Type Here to Get Search Results !

Jan-2019 అవార్డులు

జనవరి - 4
¤ ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ఆవిష్కరించిన చౌక ఫీచర్‌ ఫోన్‌ ‘జియో ఫోన్‌'కు ప్రతిష్ఠాత్మక ‘నిక్కీ సుపీరియర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ అవార్డు-2018' లభించింది.
జనవరి - 7
¤ 76వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను లాస్‌ ఏంజెల్స్‌లో ప్రకటించారు.
విజేతలు: » బెస్ట్‌ ఫిల్మ్‌ డ్రామా - బొహిమియన్‌ 
రాప్సోడి
» బెస్ట్‌ ఫిల్మ్‌ కామెడీ ఆర్‌ మ్యూజికల్‌ - గ్రీన్‌ 
బుక్‌
» ఉత్తమ నటుడు (ఫిల్మ్‌ డ్రామా) - రామి మాలెక్‌ (బొహిమియన్‌ రాప్సోడి)
» ఉత్తమ నటి (ఫిల్మ్‌ డ్రామా) - గ్లెన్‌ క్లోజ్‌ (ది వైఫ్‌)
» ఉత్తమ నటుడు (కామెడీ/ మ్యూజికల్‌) - క్రిస్టియన్‌ బాలె (వైస్‌)
» ఉత్తమ నటి (కామెడీ/ మ్యూజికల్‌) - ఒలివియా కోల్‌మన్‌ (ది ఫేవరెట్‌)
¤ ప్రముఖ గాయని పి. సుశీల కేరళ ప్రభుత్వం ప్రకటించే హరివరాసనం అవార్డుకు ఎంపికయ్యారు.
జనవరి - 11
¤ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో (సీఎస్‌ఆర్‌) అత్యుత్తమ సేవలు అందించినందుకు హైదరాబాద్‌ జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్ఠాత్మక ఇన్‌స్టిట్యూట్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) సీఎస్‌ఆర్‌ అవార్డు - 2018కి ఎంపికైంది.
జనవరి - 14
¤ ప్రధాని నరేంద్ర మోదీ ‘ఫిలిప్‌ కాట్లర్‌' తొలి పురస్కారాన్ని దిల్లీలో అందుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ కాట్లర్‌ పేరిట ఈ అవార్డు నెలకొల్పారు. ప్రజలు (పీపుల్‌), ప్రయోజనం (ప్రాఫిట్‌), ప్రపంచం (ప్లానెట్‌) కోసం చేసిన కృషి ఆధారంగా దేశాధినేతల్లో ఒకరికి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
జనవరి - 16
¤ కేంద్ర ప్రభుత్వం గాంధీ 2015 నుంచి 2018 వరకు నాలుగు సంవత్సరాలకు శాంతి బహుమతి విజేతలను ప్రకటించింది. మహాత్ముడి అహింసా మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు ఇస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ సభ్యులుగా ఉన్నారు. ఈ అవార్డులను 1995 నుంచి ఇస్తున్నారు. విజేతలకు అవార్డుతోపాటు రూ.కోటి నగదు బహుమతి అందజేస్తారు. విజేతల వివరాలు:- 2018: యోహీ ససకావా. ఈయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున కుష్ఠు నివారణకు కృషి చేస్తున్నారు. - 2017: ఏకై అభియాన్‌ ట్రస్ట్‌. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది.- 2016: అక్షయ పాత్ర ఫౌండేషన్, సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు (సంయుక్తంగా)- 2015: వివేకానంద కేంద్ర. కన్యాకుమారిలోని ఈ సంస్థ గ్రామీణాభివృద్ధితోపాటు విద్య కోసం పాటుపడుతోంది.¤ తరుణ్‌ భారత్‌ సంగ్‌ సంస్థ ‘పర్యావరణ సంరక్షక్‌' అవార్డును జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి. ప్రకాశ్‌కు ప్రదానం చేసింది. రాజస్థాన్‌లోని బీకంపురాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు అరుణ్‌ గాంధీ, మునిమనవడు తుషార్‌ గాంధీ చేతుల మీదుగా ప్రకాశ్‌ ఈ అవార్డును అందుకున్నారు.
జనవరి - 18
¤ క్యాన్సర్‌ వ్యాధిపై పరిశోధనలు చేసిన డాక్టర్‌ డాన్‌ క్లీవ్‌ల్యాండ్, ప్రజారోగ్య విభాగంలో సేవలు అందించిన డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా - 2019 సదస్సులో వీరికి అవార్డు ప్రదానం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌ అయిన క్లీవ్‌ ల్యాండ్‌ లుడ్‌విగ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ - శాండియాగో శాఖలో సెల్‌ బయాలజీ ల్యాబ్‌ అధిపతిగా పని చేస్తున్నారు. డాక్టర్‌ సౌమ్య చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్క్యులోసిస్‌ డైరెక్టర్‌గా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా పని చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థలో (డబ్ల్యూహెచ్‌ఓ) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ప్రోగ్రామ్స్‌) హోదాలో ఉన్నారు.
జనవరి - 23
¤ విపత్తు సహాయక, పునరావాస చర్యలు చేపట్టే సంస్థలు, వ్యక్తుల సేవలకు వార్షిక పురస్కారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ‘సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కార్‌' పేరిట అవార్డు ఏర్పాటు చేసింది. తొలి పురస్కారాన్ని (2019 సంవత్సరానికి) గాజియాబాద్‌లోని జాతీయ విపత్తు స్పందన దళానికి ఇవ్వనున్నట్లు హోం శాఖ ప్రకటించింది. ¤ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌ లభించింది. ఈ ఏడాది మొత్తం 28మంది ప్రవాస భారతీయులు, రెండు సంస్థలకు సమ్మాన్‌ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో పి.వి. సాంబశివరావు (కెన్యా, సాంకేతిక రంగం), గుణశేఖర్‌ ముప్పూరి (జమైకా, వైద్య-వ్యాపార రంగం), జగదీశ్వర్‌రావు మద్దుకూరి (పోలెండ్, వ్యాపార రంగం) అనే ముగ్గురు తెలుగువారు ఉన్నారు. నార్వే ఎంపీ హిమాన్షు గులాటి, దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్‌ సూక్లల్‌ తదితరులతోపాటు గయానా హిందూ ధార్మిక సభ, ఈజిప్ట్‌లోని భారతీయ కమ్యూనిటీ సంఘానికి కూడా అవార్డులు లభించాయి.
జనవరి - 24
¤ ఉగ్రవాద బాట వీడి సైన్యంలో చేరి ప్రాణాలు త్యాగం చేసిన లాన్స్‌నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వనీకి (38 ఏళ్లు) కేంద్ర ప్రభుత్వం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018 నవంబరు 25న షోపియాన్‌ జిల్లాలోని హీరాపూర్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అహ్మద్‌ వనీ ఒక లష్కరే కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించి నేలకొరిగారు. అశోకచక్ర శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అహ్మద్‌ వనీ భార్య మహజబీన్‌కు ఈ అవార్డును అందించనున్నారు.
జనవరి - 25
¤ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, జనసంఘ్‌ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, గాయకుడు భూపేన్‌ హజారికాలకు కేంద్రం ‘భారత రత్న' అవార్డు ప్రకటించింది. ఈ ముగ్గురిలో నానాజీ, భూపేన్‌లకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. నాలుగేళ్ల విరామం తర్వాత కేంద్రం ఈ ఏడాది భారత రత్న ప్రకటించింది. చివరిగా 2015లో మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్‌మోహన్‌ మాలవీయకు ఈ అవార్డు ఇచ్చారు. ఇప్పటి వరకు భారత రత్న అందుకున్నవారి సంఖ్య 48 కి చేరింది. కేంద్ర ప్రభుత్వం 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 11 మంది విదేశీయులతో సహా 112 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో నలుగురు పద్మవిభూషణ్, 14 మంది పద్మభూషణ్, 94 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

పద్మవిభూషణ్‌ విజేతలు
:1) ఇస్మాయిల్‌ ఒమర్‌ గుయెల్లె (డిజిబౌటి అధ్యక్షుడు)
2) తీజన్‌బాయి (జానపద గాయని, ఛత్తీస్‌గఢ్‌)
3) ఏఎం నాయక్‌ (ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్, మహారాష్ట్ర)
4) బల్వంత్‌ మొరేశ్వర్‌ పురందరె (రంగస్థల కళాకారుడు, మహారాష్ట్ర)
పద్మభూషణ్‌కు ఎంపికైనవారు
:1) మోహన్‌లాల్‌ (మలయాళ నటుడు)
2) నంబి నారాయణ్‌ (అంతరిక్ష శాస్త్రవేత్త)
3) కులదీప్‌ నయ్యర్‌ (పాత్రికేయుడు)
4) కరియా ముండా (లోక్‌సభ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎంపీ)
5) హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ (కేంద్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి, భాజపా ఎంపీ)
6) సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా (అకాలీదళ్‌ నేత, మూడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు)
7) మహాశయ్‌ ధర్మపాల్‌ గులాటీ (ఎండీహెచ్‌ మసాలా వ్యవస్థాపకులు, సీఈఓ)
8) బచేంద్రీపాల్‌ (పర్వతారోహకురాలు)
9) వీకే షుంగ్లూ (మాజీ కాగ్‌)
10) జాన్‌ చాంబర్స్‌ (సిస్కో మాజీ అధిపతి)
11) అశోక్‌ లక్ష్మణ్‌రావ్‌ కుకడే (వైద్యసేవ, మహారాష్ట్ర)
12) ప్రవీణ్‌ గోర్ధన్‌ (ప్రజా సంబంధాలు, దక్షిణాఫ్రికా మంత్రి)
13) దర్శన్‌లాల్‌ జైన్‌ (సామాజిక సేవ, హరియాణా)
14) బుధాదిత్య ముఖర్జీ (సితార్‌ కళాకారుడు, పశ్చిమ్‌ బంగ)
పద్మశ్రీ పొందిన ప్రముఖులు
:1) నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు ప్రభుదేవా
2) బాలీవుడ్‌ నటుడు ఖాదర్‌ఖాన్‌ (మరణానంతరం)
3) సిరివెన్నెల సీతారామశాస్త్రి (సినీ గేయ రచయిత)
4) యడ్లపల్లి వెంకటేశ్వరరావు (రైతునేస్తం ఫౌండేషన్‌ స్థాపకుడు)
5) మనోజ్‌ బాజ్‌పాయ్‌ (బాలీవుడ్‌ నటుడు)
6) శివమణి (సంగీతం - డ్రమ్స్‌)
7) శంకర్‌ మహదేవన్‌ (గాయకుడు)
8) శంతను నారాయణ్‌ (అడోబ్‌ సీఈఓ)
పద్మశ్రీ క్రీడాకారులు
:1) జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి (తెలంగాణ)
2) చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్‌)
3) శరత్‌ కమల్‌ (టీటీ)
4) గౌతమ్‌ గంభీర్‌ (క్రికెట్‌)
5) బజ్‌రంగ్‌ పునియా (రెజ్లర్‌)
6) అజయ్‌ ఠాకూర్‌ (కబడ్డీ)
7) బొంబ్యాల దేవి (ఆర్చరీ)
8) ప్రశాంతిసింగ్‌ (బాస్కెట్‌బాల్‌)
రాష్ట్రాల వారీగా అవార్డుల వివరాలు
మహారాష్ట్ర (12), ఉత్తర్‌ ప్రదేశ్‌ (10), దిల్లీ (8), తమిళనాడు (7), గుజరాత్‌ (6), కేరళ, కర్ణాటక, బిహార్, హరియాణాలకు 5 చొప్పున; మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌ 4 చొప్పున; ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్‌ బంగ, జమ్మూ కశ్మీర్‌లకు 3 చొప్పున; హిమాచ్‌లప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు 2 చొప్పున; మణిపూర్, సిక్కిం, త్రిపురలకు 1 చొప్పున లభించాయి.
¤ జాట్‌ రెజిమెంట్‌కి చెందిన మేజర్‌ తుషార్‌ గౌబాను దేశంలోనే రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తిచక్రకు రక్షణ శాఖ ఎంపిక చేసింది. 2018 మేలో జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆ సమయంలో తుషార్‌ తన ప్రాణాలను లెక్కచేయకుండా 20 మీటర్ల దూరం కొండపైకి పాక్కుంటూ వెళ్లి, ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించాడు. 22 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన అశ్వ భటుడు విజయ్‌కుమార్‌ను కూడా ఈ పురస్కారం వరించింది (మరణానంతరం). 2018 ఆగస్టులో బారాముల్లా జిల్లాలో జరిగిన ఆపరేషన్‌ విజయ్‌ దర్సులో పాల్గొన్న విజయ్‌కుమార్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డారు. అయినా వెనుదిరగకుండా ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలను అర్పించారు. విధి నిర్వహణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు విజయ్‌కి కీర్తిచక్ర ప్రకటించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
¤ చెన్నైకి చెందిన ఇండియా నెక్స్ట్‌ అనే స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా పీవీ నరసింహారావు మెమోరియల్‌ నేషనల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 28న దిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
¤ ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ ఎం.మధుసూదన్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వీసులో అసమాన ధైర్యసాహసాలు, విశేష సేవ చేసిన పోలీసులకు ఏటా పురస్కారాలు అందజేస్తారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారి జాబితాను కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 855 మంది పోలీస్‌ సిబ్బందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు.
జనవరి - 28
¤ కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డుకు సీనియర్‌ పాత్రికేయుడు, కవి, ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌ అప్పరసు కృష్ణారావు ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన డోగ్రీ కవయిత్రి పద్మశ్రీ పద్మాసచ్‌దేవ్‌ రాసిన కవితలను ‘గుప్పెడు సూర్యుడు.. మరికొన్ని కవితలు' పేరిట తెలుగులోకి అనువదించినందుకు ఆయనకీ పురస్కారం దక్కింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.