Type Here to Get Search Results !

Jan-2019 నివేదికలు

జనవరి - 9
¤ మన దేశ జనాభాలో 2050 నాటికి అసమతౌల్యం ఏర్పడుతుందని, దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని ఎస్‌బీఐ పరిశోధక నివేదిక వెల్లడించింది. యూపీ, రాజస్థాన్, అసోం, బిహార్, హరియాణాలో మాత్రం యువత ఎక్కువగా ఉండనుంది.¤ దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఒకేఒక్క ఉపాధ్యాయుడు పని చేస్తున్న ప్రాథమిక పాఠశాలలు లక్ష వరకు ఉన్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో సుమారు 12 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిలో 92,275 బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడే పని చేస్తున్నట్లు తేలింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 18,307 ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 5 వ స్థానంలో (7,483), తెలంగాణ 8 వ స్థానంలో (4,587) నిలిచాయి.
జనవరి - 10
¤ 2011-16 మధ్య ఇంటర్నెట్‌ వాడకందార్ల సంఖ్యలో 44 శాతం వార్షిక వృద్ధి నమోదవగా, సైబర్‌ నేరాల సంఖ్య 457 శాతం అధికమైందని అసోచామ్‌ (ది అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా), ఎన్‌ఈసీ సంయుక్త నివేదిక పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత ఇంటర్నెట్‌ వాడకందార్లు అధికంగా ఉన్న దేశం మనదేనని కూడా ఈ నివేదిక వెల్లడించింది.
¤ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత పాస్‌పోర్ట్‌ 79 వ స్థానంలో నిలిచింది. హెన్లీ అండ్‌ పార్టనర్స్‌ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో జపాన్‌ తొలిస్థానంలో నిలిచింది.
జనవరి - 15
¤ తెలంగాణలో 8వ తరగతి చదువుతున్న గ్రామీణ విద్యార్థుల్లో 9.6 శాతం మందికి కనీసం తెలుగు పదాలను కూడా పూర్తిస్థాయిలో చదవడం రావట్లేదని విద్యా వార్షిక నివేదిక-2018 (అసర్‌) వెల్లడించింది. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు ప్రస్తుతం 84.7 శాతంగా ఉంది.
జనవరి - 16
¤ జీవిత బీమా ఏజెంట్లుగా మహిళల సంఖ్య పెరిగిందని భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విడుదల చేసిన 2017-18 వార్షిక నివేదిక పేర్కొంది. అలాగే పాలసీలు తీసుకున్న మహిళల సంఖ్య కూడా పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. మొత్తం 2.82 కోట్ల జీవిత బీమా పాలసీల్లో 90 లక్షల పాలసీలను మహిళలే తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 2017-18లో ప్రతి 10వేల మందిలో 210 మంది పాలసీలు తీసుకున్నారని కూడా వెల్లడించింది. ¤ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన యువతులకు చాలా తక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో నిరుద్యోగిత రేటు 5 రెట్లు అధికంగా ఉందని సొసైటీ ఆఫ్‌ ఉమెన్‌ ఇంజినీర్స్‌ అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలోని సెంటర్‌ ఫర్‌ వర్క్‌ లైఫ్‌ లా భాగస్వామ్యంతో సొసైటీ ఆఫ్‌ ఉమెన్‌ ఇంజినీర్స్‌ ‘వాకింగ్‌ ద టైట్‌ రోప్‌' పేరుతో ఈ నివేదికను రూపొందించింది.
జనవరి - 17
¤ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సామాజిక, విద్యా పరిస్థితుల్లో పురోగతి సాధించాయని అసర్‌ (చిన్నారుల విద్యా ప్రమాణాలపై నిర్వహించే సర్వే) నివేదిక వెల్లడించింది. పక్కా ఇళ్లు, మోటార్‌ సైకిళ్లు, మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, తల్లిదండ్రుల విద్యాభ్యాసాలకు సంబంధించిన గణాంకాలను ఇందులో పేర్కొన్నారు. గడచిన నాలుగేళ్లలో చదువులేని తల్లులు, తండ్రుల సంఖ్య తగ్గింది. పదో తరగతి ఆపైన చదివిన తల్లుల సంఖ్య రెట్టింపైంది. తండ్రులు ఈ విషయంలో వెనకబడ్డారు.¤ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యేటా 1.1 కోట్లమంది అకారణంగా మృత్యువాత పడుతున్నారని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ నివేదిక తెలిపింది. ‘ఈట్‌-లాన్సెట్‌' కమిషన్‌ పేర్కొన్న వివరాలతో ఈ నివేదికను విడుదల చేశారు. 16 దేశాలకు చెందిన 37మంది శాస్త్రసాంకేతిక నిపుణులు మూడేళ్లపాటు పనిచేసి దీన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం అధికమైంది. ఆసియాలో ఇది మరీ ఎక్కువ. 2017-2050 మధ్య ఆసియాలో మాంసం వాడకం 78% పెరుగుతుందని ఏషియా రిసెర్చ్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇటీవల హెచ్చరించింది. ఇది సింగపూర్‌కు చెందిన సంస్థ. మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు 290 కోట్ల టన్నుల నుంచి 540 కోట్ల టన్నులకు పెరుగుతాయి. ఇది 9.5 కోట్ల కార్లు విడుదల చేసే ఉద్గారాలతో సమానం.లాన్సెట్‌ నివేదికలో ముఖ్యాంశాలు: ఆహార అలవాట్లను మార్చుకుంటే ఏటా 19% నుంచి 23% వరకు మరణాలను తప్పించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో వ్యవసాయ పంటలు 40% కాగా దీనికి 70% మంచినీరు ఖర్చవుతోంది. ఇదే సమయంలో విడుదల అవుతున్న ఉద్గారాలు 30 శాతం. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లమంది అవాంఛిత ఆహారం తీసుకుంటున్నారు. 82 కోట్లమంది తగినంత ఆహారం తీసుకోవడం లేదు.¤ నీతి ఆయోగ్‌ ‘నవీన భారత్‌ @75 ' పేరుతో వ్యూహపత్రాన్ని రూపొందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 వసంతాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో నూతన భారత్‌ సృష్టికి పాఠశాల, కళాశాల, ఉపాధ్యాయ విద్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలో సూచిస్తూ నవీన భారత్‌ 75 కోసం అనుసరించాల్సిన వ్యూహపత్రాన్ని నీతి ఆయోగ్‌ ఇటీవల రూపొందించింది. ముఖ్యాంశాలు:
 నాణ్యమైన విద్యా వ్యవస్థ కావాలంటే ఉపాధ్యాయ విద్యను సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఉపాధ్యాయ విద్యలో ప్రవేశానికి కనీస ప్రమాణాలు ఉండాలి. అర్హత పరీక్షలను కఠినంగా మార్చాలి. ఉపాధ్యాయ విద్యను అందించే బీఈడీ, ఎంఈడీ, డీఈడీ కళాశాలలకు న్యాక్‌ తరహా అక్రిడేషన్‌ విధానాన్ని అనుసరించాలి.  ఏటా 2 వేల మందికి ప్రవేశం కల్పించే 5 లేదా 6 జాతీయస్థాయి సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం జీడీపీలో 3 శాతం నిధులను మాత్రమే విద్యకు ఖర్చు చేస్తున్నాం. వీటిని 2022 నాటికి 6 శాతానికి పెంచాలి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి. జీవన నైపుణ్యాలను చదువులో భాగం చేయాలి. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ లాంటి సంస్థలను పునఃనిర్మించాలి లేదా విలీనం చేయాలి. పనితీరు, నాణ్యత ఆధారంగా విద్యాసంస్థలకు నిధులు మంజూరు చేయాలి.  డిగ్రీ స్థాయిలోనే ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించాలి.
జనవరి - 21
¤ మన దేశంలో 2018లో కేవలం 1 శాతం మంది ధనవంతుల సంపద 39 శాతం (రోజుకు రూ.2200 కోట్లు) పెరిగింది. అదే సమయంలో సగం మంది జనాభా సంపద కేవలం 3 శాతం పెరిగింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు ముందు ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. కొన్ని ముఖ్యాంశాలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం వెచ్చించే మొత్తం రూ.2,08,166 కోట్లు. ఇది ముకేశ్‌ అంబానీ సంపద రూ.2.8 లక్షల కోట్ల కంటే తక్కువ. 2018-22 మధ్య దేశంలో రోజుకు 70 మంది కొత్త కుబేరులు తయారవుతారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 11200 కోట్ల డాలర్లు పెరిగింది. ఆయన ఒక్క శాతం సంపద ఇథియోపియా ఆరోగ్య బడ్జెట్‌తో సమానం. భారతదేశంలో 9 మంది కుబేరుల సంపద అట్టడుగున ఉన్న 50% మంది జనాభా సంపదతో సమానం. 2018లో కొత్తగా 18 మంది కుబేరులు కావడంతో దేశంలో వారి సంఖ్య 119కి చేరింది. వీరిలో మహిళలు 9 మంది. 119 మంది అత్యంత సంపన్నుల దగ్గర రూ.28 లక్షల కోట్లు (44000 కోట్ల డాలర్లు. 2017లో ఇది 32500 కోట్ల డాలర్లుగా ఉంది) దేశ జనాభాలో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది 2004 నుంచి అప్పుల్లో మునిగిపోతున్నారు. దేశ జనాభాలో వీరు 10%. సుసంపన్నులైన 1% మంది తమ సంపదపై అదనంగా చెల్లిస్తున్న పన్నులు 0.5 శాతం మాత్రమే. ప్రపంచంలో చెల్లింపులు లేకుండా ఏటా మహిళలు చేస్తున్న పని విలువ: రూ.10 లక్షల కోట్ల డాలర్లు. ఇది యాపిల్‌ కంపెనీ వార్షిక టర్నోవర్‌ కంటే 43 రెట్లు అధికం. ప్రపంచంలో కుబేరుల సంపద 2018లో రోజుకు 12% లేదా 250 కోట్ల డాలర్లు పెరిగితే పేదల సంపద 11% మేర తగ్గింది. ప్రపంచంలో ఉన్న 26 మంది కుబేరుల సంపద 380 కోట్లమంది పేదల వద్ద ఉన్న ధనంతో సమానం. గత ఏడాది ఈ సంపన్నుల సంఖ్య 44.
జనవరి - 27
¤ 2022 నాటికి దేశీయ మీడియా, వినోద పరిశ్రమ 52,683 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.73 లక్షల కోట్లు) స్థాయికి చేరొచ్చని అసోచామ్‌ - పీడబ్ల్యూసీ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.