ఫిబ్రవరి - 2
|
¤ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్) నుంచి రష్యా వైదొలిగింది. ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నందు వల్ల తామూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 2న ప్రకటించారు. స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను నిషేధిస్తూ రూపొందించిన ఐఎన్‌ఎఫ్‌పై 1987లో అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్ సంతకం చేశాయి. ఈ నిబంధనలను రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించిన అమెరికా ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే రష్యా దాన్ని అనుసరించింది.
|
ఫిబ్రవరి - 4
|
¤ లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించడానికి బ్రిటన్ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన ఫైలుపై బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావిద్ ఫిబ్రవరి 4న సంతకం చేశారు.
|
ఫిబ్రవరి - 7
|
¤ అమెరికాలో రెండు దిగ్గజ బ్యాంకులు బీబీఅండ్‌టీ, సన్‌ట్రస్ట్ విలీనానికి ఒప్పందం చేసుకున్నాయి. 66 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.70 లక్షల కోట్ల) ఒప్పందం ద్వారా, అమెరికాలో ఆరోపెద్ద బ్యాంకుగా విలీన బ్యాంకు ఉంటుందని రెండు బ్యాంకులు ప్రకటించాయి. » స్టాక్స్ ఒప్పందం ద్వారా విలీనానికి ఇరు బ్యాంకుల బోర్డులు అంగీకరించాయని తెలిపాయి. విలీన బ్యాంకుకు 442 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31.38 లక్షల కోట్ల) ఆస్తులు, 301 బి.డా. (సుమారు రూ.21.37 లక్షల కోట్ల) రుణాలు, 324 బి.డా. (సుమారు రూ.23 లక్షల కోట్ల) డిపాజిట్లు ఉంటాయని, కోటి మందికి పైగా ఖాతాదార్లకు సేవలందిస్తుందని వెల్లడించాయి. 2019 నాలుగో త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించాయి. » సన్‌ట్రస్ట్ బ్యాంక్ అట్లాంటా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుండగా, బీబీఅండ్‌టీ నార్త్ కరోలినాలోని విన్‌స్టన్ సలెమ్ కేంద్రంగా నడుస్తోంది. » విలీన బ్యాంక్ నార్త్ కరోలినాలోని చార్లొటే కేంద్రంగా, కొత్త పేరు, బ్రాండ్‌పై పనిచేయనుంది. ఇరు సంస్థలకు సమాన వాటా లభిస్తుంది. కార్యనిర్వాహక అధికారులు ఇరు సంస్థల నుంచి సమానంగా నియమితులవుతారు. » 2000 సంవత్సరం తర్వాత అమెరికాలో బ్యాంకుల సంఖ్య 40 శాతం తగ్గిపోయింది.
|
ఫిబ్రవరి - 8
|
¤ బ్రెజిల్‌లో ఫుట్‌బాల్ శిక్షణ క్లబ్ ఫ్లెమింగోలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువ క్రీడాకారులు సహా పదిమంది మృతిచెందారు. » పశ్చిమ రియోలోని వర్జెమ్ గ్రాండ్ జిల్లాలో ఫుట్‌బాల్ శిక్షణకు ప్రసిద్ధిగాంచిన ఫ్లెమింగో శిక్షణ కేంద్రం ఉంది. ప్రముఖ క్రీడాకారులే కాకుండా... వివిధ వయస్సుల క్రీడాకారులు అక్కడ శిక్షణ పొందుతూ ఉంటారు. అక్కడే బస చేస్తున్న 14-17 ఏళ్ల యువ క్రీడాకారుల్లో ఆరుగురు, బృంద సహాయకుల్లో నలుగురు వీటిల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు.
|
ఫిబ్రవరి - 9
|
¤ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో వియత్నాం రాజధాని హనోయిలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
|
ఫిబ్రవరి - 10
|
¤ తమ న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా అమలు చేయనున్నట్లు అబుధబీ న్యాయశాఖ ప్రకటించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అరబిక్, ఆంగ్ల భాషలతోపాటు హిందీలో కూడా న్యాయప్రక్రియలు కొనసాగుతాయని పేర్కొంది.
|
ఫిబ్రవరి - 11
|
¤ థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడానికి యువరాణి ఉబోల్‌రతన అనర్హురాలని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. మాజీ ప్రధాని తక్సిన్ షినవ్రత కుటుంబానికి చెందిన థాయ్ రక్షాచార్త్ పార్టీ ప్రధాని పదవికి తమ అభ్యర్థిగా యువరాణిని ప్రతిపాదించింది. అయితే థాయ్‌లాండ్ రాజు మహా వజ్రాలంగ్‌కోర్న్ (ఉబోల్‌రతన సోదరుడు) జారీ చేసిన రాజాజ్ఞ మేరకు ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
|
ఫిబ్రవరి - 12
|
¤ అమెరికా - మెక్సికో సరిహద్దు పొడవునా గోడ నిర్మాణానికి నిధుల విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ప్రభుత్వం మళ్లీ పాక్షికంగా మూతపడకుండా చూసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది. ¤ భారత్, చైనా లాంటి దేశాల్లో గత 20 ఏళ్లలో పచ్చదనం పెరిగిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఈ వివరాలు ‘నేచర్ సస్టెయినబిలిటీ' జర్నల్‌లో ఫిబ్రవరి 11న ప్రచురితమయ్యాయి. 2000-17 మధ్య ప్రపంచంలో పచ్చదనంపై నాసా ఉపగ్రహాల ద్వారా జరిపిన అధ్యయనంలో పంట భూముల విస్తీర్ణం పెరుగుతున్నట్లు తేలింది. చైనాలో పచ్చదనానికి అడవులు 42 శాతం, పంట భూములు 32 శాతం కారణమైతే, భారత్‌లో అడవులు 4.4 శాతం, పంట భూములు 82 శాతం కారణమని అధ్యయనం పేర్కొంది. 2000తో పోలిస్తే ఈ రెండు దేశాల్లో ఆహారోత్పత్తి 35 శాతం పెరిగింది. 1970, 1980లలో భారత్, చైనాలలో వృక్షజాతి ఎక్కువగా తగ్గింది. 1990లో ఈ సమస్యను గుర్తించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. భారత్, చైనా దేశాలు భూగోళంపై 9 శాతం భూభాగాన్నే కలిగి ఉన్నా వృక్ష సంపదలో అగ్రభాగాన నిలిచాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
¤ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఏసియా ప్రాంతీయ పోటీల్లో భారతీయ విద్యార్థుల బృందం రూపొందించిన ‘సియోలి' స్మార్ట్ మాస్క్ ప్రథమ స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన ఆకాశ్, వాసు కౌశిక్, భరత్ సుందల్ ‘సియోలి' పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీ పొల్యూషన్ అండ్ డ్రగ్ డెలివరీ స్మార్ట్ మాస్క్‌ను తయారు చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలను వెలికితీసేందుకు ఇమాజిన్ కప్ పేరుతో మైక్రోసాఫ్ట్ ఏటా వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తోంది. మొదట ప్రాంతీయ పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచినవారికి తుది పోటీలకు ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు ప్రాంతీయ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి 15 వేల డాలర్లు గెలుచుకున్నారు. ఈ ఏడాది మేలో అమెరికాలో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గెలిస్తే లక్ష డాలర్లు వీరికి సొంతమవుతాయి. ‘సియోలి' జేబులో పట్టే ప్యాకెట్ నెబ్యులైజర్ లాంటి పరికరం. ఇది యాప్ సాయంతో పని చేస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధిగ్రస్తులు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు వీలు కల్పిస్తుంది.
|
ఫిబ్రవరి - 13
|
¤ పట్టణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో విడుదలయ్యే కార్లు, చిన్న తరహా వాణిజ్య వాహనాలకు ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి జపాన్, యూరోపియన్ యూనియన్ నేతృత్వంలోని 40 దేశాలు అంగీకరించాయి. భారత్, అమెరికా, చైనా ఈ 40 దేశాల జాబితాలో లేవు. తొలుత వచ్చే ఏడాది నుంచి జపాన్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ వెల్లడించింది. 2022 కల్లా ఈయూ దేశాలు దీన్ని అమలు చేసేలా కృషి చేస్తామని యూఎన్‌ఈసీఈ అధికార ప్రతినిధి జీన్ రోడ్రిగ్స్ పేర్కొన్నారు.
|
ఫిబ్రవరి - 15
|
¤ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2016 ఎన్నికల్లో అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెక్సికో సరిహదుల్లో గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్లు కావాలని ట్రంప్ పట్టుబట్టారు. దీనికి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో అయిదు వారాలపాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో కాంగ్రెస్ మధ్యే మార్గంగా 1.4 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీన్ని వ్యతిరేకించిన ట్రంప్ అత్యవసర పరిస్థితి విధించాలని నిర్ణయించారు.
|
ఫిబ్రవరి - 18
|
¤ మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అరెస్టయ్యారు. గత ఏడాది సెప్టెంబరులో అధ్యక్ష ఎన్నికలకు ముందు 1.5 మిలియన్ల అమెరికన్ డాలర్లను చట్ట వ్యతిరేకంగా సేకరించినట్లు అభియోగాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.¤ వినికిడి లోపాల నివారణకు పాటించాల్సిన సరికొత్త ప్రమాణాలను, మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ఇటీవల సంయుక్తంగా విడుదల చేశాయి. » ప్రపంచవ్యాప్తంగా 12-35 ఏళ్ల వయస్కుల్లో దాదాపు 50 శాతం మంది (సుమారు 100 కోట్ల మంది) వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. » ప్రపంచ జనాభాలో దాదాపు 5 శాతం మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. వీరిలో 43.2 కోట్ల మంది పెద్దవాళ్లు కాగా, 3.4 కోట్ల మంది పిల్లలు. » వీరిలో అత్యధికులు వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలే. » ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రతి 10 మందిలో ఒకరు వినికిడి లోపంతో బాధపడుతుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ¤ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ - ఇ - పాకిస్థాన్'ను పాకిస్థాన్ ప్రదానం చేసింది. ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనకీ పురస్కారాన్ని అందజేశారు.
|
ఫిబ్రవరి - 19
|
¤ మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు రాబట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ అత్యయిక స్థితి విధించడాన్ని 16 రాష్ట్రాలు కోర్టులో సవాలు చేశాయి. అత్యయిక స్థితి ప్రకటనను అడ్డుకోవాలని న్యాయస్థానానికి విన్నవించాయి. సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం ట్రంప్ 5.7 బిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తుండగా, కాంగ్రెస్ ఇటీవల కేవలం 1.375 బిలియన్ డాలర్లు మంజూరు చేసింది. దీంతో కాంగ్రెస్ అనుమతితో సంబంధం లేకుండా గోడ నిర్మాణంపై మరిన్ని నిధులు వ్యయం చేయడానికి వీలుగా ట్రంప్ ఫిబ్రవరి 15న జాతీయ అత్యయిక స్థితి ప్రకటించారు. దీంతో ట్రంప్ చర్యను తప్పుపడుతూ 16 రాష్ట్రాలు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫిబ్రవరి 18న దావా వేశాయి.
|
ఫిబ్రవరి - 20
|
¤ ప్రాణాంతకమైన తట్టు వ్యాధి (మీజిల్స్) ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. 2018లో 2,29,068 మంది తట్టు బారిన పడగా, 1.36 లక్షల మంది మరణించారు. 2017తో పోలిస్తే ఇది 47% అధికమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
|
ఫిబ్రవరి - 21
|
¤ అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక ప్రగతికి సహకరిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి 2018వ సంవత్సరపు సియోల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బహూకరించిన రెండు లక్షల డాలర్లు (రూ.1.40కోట్లు)ను గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన దక్షిణ కొరియా వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. క్రీస్తుశకం 48వ సంవత్సరంలో కొరియా రాజు కిమ్ సురోను వివాహమాడిన అయోధ్య రాకుమారి సురి రత్న (మహారాణి హుర్ హ్వాంగ్ ఓక్)పై ఇరు దేశాలూ తపాలా బిళ్లను విడుదల చేయాలని నిర్ణయించాయి. ¤ పారిస్‌లో వారం పాటు జరిగిన ‘ఆర్థిక చర్యల కార్యదళం' (ఎఫ్‌ఏటీఎఫ్) ప్లీనరీ ఫిబ్రవరి 22న ముగిసింది. పుల్వామాలో ఉగ్రవాద దాడిని ఎఫ్‌ఏటీఎఫ్ ఖండించింది. ఈ సంస్థ అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందే ఆర్థిక వనరులను గమనిస్తూ ఉంటుంది. తాజాగా జైష్ ఎ మహ్మద్, లష్కరే తొయిబా, జమాతుద్ దవా వంటి ఉగ్రవాద ముఠాలకు నిధులు అందకుండా చూడటంలో విఫలమైన పాకిస్థాన్‌ను ‘గ్రే లిస్ట్'లో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ లిస్ట్‌లో కొనసాగించడం వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరోపా సంఘం వంటి ఆర్థిక సంస్థలు పాక్ స్థాయిని తగ్గిస్తాయి. మూడీస్, ఎస్ అండ్ పీ, ఫిచ్ వంటి సంస్థలు రేటింగ్‌ను తగ్గిస్తాయి.
|
ఫిబ్రవరి - 27
|
¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వియత్నాం రాజధాని హనోయిలో సమావేశమయ్యారు. ఈ భేటీ రెండు రోజులు జరుగుతుంది. వీళ్లిద్దరూ గత ఏడాది సింగపూర్‌లో సమావేశమయ్యారు. ¤ కొండను ఢీకొని హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదంలో నేపాల్ పర్యటక, పౌరవిమానయాన శాఖ మంత్రి రబీంద్ర అధికారి (39) దుర్మరణం పాలయ్యారు. నేపాల్‌లోని పఠిభర ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో ఆరుగురు మరణించారు. ¤ నైజీరియా అధ్యక్షుడిగా ముహమ్మదు బుహారి (76) రెండోసారి ఎన్నికయ్యారు. నైజీరియాలో ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించగా బుహారి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో సైనిక పాలకుడిగా వ్యవహరించిన బుహారి 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా అధ్యక్షుడయ్యారు.
|
ఫిబ్రవరి - 28
|
¤ అణ్వాయుధాల తగ్గింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య హనోయిలో మొదలైన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఎలాంటి ఒప్పందం కుదరలేదని శ్వేత సౌధం ప్రకటించింది.
|
|
|