసం చైనా ప్రయోగించిన చాంగ్‌-4 ల్యాండర్‌ దానిపై ఏర్పాటు చేసిన కెమెరా సాయంతో చంద్రుడి వెనకభాగం ఫొటో తీసి చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు (సీఎన్‌ఎస్‌ఏ) పంపింది.
జనవరి - 13
¤ చాంగే-4 పేరుతో చైనా పంపిన రోవర్‌ చంద్రుడిపై రాత్రి సమయంలో నమోదయ్యే శీతల ఉష్ణోగ్రతను నిర్ధరించనుంది.
జనవరి - 14
¤ న్యూక్లియర్‌ క్షిపణి వ్యవస్థను కాపాడుకోవడానికి చైనా ఆ స్థావరాల చుట్టూ భూగర్భంలో ఉక్కు గోడను నిర్మించింది. హైపర్‌సోనిక్‌ క్షిపణులు, బంకర్‌ విధ్వంసక ఆయుధాలు కూడా ఈ ఉక్కు కవచాన్ని చీల్చలేవని చైనా శాస్త్రవేత్త కియాన్‌ హు (82) పేర్కొన్నారు.
జనవరి - 16
¤ చైనా శాస్త్రవేత్తలు చంద్రుడి అవతలి భాగంలో పత్తి గింజలను మొలకెత్తించారు. జనవరి 4న చంద్రుడిపై దిగిన చాంగే-4 రోవర్‌లో శాస్త్రవేత్తలు 10 రకాల విత్తనాలను పంపారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో తొలుత పత్తి గింజలు మొలకెత్తగా రోవర్‌ ఆ ఫోటోను చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు (సీఎన్‌ఎస్‌ఏ) పంపించింది. త్వరలో ఆలుగడ్డలను పండిస్తామని సంస్థ ప్రకటించింది. చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించడానికి చైనా ఈ ఏడాది చివరి నాటికి చాంగే - 5 మిషన్‌ను ప్రయోగించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువ అన్వేషణకు చాంగే-6ను, చందమామ ఉపరితలం, మూలక మిశ్రమాలు, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి చాంగే-7ను పంపాలని భావిస్తోంది. ఈ పరిశోధన వెనక చైనాలోని 28 వర్సిటీల కృషి ఉంది. 2036 నాటికి చంద్రుడిపై నివాసం ఏర్పాటే లక్ష్యంగా చైనా ఈ పరిశోధనలు సాగిస్తోంది.¤ నకిలీ వార్తలను గుర్తించడానికి హైదరాబాద్‌కు చెందిన ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు ‘ఫేకో మీటర్‌' అనే సెర్చ్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు. దీని రూపకల్పనలో గ్రామీణర్‌ అనే కంపెనీ సాయం చేసింది. ఐఐఐటీ-హెచ్‌లోని నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ ల్యాబ్‌ కీలక పాత్ర పోషించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సెర్చ్‌ ఇంజిన్‌లో ఒక వార్త హెడ్డింగ్‌ లేదా ట్వీట్‌ను పేస్ట్‌ చేస్తే ఆ వార్త కచ్చితత్వం ఎంతో చెబుతుంది.
జనవరి - 17
¤ పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ విద్యార్థులు దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత బస్సును రూపొందించారు. అది కూడా పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచేది కావడం మరో విశేషం. సౌర పలకలు అమర్చిన ఈ బస్సుకు ఒకసారి ఛార్జింగ్‌ పెడితే 70 కి.మీ. ప్రయాణిస్తుంది.¤ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఐఐటీ పరిశోధకులు దెబ్బతిన్న మూత్రపిండాలను ప్రారంభ దశలోనే గుర్తించే ఒక కొత్త పరీక్షను రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా మూత్రం, రక్తం నమూనాల్లో ప్రోటీన్‌ మార్కర్లు తక్కువ స్థాయుల్లో ఉన్నా గుర్తించవచ్చు. మూత్రం, రక్తంలో ప్రోటీన్‌ అల్బుమిన్‌ను గుర్తించడం ద్వారా ఈ పరీక్ష పని చేస్తుంది. దీని సాయంతో అల్బుమిన్‌ గాఢతను ప్రతి డెసి లీటర్‌కు 3.3 మైక్రోగ్రాముల తక్కువ స్థాయి వరకు గుర్తించవచ్చని ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు.¤ దేశీయంగా రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్రాన్ని తొలిసారిగా ప్రయోగించింది. దాంతో గాల్లో తేలుతున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సంస్థ ఈ హెలికాప్టర్‌ను రూపొందించింది. ఈ ప్రయోగం ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక వద్ద నిర్వహించారు.¤ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘ఉన్నతి' (యుని స్పేస్‌ నానోశాటిలైట్‌ అసెంబ్లీ అండ్‌ ట్రైనింగ్‌ బై ఇస్రో) కార్యక్రమాన్ని కేంద్ర అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో ‘సమీకృత సరిహద్దు నిర్వహణ ప్రాజెక్టు'ను ప్రారంభించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని ఇళ్లలోకి వర్చువల్‌గా ప్రవేశించగలిగే సరిహద్దు నిర్వహణ పరిజ్ఞానాన్ని భారత్‌ అభివృద్ధి చేసిందని ప్రకటించారు. నానో ఉపగ్రహ అభివృద్ధి కార్యక్రమానికి ఊతమివ్వడానికి ‘ఉన్నతి'ని చేపట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. మొదటి బృందంలో 17 దేశాలకు చెందిన 30 మంది ఉన్నారు. ఇది 8 వారాల పాటు కొనసాగుతుంది.
జనవరి - 18
¤ ఎతిహాద్‌కు చెందిన ఒక వాణిజ్య విమానం (బోయింగ్‌ 787) జీవ ఇంధనంతో అబుదాబి నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌ వరకు 7 గంటలు ప్రయాణించింది. ఈ జీవ ఇంధనాన్ని యూఏఈలోని ఖలీఫా వర్సిటీకి చెందిన మస్దార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన సుస్థిర జీవ ఇంధన పరిశోధక సంస్థ (ఎస్‌బీఆర్‌సీ) ఉత్పత్తి చేసింది. మస్దార్‌ నగరంలో ఉప్పునీటితో పెంచిన సాలికోర్నియా మొక్కల నుంచి తీసిన నూనెను జెట్‌ ఇంధనంగా మార్చడం విశేషం. ఈ జీవ ఇంధనంతో కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.
జనవరి - 20
¤ దక్షిణ కొరియాలోని ఉస్లాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు కార్బన్‌ డైఆక్సైడ్‌ నుంచి విద్యుత్, హైడ్రోజన్‌ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు. హైబ్రిడ్‌ ఎన్‌ఏ-సీవో2గా పిలిచే ఈ వ్యవస్థలో కార్బన్‌ డైఆక్సైడ్‌ నుంచి 1000 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్, హైడ్రోజన్‌ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్బన్‌ డైఆక్సైడ్‌ వల్లే గ్లోబల్‌ వార్మింగ్‌ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
¤ శనిగ్రహంపై ఒక రోజు గడవాలంటే 10 : 33 : 38 గంటలు పడుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా - శాంటాక్రజ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా ‘కాసిని' స్పేస్‌క్రాఫ్ట్‌ పంపిన సమాచారం ఆధారంగా శనిగ్రహం ఒక రోజు సమయాన్ని నిర్ధరించారు. అంటే శనిగ్రహంపై ఒక రోజు పూర్తికావడానికి పదిన్నర గంటల సమయం పడుతుందని తేలింది.
జనవరి - 21
¤ 2019లో తొలిసారిగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది భారత్, ఆసియా దేశాలు మినహా అమెరికా, యూరప్, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపించింది. సూపర్‌ బ్లడ్‌ వుల్ఫ్‌ మూన్‌గా పిలిచే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం 62 నిమిషాలపాటు కనిపించింది. ఆ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా, ఎర్రగా కనిపించాడు.¤ ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు మన దేశంలో 6.5 కోట్ల సంవత్సరాల కిందట భూమిలో 1500 మీటర్ల లోతులో జీవం మనుగడ సాగించినట్లు కనుక్కున్నారు. దక్షిణ, పశ్చిమ భారత్‌లోని దక్కన్‌ పీఠభూమిలో చాలావరకు ఆవరించిన దక్కన్‌ ట్రాప్స్‌లోని శిలల్లో సూక్ష్మజీవుల రూపంలో ఇవి కనిపించాయి. వీటిలో ఎక్కువగా బ్యాక్టీరియానే ఉంది. భారత్‌లో ఇంత లోతులో జీవం ఆనవాళ్లు కనిపించడం ఇదే తొలిసారి. దాదాపు 6.5 కోట్ల ఏళ్ల కిందట సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఈ దక్కన్‌ ట్రాప్స్‌ ఏర్పడ్డాయి. ఆ సందర్భంగా ఏర్పడిన శిలాద్రవం గట్టిపడటం వల్ల ఏర్పడిన శిలల్లో పోషకాలు, నీరు అంతగా లేనిచోట్ల సూక్ష్మజీవులు మనుగడ సాగించడం శాస్త్రవేత్తలను అబ్బురపరిచింది. భూప్రకంపనల వల్ల ఏర్పడిన పగుళ్ల ద్వారా అవి శిలల్లోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నారు.
జనవరి - 24
¤ నెల్లూరులోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - సీ44 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న కలాం శాట్, 740 కిలోల మైక్రో శాట్‌-ఆర్‌ ఉప్రగహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వీటిలో కలాం శాట్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించింది. మైక్రో శాట్‌-ఆర్‌ దేశ రక్షణ రంగ అవసరాల కోసం ఉద్దేశించింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సిరీస్‌లో ఇది 46వ వాహక నౌక. దీన్ని పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌గా పిలుస్తున్నారు. మామూలుగా పీఎస్‌ఎల్‌వీ వాహకనౌకలో 6 స్ట్రాపాన్‌ బూస్టర్లు ఉంటాయి. పీఎస్‌ఎల్‌వీ - సీ44లో మాత్రం రెండే ఉపయోగించి, ప్రయోగం చేపట్టారు. అందుకే దీనికి పీఎస్‌ఎల్‌వీ - డీఎల్‌గా నామకరణం చేశారు.¤ బ్రిటన్‌ అంటార్కిటిక్‌ సర్వే (బాస్‌) శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో రెండు కిలోమీటర్ల లోతైన బోరు బావిని తవ్వారు. 11 మంది సభ్యుల బృందం అంటార్కిటికాలోని అతిపెద్ద మంచు ఫలకమైన రట్‌ఫోర్డ్‌పై 12 వారాలు శ్రమించి, దీన్ని పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును బీమిష్‌గా పేర్కొంటున్నారు. ఇది 20 ఏళ్ల కిందటి నుంచే ‘బాస్‌' ప్రణాళికలో ఉంది. అయితే 2004లో చేపట్టిన తవ్వకాలు సఫలం కాలేదు. తాజాగా సాంకేతిక అవరోధాలను అధిగమించి మొదటి గుంతకు రెండు కిలోమీటర్ల దూరంలో మరో గుంతను కూడా తవ్వారు. సముద్ర ఉష్ణ జలాల కారణంగా పశ్చిమ అంటార్కిటికాలోని మంచు గడ్డలు కోతకు గురై, అతి త్వరగా నీరైపోతున్నాయి. ఇలా మంచు కరిగేందుకు కారణమవుతున్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ప్రస్తుత ప్రయోగాన్ని చేపట్టారు. తద్వారా భవిష్యత్‌లో సముద్ర మట్టాలు పెరగడంపై స్పష్టమైన అంచనాకు రావచ్చని వారు భావిస్తున్నారు.¤ చైనా శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్‌ విధానంలో పుట్టిన ఒక కోతిని క్లోన్‌ చేసి, అయిదు ప్రతిరూపాలను సృష్టించారు. మానవ జీవక్రియ గడియారంలో (సర్కాడియన్‌ రిథమ్‌) లోపాలు ఉండేలా తమ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్‌తో ఒక కోతిని తయారు చేశారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఆ కోతి నుంచి మరో అయిదు కోతులను సృష్టించారని పేర్కొంది. షాంఘైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌లో ఇవి జన్మించాయి. సర్కాడియన్‌ రిథమ్‌లోని లోపాలకు నిద్రలేమి, కుంగుబాటు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్‌ లాంటి వ్యాధులతో సంబంధం ఉంది. సాధారణంగా ఇలాంటి వ్యాధులపై పరిశోధనల కోసం ఎలుకలు, ఈగలను ఉపయోగించేవారు. కానీ దినచర్యలు, మెదడు నిర్మాణం, జీవక్రియ రేటు లాంటి అంశాల్లో వీటికీ మానవులకు చాలా వైరుధ్యం ఉంటోంది. తాజాగా క్లోనింగ్‌లో జన్మించిన కోతుల శరీర అంతర్గత తీరుతెన్నులు చాలావరకు మానవులను పోలి ఉన్నాయి. కాబట్టి అనేక వ్యాధులకు చికిత్స విధానాలను రూపొందించడానికి ఇవి మెరుగైన నమూనాలుగా ఉపయోగపడతాయని, తద్వారా మందుల ఖర్చు తగ్గుతుందని జిన్హువా పేర్కొంది.¤ దేశీయంగా ఉత్పత్తైన జీవ ఇంధనంతో సైనిక విమానాలను నడపటానికి సైనిక విమానయాన భద్రత ప్రమాణీకరణ కేంద్రం (సీఈఎంఐఎల్‌ఏసీ) అనుమతి మంజూరు చేసింది. మొక్కలు, విత్తనాల నుంచి తీసే ఈ జీవ ఇంధనాన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్లలో వాయు సేన వినియోగించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో పండించిన జట్రోఫా మొక్కల విత్తనాల నుంచి ఈ జీవ ఇంధనాన్ని తయారు చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.