Type Here to Get Search Results !

Feb-2019 జాతీయం

ఫిబ్రవరి - 3
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 3న జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. లద్దాఖ్‌లో తొలి విశ్వవిద్యాలయాన్ని, దాల్‌ సరస్సు ఒడ్డున తొలి బీపీఓ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. విజయ్‌పుర్‌లో ఎయిమ్స్‌తోపాటు ఇతర పనులకు శంకుస్థాపన చేశారు.
ఫిబ్రవరి - 7
¤ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ప్రయాణించే ‘ఎయిర్‌ ఇండియా వన్‌' విమానాలకు రెండు అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థల విక్రయానికి అమెరికా అంగీకరించింది. దీనివల్ల ఆ లోహ విహంగాల భద్రత మరింత కట్టుదిట్టమవుతుంది. ఈ విక్రయం వల్ల భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతమవుతుందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్‌' పేర్కొంది.
           » లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్స్‌ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ స్వీట్స్‌ (ఎస్‌పీఎస్‌) అనే ఈ వ్యవస్థలను 19 కోట్ల డాలర్లతో భారత్‌ కొనుగోలు చేయనుంది. ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి తీవ్రస్థాయిలో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రెండు వ్యవస్థలను సరఫరా చేయాలని భారత ప్రభుత్వం ఇటీవల అమెరికాకు విజ్ఞప్తి చేసింది. వీటి వల్ల అమెరికా అధ్యక్షుడి అధికార విమానం ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌' తరహా భద్రతా వ్యవస్థలు ‘ఎయిర్‌ ఇండియా వన్‌'లోనూ ఉంటాయి
.
           » భారత్‌ను ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించింది. స్ట్రాటజిక్‌ ట్రేడ్‌ ఆథరైజేషన్‌ (ఎస్‌టీఏ-1) హోదా కూడా ఇచ్చింది. రెండు దేశాలు ‘కమ్యూనికేషన్స్‌ కంపాటబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌' (సీవోఎంసీఏఎస్‌ఏ) ఒప్పందంపై సంతకాలు చేశాయి. వీటివల్ల రెండు దేశాల సైన్యాల మధ్య మరింత సమన్వయం, అధునాతన పరిజ్ఞాన విక్రయానికి వీలు కలుగుతోంది
.
¤ ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలోని బైరాంగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు
.
¤ చిన్న, సన్నకారు రైతులకు పూచీకత్తు లేకుండా రూ.1.6 లక్షల రుణాన్ని ఇవ్వనున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది
.
           » ఇంతవరకు రూ.లక్ష రుణం ఇస్తుండగా, ఆ పరిమితిని మరో రూ.60 వేలకు పెంచింది. 2010లో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంతవరకు రైతులకు రూ.లక్ష వ్యవసాయ రుణం మంజూరు చేస్తోంది. ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రుణ మొత్తాన్ని కూడా పెంచింది
.
           » పూచీకత్తు అడగకుండా రైతులకివ్వాల్సిన రుణ పరిమితిని రిజర్వుబ్యాంకు పెంచడంతో తెలంగాణలో దాదాపు 30 శాతం మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో ప్రస్తుతం ఎకరా విస్తీర్ణంలో వరి సాగుకు రూ.34 వేలను రుణంగా ఇవ్వాలని రుణపరిమితి ఉంది. దీని ప్రకారం మూడెకరాల్లో వరి వేస్తే గరిష్ఠంగా రూ.1.02 లక్షల రుణం వస్తుంది. రైతుకున్న పాతబాకీలను లెక్కచూసి ఈ రుణ పరిమితిలో కొంతమేర ఇస్తుంటారు. 2010 నుంచి రూ.లక్ష వరకూ పూచీకత్తు అడగకూడదనే నిబంధన ఉంది. తెలంగాణలో మూడెకరాలకు పైగా భూమి ఉన్న 14.81 లక్షలమంది రైతులు రూ.1.60 లక్షల రుణం పొందడానికి అవకాశముందని అంచనా
.
¤ న్యాయస్థానాలు ఆదేశించిన పక్షంలో రాష్ట్రాల్లో సీబీఐ విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అక్కర్లేదని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల సాధారణ సమ్మతి కూడా అవసరం లేదని పేర్కొంది.
ఫిబ్రవరి - 8
¤ రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తుల సంస్థ (ఎఫ్‌పీవో)ల ఏర్పాటును నాబార్డు, కేంద్ర వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నాయి.
           » కంపెనీల చట్టం కింద నమోదయ్యే ఈ సంస్థల్లో పంటలు పండించే, పాడి రైతులే భాగస్వాములు, యజమానులు. వారి ఉత్పత్తులను వారే నేరుగా అమ్మవచ్చు, ఇతర రైతుల నుంచి కొనవచ్చు. పంటలు పండించడంతో ఆగకుండా వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి సొంత ‘బ్రాండు'తో విపణిలో విక్రయించుకోవచ్చు
.
           » పాడి పశువులు, పంటలు, పండ్ల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో ఆదాయాన్ని పెంచుకోవచ్చంటూ సరికొత్త మార్గాన్ని రైతులకు ఈ సంస్థలు చూపుతున్నాయి
.
           » రైతుల ఉత్పత్తుల సంస్థల ఏర్పాటు, పర్యవేక్షణకు కేంద్ర వ్యవసాయశాఖలో ప్రత్యేకంగా ‘చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కూటమి'(ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటయ్యింది. 800 నుంచి 1000 మంది వరకూ రైతులు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 783 ఎఫ్‌పీవోల్లో 8 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు సభ్యులుగా చేరారు
.
ఎఫ్‌పీవోల పనితీరు           » ప్రతి 10-12 గ్రామాలకు కలిపి ఒక ఎఫ్‌పీవో ఉంటుంది. దాని పరిధిలో ప్రతి గ్రామంలో 15-20 మంది రైతులతో ‘రైతుల ఆసక్తి సంఘం' (ఎఫ్‌ఐజీ) ఏర్పాటవుతుంది. పంటరుణాలు, సాగుకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలన్నీ ఎఫ్‌పీవో సమకూరుస్తుంది
.
           » గ్రామంలో ఏ పంటను ఎవరు సాగుచేయాలి, విత్తనోత్పత్తి, పరస్పర సమాచార మార్పిడి వంటివన్నీ ఎఫ్‌ఐజీ స్థాయిలో జరుగుతాయి. గుజరాత్‌లో ‘గుజ్‌ప్రో', మధ్యప్రదేశ్‌లో ‘మధ్యభారత్‌' వంటి బ్రాండ్లలో అక్కడి ఎఫ్‌పీవోలు రైతులకు సేవలందిస్తున్నాయి
.
           » ఎఫ్‌పీవో ఏర్పాటుకు రూ.15 లక్షల వరకూ ఎస్‌ఎఫ్‌ఏసీ సమకూర్చుతుంది. అంతే మొత్తాన్ని రైతులు తమ వాటాగా పెట్టాలి. రైతులు ఎంతవాటా ఇవ్వగలిగితే ఎస్‌ఎఫ్‌ఏసీ అంతే మొత్తాన్ని ఇస్తుంది. దీంతో పాటు బ్యాంకు నుంచి రూ.కోటి వరకూ రుణం ఇప్పించడానికి పూచీకత్తు ఇస్తుంది
.
¤ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్‌ అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించిన చట్టం చెల్లుబాటును మాత్రం పరిశీలిస్తామని స్పష్టం చేసింది
.
           » ఈ చట్టం ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు ఉద్దేశించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా కాంగ్రెస్‌ మద్దతుదారు, వ్యాపారవేత్త తహ్‌సీన్‌ పూనావాలా కూడా ఈ కోటా అమలును నిలిపివేయాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది
.
¤ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 40 నదులను పునరుజ్జీవింపజేసినందుకుగాను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-2019లో చోటు దక్కింది
.
           » కరవు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల కారణంగా 5 వేలకు పైగా గ్రామాల్లోని 49.9 లక్షల ప్రజలకు నీటి వసతి కలిగింది. 2013 జనవరిలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ స్వచ్ఛంద సంస్థ నాలుగు రాష్ట్రాల్లోని (కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా) నదీ పరివాహక ప్రాంతాల్లో 40కి పైగా నదులు, వాగులను, 9 నదీ పరివాహక ప్రాంతాల్లోని 26 సరస్సులను పునరుజ్జీవింపచేసే కార్యక్రమం చేపట్టింది
.
¤ లద్దాఖ్‌ ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడింది. ఇంతకముందు కశ్మీర్‌ డివిజన్‌లో భాగంగా ఉండేది
.
           » మిగతా డివిజన్‌ల మాదిరే లద్దాఖ్‌కు ప్రత్యేక డివిజినల్‌ కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీ), వారికి పూర్తిస్థాయి సిబ్బంది ఉంటారు. కార్గిల్, లేహ్‌ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. లేహ్‌ కేంద్రంగా ఈ డివిజన్‌ ఉంటుంది. ఈ డివిజన్‌ ఆవిర్భావంతో ‘లద్దాఖ్‌ స్వతంత్ర పర్వతాభివృద్ధి మండళ్ల (ఎల్‌ఏహెచ్‌డీసీ)' చిరకాల డిమాండ్‌ తీరింది.
ఫిబ్రవరి - 9
¤ ప్రధాని నరేంద్ర మోదీ అసోం, అరుణాచల్‌ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ.4 వేల కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఫిబ్రవరి - 10
¤ అమెరికా నుంచి నాలుగు భారీ షినూక్‌ సైనిక హెలికాప్టర్లు గుజరాత్‌లోని ముంద్రా రేవుకు చేరుకున్నాయి. వీటిని చండీగఢ్‌లోని వైమానిక స్థావరానికి తరలించనున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఇవి వైమానిక దళంలోకి చేరనున్నాయి.
¤ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించారు. చెన్నైలోని 470 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని, బీపీసీఎల్‌కు చెందిన ఎన్నోర్‌ కోస్తా టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తిరుప్పూరు వచ్చిన మోదీ ఇక్కడి పెరుమానల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చెన్నై విమానాశ్రయం నుంచి మనాలి చమురుశుద్ధి కర్మాగారం వరకు ఏర్పాటు చేసిన ముడి చమురు పైప్‌లైన్‌ను, భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. తిరుచ్చి విమానాశ్రయంలో నూతన సమీకృత భవన నిర్మాణం, చెన్నై విమానాశ్రయ ఆధునికీకరణ పనులకు తిరుపూర్‌ నుంచే శంకుస్థాపన చేశారు. కర్ణాటకలోని ధార్వాడలో నిర్మించనున్న ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీలకు శంకుస్థాపన చేశారు. తర్వాత మంగళూరు రేవులోని 1.5 మిలియన్‌ టన్నుల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను జాతికి అంకితం చేశారు.
           » ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖపట్నంలో రూ.1178 కోట్లతో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్‌ టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ఠ, ఎస్‌1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును రిమోట్‌ ద్వారా ప్రారంభించారు.
ఫిబ్రవరి - 11
¤ అసోం కవి, గాయకుడు భూపేన్‌ హజారికా కుటుంబం భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించింది. కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హజారికా తనయుడు తేజ్‌ హజారికా పేర్కొన్నారు. 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తూ కేంద్రం రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ 2019 జనవరి 8న ఆమోదô తెలిపింది.
¤ లఖ్‌నవూలోని బృందావనంలో అక్షయపాత్ర సంస్థ నిర్వహించిన ‘థర్డ్‌ మిలియన్‌ మీల్‌' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
¤ ప్రవాస భారతీయులు భారత్‌కు చెందిన మహిళను లేదా విదేశాల్లో తమ సహచర ఎన్‌ఆర్‌ఐలను వివాహం చేసుకున్న 30 రోజుల్లోపు దాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోతే వారి పాస్‌పోర్ట్‌ను జప్తు/ రద్దు చేస్తారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఎన్‌ఆర్‌ఐల వివాహ రిజిస్ట్రేషన్‌ బిల్లు - 2019ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రవాస భారతీయులు వివాహం పేరుతో మహిళలను మోసం చేస్తున్న కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టేందుకు కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం పాస్‌పోర్ట్‌ చట్టాన్ని, నేర శిక్షాస్మృతిని కూడా సవరించనున్నారు. దీని ప్రకారం దోషులుగా తేలినవారు చట్టం ముందు లొంగిపోకపోతే వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టులకు లభిస్తుంది. కోర్టులు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా నిందితులకు వారెంట్లు, సమన్లు జారీ చేస్తాయి.
¤ దిల్లీలోని ఇండియా హేబిట్‌ సెంటర్ లో 3 రోజులపాటు జరగనున్న ‘వరల్డ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సమిట్‌ - 2019'ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
ఫిబ్రవరి - 12
¤ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని కురుక్షేత్రలో ‘స్వచ్ఛశక్తి - 2019' పురస్కారాలను ప్రదానం చేశారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ మహిళల నాయకత్వ పాత్రను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ సుందర శౌచాలయ్‌ జాతీయ పోటీల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లి ప్రథమస్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ గ్రామ సర్పంచ్‌ ఎం.భాగ్యలక్ష్మి అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
¤ హరియాణాలోని ఝజ్జర్‌లో నిర్మించిన జాతీయ క్యాన్సర్‌ కేంద్రాన్ని ప్రధానమంత్రి మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఫరీదాబాద్‌లో నిర్మించిన తొలి ఈఎస్‌ఐ ఆస్పత్రి (ఇది ఉత్తర భారత్‌లోనే మొదటిది), వైద్య కళాశాలను ప్రారంభించారు. పంచకులలో నిర్మించే జాతీయ ఆయుర్వేద సంస్థ, కురుక్షేత్రలో నిర్మించే శ్రీకృష్ణ ఆయుష్‌ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు.
¤ అధునాతన 7.62 ఎంఎం అసాల్ట్‌ రైఫిళ్లను కొనుగోలు చేయడానికి మన దేశం అమెరికాకు చెందిన సిగ్‌ సావర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు రూ.700 కోట్లు వెచ్చించి 72,400 రైఫిళ్లను సమకూర్చుకోనుంది.
¤ బోగస్‌ పొదుపు పథకాలతో (పోంజీ స్కీములు) సామాన్య మదుపుదార్లు మోసపోకుండా చూడటానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి - 13
¤ రాజస్థాన్‌ ప్రభుత్వం గుజ్జర్లతోపాటు బంజారా, గాడియా లొహార్, రైకా, గడారియా లాంటి కులాలకు 5% రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించింది. వెనకబడిన కులాలకు రిజర్వేషన్లలను 21 నుంచి 26 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రి బీడీ కల్లా ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు.¤ కుల, మతాల పట్టింపు లేని తొలి భారతీయ మహిళగా తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన స్నేహ ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఈమె చిన్నప్పటి నుంచి తన విద్యార్హత సర్టిఫికెట్లలో కుల, మతాలను నమోదు చేయలేదు. ఈ క్రమంలో ఆమె తాను ఏ కులానికి, మతానికి చెందినదాన్ని కాదని సర్టిఫికెట్‌ జారీ చేయాలని దరఖాస్తు చేసుకోగా, తిరుపత్తూరు తహశీల్దార్‌ దాన్ని మంజూరు చేశారు. ¤ పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడటంతో ప్రస్తుతం రాజ్యసభ ముందున్న ట్రిపుల్‌ తలాక్, పౌరసత్వ బిల్లులు మురిగిపోనున్నాయి. కుష్టు వ్యాధి కారణంగా విడాకులివ్వడాన్ని నిషేధించే బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఫిబ్రవరి - 14
¤ శ్రీనగర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని జైష్‌ ఎ మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి 2547 మంది జవాన్లు 78 వాహనాల్లో శ్రీనగర్‌కు బయలుదేరగా, అదిల్‌ అహ్మద్‌ దార్‌ అనే ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనంతో జవాన్ల వాహనాన్ని ఢీకొన్నాడు. శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో అవంతిపురంలోని లాతూమోడె వద్ద ఈ దాడి జరిగింది. ¤ వి.వి.గిరి నేషనల్‌ లేబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫెలో అనూప్‌ చౌదరి అధ్యక్షతన ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ జాతీయస్థాయిలో ప్రాంతాలవారీగా అమలు చేయాల్సిన కనీస వేతనాలపై కార్మికశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించింది. జాతీయస్థాయిలో సగటు కనీస వేతనం రోజుకు రూ.375, నెలకు రూ.9,750 ఉండాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌లను రీజియన్‌-2 కింద పరిగణించి రోజుకు రూ.380 కనీస వేతనం ఉండాలని సూచించింది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడును రీజియన్‌-3 కింద గుర్తించిన కమిటీ అక్కడ రోజుకు రూ.414, నెలకు రూ.10,764 వేతనాన్ని నిర్ధరించింది. ప్రజాభిప్రాయం కోసం కేంద్ర కార్మికశాఖ ఈ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచింది. తెలుగు రాష్ట్రాల్లో తలసరి నెలవారీ ఆహారం, ఆహారేతర అవసరాల కోసం రూ.1,806, ఇంటి ఖర్చుల కోసం రూ.6,503 అవుతుందని లెక్కించి నెలవారీ కనీస వేతనం రూ.9,885.2గా, రోజువారీ వేతనం రూ.380.2గా ఉండాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దేశంలోని భౌగోళిక విభిన్నతలను దృష్టిలో ఉంచుకుని 5 ప్రాంతాలుగా విభజించి, అయిదు వేర్వేరు కనీస వేతనాలను నిర్ధరించింది.
ఫిబ్రవరి - 15
¤ పాకిస్థాన్‌కు అత్యంత ప్రాధాన్య దేశం (మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ - ఎంఎఫ్‌ఎన్‌) హోదాను ఉపసంహరించాలని భారత్‌ నిర్ణయించింది. పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పాక్‌ నుంచి దిగుమతి చేసుకునే సరకులపై కస్టమ్స్‌ సుంకాలను గణనీయంగా పెంచడం, రేవుల వద్ద ఆంక్షలు, కొన్ని సరకులపై నిషేధం లాంటి చర్యలు చేపడతారు. ఫలితంగా మన దేశానికి పాకిస్థాన్‌ ఎగుమతి చేసే 48.85 కోట్ల డాలర్ల (రూ.3,482.3 కోట్లు) విలువైన సరకులపై ప్రభావం పడనుంది.
¤ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆ పదవికి ఎన్నికైన తర్వాత ఏడాదిన్నర కాలంలో వివిధ సందర్భాల్లో చేసిన 400కు పైగా ప్రసంగాల నుంచి 92 ఉపన్యాసాలను సేకరించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ ‘ఎంపిక చేసిన ఉపన్యాసాలు' (సెలెక్టెడ్‌ స్పీచెస్‌) పేరుతో తొలి సంకలనాన్ని ముద్రించింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలో ఆవిష్కరించారు.
¤ దేశంలో తొలి సెమీ-హైస్పీడ్‌ రైలు ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ప్రారంభించారు. దిల్లీ - వారణాసి మధ్య తొలి ప్రయాణాన్ని దిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.
¤ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) స్వచ్ఛత ఎక్సలెన్సీ పురస్కారాన్ని దక్కించుకుంది. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డీఎస్‌ మిశ్రా చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో జీహెచ్‌ఎంసీకే ఈ పురస్కారం దక్కింది.
ఫిబ్రవరి - 16
¤ మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అజ్ని-పుణె హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు.
ఫిబ్రవరి - 17
¤ మైసూరు సమీపంలోని టి.నరసీపుర పట్టణం వద్ద త్రివేణి సంగమంలో (కావేరి, కపిల, స్పటిక) కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 17 నుంచి 3 రోజులపాటు జరగనుంది. ఇది దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది. ప్రతి మూడేళ్లకోసారి దీన్ని నిర్వహిస్తారు.
ఫిబ్రవరి - 18
¤ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇకపై 112 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఈ సమీకృత మద్దతు వ్యవస్థ ఫిబ్రవరి 19 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తుంది. అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థలో (ఈఆర్‌ఎస్‌ఎస్‌) భాగంగా అత్యవసర స్పందన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
¤
 అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మక్రి నేతృత్వంలో భారతదేశ పర్యటనకు వచ్చిన బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రక్షణ, అణు ఇంధనం, పర్యటకం, సమాచార సాంకేతికత, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. అణు సరఫరాదారుల బృందంలో (ఎన్‌ఎస్‌జీ) భారత్‌ సభ్యత్వానికి అర్జెంటీనా పూర్తి మద్దతిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.¤ సాంస్కృతిక సామరస్యానికి ఇచ్చే ఠాగూర్‌ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా దిల్లీలో జరిగింది. అవార్డు గ్రహీతలు: మణిపురి నృత్య దర్శకుడు రాజ్‌కుమార్‌ సింఘజిత్‌ సింగ్‌ (2014), బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ చాయనౌత్‌ (2015), ప్రముఖ శిల్పి రామ్‌వంజి సుతార్‌ (2016). ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ¤ పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణిపై దాడికి సూత్రధారులు, జైష్‌ ఎ మహ్మద్‌ కమాండర్లు అయిన అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఘాజీ, కమ్రాన్‌తోపాటు ఉగ్రవాది హిలాల్‌ను భారత సైన్యం తుదముట్టించింది. పింగ్లాన్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్‌ హోదా అధికారి సహా నలుగురు సైనికులు, ఒక పోలీసు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. జైష్‌ ఎ మహ్మద్‌ అధిపతి మౌలానా మసూద్‌ అజార్‌కు ఘాజీ, కమ్రాన్‌ అత్యంత సన్నిహితులు. భారత జవాన్లపై జరిగిన దాడిలో ఆత్మాహుతి బాంబర్‌గా వ్యవహరించిన అదిల్‌ అహ్మద్‌ దార్‌ను కమ్రాన్‌ రిక్రూట్‌ చేశాడు.
ఫిబ్రవరి - 19
¤ డీజిల్‌ ఇంజిన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చిన మొట్టమొదటి రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 19న వారణాసిలో జెండా ఊపి ప్రారంభించారు. డీజిల్‌ ఇంజిన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌గా మార్చడం భారత్‌లో ఇదే తొలిసారి. బ్రాడ్‌ గేజ్‌ విభాగంలోని రైళ్లన్నింటినీ ఎలక్ట్రిక్‌గా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. 2017 డిసెంబరు 22న ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం 69 రోజుల్లో పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రఖ్యాత భక్తి ఉద్యమ గురు, సంత్‌ రవిదాస్‌ జయంత్యుత్సవం సందర్భంగా ఆయన జన్మస్థలి ప్రాంత అభివృద్ధి పథకానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.¤ ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ బెనారస్‌ రూపొందించిన ‘పరమ్‌ శివాయ్‌' అనే సూపర్‌ కంప్యూటర్‌ను ఫిబ్రవరి 19న ప్రారంభించారు. 833 టెరాఫ్లాప్‌ కెపాసిటీతో ఉన్న ఈ కంప్యూటర్‌ నిర్మాణానికి రూ.32.5 కోట్లు ఖర్చయ్యాయి. బీహెచ్‌యూ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పోస్టల్‌ స్టాంపు, పోస్టల్‌ స్టాంప్‌ ఆల్బమ్‌ను మోదీ విడుదల చేశారు. ఈ కంప్యూటర్‌లో 40 శాతం సామర్థ్యాన్ని నవోదయ విద్యాలయ విద్యార్థులు ఉపయోగించనున్నారు. పరమ్‌ శివాయ్‌లో 1 పెటా బైట్‌ సెకండరీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంది. భారత్‌కు చెందిన మొదటి సూపర్‌ కంప్యూర్‌ పరమ్‌ 8000 ను 1991లో ప్రారంభించారు. ప్రస్తుతం మనదేశం వద్ద ప్రత్యూష్, మిహిర్, సెర్క్‌-క్రే వంటి సూపర్‌ కంప్యూటర్లు ఉన్నాయి.¤ హిస్సార్‌లోని గురు జంబేశ్వర్‌ విశ్వవిద్యాలయంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీశ్రీ రవిశంకర్‌ సారథ్యంలో ఫిబ్రవరి 19న జరిగిన ‘మాదకద్రవ్యాల రహిత భారత్‌' కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ రెండురోజుల పాటు చండీగఢ్, హిస్సార్‌లలో నిర్వహించిన మాదకద్రవ్యాల రహిత భారత్‌ కార్యక్రమంలో 60 వేల మంది ప్రత్యక్షంగా, కోటి మంది అంతర్జాలం ద్వారా పాల్గొని, మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా పనిచేస్తామంటూ ప్రతినబూనారు.
ఫిబ్రవరి - 20
¤ తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌కు సంబంధించి పూర్తిస్థాయి నిర్వహణ అనుమతి (ఎఫ్‌ఓసీ) ధ్రువీకరణ పత్రాన్ని ఐఏఎఫ్‌కు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అందజేసింది. తేజస్‌ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేసింది. ఇందులో ఒకే సీటు, ఒకే జెట్‌ ఇంజిన్‌ ఉంటాయి. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్‌ యుద్ధ సూట్లతోపాటు పలు రకాల బాంబులు - ఆయుధాలు ఉండటం తేజస్‌ ప్రత్యేకత.¤ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ‘ఏరో ఇండియా - 2019' ప్రదర్శన ప్రారంభమైంది. రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు సురేశ్‌ ప్రభు, సదానంద గౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ప్రదర్శనను ఆరంభించారు (ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుంది). ఎల్‌సీహెచ్, హెచ్‌ఏఎల్‌ తేజస్, యూఎస్‌ఏఎఫ్‌ బీ-52, రఫేల్, ఫాల్కన్‌ 2000 ఎస్, ఎఫ్‌ఏ - 18 సూపర్‌ హార్నెట్‌లు విన్యాసాల్లో పాల్గొన్నాయి.
ఫిబ్రవరి - 21
¤ భారత స్టాంపుల చట్టం, 1899లో మార్పులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. పన్నుల ఎగవేత నిరోధానికి, స్టాంపు సుంకం విధానం హేతుబద్ధీకరణకు ఇది దోహదపడుతుంది.¤ ఇంగ్లండ్‌కు చెందిన రక్షణ ఉత్పత్తి సంస్థ ‘లాక్‌హీడ్‌ మార్టిన్‌' ఎఫ్‌-21 ఫైటర్‌ జెట్‌ను తయారు చేయడానికి మన దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో ఐఏఎఫ్‌ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ జెట్‌ను భారత్‌లో తయారు చేయనున్నారు.
ఫిబ్రవరి - 26
¤ పాకిస్థాన్‌లోని బాలాకోట్‌ పట్టణానికి చేరువలో ఉన్న జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) దాడి జరిపింది. మిరాజ్‌ - 2000, సుఖోయ్‌ - 30 ఎంకేఐ, నేత్ర ఈ దాడిలో పాల్గొన్నాయి.
¤ దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2015, 2016, 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన గాంధీ శాంతి బహుమతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రదానం చేశారు. కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర (2015), అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్‌ ఇంటర్నేషనల్‌ (2016), ఏకల్‌ అభియాన్‌ ట్రస్ట్‌ (2017), యోహి శసకవా (2018)లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
¤ ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ దిల్లీలోని ఇస్కాన్‌ మందిరంలో 670 పేజీలు, 800 కిలోలున్న భారీ భగవద్గీతను ఆవిష్కరించారు.
ఫిబ్రవరి - 27
¤ ఇండియా నెక్స్ట్‌ సంస్థ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 సంవత్సరానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రదానం చేసింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును మన్మోహన్‌కు అందించారు.¤ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టల్‌) రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఇందులో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు, వాల్తేరులో కొంతభాగం ఉంటాయి. వాల్తేర్‌లో మిగిలిన భాగంతో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో రాయగఢ డివిజన్‌ ఏర్పాటు చేస్తామని, దక్షిణ మధ్య రైల్వే ఇకపై హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్లతో కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.¤ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో ఇండియా మొబైల్‌ యాప్‌ను న్యూదిల్లీలో ఆవిష్కరించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఈ యాప్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించింది. ఎంచుకున్న క్రీడలో శిక్షణ కేంద్రం, కోచ్‌లు, ఇతర సిబ్బంది ఫోన్‌ నెంబర్లు తదితర విషయాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో క్రీడామంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ పాల్గొన్నారు.¤ దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన ‘నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌ - 2019'లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఫిబ్రవరి - 28
¤ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు చీటీతోపాటు నిర్దేశిత 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చూపించాల్సిన కార్డులు ఇవే: ఓటరు గుర్తింపు కార్డు/ పాస్‌పోర్టు; డ్రైవింగ్‌ లైసెన్సు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డులు; బ్యాంకు/పోస్ట్‌ ఆఫీసు జారీచేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, పాన్‌కార్డు, జాతీయ జనాభా రిజిస్ట్రార్‌ జారీచేసిన స్మార్ట్‌కార్డు; ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు; కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌కార్డు; ఫొటోతో కూడిన పెన్షన్‌ పత్రం; ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు; ఆధార్‌కార్డు¤ 500కు పైగా బస్సులతో అతిపెద్ద వాహన శ్రేణిని ఏర్పాటు చేసి ఉత్తర్‌ ప్రదేశ్‌ ఆర్టీసీ గిన్నిస్‌ రికార్డులకెక్కింది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా చిహ్నాలతో ఉన్న 500కు పైగా ఆర్టీసీ బస్సులు ఒకేసారి ప్రయాణించాయి. ఈ వాహన శ్రేణి పొడవు 3.2 కిలోమీటర్లు. ¤ జమ్మూ కశ్మీర్‌లో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ¤ జమ్మూ కశ్మీర్‌లో జాతి వ్యతిరేక, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాతే ఇస్లామీ సంస్థను కేంద్ర ప్రభుత్వం అయిదేళ్లపాటు నిషేధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.¤ దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ విజేతలకు అవార్డులు అందించారు. వైద్య రంగంలో చేసిన కృషికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ నియాజ్‌ అహ్మద్‌కు 2016 సంవత్సరానికి శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం లభించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.