ఫిబ్రవరి - 2
|
రాష్ట్రీయం (టీఎస్)¤ తెలంగాణలోని 20 జిల్లాల్లో భూగర్భజలమట్టం మరింత లోతుకు పడిపోయింది. 2018 జనవరితో పోలిస్తే, గత నెలలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 7.49 మీటరల అదనపు తగ్గుదల నమోదైందని భూగర్భజలశాఖ ఫిబ్రవరి 2న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత జూన్ నుంచి జనవరి వరకు మొత్తం 16 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుంచి 45 శాతం వరకు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు 11.91 మీటర్ల లోతున నీరుంది.
|
ఫిబ్రవరి - 3
|
రాష్ట్రీయం (ఏపీ)¤ అమరావతిలోని నేలపాడు వద్ద నిర్మించిన రాష్ట్ర హైకోర్టు (తాత్కాలిక) భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. సమీపంలోని హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.ఎన్. రాధాకృష్ణన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రీయం (టీఎస్)¤ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న నిర్వహించిన మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది (ఒకేరోజు 4,578 మందికి పరీక్షలు జరిపారు) ప్రపంచ క్యానర్ దినం సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, కలెక్టివ్ పవర్ ఆఫ్ వన్ అమెరికా సహకారంతో డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎం. రాంకిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు.
|
ఫిబ్రవరి - 4
|
రాష్ట్రీయం (టీఎస్)¤ మేలైన పట్టు (బైఓల్టిన్ రకం) ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఫిబ్రవరి 9న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘సర్జింగ్ సిల్క్' పేరుతో నిర్వహించే ప్రదర్శన, సదస్సులో తెలంగాణ రాష్ట్ర పట్టుశాఖకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.¤ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీ గిరిజనులు జరుపుకునే నాగోబా జాతర ఫిబ్రవరి 4న ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణలో సమ్మక్క - సారక్క (మేడారం) జాతర తర్వాత ఇదే పెద్దది. రాష్ట్రీయం (ఏపీ)¤ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) పథకానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 53 గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, ఇతర వసతుల కోసం కేంద్రం రూ.21 లక్షల చొప్పున కేటాయిస్తుంది.
|
ఫిబ్రవరి - 7
|
రాష్ట్రీయం (టీఎస్)¤ రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. » జగిత్యాల జిల్లా కోరుట్ల కేంద్రంగా డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మెట్‌పల్లి డివిజన్‌లో ఉన్న కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలను కోరుట్ల డివిజన్‌లో చేర్చుతూ ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నం.47) జారీచేశారు. మెట్‌పల్లి డివిజన్‌లో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలాలు మిగిలాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ జీవో ఆర్‌టీ నం.46 జారీచేశారు. » నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్‌లో తొమ్మిది మండలాలు ఉండగా కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెళ్లి మండలాలను వేరుచేసి కొత్త డివిజన్‌లో చేర్చారు. » రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 69 నుంచి 71కి చేరుకుంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 38గా ఉన్న డివిజన్లను 2016లో ప్రభుత్వం 68కి విస్తరించింది. అనంతరం మరో డివిజన్, తాజాగా రెండు డివిజన్లను ఏర్పాటు చేసింది.
¤ తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల కింద మూతపడిన సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లు(ఎస్పీఎం)లోను పున: ప్రారంభించింది. » సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ పవన్‌కుమార్ సూరి, ఎస్పీఎం ప్రతినిధులు ప్రత్యేక మిల్లులోని ఏడో కాగితం ఉత్పత్తి చేసే యంత్రాన్ని ప్రారంభించారు. » నిజాం హయాంలో 1932లో కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో స్థాపించిన మిల్లు నాలుగేళ్ల క్రితం మిల్లు యాజమాన్య వైఖరి, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో మూతపడింది.
¤ హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఓడీఎఫ్ ++ హోదా పొందిన రెండో మహానగరంగా వరంగల్ రికార్డు నెలకొల్పింది. » బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత నగరంగా స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించింది. » స్వచ్ఛభారత్ మిషన్ థర్డ్ పార్టీ పర్యవేక్షణ జనవరి 18, 19 తేదీల్లో జరిగింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లోని కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, అమ్మవారిపేటలో మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ (శానిటేషన్ రిసోర్స్‌పార్క్) నిర్వహణ అత్యద్భుతంగా చేపడుతున్నారని థర్డ్‌పార్టీ పరిశీలనలో తేలింది. వరంగల్ మహానగరంలో 43 పబ్లిక్ టాయిలెట్లు ఉండగా, ఇందులో 28 ప్రాంతాల్లోని పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించి.. 13 పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్లకు స్వచ్ఛభారత్ మిషన్ గ్రేడింగ్ ఇచ్చింది. » అందులో పోచమ్మమైదాన్, రాజీవ్‌పార్క్ టాయిలెట్లను అతిశుభ్ర నిర్వహణగా, ఎల్బీనగర్, వేయిస్తంభాల గుడి సమీపం, కాకతీయ కెనాల్, భద్రకాళి చెరువు సమీపం, వరంగల్ బస్టాండ్ ఈ ఐదింటిని ఉత్తమ నిర్వహణ టాయిలెట్లుగా; హన్మకొండలోని కుమార్‌పల్లి, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, లక్ష్మిపురం, గోపాలస్వామిగుడి దగ్గర, హన్మకొండ బస్టాండ్, ఖిలా వరంగల్ ఈ ఆరు పబ్లిక్ టాయిలెట్లను అత్యుత్తమ టాయిలెట్లుగా తేల్చింది. » దేశవ్యాప్తంగా 4050 పట్టణాలు స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా పోటీపడుతున్నాయి. అందులో ఉన్న ప్రధానమైన బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత విభాగంలో ఓడీఎఫ్ వరంగల్ అర్బన్ జిల్లాగా ప్రతిపాదనలు పంపింది. ¤ ‘సీనియర్ జర్నలిస్టు, విలక్షణ కవి అరుణ్‌సాగర్ సాహితీపురస్కారం-2018'కి ప్రముఖ కవి, విశ్లేషకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య ఎంపికయ్యారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే అరుణ్‌సాగర్ మూడో వర్ధంతిసభలో అవార్డును లక్ష్మీనరసయ్యకు ప్రదానంచేస్తారు. అరుణ్‌సాగర్ ట్రస్టు తరపున టీవీ5 సౌజన్యంతో అవార్డును అందజేస్తున్నట్టు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయం (ఏపీ)¤ రాష్ట్రంలో చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో ఆంధ్రప్రదేశ్ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. » కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ అభియాన్' పథకం సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. » రూ.9,046 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ పథకం అమలులో వివిధ రాష్ట్రాల పనితీరును అంతర్జాతీయ ఆహార పరిశోధన సంస్థతో కలిసి పరిశీలించిన నీతి ఆయోగ్ మొదటి నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పనితీరును అభినందించింది. చిన్నారులు, మహిళలకు తప్పకుండా అందించాల్సిన పోషణ, మానవ వనరుల కేటాయింపు, మౌలిక సదుపాయాలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమాల అమలులో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
¤ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరికి ఐదు శాతం; ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే వేర్వేరు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. » కాపులకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్లలో 1/3వ వంతును మహిళలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లులను ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపినట్లు సభాపతి కోడెల శివప్రసాద్ ప్రకటించారు. ¤ భూదార్‌కు చట్టబద్ధత కల్పించేందుకు రెండు వేర్వేరు బిల్లులను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదం తెలిపింది. ¤ రాష్ట్ర సౌభాగ్యానికి ముఖద్వారంగా మచిలీపట్నం ఓడరేవు మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను ఆవిష్కరించారు.
¤ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా మహ్మద్ అహ్మద్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో షరీఫ్ పోటీలేకుండా ఎన్నికైనట్టు మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం షరీఫ్ మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రీయం (ఏపీ, టీఎస్) ¤ సాధారణంగా గర్భిణుల్లో 20వ వారంలో తలెత్తే గుర్రపు వాతం (ప్రీఎక్లాంప్సియా)ను గుర్తించేందుకు కచ్చితమైన వేగవంత పరీక్ష (ర్యాపిడ్ టెస్టు) అందుబాటులోకి వచ్చింది. చిన్న రక్తపు నమూనాతో పది నిమిషాల వ్యవధిలో గుర్తించే లుమెల్లా కిట్‌ను డయాబెటోమిక్స్ కంపెనీ హైదరాబాద్‌లో విడుదల చేసింది. » ఈ కార్యక్రమంలో డయాబెటోమిక్స్ కంపెనీ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, సీఈవో డాక్టర్ శ్రీనివాస్ నాగళ్ల, రెయిన్‌బో ఆసుపత్రి సీఎండీ డాక్టర్ రమేష్ కంచెర్ల, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ ప్రతిభ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఏటా దేశంలో 28 మిలియన్ల గర్భిణుల్లో 8-10 శాతం మందిలో గుర్రపు వాతం లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. 3.5 మిలియన్ల మంది శిశువులు నెలలు నిండకుండానే పుడుతున్నారని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 15-25 శాతం మంది తల్లుల మరణానికి గుర్రపువాతం కారణమవుతోందన్నారు. » గర్భిణుల్లో అసాధారణంగా పెరిగే రక్తపోటునే ప్రీఎక్లాంప్సియాగా వ్యవహరిస్తారు. నిరంతరం తలనొప్పి, చేతులు, ముఖంలో అసాధారణ వాపు, ఆకస్మికంగా బరువు పెరగడం, దృష్టిలో మార్పులు, కుడి ఎగువ ఉదరంలో నొప్పి అనేవి ప్రధాన లక్షణాలు. ఫలితంగా బిడ్డ ఎదుగుదల సక్రమంగా లేకపోవడం, తక్కువ బరువుతో నెలలు నిండక ముందే కాన్పు, కొన్నిసార్లు తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు ఉంటుంది.
|
ఫిబ్రవరి - 8
|
రాష్ట్రీయం (టీఎస్)¤ తెలంగాణ గిరిజన యూనివర్సిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పర్యవేక్షణలో కొనసాగనుంది. » ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈ వర్సిటీని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కేంద్రం అంగీకరించింది. వచ్చే ఏడాది బడ్జెట్‌లోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.8 కోట్ల నిధులు కేటాయించింది. » తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాకారంలోని ఏటూరు నాగారం యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ) తాత్కాలిక భవనంలో తొలుత ఆరు కోర్సులతో 2019-20కి జులై నుంచి తరగతులు ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు ప్రత్యేక సొసైటీ కింద హెచ్‌సీయూ పర్యవేక్షణలో కొనసాగనుంది.
¤ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లను అగ్రశ్రేణి, ఆకర్షణీయ పట్టణంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు రూ.4.32 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పురపాలక సంఘం కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. » జిల్లా రహదారుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మానేరువాగుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను అదనంగా 3.4 కిలోమీటర్లు పొడిగించడంతోపాటు, 16 అడుగుల వెడల్పు నుంచి 80 అడుగులకు పెంచాలని కేటీఆర్ పేర్కొన్నారు. ¤ తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. » దిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కేంద్ర ఆహార భద్రత, రక్షణ శాఖ 20 కేటగిరీల్లో వివిధ సంస్థలకు ఈ పురస్కారాలు ప్రదానం చేసింది. ఇందులో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నందుకు విజయ డెయిరీకి అవార్డు దక్కింది. కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేష్ ప్రభు తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ అధికారి మల్లయ్యకు అవార్డునందించారు. ¤ ఉత్తమ పనితీరుతో రైతులకు సేవలందిస్తున్న ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల' (ప్యాక్స్)కు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రకటించిన ఉత్తమ పురస్కారాలను రాష్ట్ర సహకారశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి అందజేశారు. ఉత్తమ పురస్కారాలు పొందిన సంఘాలు మొదటి బహుమతి (రూ.25 వేలు) » ప్యాక్స్, చొప్పదండి గ్రామం - కరీంనగర్, మత్స్య సహకార సంఘం- కందికల్, శ్రీ రామకృష్ణ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘం - ఇంద్లూరు, నల్గొండ. » ఉత్తమ మహిళా సంఘం - విద్యుత్‌నగర్ పరస్పర ఆధారిత సహకార సంఘం (మ్యాక్స్) - రామచంద్రాపురం, సంగారెడ్డి. రెండో బహుమతి (రూ.20 వేలు) » సాధన మ్యాక్స్ - నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా » పాల్వంచ సహకార సంఘం - పాల్వంచ, భద్రాద్రి జిల్లా » మహిళా మత్స్య సహకార సంఘం - షేక్‌పేట, హైదరాబాద్ ¤ కేంద్ర వ్యవసాయశాఖ విభాగం చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కూటమి - ఎస్‌ఎఫ్‌ఏసీ, ఫిక్కి ఆధ్వర్యంలో ‘రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ఎఫ్‌పీవో' అనే అంశంపై హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ సమావేశ మందిరంలో సదస్సు జరిగింది. » ఈ సదస్సుకు ముఖ్య అథితిగా హాజరైన వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘రైతుల ఉత్పత్తుల సంస్థ' (ఎఫ్‌పీవో)లపై పర్యవేక్షణ, సమన్వయం అవసరమని సూచించారు. ¤ తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలపై గుజరాత్ గిడ్డంగుల సంస్థ ఎండీ సంజయ్ నందన్ అధ్యయనం చేయనున్నారు. » వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఆయనకు పథకాల గురించి వివరించారు. రైతుబంధు, రైతుబీమా, పంటలను మద్దతు ధరకు కొనుగోలుచేస్తున్న తీరుపై సంజయ్ వివరాలు తెలుసుకున్నారు. ¤ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 39వ ‘సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్' ప్రారంభమైంది.
 » ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చరిత్ర ఆధారంగానే మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు వేయగలమని చెప్పారు. హైదరబాద్‌లో 1847లోనే పోలీస్ వ్యవస్థ ప్రారంభమైందని.. అప్పట్లో సైకిల్‌పై పెట్రోలింగ్ జరిగేదని, ప్రస్తుతం సైబర్ పెట్రోలింగ్ జరుగుతోందన్నారు.
|
ఫిబ్రవరి - 9
|
రాష్ట్రీయం (టీఎస్)¤ హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థలో (ఎన్‌ఐఎన్) ‘అభివృద్ధి సంభాషణ' పేరుతో నిర్వహిస్తోన్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫిబ్రవరి 9న ప్రారంభించారు. ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జాతీయ పోషకాహార సంస్థతో కలిసి రిసెర్చ్ అండ్ రిసర్జెన్స్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇఫ్లూ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్మించిన (వజ్రోత్సవ) పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
|
ఫిబ్రవరి - 10
|
రాష్ట్రీయం (ఏపీ)¤ ఉభయ వేదాంత విద్వాంసులకు అందించే గోపాలోపాయన పురస్కారాలను త్రిదండి చినజీయర్‌స్వామి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రదానం చేశారు. రాష్ట్రీయం (టీఎస్)¤ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దక్షిణ భారత కవిత్వ ఉత్సవం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, ఇతర సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.
|
ఫిబ్రవరి - 12
|
రాష్ట్రీయం (ఏపీ) ¤ ఏప్రిల్ 22న జరిగే భాగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
|
ఫిబ్రవరి - 13
|
రాష్ట్రీయం (ఏపీ) ¤ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వెచ్చించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.¤ ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘గిరి ఆహార పోషణ' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.532 విలువైన ఆహార బుట్టలను మార్చి 1 నుంచి 2,00,668 గిరిజన కుటుంబాలకు ప్రతినెలా అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో ప్రారంభించారు. దీని అమలు కోసం 2018-19 బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించారు.¤ అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సును సీఎం చంద్రబాబునాయుడు విజయవాడలో ప్రారంభించారు. ఈ సదస్సు మూడురోజులపాటు జరగనుంది.
|
ఫిబ్రవరి - 14
|
రాష్ట్రీయం (ఏపీ)¤ విశాఖ నగరంలోని కాపులుప్పాడలో ఏర్పాటు చేస్తున్న అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్‌లకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. విశాఖ ఐటీహిల్-3లోని మిలీనియం టవర్స్‌ను ఆయన ప్రారంభించారు. విశాఖలో అలీప్ ఇండియా ఆధ్వర్యంలో 55 ఎకరాల్లో ఏర్పాటు కానున్న హరిత పారిశ్రామికవాడకు, రూ.75.84 కోట్లతో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌పై 15 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్లాంట్‌కు, రూ.530 కోట్లతో 33 ఎంఎల్‌డీ వ్యర్థజలాల సేకరణ, శుద్ధి ప్లాంట్ తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. » అమరావతిలోని తుళ్లూరు వద్ద రూ.300 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. » విజయనగరంలో భోగాపురం విమానాశ్రయంతోపాటు గురజాడ విశ్వవిద్యాలయం, పతంజలి, శ్రీచందన ఫుడ్‌పార్కులకు, ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
|
ఫిబ్రవరి - 15
|
రాష్ట్రీయం (ఏపీ)¤ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీధామంలో నిర్మించిన ఋషిగోత్ర సువర్ణ మందిర ప్రారంభం, 90 అడుగుల ఎత్తయిన వాసవీమాత పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాష్ట్రీయం (టీఎస్)¤ దేశంలో మూడోది, తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్దదీ అయిన జాతీయ పతాకాన్ని కరీంనగర్‌లో ఆవిష్కరించారు. 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పైన పతాకాన్ని, 164 అడుగుల ఎత్తయిన స్తంభాన్ని ఇక్కడి తెలంగాణ చౌక్‌లో ఉన్న పురాతన పాఠశాల మైదానంలో ఏర్పాటు చేశారు. ¤ సింగరేణి సంస్థ అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీ బెర్క్‌షైర్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ ఇచ్చే ‘ఇండియాస్ బెస్ట్ కంపెనీ' పురస్కారానికి (2018 సంవత్సరానికి) ఎంపికైంది. మార్చి 8న ముంబయిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ¤ ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, నిధుల ఖర్చుపై పర్యవేక్షణకు తెలంగాణ కంపా (కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటైంది. ఈ పాలకమండలికి ముఖ్యమంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
|
ఫిబ్రవరి - 16
|
రాష్ట్రీయం (టీఎస్)¤ తెలంగాణలో ములుగు, నారాయణపేట రెవెన్యూ డివిజన్లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు చేరుకుంది. పది జిల్లాలతో ఆవిర్భవించిన తెలంగాణలో 2016 అక్టోబరు 11న కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు.
¤ దక్షిణ అమెరికా ఖండం అర్జెంటీనాకు చెందిన ఆండీస్ పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తయిన అకోంకాగ్వాను ఇద్దరు తెలుగు విద్యార్థులు అధిరోహించారు. కామారెడ్డికి చెందిన మాలావత్ పూర్ణ ఫిబ్రవరి 15న అకోంకాగ్వా పర్వతాన్ని (6962 మీటర్లు) అధిరోహించింది. నాలుగు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన పర్వతాలను ఎక్కిన అతి చిన్న వయసు గిరిజన మహిళగా పూర్ణ రికార్డు సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం కుంజవారిగూడేనికి చెందిన దుర్గారావు కూడా ఈ పర్వతాన్ని అధిరోహించాడు.
|
ఫిబ్రవరి - 17
|
రాష్ట్రీయం (టీఎస్)¤ కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణపేట జిల్లాల్లో పాలనాపరమైన సేవలు ప్రారంభించారు. 9 మండలాలతో ఏర్పాటైన ములుగు జిల్లాలో జనాభా 2.94 లక్షలు. 11 మండలాలతో ఏర్పడిన నారాయణపేట జిల్లా జనాభా 5.04 లక్షలు.
|
ఫిబ్రవరి - 18
|
రాష్ట్రీయం (ఏపీ)¤ ఏపీలో ‘అన్నదాతా సుఖీభవ' పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపు మొదలైంది. 65.05 లక్షల మంది రైతుల వివరాలను ఆర్టీజీ సేకరించింది. ఇందులో ఆధార్, బ్యాంకు ఖాతా పక్కాగా ఉన్న 48.89లక్షల మందిని గుర్తించి ఒక్కొక్కరి ఖాతాకు రూ.వెయ్యి వంతున నగదు బదిలీ చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 18న వీరికి రూ.258.50 కోట్లు చెల్లించారు. ఫిబ్రవరి 19న మరో రూ.231 కోట్లు బదిలీ చేయనున్నారు. ¤ గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట ముగింపు ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
|
ఫిబ్రవరి - 19
|
రాష్టీయ్రం (టీఎస్)¤ తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో పది మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్‌అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరిగింది.కొత్త మంత్రులు, శాఖలు* ఈటల రాజేందర్: వైద్యారోగ్యశాఖ * జి.జగదీశ్‌రెడ్డి: విద్య * ఎర్రబెల్లి దయాకర్‌రావు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ * సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వ్యవసాయం, సహకార, మార్కెటింగు, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు * కొప్పుల ఈశ్వర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధ సంక్షేమ శాఖలు * వేముల ప్రశాంత్‌రెడ్డి: రోడ్లు భవనాలు, రవాణా, శాసనసభా వ్యవహారాలు, గృహనిర్మాణం * వి.శ్రీనివాస్‌గౌడ్: ఆబ్కారీ, పర్యటక, క్రీడలు, యువజన సేవలు, సాంస్కృతిక, పురావస్తు * ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి: న్యాయ, అటవీ, పర్యావరణం, దేవాదాయం * తలసాని శ్రీనివాస్‌యాదవ్: పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ * చామకూర మల్లారెడ్డి: కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలు, స్త్రీ - శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖ¤ ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ విమానాల విడిభాగాల తయారీ సంస్థ ‘సఫ్రాన్' హైదరాబాద్‌లో రూ.290 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ప్రత్యేక ఆర్థిక మండలి సమీపంలో స్థాపించనున్న ఈ పరిశ్రమలో విమాన లీఫ్ టర్బోఫ్యాన్ ఇంజిన్ల విడిభాగాలు తయారుచేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా 50 మంది నిపుణులు, మరో 300 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. సంస్థ సీఈవో ఫిలిప్ పెటిట్‌కొలిన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించారు.రాష్ట్రీయం (ఏపీ)¤ కేంద్ర జలవనరుల శాఖ ప్రకటించిన జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడోస్థానం లభించింది. ¤ తిరుమల, తిరుపతి దేవస్థానం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,116.25 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించింది.
|
ఫిబ్రవరి - 20
|
రాష్ట్రీయం (టీఎస్)¤ చెన్నైలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహించిన జల్ సభ - 2019 కార్యక్రమంలో స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ పత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మిషన్ భగీరథ పథకానికి అవార్డులు ప్రదానం చేసింది.
|
ఫిబ్రవరి - 21
|
రాష్ట్రీయం (టీఎస్)¤ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లికి చెందిన రాసమల్ల అఖిల్ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.
|
ఫిబ్రవరి - 22
|
రాష్ట్రీయం (టీఎస్)¤ తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసింది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే సుమారు 24 లక్షల మంది ఓటర్లు పెరిగారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్‌కుమార్ వెల్లడించారు. సవరణ తరవాత రాష్ట్రంలో 2,95,18,964 మంది ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు- ఓటర్ల నిష్పత్తి పెరిగింది. గతంలో ప్రతి వెయ్యి మందికి 738 మంది ఓటర్లుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 762కు చేరింది. స్త్రీ-పురుష నిష్పత్తి కూడా పెరిగింది. ఇది గతంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 982 మంది మహిళా ఓటర్లుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 989కి పెరిగింది. 1,95,369 మంది బోగస్ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు.
ఓటర్ల వివరాలు...
|
మొత్తం ఓటర్లు
|
-
|
2,95,18,964
|
పురుషులు
|
-
|
1,48,42,619
|
మహిళలు
|
-
|
1,46,74,977
|
మూడోతరం వారు
|
-
|
1,368
|
సర్వీసు ఓటర్లు
|
-
|
10,307
|
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు
|
-
|
1,122
|
దివ్యాంగులు
|
-
|
4,69,030
|
18-19 సంవత్సరాల వారు
|
-
|
5,99,933
|
|
¤ ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 22న రూ.1,82,017 కోట్లతో శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆర్థిక శాఖను నిర్వహిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వారి జాబితాలో ఆయన చేరారు. » 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో సీఎంలే బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. జనవరి 30న గోవా సీఎం మనోహర్ పారికర్ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ నెల 8న కర్ణాటక సీఎం కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్, 9న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్‌లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో 2015-16లో యూపీ సీఎం అఖిలేష్‌యాదవ్, కేరళలో 2016-17లో ఊమెన్ చాందీ, 2018-19లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్‌లో వసుంధర రాజె, నాగాలాండ్‌లో సీఎం సీకే సంగ్మా బడ్జెట్‌లను సమర్పించారు. » ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎంగా ఆర్థిక శాఖను నిర్వహిస్తూ 1955-56, 1957-58 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. » కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉంటూ ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టి 1968-69, 1969-70 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్‌ను సమర్పించారు. » కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖను నిర్వహిస్తూ 2010-11లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.¤ సకాలంలో సమర్థంగా పౌరసేవలు అందిస్తున్నందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ‘డిజిటల్ ఇండియా-2018' అవార్డు సాధించింది. స్థానిక సంస్థలకు చెందిన ‘ఔట్ స్టాండింగ్ ఇనీషియేటివ్' విభాగంలో ప్లాటినం ఐకాన్ పురస్కారానికి ఎంపికైంది. ప్రజలకు మరిన్ని సేవలు అందేలా సాంకేతికతను అందిపుచ్చుకోవడం, దాన్ని వినియోగించుకునే విధానం ఆధారంగా కేంద్రప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాలకు డిజిటల్ ఇండియా అవార్డులు అందజేస్తోంది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఒకే యాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలపరంగా సేవలను విస్తరించే టి- యాప్, సంబంధిత విభాగంలో కృషికి గుర్తింపు లభించింది. జిల్లాకు చెందిన పూర్తి సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్ ‘వెబ్‌రత్న' విభాగంలో గోల్డెన్ ఐకాన్ అవార్డుకు ఎంపికైంది.రాష్ట్రీయం (ఏపీ)¤ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో స్వర్ణభారత్ ట్రస్టు 18వ వార్షికోత్సవవేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
|
ఫిబ్రవరి - 26
|
రాష్ట్రీయం (టీఎస్)¤ ప్రతిష్ఠాత్మక సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి ప్రకటించారు. ఈ నెల 28న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ¤ బయోఫెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు (బయోకికాన్-2019) జీవన సాఫల్య పురస్కారానికి ఐఐసీటీ విశ్రాంత శాస్త్రవేత్త పత్తిపాటి ఉషారాణి ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లోని అమిటీ విశ్వవిద్యాలయంలో మార్చి 6న జరిగే బయోకికాన్ 6వ సదస్సులో ఆమె ఈ పురస్కారం అందుకోనున్నారు. పంటలకు హాని చేసే పురుగులు, కీటకాల నియంత్రణకు పర్యావరణానికి హానిచేయని సుమారు 50 రకాల జీవ రసాయనాలను ఉషారాణి అభివృద్ధి చేశారు. ¤ తెలంగాణలో 4 పురపాలక సంఘాలు సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, ఫీర్జాదిగూడ జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపికయ్యాయి. మార్చి 6న దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. గత నెల 31న స్వచ్ఛ సర్వేక్షణ్‌పై జరిగిన సర్వే ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. సిద్దిపేట స్వచ్ఛ సర్వేక్షణ్-2019 పురస్కారానికి వరుసగా రెండోసారి ఎంపికైంది.
|
ఫిబ్రవరి - 27
|
రాష్ట్రీయం (టీఎస్)¤ నాగర్‌కర్నూల్ జిల్లాలోని చెంచు తెగలు ఏటా నిర్వహించే బౌరాపూర్ భ్రమరాంబ జాతరను ఇకపై అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లింగాల మండలం బౌరాపూర్‌లో ఈ జాతరను శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు.
|
ఫిబ్రవరి - 28
|
రాష్ట్రీయం (టీఎస్)¤ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండు రోజుల జాతీయ విద్యా సదస్సు (ఫిబ్రవరి 27, 28) ముగిసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి ఆధ్వర్యంలో ‘నయీ తాలిమ్ - ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్' అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
|
|
|